వంగి అందులోకి చూడటానికి ప్రయత్నించాను. పదిహేను రోజుల్నుంచీ ఎవరో చాలా అధునాతమైన పరికరాల్తో తవ్వుతూ లోపలికి వెళ్ళారన్నమాట. సాధారణంగా లోపల్నుంచి బయటకు తవ్వేవారి గురించి తెలుసుగానీ ఇలా సాయపడే కథలు అరుదు. పైకిఏమీ కనిపించకుండా చాలా పగడ్బందీగా జరుగుతుందీ వ్యవహారం.
సొరంగం లోపలికి వెళ్ళాలని నిశ్చయించుకున్నాను.
సాధారణంగా ఇటువంటి పరిస్థితుల్లో మొత్తం యూనిట్ ని అంతా జాగరుకుల్ని చేయాలి. అలారం మ్రోగించాలి.
వెనక్కి వెళ్ళి నేనుగానీ ఆ పని చేసివుంటే ప్రత్యర్ధుల కార్యం పూర్తి అయ్యేదే. అదృష్టం నావైపు వుంది. అప్పటికప్పుడే దాన్ని స్వయంగా పరీక్షించాలని నేను తీసుకున్న నిర్ణయం లాభించింది.
చెక్కలు బోల్టులతో నిలబెట్టి ఒక మనిషి సులువుగా వెళ్ళటానికి సరిపోయేటంత రంధ్రం చేశారు. బహుశా గోడకి అటువైపు వరకూ ఉంటుంది. ఇది దాదాపు ఇరవై గజాలు. ఎలక్ట్రిక్ కరెంట్ పాసవుతూన్న తీగెల మీంచి, సెర్చిలైటు దారినుంచి తప్పించుకుని వెళ్ళటం అసంభవం అని గురించి, ఈ పథకం ఆలోచించి ఉంటారు.
నెమ్మదిగా పాక్కుంటూ సొరంగంలో ప్రవేశించాను. ఈ కార్యక్రమంలో వీళ్ళు ఎంతవరకూ ముందు వెళ్ళారో తెలుసుకోవాలని నా కోర్కె దాదాపు మూడు గజాలు లోపలికి వెళ్ళేసరికి అట్నుంచి అలికిడి వినిపించింది.
దెబ్బతిన్న పక్షిలా వెనక్కి వచ్చాను.
బట్టలు దులుపుకుంటూ అలర్టుగా నిలబడ్డాను. చేతిలో రివాల్వర్ గానీ మరే ఆయుధంగానీ లేదు. ఎవరినీ పిలిచేటంత టైమూ లేదు.
ముందు తల బయటకొచ్చింది.
తరువాత క్రమక్రమంగా కాళ్ళు.
నేలమీదకు పూర్తిగా వచ్చిన తరువాత కూడా అరక్షణం పాటు అలానే నిశ్చలంగా ఉండి, నెమ్మదిగా తలెత్తాడు. పక్కనే నిలబడి తాపీగా చూస్తున్నాను. పొదలోంచి బయటకు వచ్చే పులిలా ముందుకు అడుగువేసి ఎందుకో అనుమానం వచ్చినట్టు తలతిప్పి, పక్కనే వున్న నన్ను చూసి పక్కలో బాంబు పడ్డట్టూ అదిరిపడ్డాడు.
అతడు భీమరాజు.
3
కరతాళ ధ్వనులు మిన్నుముడుతూ ఉండగా వెళ్ళి మెడల్ తీసుకున్నాను. మొదటి వరుసలో కూర్చుంది అమ్మ. స్టేజి దిగివచ్చి పక్కసీటులో కూర్చుని, కాలరు సర్దుకుంటూ "చూసేవా, నీ కొడుకు ఎంత గొప్పవాడైపోయాడో" అన్నాను రహస్యంగా. నిజంగానే అమ్మ మొహం ఆనందంతో వెలిగిపోతూంది. ఇదే అదననుకొని "ఇంటికెళ్ళిన తరువాత నుదుటన ముద్దిచ్చెయ్యాలి మరి" అన్నాను.
"జైల్లో ఖైదీలు తప్పించుకుపోకుండా చూడటానికే కదరా నీకు జీతమిస్తున్నది. అదేదో ఘనకార్యంలా చెపుతావేమిటి" అంది. అది కేవలం నన్ను ఏడిపించటానికే అని తెలుసు.
నువ్వు అలాగే అంటావ్. ఆయన చూడు ఎలా పొగుడుతున్నాడో" అన్నాను.
జైలు సూపర్నెంటెండెంట్ స్టేజీమీద నన్ను నెపంగా పెట్టుకుని పోలీసు డిపార్టుమెంటు గొప్పదనాన్ని అన్యాపదేశంగా పొగుడుతున్నాడు. పోలీసుల దృష్టినుంచి ఎవరూ తప్పించుకుపోలేరనీ, ముఖ్యంగా ఆ జైలు నుంచి బయటపడటం ఏ ఖైదీకి సాధ్యంకాదనీ చెపుతున్నాడు. ప్రమాదం జరగబోతూ వుంటే దాన్ని ముందే పసిగట్టటం పోలీసులకి వెన్నతో పెట్టిన విద్య అని అంటున్నాడు.
పక్కనుంచి అమ్మ కంఠం వినిపించింది. "మరీ అంత దిగులుగా మొహం పెట్టుకుని కూర్చోనవసరంలేదు. నిజంగా నువ్వు చేసింది గొప్పపనే. ఒప్పుకుంటున్నానుగా" అంది.
ఇంతలో శివప్రసాద్ పక్కనచేరి "గురూ! చిక్కుల్లో ఇరుక్కుపోయావు గురూ నువ్వు" అన్నాడు రహస్యంగా.
"ఏమిటి, ఏమైంది?"
శివప్రసాద్ చెప్పుకుంటూ వచ్చాడు. ".... మంగతాయారు చెప్పింది గురూ! వాళ్ళ లేడీస్ హాస్టల్లో పదిరోజుల క్రితం ఈ చర్చ జరిగిందట. ఎవరో అమ్మాయి... క్లెయింట్ ఈస్ట్ వుడ్ ఫాన్- పోలీసాఫీసర్ల సామర్ధ్యాన్ని అదే పనిగా పొగడటం మొదలు పెట్టిందట. ఇంకొకరు వప్పుకోక, మన దేశంలో ఈ డిపార్టుమెంటు వాళ్ళకి మెదడు మోకాలులో వుంటుందన్నారట. దానితో మాటామాట పెరిగిందిట. పందేలు వేసుకున్నారు. పందెం ఏమిటంటే ఒక పోలీసు ఆఫీసర్ని వరుసగా రెండుసార్లు పూల్ ని చేయటం....! సరే అంటే సరే అనుకున్నారు. ఇంతకీ చెప్పొచ్చే దేమిటంటే, ఫూల్ ని చేయటం కోసం వాళ్ళు ఎన్నుకున్న పోలీసాఫీసర్ వి నువ్వే...."
అప్పటివరకూ ఉత్సాహంగా వింటూన్న నేను ఈ చివరి వాక్యంతో పక్కలో పిడుగు పడ్డట్టు ఉలిక్కిపడ్డాను.
"ఏమిటీ?"
"అవును గురూ. లేడీస్ హాస్టల్ లో ఆ రోజు రాత్రి పదింటికి జరిగిన ఆ చారిత్రాత్మక వప్పందాన్ని ఎంతో రహస్యంగా ఉంచాలన్న నిర్ణయం జరిగింది. కానీ మంగతాయారు మన -సారీ- నా ప్రియురాలు కాబట్టి, ప్రేమికులు మధ్య ఇలాంటి రహస్యా లుండకూడదు కాబట్టి ఆ అమ్మాయి నాకు అంతా చెప్పేసింది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి..."
మాట్లాడలేదు నేను. దొంగకు తేలుకుట్టినట్టయింది నా పరిస్థితి. ఇప్పటికే ఒకసారి ఫూల్ ని అయ్యానని ఎలా చెప్పను? అర్దరాత్రి ఆర్తజన పరాయణుడిలా ఆ లేడీస్ హాస్టల్ కి ఆల్రెడీ వెళ్ళానని ఎలా వప్పుకోను.
* * *
ఆ రాత్రి కలొచ్చింది.
"మాట్లాడటం కాదు ....కావాలంటే బెట్. ఒకే పోలీసాఫీసర్ని వరుసగా రెండుసార్లు ఫూల్ ని చేస్తాను. ఓ.కే!" అంటుందా అమ్మాయి.
"సరేనే. నువ్విలా చేసిచూపిస్తే ఒక నెలరోజుల పాటు మేమందరం నువ్వు చెప్పినట్టుగా చేస్తాము. అదే బెట్!"
"ఏం చెప్పినా చెయ్యాలి. మన మెస్ వంటవాడినీ, బాత్ రూం క్లీనర్ గాడినీ, హాస్టలు గూర్ఖాగాణ్నీ ఎవర్ని ముద్దు పెట్టుకోమన్నా పెట్టుకోవాలి- సరేనా.."
"సరే."
"అయితే ఏ పోలీసు ఆఫీసర్ని ఫూల్ ని చెయ్యమంటారు?"
"ఎవర్నన్నా చేయగలవా?"
"ఆఁ, ఆ డిపార్టుమెంటులో ఎవరి మెదడైనా మోకాళ్ళలోనే ఉంటుంది."
"సరే అయితే. మీ నాన్నగారు జైలు సూపర్నెంటెండెంట్ కదే! ఆయన దగ్గిర పనిచేసే ఆఫీసర్స్ లో ఎవరినైనా సరే!"
"ఓ.కే.! 'ఆపరేషన్ పూల్ ది ఆఫీసర్'... ఇప్పుడే ప్రారంభమవుతుంది... పదండి" కోతులన్నీ బయల్దేరాయి.
"హలో ... సార్.... ఒక రౌడీవెధవ మా హాస్టల్ లో జొరబడి గరల్స్ అందర్నీ అల్లరి చేస్తున్నాడు సార్. అతనీ మధ్యే జైలునుంచి రిలీజ్ అయ్యాడట సార్. చాలాకాలం నుంచి ఆడగాలి లేకపోవటంతో శివాలెత్తిపోతున్నాడు."
"ఇప్పుడే వచ్చేస్తున్నాను. చూడండి! నేనొచ్చేవరకూ మీరు మీ శీలాల్ని జాగ్రత్తగా కాపాడుకోండి."
మోటార్ సైకిలు స్టార్టయిన చప్పుడుతో మెలకువ వచ్చింది. నాకే సిగ్గేసింది నా కలకి. ఒకసారి మెదడు ఎక్కడుందా అని తడుముకున్నాను.
సరే, అయిందేదో అయిపోయింది.
రెండోసారి మాత్రం చచ్చినా ఫూల్ కాకూడదు- అని నిశ్చయించుకున్నాను. ఆ అమ్మాయి తెలివైనదే కావచ్చు. కానీ నాకూ విషయం తెలిసి పోయింది కాబట్టి ఇక బ్రహ్మరుద్రాదులు కూడా ఆమెకు సాయం చేయలేరు. ఆమె గెలవలేదు. ఈ లోపులో గడువు పూర్తయి, ఆమె ఓడిపోవాలి.
సరే! ఇది ఇటువైపు వుండగా, మరోవైపు -
- జైల్లో కట్టుదిట్టాలు మరింత ఎక్కువచేసాం. నేనే స్వయంగా ప్రతి సెల్ కి వెళ్ళి పరీక్షించాను. భీమరాజుకి రహస్యంగా ఈ సామాన్లు అందజేయబడ్డాయని అర్ధమైంది. కానీ ఎలా అందజేయబడిందీ మాకు అర్ధం కాలేదు. నా అనుమానాన్ని ఎవరికీ చెప్పలేదు నేను. నాలోనే దాచుకున్నాను. సొరంగంలో మాకు గునపం, పార కూడా దొరికాయి.
కానీ ఎన్ని ప్రశ్నలు వేసినా భీమరాజు సమాధానం చెప్పలేదు. ఫైలు పోలీసులకి అందజేసాం. సొరంగం అతడు తవ్వలేదు, ఎవరో బయటనుంచి తవ్వుకెళ్ళిన దానికి అతడు బాధ్యుడు కాదు. ఇదీ పోలీసుల ఎంక్వయిరీలో తేలింది.
సాటి ఖైదీల మధ్య భీమరాజు హీరోలా వెలగడం మొదలు పెట్టాడు. నన్ను చూసి హేళనగా నవ్వసాగాడు. నేను వూరుకొన్నాను. ఇది సమయం కాదు. నాకు సమయం వస్తుంది.
....
"ఏమిటి విశేషాలు?" అటెండెన్స్ తీసుకుని నా గదివైపు వెళ్తూ వుంటే రాజారాం అడిగాడు. రాజారాం నాలాగే సబ్- జైలరు. అతడికి హైదరాబాద్ రాజకీయాల్లో చాలా పరిచయం వుంది. అతడి మామగారు ముఖ్యమంత్రికి చాలా దగ్గిర.
"ఏమున్నాయి- మామూలే. ఖైదీలు ఈ భీమరాజు విషయంలో మనమీద మానసికంగా విజయం సాధించినట్లు భావిస్తున్నారు" అన్నాను.
"వాళ్ళమొహం-" అన్నాడు రాజారాం. "నీ వల్ల దొరికిపోయాడు కదా చివరికి! మొత్తానికి నీ పుణ్యమా అని. మంచి పేరొచ్చింది"
"అదలా వుంచుగానీ, ఒకవేళ భీమరాజు నిజంగా తప్పించుకుపోయి వుంటే మాత్రం ఈ కొత్త సూపర్నెంటు చాలా ఇరకాటంలో పడిపోయి ఉండేవాడు. ఇన్నేళ్ళజైలు ప్రతిష్ట తన హయాంలో పోయినందుకు."
"నిజమే... రాజకీయ నాయకుల్తో పలుకుబడి ఉపయోగించి కోరి కోరి వేయించుకున్నాడాయె."
"రాజకీయ నాయకులతోటా?"
"నీకు తెలీదా? మాజీ మంత్రిగారు దామోదరం కాబట్టి ఇతగాణ్ణి ఈ పోస్టులో వేయించేవరకూ నిద్రపోలేదు."
ఒక శీతల పవనం నన్ను అకస్మాత్తుగా చుట్టుముట్టినట్టు ఫీలయ్యాను.
దామోదరం జగన్నాధాన్ని ఈ జైలుకి పనిగట్టుకుని వేయించాడు. ఒక సీక్రెట్ వార్త ఈ జైలునుంచి ఇతడి ద్వారా అతడికి చేరింది. అదే రాత్రి ఓ కిరాయి హంతకుడు జైలునుంచి తప్పించుకోవటానికి ప్రయత్నించాడు. ఆ కిరాయి హంతకుడు రాజకీయ నాయకులకి కుడి భుజం. ఎలక్షన్లలో దామోదరానికి ఎదురుగా నిలబడే ప్రత్యర్ధి సాధు వర్తనుడు. ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నవాడు. అతడు అడ్డుతొలగితే తప్ప దమోదరానికి విజయావకాశాలు లేవు.
ఒకటి కొకటి కలిపి- హేతువుగా ఆలోచిస్తే...
తెర వెనుకనుంచి భీమరాజుకి సాయపడింది మా జైలు ఉన్నతాధికారే...... జగన్నాధం!!!
ఏ మూలో కొద్దిగా వున్న అనుమానం యిప్పుడు పూర్తిగా నిజమైంది. అయితే ఋజువులు లేవు. వాటిని పూర్తిగా సంపాదించేవరకూ ఓపిక పట్టాలి. ఈ లోపులో భీమరాజు మీద ఒక కన్నేసి ఉంచాలి.
నేను ఆలోచిస్తూ ఉండగానే శివప్రసాద్ పరుగెత్తుకు వచ్చాడు. అతడి చేతిలో ఒక టెలిప్రింటర్ వార్త వుంది. "గురూ! మాలాంటి వాళ్ళకి బాడ్ న్యూస్... నీకు గుడ్ న్యూస్. మొత్తం మీద థ్రిల్లింగ్ న్యూస్. గండ్రగొడ్డలి మన జైలుకే వస్తున్నాడట."