Previous Page Next Page 
అతడే ఆమె సైన్యం పేజి 6


    దాంతో అతడి శరీరం అంతా గాజు పెంకులు గుచ్చుకుని రక్తం స్రవించసాగింది. అక్షౌహిణి కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి.

    "తొందరగా..... చెయ్యి అందివ్వు" అని అరిచాడతడు. ఆమె చెయ్యి అందించింది. ఆమె బరువుకి పెంకులు మరింత లోపలికి వెళ్ళాయి. బాధని అదిమిపెట్టి, పెదాలు బిగపట్టి ఆమెని పైకి లాగసాగాడు! చివరివరకూ వచ్చాక ఆమె చెయ్యి గోడ చివరి అంచు పెంకుమీద ఆని, ఆమె బాధతో కెవ్వున అరిచింది. అతడు వారించబోయే లోపులోనే ఆ కేక గాలిలో కలిసిపోయింది. సెంట్రీలు పరుగెత్తుకు రాసాగారు.

    అతడు రెండు చేతుల్తోనూ ఆమె భుజాలు పట్టుకుని పైకి లాగటానికి ప్రయత్నం చేయసాగాడు. సెంట్రీ విజిల్ వూదాడు. ఆమె అతడితో పాటూ పైకి రావటానికి ప్రయత్నం చేస్తోంది.

    "ఆగండి- స్టాప్ దేర్" రెండో సెంట్రీ అరుస్తున్నాడు.

    ఈ అవకాశం పోతే మరి రాదని అతడికి తెలుసు. తన గాయాన్ని కూడా లెక్కచేయటం లేదతడు. అతడి గాయాలనుంచి స్రవిస్తూన్న రక్తం ఆమె మీద బొట్లు బొట్లుగా పడుతూంది.

    హెచ్చరికగా సెంట్రీ గాలిలోకి రైఫిల్ పేల్చాడు. అక్కడి నిశ్శబ్దం ఒక్కసారిగా చెదిరింది. ఆస్పత్రి ఆవరణలో వున్న చెట్లమీద విశ్రాంతి తీసుకుంటున్న పక్షులన్నీ ఆ అర్దరాత్రి శబ్దానికి ఒక్కసారిగా రెక్కలు టపటపా కొట్టుకుంటూ పైకి లేచాయి.

    గోడమీద కాలుపెట్టి ఒక్క అంగలో పైకి రావచ్చు కానీ భయంవల్లా. టెన్షన్ వల్లా ఆ పని చేయలేకపోతూంది. ఆమెని వదిలి అతడు వెళ్ళిపోవచ్చు కానీ కృతజ్ఞతా భావంవల్ల అతడా పని చేయలేకపోతున్నాడు.

    అదే ఆ ఇద్దరి పాలిట శాపంలా పరిణమించింది.

    ఒక రైఫిల్ బుల్లెట్ అతని పక్కనుంచి దూసుకుపోయింది. అంత పరిణామాన్ని అతడు వూహించలేదు. ఒక పిచ్చాసుపత్రి నుంచి పేషెంట్ పారిపోతుంటే అతడిని పట్టుకోవటానికి అలా రైఫిల్స్ పేల్చనవసరం లేదు, గేటు బైటికొచ్చి గోడ ఇవతల్నించి పట్టుకోవచ్చు. అతడు రెండు చేతులతో ఆమెని పట్టుకుని పైకి లాగుతూండగా అప్పుడు వినిపించింది. రెండో బుల్లెట్ శబ్దం. దానితోపాటు ఆమె ఆర్తనాదం.

    సెంట్రీ రైఫిల్ నుంచి వెలువడిన బుల్లెట్ ఆమె వెన్నులోంచి దూసుకుపోయింది. క్షణాల్లో ఆమె శరీరం తోటకూర కాడలా వాడిపోయింది. నేలమీద కుప్పగా కూలిపోయింది. అతడామె తలని వళ్ళోకి తీసుకున్నాడు. ఆమె ఏదో చెప్పబోయింది. నోటినుంచి మాట రాలేదు.

    ఆమె తల పక్కకి వాలిపోయింది.

    అతడింకా దిగ్భ్రమనుంచి కోలుకోలేదు. జరుగుతున్నదంతా కలో నిజమో తెలియటం లేదు. క్షణం క్రితం వరకూ తన ముందు సజీవ ప్రతిమలా తిరుగుతూ, తన కళ్ళల్లో మెరుపుల్ని పండించిన ఆ అద్భుత సౌందర్యరాశి రెప్పపాటు కాలంలో నిర్జీవంగా మారటాన్ని అతడు జీర్ణించుకోలేకపోయాడు. అతడా అచేతనామయవస్థలో వుండగానే తన మొహంమీద ఏదో ద్రవం చల్లబడినట్లు అనిపించింది. జూలో జంతువులు బోనులో నుంచి పొరపాటున బయటకొస్తే వాటిని వెంటనే మత్తులోకి పంపే ద్రవం అది.


                                                3


    ఏటవాలుగా ఒక సూర్యకిరణం మొహం మీద చురుక్కుమని పడటంతో అతడికి మెలకువ వచ్చింది.

    కళ్ళు విప్పి చుట్టూ చూశాడు. అదే హాస్పిటల్ రూమ్.

    అతడికి మెలకువ రావటం చూసి, వరండా లోంచి వెళుతూన్న డాక్టర్ లోపలికి వచ్చాడు. "గుడ్ మార్నింగ్ సుబ్బారావ్."

    "నేను సుబ్బారావ్ ని అవనీ, చైతన్యని అవనీ నా మూలంగా ఒక అమ్మాయి ప్రాణాలు పోగొట్టుకుంది. దానికి నేను శిక్షార్హుణ్ణి" అన్నాడు.

    "నీ మూలంగా ప్రాణాలు పోగొట్టుకోవటం ఏమిటి?"

    "నిన్న రాత్రి జరిగిన సంఘటన-"

    "ఏం జరిగింది సుబ్బారావ్?"

    ఏం జరిగిందో ఆ డాక్టర్ కి తెలిసి వుండకపోవచ్చు. అతడు జరిగినదంతా చెప్పేడు. డాక్టర్ మొహంలో రంగులు మారాయి. "మైగాడ్" అని గొణుక్కున్నాడు. అంతలో ఆ గదిలోకి సూపర్నెండెంట్ వచ్చాడు. డాక్టర్ ఆయన్ని దూరంగా తీసుకువెళ్ళాడు.

    "నిన్నరాత్రి నుంచి పేషెంట్ కి హెలూసినేషన్ (భ్రాంతి) స్టార్ట్ అయినట్టు అనుమానం సార్."

    "పారానాయిడ్ ప్రవర్తనకి తోడు హెలూసినేషన్ కూడానా- ఐ పిటీ హిమ్."

    ఎంత తక్కువ గొంతులో మాట్లాడుకున్నా ఆ మాటలు అతని చెవిన పడ్డాయి. గాలిలా వాళ్ళ మధ్యకు వెళ్ళి "మీరేమనుకుంటున్నారో నాకు అర్ధంకావటంలేదు. నిన్నరాత్రి నేనీ ఆస్పత్రి నుంచి పారిపోవాలనుకున్నాను. ఒకామె నాకు సాయం చేయటానికి సిద్ధపడింది. ఆ ప్రయత్నంలో ఆమె సెంట్రీల రైఫిల్ గుళ్ళకి బలి అయింది" అన్నాడు.

    "సెంట్రీల గుళ్ళకా?" ఆశ్చర్యంగా అడిగాడు సూపర్నెండెంట్.

    "అవును. ఆ విషయం మీకింతవరకూ తెలియకపోవటం ఆశ్చర్యకరం."

    "మీకు కలవచ్చి వుంటుంది సుబ్బారావ్."

    అతన్ని లాగిపెట్టి కొట్టాలన్న కోరికని బలవంతంగా ఆపుకున్నాడు అతడు. "కలకాదు. నిజం. మీ సెంట్రీలని ఎంక్వయిరీ చేయండి."

    "అక్కర్లేదు. ఇది ఆర్మీ క్యాంప్ కాదు. పిచ్చాసుపత్రి. పారిపోయే రోగుల్ని కాల్చడానికి ఇక్కడ సెంట్రీలు, వాళ్ళ దగ్గిర రైఫిల్సూ వుండవు."

    అతడు షాక్ తగిలినట్టు నిలబడిపోయాడు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. "ఇతడిని జాగ్రత్తగా ట్రీట్ చేయాలి. చాలా విచిత్రమయిన కేసు" అని పాల్ అంటూ వుండటం దూరం నుంచి వినిపించింది.


                  *    *    *    *


    అతడు ఆ ఒంటరి గదిలో రెండు గంటలు నరకం అనుభవించాడు.

    ఆమె దూరం అతడి కళ్ళముందు నుంచి తొలగిపోవటం లేదు. తనని బయటకు పంపే ఆమె ప్రయత్నం. చెయ్యి అందిస్తూ వుండగా ఆమె వెన్నులో బుల్లెట్స్ గుచ్చుకోవటం, ఆమె తన వైపు చూసిన ఆఖరి చూపు అతడిని కదిలించి వేస్తున్నాయి. అందరికన్నా అతీతమైనదేదో వుంది ఆమెలో. ఒక రకమైన గ్రేస్ అది బహుశా కల్నల్ కూతురవటం వల్ల వచ్చిందేమో అది. అందుకేనేమో యుద్ధంలో సైనికుడిలా మరణించింది- ఆఖరి చిరునవ్వుతో.

    మనసంతా చీకటి కమ్మినట్టు ఒక ఆర్ధ్రభావం.

    అతడు కవి కాదు. కానీ ఒక నిజమైన అభిమానాన్ని మాటల్లో వ్యక్తీకరించటానికి కవిత్వం అవసరంలేదు. జ్ఞాపకం వచ్చే పెదవి నవ్వు ఆనందభైరవి అయితే జ్ఞాపకం మిగిల్చే కంటిచుక్క శివరంజని...! కాలం కడగలేని ఒకే ఒక వస్తువు- జ్ఞాపకం. ఆమెతో అతడి పరిచయం కొన్ని గంటలు మాత్రమే. పేరే గమ్మత్తయినది 'అక్షౌహిణి'.

    పైకి లాగటం కోసం తనామెకి చెయ్యి అందిస్తూంటే కనీసం తననైనా ప్రాణాలు దక్కించుకొమ్మని అర్ధిస్తూ ఆమె చూసిన చూపు అతడిని వేదనాపూరితుడిని చేస్తుంది. ఆ గదిలో ఒంటరితనం ఆవేదనకి మరింత సాంద్రత కలిగిస్తోంది. అతడికి కవిత్వం రాదు.

    ఏ కవి అన్నాడు?

    -స్వప్న సంగీతాలు నేను గానవిస్తూంటే నీ చుట్టూ వున్న సౌండ్ ప్రూఫ్

    నిశ్శబ్దాని కెంత నిర్దయ?

    ఈ నిశ్శబ్ద హిమసుమం కోసం ఇవ్వాళ ఉదయించని నిన్నటి సూర్యుడా! నిన్ను ప్రేమించిన నేరానికి, నువ్వు మిగిల్చిన సంధ్య రక్తాన్ని నీ గుర్తుగా చీకటి పాదాలకి పూస్తోంది ఈ ప్రపంచం.

    ఆత్మహత్యించుకుంటున్న నిన్నటి స్వప్నాల డెడ్ బాడీస్ మీద నుంచి చెయ్యిపట్టి లాక్కెళుతున్నాడు నేటి సూర్యుడు.

    ఎన్ని ఓదార్పుల శాస్త్రచికిత్సలు కావాలో- చీలిన నా హృదయాన్ని అతకటానికి.

    రాత్రి పత్రంమీద వెన్నెల కిరణాల కలంతోనే రాసిన మౌనాక్షరాల నక్షత్రాలు, ప్రత్యూషంలో హిమబిందువులై, అపరాహ్ణంలో దాహార్తితో అరిచే పక్షుల దీనరవాలై, సాయం సంధ్య మసకల్లో చీకట్లుగా కలిసిపోతున్నాయి.

    కేవలం ఉదయపు వాస్తవ విషాదాన్ని దర్శించటం కోసం, నిన్ను తల్చుకుంటూ, రాత్రి అంచుల మీద ప్రయాణిస్తాను.

    పరిచయం కానంతకాలం నిన్ను పోగొట్టుకున్నాను. పరిచయం అయ్యాక నన్ను పోగొట్టుకున్నాను.

    నా నిస్తేజపు కళ్ళనుంచి నీ అద్భుత సౌందర్యానికి చేసిన వంతెన మీద నడిచే నిర్దయ సైనికులు నా చుట్టూ వున్నవారు.

    ఒక శరద్రాత్రి, ఏటవాలు క్షణాలమీద నిటారుగా నిలబడి, వెన్నెల తీవెల్ని మీటగల అనుభవాన్ని ఇచ్చేదే ప్రేమ. కనురెప్పల మైదానాల మీద కలల విత్తనాలు జల్లి, అనుభూతుల పంట పండించేదే ప్రేమ. కొబ్బరితాడు చేదా, తియ్యటి నీళ్ళు, మిద్దెలో వుంచిన మామిడి పళ్ళ వాసనా, తాటాకులమీద తొలకరి జల్లుల చప్పుడు కలిస్తే ప్రేమ, మనసుకి మాట్లాడే అనుమతి ఇచ్చేది ప్రేమ. నీ అద్భుతంలో, నీ అనంతంలో, నీ అద్వితీయంలో సర్వస్వం విలీనమవ్వటం ప్రేమ.

    కార్తీకమాసపు చిరుచలి రాత్రంతా కుప్పగా పోసే వెన్నెల నీవైతే, ఆకాశం అంచున సూర్యుడు వెళ్ళిపోతూ వ్రాసే కవితాపంక్తి ననీ స్నేహమైతే,

    నిన్నే నిన్నే తలుచుకుని
    నిద్దుర పొద్దులు మేలుకుని
    వేచాను నువ్వొస్తావని
    నువ్వొస్తే ప్రాణం వొస్తుందని."


                                        *    *    *    *


    ఏదో శబ్దమవటంతో అతడు తన స్వాప్నికావస్థనుంచి తేరుకున్నాడు. వరండాలో ఇద్దరు డాక్టర్లు వెళుతున్నారు.

    అప్పుడే వచ్చింది అతడికో ఆలోచన.

    టేబుల్ పక్కనున్న నీళ్లసీసా భళ్ళున బ్రద్దలుకొట్టాడు. ఆ శబ్దానికి డాక్టర్లు వెనుదిరిగారు.

    అతడు గాలిలా దూసుకువెళ్ళాడు వాళ్ళ దగ్గరికి. ఏం జరుగుతూ వుందో తెలుసుకునే లోపులోనే ఒక డాక్టర్ మెడమీద ఆ సీసా అంచుని కత్తిలా ఆన్చి అతడిని పట్టుకుని తన గదిలోకి లాక్కొచ్చాడు.

    ఈ దృశ్యం చూసి సిబ్బంది పరుగెత్తుకు రాసాగారు.

    "ఖబడ్దార్! ఎవరైనా నా గదిలోకి రావటానికి ప్రయత్నిస్తే ఈ డాక్టర్ ప్రాణాలు పోతాయి. అంతేకాదు! అక్షౌహిణి శవాన్ని మీరేం చేశారు? ఆ విషయం అయిదు నిముషాల్లో పోలీసుల్ని పిలిపించి మీరు చెప్పాలి. లేకపోయినా ఈ డాక్టర్ ప్రాణాలు మిగలవు,"

    అతడి చేతులమధ్య డాక్టర్ వణికిపోతున్నాడు.

    అంతలో అక్కడికి సూపర్నిండెంట్ పరుగెత్తుకు వచ్చాడు.

    "వదుల్ను. ఆమెని చంపిన సెంట్రీల సంగతి తేల్చండి ముందు."

    "ఆమె ఎవరు?"

    "అక్షౌహిణి".

    "అంటే?"

    "అదికూడా మీకు తెలిదా? ఆమె మీ ఆస్పత్రిలో పనిచేసే నర్సు."

    "మెదడుకి తార్కికంగా ఆలోచించడం నేర్పు సుబ్బారావ్. అక్షౌహిణి అనే పేరు ఎవరకయినా వుంటుందా?"

 Previous Page Next Page