ఈ సంఘర్షణతో, మనఃక్లేశంతో కొన్నిరోజులు గడిచాక ఓ రాత్రి ఆమె ఇంటికి మరీ ఆలస్యంగా వచ్చింది.
రామం మేడగదిలో కూర్చుని కోపం ఆపుకోలేకపోతున్నాడు. అతనికి అన్నం సహించలేదు. మండిపడుతున్నాడు.
"ఇంకా భోజనం చేయలేదేం...?" అని గదిలోకి అడుగుపెడుతోంది మనోరమ.
"ఎక్కడికెళ్ళావ్?"
ఆ కంఠంలోని కర్కశత్వాన్ని గుర్తించి ఉలిక్కిపడింది ఆమె. భయంవేసింది. కాని తను ఏం తప్పు చేసింది భయపడటానికి? అని సమాధానపరుచుకుని ధైర్యంగా నిలబడింది.
"ఎక్కడికెళ్ళావ్?"
మనోరమ జవాబు చెప్పింది. "నేనూ, నా ఫ్రెండ్ అరుణా కలిసి అలా సముద్రంవైపు షికారు వెళ్ళాం. అక్కడ ఏవో కబుర్లు చెప్పుకుంటూ టైం గడిచిపోయింది. ఏం తప్పా?"
"తప్పే" అన్నాడు రామం కఠినంగా.
మనోరమ ఇలాంటి ప్రత్యుత్తరం ఊహించలేదు. అందుకని నివ్వెరపోయి, మరుక్షణంలో తమాయించుకుని "ఎందుకనీ...? ఇదేమంత అత్యాచారం? మీరు తీసుకువెళ్లకపోతే ఇంకా ఎక్కడికి పోకూడదా?" అన్నది రోషాయమానంగా.
"పోవచ్చు. కానీ వేళాపాళా చూసుకోవాలి" అనాలనుకున్నాడు రామం. కాని అతని హృదయం భగభగ మండిపోతోంది. కసి తీర్చుకోవాలనిపించింది.
"పోకూడదు" అన్నాడు.
మనోరమ అహం పూర్తిగా దెబ్బతింది. పడగవిప్పిన నాగులా అతడి కెదురుగా నిలబడి "ఏం? నాకామాత్రం స్వేచ్చలేదా? నేను మీ బానిసనా" అంది బుసకొడుతున్నట్లుగా.
అతనికి ఆమెను ఇంకా హింసించాలనిపించింది. లేచి నిలబడి గట్టిగా "అవును, నువ్వు నా బానిసవే" అన్నాడు.
"ఏమిటి?" అని అరిచిందామె కోపంతో వణికిపోతూ.
"అవును నువ్వు నా భార్యవు. నేను చెప్పినట్లు వినాలి. నేను గీచిన గీటు దాటకూడదు, నా అనుమతి లేకుండా ఎక్కడికి పోకూడదు, ఎవరితోను మాట్లాడకూడదు. అర్థమయిందా!"
"ఛీ. ఇంత మూర్కుడివా నువ్వు?" అంది మనోరమ అసహ్యంగా.
మరుక్షణం ఆమె చెంప పేలిపోయింది. ఆమె కళ్ళు గిర్రున తిరిగాయి. భూమి కంపించినట్టు తోచింది. ఎలా చేరుకుందో ప్రక్కగదిలోకి చేరుకుని పరుపుమీద వాలిపోయింది. ఆమె ఏడవటల్లేదు. అహం విరుచుకుపడుతోంది. అవమానభారంతో అంతరంగం ఘూర్ణిల్లుతోంది.
"ఛీ! ఇంతటి పశువునా తను పెళ్లి చేసుకొంది? తను భంగపడింది. అబ్బ! ఎంత అసహ్యం!!
ఆమె ఓ నిశ్చయానికి వచ్చేసింది.
అర్థరాత్రి చప్పుడు చేయకుండా ఓ చిన్న సూటుకేసులో కాసిని బట్టలూ, డబ్బూ పెట్టుకుంది. నిశ్శబ్దంగా మెట్లుదిగి క్రిందకి వచ్చి వంటింటి గుమ్మం ఇవతల పడుకునివున్న వంటవాడ్ని లేపింది.
వంటవాడు లేచాడు. ఇంటికోడలు అర్థరాత్రివేళ వచ్చి తనని మేల్కొల్పటం అతనికి దిగ్భ్రమ కలిగించింది.
"ఏమిటండీ" అన్నాడు.
"నేను మెడ్రాస్ పోవాలనుకుంటున్నాను. నాకు తోడు వస్తావా" అనడిగింది మనోరమ.
వంటవాడు యువకుడు. మంచి దేహసౌష్టవం గలవాడు. తన శరీరం చూచి ఆడవాళ్లు పరవశులై వెంటపడతారని అతని నమ్మకం. అందులో యింటికోడలు అతనితో చనువుగా వుండేది. ఇన్నాళ్ళనుంచీ తనమీద మనసు వుంచి కలలుగంటూ వుంది కాబోలు అనుకున్నాడు. తను ఎలాగూ దేశ దిమ్మరే. నా అన్నవాళ్ళు ఎవరూలేరు. అవసరం వస్తే వంటపని చేసి ఎక్కడో అక్కడ పొట్ట పోషించుకోగలడు. చేతిలోకి వచ్చిన అవకాశం పోగొట్టుకోకూడదనుకున్నాడు. "పదండి" అన్నాడు.
మనోరమ గుండె గబగబ కొట్టుకోవటంలేదు. ఆమె సంశయించటం లేదు. తను పిరికిది కానందుకు గర్విస్తోంది.
ఇద్దరూ చడీచప్పుడూ లేకుండా బయటకువచ్చి ఆ చీకట్లో కలిసిపోయారు.
2
"పూర్వపు రోజులే బాగున్నాయి కదూ?" అన్నాడు విశ్వనాథంగారు.
ఆయనకు యీ మధ్య జీవితంమీద ఎడతెగని విసుగ్గా వుంది. ఒక్క విషయంలోకూడా శాంతి కలగటంలేదు. అందరూ తనమీద కక్ష గట్టినట్లుగా బాధపడుతున్నాడు. ఆరోగ్యంకూడా అంత బావుండడంలేదు. డాక్టరు పరీక్షచేసి బ్లడ్ ప్రెషర్ కొంచెం ఎక్కువగా వున్నదనీ జాగ్రత్తగా వుండాలనీ చెప్పాడు.
లలితమ్మగారు ఏదో జవాబు చెప్పబోతోంది.
ఇంతలో లోపల్నుంచి టెలిఫోన్ మ్రోగింది.
ఆయన లోపలికివెళ్ళి రిసీవర్ అందుకున్నాడు.
పరిచితుడు ఒకాయన ఫోన్ చేస్తున్నాడు. ఆయనకు అర్జంటుగా విశాఖపట్నం పోవలసిన పని తగిలిందట, కారు కావాలని అడుగుతున్నాడు.
విశ్వనాథంగారు తప్పించుకుందామని "మా డ్రైవర్ సెలవుమీద వున్నాడండీ" అన్నారు.
"పర్వాలేదండీ. నాకు తెలిసిన డ్రైవరు వున్నాడు. అతన్ని పంపిస్తాను. మీరు మరోలా భావించకండి అలాంటి అవసరం వచ్చింది మరి" అన్నాడు అవతలి మనిషి.
విశ్వనాథంగారు చేసేదిలేక "అలాగే పంపించండి" అని రిసీవర్ పెట్టేశాడు.
"ఏమిటి?" అని అడిగింది లలితమ్మగారు.
"బలరామయ్యగార్కి కారు కావాలట. విశాఖపట్నం పోతాట్ట."
"ఇస్తానన్నారా?"
"ఏంచెయ్యను? ఆయనతో మనకు బోలెడు అవసరాలున్నాయి. ఇవ్వకపోతే మనసులో పెట్టుకుంటాడు. ఈ కార్లు అడిగేవాళ్లకి అది యివ్వటం ఎంత యిబ్బందో తెలీదు. వాళ్ళ అవసరం ఒక్కటే వాళ్ళకు తెలుసు."