Previous Page Next Page 
ఆనందోబ్రహ్మ పేజి 7

   

    అతడు లోపలికి నడిచాడు.
   
    అనుకున్నంత టెన్షన్ గా లేకపోవటంతో తనలో తానే ఆశ్చర్యపడ్డాడు. బహుశా దైనందిన జీవితంలో వత్తిడులు ఏ పరిస్తితులనైనా కామ్ గా తీసుకొనేటట్టూ చేస్తున్నాయేమో!
   
    అంతలో ఆటోమాటిక్ గా సెట్ చేసి ఉంచిన టి.వి. దానంతట అదే ప్రారంభమయి వార్తలు వినిపించసాగాయి. "ఆంధ్రదర్శిని....వార్తలు.....ఫ్రాన్సుకీ, రష్యాకీ మధ్య జరుగుతున్న చర్చలు సఫలమయ్యే జాడ ఏదీ కనిపించటం లేదు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం నాలుగింటికీ చర్చలు మధ్యలో ఆగిపోయాయి."
   
    అతడి మొహం వివర్ణమైంది. 'ఇక బయలుదేరి - ప్రాణాలరచెథిలొఇ పెట్టుకుని బయలుదేరాలి' అనుకున్నాడు. అంతలో మరో వాక్యం వినిపించింది.
   
    "చర్చలు ఆగిపోయిన అయిదు నిమిషాల్లో రష్యన్ విమానాలు పారిస్ పట్టణ శివార్లపై బాంబింగ్ జరిపాయి. కొన్ని వేలమంది మరణించి వుంటారని అంచనా. ప్రపంచ అద్బుతాల్లో ఒకటిగా గుర్తింపబడిన పారిస్ టవర్ కూలిపోయింది. ఫ్రాంక్ ఫర్టులో పర్యటిస్తున్న అంతర్జాతీయ శాంతి సంఘ కార్యదర్శి డాక్టర్ వాల్టన్ హుటాహుటిన జెనీవా ప్రయాణమయ్యారు. సకాలంలో ఆయన తీసుకున్న చర్యలవల్ల పది నిమిషాల క్రితమే 'తాత్కాలిక యుద్ద విరమణ.....సంధి' జరిగింది...."
   
    వార్తలు వింటూన్న కుటుంబ సభ్యులు నిశ్శబ్దంగా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. భయానికి కూడా అతీతమైన భావం అది. పూర్తిగా భయం కూడా కాదు. దిగ్భ్రమ. అది వాళ్ళ మోహంలో ప్రస్ఫుటించింది. మనిషి కాలానికి విలువ ఇవ్వటం ఎప్పుడో మానేశాడు..... ప్రాణానికి కూడానా?
   
    భరద్వాజ సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు.
   
    అంతకన్నా ఘోరమైన విపత్తుని వూహిస్తూ వుండటంవల్ల అతడికి ఈ వార్త అంత సంచలనాన్ని కలిగించలేదు. వస్తుందనుకున్న తుఫాను అనుకున్న తీరాన్ని కాకుండా వేరేచోట తాకినట్టూ - పారిస్ ఆహుతి అయిందన్నమాట.
   
    అతడు కమీషనర్ కి ఫోన్ చేశాడు. అట్నుంచి సంతోషంగా-
   
    "కథ సుఖాంతమయింది. మనం ఇంకెక్కడికీ వెళ్ళనవసరంలేదు. "అన్నాడు కమీషనరు.
   
    "అది సరే, మీరు నాకు చెప్పిన ప్రకారం చర్చలు పూర్తయ్యేసరికి తెల్లవారుతుంది. బాంబు వేసేసరికి నాలుగో అయిదో అవుతుంది."
   
    "అవును."
   
    "మీరు చెప్పినట్టు తెల్లవారుఝామున కాదు, గంట క్రితమే.....ఈ వార్తలు వినకుండానే...."
   
    అవతల్నుంచి కమీషనర్ ఇబ్బందిగా "మేము అనుకున్నది తెల్ల్లవారుఝామున అని... ఆ మాత్రం రిస్కు తీసుకోకుండా వార్త తెలియగానే పరిగెత్తటం హాస్యాస్పదం అవదూ" అన్నాడు.
   
    "అవుతుంది. మీకు మరొకసారి థాంక్స్!" అని పెట్టేశాడు భరద్వాజ. రిస్కు అన్న పదం చిత్రంగా వినిపించింది.
   
    వార్తలు వినేవరకూ వుంటే రిస్క్.....ముందే పరుగెడితే హాస్యాస్పదం. అనుక్షణం ప్రాణభయం. ఏమిటి ప్రపంచం!
   
    సమయం ఏడు కావొస్తూంది. సోలార్ సాటిలైట్ అవటం వల్ల పట్టపగల్లా వెలుతురుగానే వున్నా గాలి మాత్రం చల్లగా వీస్తూంది.
   
    ఇంతలో లోపల్నుంచి భార్య రావటం కనిపించింది. ఆమె ముసిముసిగా నవ్వుతూంది. ఎందుకన్నట్టు చూశాడు. ఆమె లోపలికి చూడమన్నట్టు సైగ చేసింది. అతడు లోపలికి వెళ్ళాడు.
   
    కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తున్న కూతురు అలికిడికి వెనుదిరిగింది. ఆమె కళ్ళలో నీళ్ళున్నాయి.
   
    "ఏమైంది?" అని అడిగాడు దగ్గరికి వెళుతూ.
   
    "పారిస్ టవర్ కూల్చేశారట. ఎనిమిది అద్భుతాల్లో ఒకటి పోయింది" ఆమె కంఠం రుద్దమయింది.
   
    అతడికి నవ్వొచ్చింది. దాన్ని ఆపుకుంటూ "దానికి ఏడుస్తున్నావా? డోంట్ బి సెంటిమెంటల్...... ఒక ఇనుప కట్టడం కూలిపోతే ఏడుస్తారా ఎవరైనా" అన్నాడు. ఆ అమ్మాయి మాట్లాడలేదు.
   
    అతడు బైటకొస్తూంటే భార్య ఇంకా అలానే నవ్వుతూ వుండటం కనిపించింది. కూతుర్నైతే మందలించాడు గానీ భార్య నవ్వటం చికాకు అనిపించింది. ఎందుకో తెలీదు.
   
    ఇంతలో లోపల కొడుకు చెల్లెలితో అనటం వినిపించింది. "మనుష్యులు పోతేనే క్రిమేషన్ కి పంపించేసి ఇంటికి వచ్చేస్తున్నాం. ప్రాణంలేని వస్తువులు పోతే ఏడవడం దేనికి?"
   
    ఒక్కసారిగా గాలి స్థంభించినట్టూ అతడు ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. లోపలి గదిలోంచి వచ్చిన ఈ మాటలకి అతడి భార్య మొహంలో నవ్వు మాయమైంది. ఇద్దరూ మొహమొహాలు చూసుకున్నారు. భార్యాభర్తలకి అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి.
   
    కొడుకు మామూలుగానే ఆ మాటలు అని వుండవచ్చు. కానీ తన మనసులో ఏ మూలో తన తండ్రిపట్ల నిరాసక్తత బాధపెడుతూ వుండి వుండవచ్చు. బాంబు కంగార్లో విచారాన్ని 'ప్రకటించాలన్న' సంగతిని తను మర్చిపోయాడు.
   
    మనిషి చనిపోతే అతిథిని పంపినట్టూ సాగనంపే తన తరం నుంచి అందమైన ఒక వస్తువు నాశనమైతే కన్నీళ్లు పెట్టుకునే సెంటిమెంటులోకి తన తరువాతి తరం వస్తుందా?
   

    అసాధ్యం."

    ఇరవై ఒకటో శతాబ్దంలో......సైన్సు ఇంతగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో - అది ఊహకందని విషయం.
   
                              6
   
    "మిష్టర్ భరద్వాజా! మా ఎస్.ఎస్.ఎ. సంస్థ స్థాపించి ఇప్పటికి పది సంవత్సరాలు కావస్తోంది. తమ తమ రంగాల్లో నిష్ణాతులైన గొప్ప గొప్ప వాళ్ళెంతోమంది ఈ సంస్థలో ఉద్యోగులుగా పార్టుటైం సలహాదారులుగా పనిచేస్తున్నారు. వ్యాపారం, ఆఫీసు బాధలు, భార్యాభర్తల మధ్య గొడవలు లాంటి చిన్న చిన్న సమస్యలే కాకుండా, అంతర్జాతీయ సంబంధాలూ, షేరు మార్కెట్టూ వంటి ఎన్నో సమస్యలకి మేము పరిష్కారాలు చెప్పాము. ఇప్పటివరకూ మేము ఎప్పుడూ ఓటమి నెదుర్కోలేదు. ఇన్ని సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా మీ కేసులో ఎదుర్కోవలసి వచ్చింది...."
   
    వింటూన్న భరద్వాజ ఉలిక్కిపడ్డాడు.
   
    "అన్నికేసులూ పరిశీలించినట్టే చాలా మామూలుగా మీ కేసునీ పరిశీలించటం మొదలుపెట్టాము. కానీ మేము వూహించని రిజల్ట్సు వస్తూంటే కంగారు వేసింది. ఒక స్పెషలిస్టు ఇచ్చిన రిపోర్టుకీ, మరో నిపుణుడు ఇచ్చిన రిపోర్టుకీ అసలు సంబంధం లేకుండా వుంది. ఈ లోపులో పాఠకులను సర్వే చేయటానికి వెళ్ళినవాళ్ళు తమ తమ నివేదికలు అందజేశారు. అది చూస్తే మాకు పూర్తిగా మతిపోయింది. ప్రజలకేం కావాలో మాకు తెలియలేదు. కానీ అసలు వాళ్ళకేం కావాలో వాళ్ళకీ తెలీదు అని మాత్రం నిశ్చయమైంది. తలొకరూ తలొక రకంగా చెప్పారు. సగటు పాఠకుడు ఎవరో నిర్ణయించటానికి మేము చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దాంతో పట్టుదల పెరిగి, మరిన్ని కొత్త పద్దతుల్లో మరింతమంది నిపుణులను ఈ పనికి ప్రవేశపెట్టాము. దీనివల్ల మీరు ఇచ్చే ఫీజుకన్నా మాకయ్యే ఖర్చు ఎక్కువ. అయినా దీనికి వెనుకాడలేదు. దీన్నో ఛాలెంజ్ గా తీసుకున్నాము. అయినా ఫలితం లేకపోయింది. వెయ్యి పేజీల రిపోర్టయితే తయారైంది కానీ, ప్రజల టేస్టూ, మీ ఓటమికి కారణమూ మాకు తెలియదు. సారీ భరద్వాజా? ఇదిగో మీ చెక్కు మీరు అడ్వాన్స్ గా ఇచ్చినది తిరిగి యిచ్చేస్తున్నాము."
   
    భరద్వాజ చాలాసేపటి వరకూ ఏమీ మాట్లాడలేదు. మాట్లాడటానికి ఏమీలేదు. ఎస్.ఎస్.ఎ. సంస్థ కూడా దీనికి కారణాలు కనుక్కోలేక పోయిందీ అంటే ఇక ఎవరూ కనుక్కోలేరు.
   
    అతడు చెయ్యిసాచి చెక్కు అందుకుని లేచి నిలబడ్డాడు. అదే చేత్తో ఎమ్.డి.కి షేక్ హాండ్ యిచ్చాడు.
   
    రెండు చేతులూ కోటు జేబులో పెట్టుకుని అతడు మెట్లు దిగుతూంటే పక్కనుంచి 'హల్లో' అని వినబడింది. తలతిప్పి చూశాడు.
   
    కీర్తి!
   
    దగ్గరగా వస్తూ "ఎక్కన్నుంచి? మా ఎమ్.డి. దగ్గర్నుంచా?" అని అడిగాడు.
   
    "అవును."
   
    "అంతా చెప్పాడా?"

 Previous Page Next Page