Previous Page Next Page 
వ్యక్తిత్వం లేని మనిషి పేజి 6


    ఒక బీరువాకొని గ్రంథాలయమంటూ ఒకటి ఏర్పాటుచేశారు. వ్రాతపత్రిక నొకదాన్ని నడుపుకొస్తున్నారు తురంగరావు అనే అతను దానికి సంపాదకుడిగా వ్యవహరిస్తున్నాడు. అతను బి.ఏ. లిటరేచర్. అతని తండ్రి పేరుపొందిన సాహితీవేత్త. చిన్నప్పట్నుంచీ వారియింటికి చిన్నలూ, పెద్దలూ, సాహితీవేత్తలు రావటం, గోష్ఠులూ, సమావేశాలూ ఈ వాసనల్లో పెరగటంవల్ల, తనూ అంతటి వాడ్ననుకుంటాడు. అతనికి వాళ్ళు చేసుకునే వాదప్రతివాదాలలోని విమర్శా, ప్రతీవాళ్ళని తీసిపారెయ్యటమూ పట్టుబడ్డాయిగానీ ఒక అక్షరంముక్క (మంచిది) స్వంతంగా రాయటం అలవడలేదు. అందుకని ఎంతటివాడినైనా అవలీలగా తీసిపారేస్తాడు. వాడిమొహం వాడు కవి కాదంటాడు. వీడిమొహం కథకుడు కాదంటాడు. అసలు ఆధునిక సాహిత్యం కాస్తకూడా చదవడు. చదవకుండా మనసాహిత్యం పతనమై పోతుందని గోలపెడతాడు. అసలు సాహిత్యమంటే పద్యాలేగాని నవలా, నాటకం, కథా యివన్నీ ఏమీ కావని ఓ వాదం లేవదీశాడు. అతనికి భారతం, భాగవతంలోని మూడు నాలుగొందల దాకా పద్యాలు కంఠతావచ్చు. సందర్భంవున్నా లేకపోయినా అందులో ఒక్కొక్కటి చొప్పున విసుర్తూ సాహిత్యమంటే యిదీ అని నిరూపిస్తూ వుంటాడు. మనిషి దుర్మార్గుడేమీ కాదుగానీ, ఎవరితోనూ మనసు విప్పి మాట్లాడలేడు. మూడోవ్యక్తి ఎదురు గుండా లేనప్పుడు అతనినోరు అతని అనుమతి లేకుండానే మూడోవాడ్ని గురించి అవాకులూ, చెవాకులూ పేలుతూ వుంటుంది. రచయితగా రాణించలేనని అనుభవంమీద తెలుసుకుని ఉపన్యాసకుడిగా రాణించటానికి ఈమధ్య ప్రయత్నాలు జరుపుతున్నాడు. అతను కాస్త కలిగినవాడు. ఈ జీతంరాళ్ళమీదే ఆధారపడి జీవించే అగత్యంలేదు. అందుకని  కాస్త దర్జాగానే ఖర్చుపెడుతూ వుంటూ వుంటాడు. ఈమధ్య పైకివచ్చిన కవులూ, కళాకారులూ వగైరాలు ఉమ్మడిపద్ధతిమీద వ్యవహారం నడుపుకొచ్చి క్రమంగా నిచ్చెనలు ఎగబ్రాకటం అతను బాగా గ్రహించాడు. ఉమ్మడిపద్ధతి అంటే మరేంలేదు. పైకివచ్చి లోకాన్ని చెండుకు తినదల్చే యిద్దరు ఉద్ధండులు ఒకచోట తారసిల్లుతారు. ఒకరి అభిప్రాయాలు ఒకరు క్షుణ్ణంగా తెలుసుకుని ఒక ఒడంబడికకు వస్తారు. ఇహ దేశంమీద దండయాత్రకు బయలుదేరి సభల్లోనూ, సమావేశాల్లోనూ, ఇంకా యితరములైన అనేక సందర్భాలలోనూ ప్రత్యక్షం గానూ, పరోక్షంగానూ ఒకరినొకరు ఆకాశానికి ఎత్తేసుకుంటారు. 'మా ఫలానా అన్నట్లు' యితనూ, 'మా ఫలానా అన్నట్లు' అతనూ ఒకరి గొప్పతనాన్ని మరొకరు తెగ అభివర్ణిస్తారు. దీన్ని ఉమ్మడిపద్ధతి అనిగానీ, తప్పుపద్ధతి అనిగానీ అనవచ్చు. దీనివల్ల అంతా లాభమేగాని నష్టమన్న మాటలేదు. ప్రారంభదశలో అనేకులు నవ్వుకొనినా నవ్వుకుందురుగాక. రానురానూ వీళ్ళ విజృంభణ ఎక్కువయేసరికి, పేర్లు బాగా నోళ్ళకు పట్టుబడి, నాని చివరకు ప్రఖ్యాతులులానే చెలామణి అవుతారు.
    తురంగరావుకు ఈ పద్ధతి బాగా నచ్చింది. తాను ఉపన్యాసకుడిగా చలామణి కావటానికి గల పథకాలన్నీ ఒక ప్రణాళికగా వేసుకున్నాడు. ఇరవై ముప్పై వరకూ నాటికలు రాసి ఎవరూ ప్రదర్శించటానికి ముందుకు రాకపోయినా పూనుకుని తనే సొంతఖర్చుతో ప్రదర్శనలు ఏర్పాటుచేసి, ఎవరి మెప్పూ పొందకపోయేసరికి భంగపాటుచెంది, ఏం చేద్దామా అని తల గోక్కుంటున్న సమయంలో ఒక దూరమిత్రుని సహకారం అతనికి అనుకోకుండా లభించింది. ఆ మిత్రుడ్ని అంత గొప్పవాడు, యింత గొప్పవాడని తను సభ్యులముందు పొగిడి, అతని ఉపన్యాసం ఒకటి ఈ ఊళ్ళో ఏర్పాటు చేయించాడు. అతన్ని తమయింట్లోనే వుంచుకుని వంటవాడ్ని పెట్టి ఘుమఘుమలాడే పిండివంటలతో మంచి విందుభోజనం చేయించాడు. ఆ మిత్రుడితో తమ ఆఫీసరుకి 'తురంగరావువంటి కవి మీ ఆఫీసులో పనిచేయటం మీ ఆఫీసుకే ప్రివిలేజ్ అండీ' అని చెప్పించాడు. మాటల్లో మాటగా అధ్యక్షస్థానం వహిస్తోన్న ఆ ఆఫీసరుకి అదేమిత్రుడు తమ ఊరుకు చేరుకుని అక్కడేదో సభ ఏర్పాటుచేసి దానికి తురంగరావును వక్తగా ఆహ్వానించాడు. కంఠసీమల నలంకరించే పూలహారాల విషయంలోనూ, సభలు ముగిశాక ఆ సమాచారాన్ని పత్రికలు ప్రకటించేటట్లు చూడడంలోనూ ఆ యిరువురూ సర్వశక్తులూ ధారపోశారు. పత్రికా విలేఖరులతో నిరంతర సాన్నిహిత్యం పెంపొందింపజేసుకున్నారు. దీనికోసంగానూ, ఇలా క్రమంగా ప్రచారం జరిపి తురంగరావుకు యితర సంస్థలనుండికూడా ఆహ్వానాలు రావటం మొదలుపెట్టాయి. శ్రోతల్ని ఆకట్టుకోవాలంటే కొన్ని ఒరిపిడి రాళ్ళవంటి పదాలూ, వాక్యాలూ పడాలి. హ్యూమర్ వుండాలి. తురంగరావుకు స్వంత హ్యూమర్ లేదు. అందుకని శ్రోతల హృదయాలని రంజింపచేయగలిగే కొన్ని కొన్ని హాస్యపు అంశాలనూ, నిత్యజీవిత సంఘటనలనూ ఓపికతో సేకరించి, కంఠస్థం చేసి, వాటిని తూణీరాల్లా గురిచేసి విడిచిపెట్టటం నేర్చుకున్నాడు. ఉపన్యసించబోయేటప్పుడు తను పెట్టబోయే ముఖభంగిమలూ, గొంతు గంభీరంగా మార్చటం, చేతులు వూపటం దగ్గర్నుంచీ యింట్లో అద్దంముందు రిహార్సల్సు వేసుకునేవాడు. అతను పైకి రావటానికి ఈవిధంగా పాపం, అనేకవిధాల తంటాలు పడుతున్నాడు.
    సాయంత్రాల వాగ్విదాలు జరుగుతున్నప్పుడు సభ్యులు అనేక విషయాల్ని మధించటం జరుగుతూ వుండేది. దానికి సోమయాజులుగారు యించుమించు అధ్యక్షస్థానాన్ని అలంకరిస్తూ వుండేవారు. మృత్యుంజయరావు విధిగా సమావేశాలకు హాజరయేవాడుగాని, ఎప్పుడూ నోరు విప్పి తన అభిప్రాయాన్ని వ్యక్తంచేసిన పాపానపోలేదు. స్థిరంగా ఓ సత్యాన్ని వెల్లడించటానికిగానీ, ఖండించటానికిగానీ అతనికి భయం. అసలు ఏ సత్యంపట్లా అతనికి స్థిరమైన అభిప్రాయంలేదు. ఒక విషయం మంచిదనిగానీ, చెడ్డదనిగానీ అతను ఘంటాపథంగా చెప్పలేడు. ఒక అంశాన్ని గురించి వాదోపవాదాలు జరుగుతున్నప్పుడు అతను యిరుపక్షాలవార్నీ మనసులో అభినందిస్తూ వుంటాడు. వారు వాదించే విషయం మీదకన్నా, వాదించే విధానంమీద అతనికి ఆసక్తి మెండు.
    ఎదుటివారి మనస్తత్వంలో, వ్యక్తిత్వంలో అతను చాలా సులభంగా లీనమౌతాడు. 'నేను దొంగనైతే బాగుండును' అనుకున్న సందర్భాలు అనేకం వున్నాయి. తనని తాను ఒక రౌడీగా అనేకసార్లు ఊహించుకున్నాడు. ఎందర్నో చంపినట్లూ, పరపర నరికినట్లూ దృశ్యాలు కళ్ళముందు తిరుగాడుతూ వుంటాయి.
    సభ్యులలో సంజీవరావు అని ఒకతను వున్నాడు. అతను ఏ పార్టీకి చెందినవాడో ఎవరికీ సరిగ్గా తెలీదుగాని, ఎప్పుడూ ప్రభుత్వాన్నీ, ప్రభుత్వ విధానాలనూ విమర్శిస్తూ వుంటాడు. ప్రజలు అనుభవిస్తూన్న యిడుముల్ని హృదయ విదారకంగా విశదీకరిస్తూ వుంటాడు. ఒకసారి అతను రైల్లో దూర ప్రయాణం చేసి వచ్చాడు. వచ్చినప్పట్నుంచీ చిరాగ్గా వున్నాడు. చిర్రుబుర్రులాడు తున్నాడు. "వెధవ రైళ్ళూ, వెధవ ప్రయాణమూ" అని విసుక్కుంటున్నాడు. మొదట టిక్కెట్లు అమ్మేచోటికి వెళ్ళి ఆదోనికి టికెట్ యిమ్మన్నాడుట. ఒకమూల ట్రైన్ బయలుదేరటానికి 'టైమయిపోతుందిట. వాడు ఒక అయిదు నిముషాలపాటు అరలన్నీ వెదికి "ఆదోని టికెట్లు అయిపోయా"యన్నాడుట. 'మరి ఎలాగయ్యా' అంటే 'నేనేం చెయ్యను' అన్నాడుట. 'పోనీ గుంతకల్ దాకా యిస్తావా' అంటే 'ఇస్తా'నన్నాడుట. 'అది సలహారూపంగా ముందే ఎందుకు చెప్పలే'దంటే, 'నాకే మవసర' మన్నాడుట. తను కోపం ఎలాగో నిగ్రహించుకుని 'గుంతకల్ నుంచి ఆదోని వరకూ చెల్లేటట్లు కాయితం రాసిస్తావా' అంటే 'అసలు టికెట్లు అమ్మేవాడ్ని నేనుకాదు. అతనేదో పనిమీదపోతే నేనమ్ముతున్నాను. నాడి యింకో డిపార్టుమెంటు. నేను యివ్వటానికి వీల్లే'దన్నాడుట. ఇతనికి కోపంవచ్చి 'అయితే కంప్లైంట్ బుక్ యి'మ్మన్నాడుట. 'అది వుండేచోటు యిదికాదు' అన్నాట్ట అతను. 'అయితే ఎక్కడ వుంటుం'దన్నాడుట సంజీవరావు. 'నాకు తెలియద'ని జవాబు. సరే యిలా గలాటా పడుతూ కూచుంటే ట్రైన్ మిస్ అయిపోతుందని కోపాన్ని దిగమ్రింగుకుని గుంతకల్ దాకా టికెట్ తీసుకుని రైలెక్కాడుట. మధ్యలో ఓసారి గార్డుని కలుసుకుని ఆదోనికి టికెట్ రాసిమ్మన్నాడుట. ఇతను చెప్పింది అతనికెంతవరకూ బోధపడిందోకాని "గుంతకల్ స్టేషన్ లో కలుసుకోండి. అక్కడ యిస్తాను" అని టికెట్ జేబులో పెట్టుకుని తన పెట్టెలోకి పోయాడుట. ఈలోపున సంజీవరావుకు మంచినిద్ర పట్టేసింది. మెలకువ వచ్చేసరికి ఏదో స్టేషన్ నుండి బండి కదలబోతోంది. ఇదే స్టేషన్ అని ప్రక్కవార్ని అడిగితే గుంటకల్ అన్నారుట. కంగారుపడుతూ అతను బెడ్డింగుతోసహా పెట్లోంచి దూకేశాడుట. టికెట్ ఏమో గార్డుతో వెళ్ళిపోయింది. ఈ విషయం అక్కడి టికెట్ కలెక్టర్ కు చెబితే వినిపించుకోడుట. చివరికి మెడలు విరిచి ఎక్సెస్ కట్టించాడుట" అదీ కథ.
    ఈ కథ చెప్పి ప్రభుత్వాన్ని, పరిపాలకుల్నీ, మంత్రుల్నీ తెగ ఏకాడు సంజీవరావు. అట్లా దూదినేకుతున్నట్లు ఏకుతూంటే ఆవేశంతో అతని కంఠనాళాలు ఉబ్బుతున్నాయి. గొంతు ఖంగుమని మ్రోగుతోంది.
    అట్లాగే ఎంక్వయిరీస్ గురించి చెప్పాడు. ప్రయాణీకులు యెంతో ఆతురతతో, ఆందోళనతో అడిగిన ప్రశ్నలకు వాళ్ళు సరియైన సమాధానాలు చెప్పరుట. ఒకసారి సంజీవరావు ఎక్కడికో ప్రయాణం పెట్టుకుని ట్రైన్ ఎప్పుడు వస్తుందని ఫోన్ చేస్తే గంట లేటుగా వస్తుందని చెప్పాడుట. సరే అని తీరిగ్గా బయల్దేరి అప్పటికి వాళ్ళు చెప్పిన టైముకి అరగంట ముందుగా పోయేసరికి అప్పటికే బండి బయల్దేరి పావుగంట అయిందని చెప్పారుట. యింకా చెప్పాడు ఎంక్వయిరీవాళ్ళ గురించి. మొదటిసారి అడిగితే ఏదో చెబుతారుట. రెండోసారి అడిగితే విసుక్కుంటారుట, మూడోసారి అడిగితే కసురుకుంటారుట.
    రైలుప్రయాణాల గురించి మృత్యుంజయరావుకూ దారుణమైన అనుభవాలు కలిగాయి. ఆఫీసరు చెప్పినట్లు నడుచుకునేవాళ్ళలో అతను అగ్రగణ్యుడేమో- ఆఫీసు పనులమీదా, సొంత పనులమీదా అతన్ని అడపాదడపా పై ఊళ్ళకి పంపించటం కద్దు. ఏ క్లాసులో ప్రయాణం చేద్దామా అన్న సంఘర్షణతో ఆరంభమవుతుంది అతని సమస్య. దాన్నిగురించి మనసులో పెద్దపెట్టున తర్జనభర్జనలు జరిపి, తల్లక్రిందులవుతాడు. ఆఫీసుడబ్బుతో అతను సెకండు క్లాసులో ప్రయాణం చేయవచ్చు. కాని అది ఒకటే కంపార్టుమెంటు కావటంవల్ల క్రిక్కిరిసి వుంటుంది. ఫస్టుక్లాసులో సొంతడబ్బు పెట్టుకుని పోదామంటే దానికి ముందుగా రిజర్వు చేసుకోవాలి. ఖాళీ లేకపోతే, ప్రక్కవాడు అభ్యంతరం చెబితే దిగిపోవాలి. అసలు ఫస్టుక్లాసులో ప్రయాణంచేసే అర్హత తనకు లేనట్లు తడుతూ వుంటుంది ఎక్కినప్పట్నుంచీ. ఆ ప్రయాణీకులు తనను చీదరించుకుంటున్నట్లూ, పురుగుని చూసినట్లు చూస్తున్నట్లూ అనుభూతి పొందుతాడు. ముళ్ళమీద కూర్చున్నట్లు కూర్చునేవాడు. ఇహ థర్డుక్లాసులో యెక్కువ ప్రయాణాలు అందులోనే జరిగాయి. జనం చీమలలా, ఈగలలా ముసురుకుని వుంటారు. ప్రక్కవాడ్ని కాస్త ప్రక్కకి జరగమనటానికి డెలికసీ.
    మృత్యుంజయరావుకు రైల్లో ఏదైనా కొనుక్కొని తినటానికి డెలికసీ. అందరూ దబాయించి సొంతయిళ్ళల్లో తిన్నట్లు తింటారు. అసలు చాలామంది తిండికోసమే ప్రయాణం చేసినట్లు చేస్తారు. స్టేషన్ స్టేషన్ కీ జంతికలో, చక్రాలో, జీడిపప్పో, జామకాయలో బఠానీలో కొనుక్కుని మింగుతూ ఉంటారు. కబుర్లు చెప్పుకుంటూ, సరదాగా, నవ్వుతూ, పేలుతూ మింగుతారు. అయినా మృత్యుంజయరావు ఆకలితో మాడి చస్తున్నాసరే, అందరి ఎదుట తినటానికి ఏదో అపరాధం చేసినట్లూ, నవ్వుతున్నట్లూ ఫీలయి నాలిక కట్టేసుకునేవాడు. అధవా ఆత్మారాముడ్ని జయించలేక ఎప్పుడైనా కక్కుర్తిపడితే, ఏ కుంటిచేత్తోనో, చీమిడిముక్కుతోనో, దుర్గంధం విరజిమ్ముతున్న కురుపులతోనో ఏ ముష్టివాడో మీదికి ఎగబడతాడు. ముఖాన్నీ, గడ్డాన్నీ ముట్టుకుంటాడు వాడినేమన్నా అనాలన్నా ప్రక్కవాళ్ళ సానుభూతి అంతా ముష్టివాడిమీదే వుంటుంది. ఇహ ప్యాసింజర్లో ప్రయాణమంటే యమలోకం చూస్తున్నట్లే. గంటలతరబడీ లేటుగా వచ్చే ట్రైన్ కోసం ఎంతోసేపు పడిగాపులు గాసి కూర్చోవాలి. దాని గమ్యస్థానం చేరేలోగా ఎన్ని క్రాసింగులు! ఎన్నిసార్లు ఆగిపోతుంది. ప్రభూ! అడుగడుక్కీ మనబ్రతుకు యింత కష్టంగా వుందా? ప్రజలగోడు తెలియటం లేదా పైవాళ్ళకి?

 Previous Page Next Page