Previous Page Next Page 
ఆనందోబ్రహ్మ పేజి 6

  

      గది బయట వరండాలో తండ్రి శవం వుంది.
   
    "మీరు తీసుకువెడతారా? మమ్మల్ని ఫోన్ చెయ్యమంటారా?"
   
    "మీరే ఫోన్ చెయ్యండి."
   
    అధికారి ఫోన్ వద్దకు నడిచాడు. పది నిమిషాల తరువాత వ్యాన్ వచ్చింది. ఈ లోపులో భరద్వాజ పేపర్లో సంతకం పెట్టి, వాళ్ళకు చెల్లించవలసిన బకాయిలు చెల్లించాడు. తండ్రి పాతకోట్లు, మిగతా వస్తువులు దానం చెయ్యమని చెప్పాడు. మరణాన్ని ధృవీకరిస్తూ ఇచ్చిన పేపర్లు జేబులో పెట్టుకున్నాడు.
   
    నలుగురు వచ్చి శవాన్ని అంబులెన్స్ లో ఎక్కించారు.
   
    వెనుకే వీళ్ళ కారు దాన్ని అనుసరించింది.
   
    చిన్న కాంపౌండ్ లో వుంది బంగళా - ఎలక్ట్రికల్ క్రిమేషన్ చేసేది.
   
    వ్యాన్ ఆగగానే నలుగురూ దిగి శవాన్ని లోపలికి తీసుకెళ్ళారు.
   
    భరద్వాజ ఆఫీసు రూములోకి ప్రవేశించాడు.
   
    క్లర్క్ ఒక ఫారం ఇచ్చి పూర్తిచెయ్యమన్నాడు.
   
    తండ్రి పేరు, వృత్తి, వయసు, ఏ కారణంవల్ల చచ్చిపోయిందీ..... డాక్టరు సర్టిఫికెట్టూ మొదలైన వివరాలన్నీ వున్నాయి. అతడు తొందర తొందరగా పూర్తిచేసుకుంటూ వచ్చి ఒక కాలమ్ దగ్గర ఆగిపోయాడు. ash అని వుంది అక్కడ.
   
    "ఏమిటిది?" అని అడిగాడు దాన్ని చూపిస్తూ.
   
    "ఆష్ - మీకు శవం తాలూకు బూడిద కావాలంటే అక్కడ టిక్ పెట్టండి. అయిదు వేల రూపాయలు ఎక్కువ అవుతుంది."
   
    "ఇంతకుముందు ఇది లేదే" అన్నాడు భరద్వాజ.
   
    "ఎన్విరాన్ మెంట్ పొల్యూషన్ ఎరాడికేషన్ సొసైటీ (వాతావరణం కాలుష్య నిరోధక సంస్థ) వారు అభ్యంతరం పెట్టిన తర్వాత ఈ బూడిదని కూడా ఆవిరి చెయ్యాలని ప్రభుత్వం నిబంధన విధించింది."
   
    "బూడిదలో వాతావరణ కాలుష్యం ఏముంటుంది?" అడిగాడు.
   
    "వివరాలు నాకు తెలియవు సార్."
   
    "బూడిద కావాలనేవాళ్ళు కూడా వుంటారా?"
   
    "కొంతమంది వుంటారు సార్! సెంటిమెంట్ గా నదిలో కలుపుతారట. వాళ్ళకోసం పాతమిషను వాడాలి. పన్ను కట్టాలి. దానికి అయిదొందలు ఎగస్ట్రా."
   
    భరద్వాజ 'యాష్' అన్నచోట అడ్డంగా కొట్టేశాడు.
   
    తరువాత ఇద్దరూ ముందు గదిలోకి వచ్చారు.
   
    అప్పటికే శవాన్ని స్ట్రెచర్ మీద పడుకోబెట్టారు.
   
    ధాన్యం పోసుకునే పెద్ద గాదెలాటి స్టీలు అల్మైరా ఒకటి వుంది. క్రింది గచ్చుకి రైలుపట్టాల్లా వున్నాయి. అవి ఆ బాక్సులోపలికి వున్నాయి.
   
    స్ట్రెచర్ ఆ పట్టాల మీద వుంది.
   
    క్లర్కు వచ్చి శవం మొహంమీద ముసుగు తొలగించాడు.
   
    భరద్వాజ అడుగు ముందుకేసి, తండ్రి మొహంకేసి ఒకసారి చూసి పక్కకి తప్పుకున్నాడు. తరువాత అదే విధంగా సిఅనిక వందనం రీతిలో కొడుకు, కూతురు భార్య కూడా అలగే చేశారు.
   
    తరువాత ఆ ఆఫీసు తాలూకు మనుష్యులు స్ట్రెచర్ ని పట్టాల మీద ముందుకు తోశారు.
   
    రైలు గుహలోకి ప్రవేశించినట్టు అది ఆ 'ఓవెన్' లోకి ప్రవేశించింది.
   
    బైట తలుపు మూసేసి క్లర్క్ స్విచ్ వేశాడు.
   
    ......స్ స్ స్ మన్న ధ్వని.
   
    రెండు నిమిషాలు ఆగి తలుపు తెరిచాడు.
   
    లోపల్నుంచి ఖాళీ స్ట్రెచర్ బయటకొచ్చింది.
   
    పైనేమీ లేదు.
   
    గుడ్డలు కూడా మాయమై పైనంతా ఖాళీగా వుంది.
   
    'అయిపోయింద'న్నట్టూ క్లర్కు భరద్వాజ వైపు చూశాడు. భరద్వాజ తలూపి గాఢంగా విశ్వసించి వెనుదిరిగాడు. వెనకే కుటుంబం కూడా నడిచింది. ఒక మనిషి ఆనవాలు కూడా లేకుండా అలా నిశ్శబ్దంగా......మెకానికల్ గా నిష్క్రమించటం ఎంత కాదనుకున్నా వాళ్ళకి అదోలా వుంది. వచ్చేస్తూంటే "చాలా అదృష్టవంతులు. ఏ రోగమూ, బాధ లేకుండా పోయారు." అంది అతడి భార్య.
   
    భరద్వాజ మాట్లాడలేదు.
   
    "పుట్టినవాళ్ళు పోక తప్పదుకదా" అని కూతురు అన్నది.
   
    "శ్మశాన వైరాగ్యమా?" చెల్లెల్ని వెక్కిరిస్తూ కొడుకు అన్నాడు.
   
    "కాదు క్రిమేషన్ వైరాగ్యం" రిటార్టు ఇచ్చిందా అమ్మాయి.
   
    "ష్..." అని సైగ చేసింది అతడి భార్య. భరద్వాజ మౌనంగా గంభీరంగా వుండటాన్ని వాళ్ళు గమనించారు.
   
    అది నిజమే.
   
    కానీ అతడలా వున్నది తండ్రి మరణంవల్ల కాదు. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని దేశం కాని దేశం వలస వెళ్ళవలసివస్తే- తను కార్లో తీసుకువెళ్ళే వస్తువుల్లో తండ్రికూడా ఒకడని అరగంట క్రితం ఆలోచించనందుకు.
   
                               5
   
    అతడు బాల్కనీలోకి వచ్చి నిలబడ్డాడు. సాయంత్రం అయిదున్నర కావొస్తూంది.
   
    ఇంకా చీకటి పడలేదు.
   
    .......ఇంకా చీకటి పడలేదు. ఇంకా చీకటి పడలేదు.. చీకటి చీకటి చీకటి.....అతడు తల విదిలించాడు.
   
    చాలా విచిత్రమైన వాక్యం అది.
   
    "ఇంకా చీకటి పడలేదు."
   
    కేవలం తమ తరానికి మాత్రమే తెలుస్తూందీ వాక్యానికి అర్ధం.
   
    తన రచనల్లో అప్పుడప్పుడూ ఉపయోగించే ఈ వాక్యాన్ని, తన తరువాత తరంవాళ్ళు చదివి అర్ధంకాక తల బ్రద్దలు కొట్టుకుంటారు.
   
    "చీకటంటే ఏమిటా?" అని.
   
    అతడు తూర్పు దిక్కుగా చూశాడు.
   
    పశ్చిమాన సూర్యుడు కృంగిపోతూంటే, తూర్పునుంచి సోలార్ సాటిలైట్ పైకి వస్తోంది. అది మరో సూర్యుడిలా వెలుగుతోంది. రాత్రి పదకొండూ పన్నెండూ వరకూ అది ప్రయాణం చేసి పశ్చిమాన అస్తమిస్తుంది. అప్పటినుంచీ కేవలం నాలుగు గంటలపాటు మాత్రమే చీకటి వుంటుంది.
   
    కొంతకాలానికి అదీ వుండదు.
   
    సూర్యుడి వెలుగుని తనలో భద్రపరచుకుని, స్వయంప్రకాశమై వెలిగే సోలార్ సాటిలైట్ ని రోదసీలోకి పంపించాలన్న ప్రతిపాదన వచ్చినప్పుడు ప్రపంచం యావత్తూ గగ్గోలు పెట్టింది.
   
    ప్రకృతి రక్షణ సంస్థవాళ్ళు ప్రపంచ కోర్టులో దావా వేశారు కూడా. ప్రకృతి సిద్దమైన చీకటి వెలుగుల్ని కృత్రిమం చేసే అధికారం మనిషికి లేదని.
   
    కానీ వాళ్ళు ఓడిపోక తప్పలేదు.
   
    మనిషికి రోజుకి నాల్గయిదు గంటల నిద్ర చాలు. కేవలం చీకటి పడటంవల్లే అతడు ఇన్ని గంటలసేపు విశ్రాంతి తీసుకుంటున్నాడు. పెరుగుతున్న జనాభాతో పాటు ఉత్పత్తి పెరగాలంటే చీకటిని కాస్త తగ్గించక తప్పదు. ఇదీ అవతలివాళ్ళ వాదన. కోర్టుకి అందులో బలం కనబడింది. సగం రాత్రి వరకూ సోలార్ సాటిలైట్ ఉపయోగాన్ని అంగీకరిస్తూ తీర్పు యిచ్చింది. ప్రజలు క్రమంగా ఈ దినచర్యకి అలవాటు పడ్డారు.
   
    కానీ ఇదీ సరిపోవటం లేదు.
   
    పెరుగుతున్న రద్దీ, పెరిగే జనాభా, పెరగవలసిన ఉత్పత్తి, ఆఫీసుల్లో స్థలం సమస్య....ఇవన్నీ మనిషిమీద మరింత వత్తిడి తెస్తున్నాయి.
   
    అర్ధరాత్రి అయ్యేసరికల్లా సాటిలైట్ ని మూసెయ్యాలన్న ప్రతిపాదనని మనిషి పునరాలోచించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది.
   
    ఈసారి ప్రకృతి రక్షణ సమితివాళ్ళు కూడా అభ్యంతరం పెట్టలేదు. వాళ్ళకీ తెలుసు - ఈ సమస్యకి పరిష్కారం మరొకటి లేదని.
   
    పూర్తి వెలుగుకి మిగతా చరచరాలు ఎలా రియాక్టు అవుతాయన్న పరిశోధన పూర్తికాగానే, మరో ఒకటి రెండు సంవత్సరాల్లో భూమినుంచి సూర్యుడికి సరిగ్గా అవతలివైపు మరో సోలార్ సాటిలైట్ ప్రవేశపెట్టబడుతుంది.
   
    అప్పుడిక ఒక రాత్రి అనేది వుండదు.
   
    ఒక షిప్టు జనం మొదటి పన్నెండు గంటలూ పగలుగా పనులు చేస్తే, ఆ తరువాత మరొక షిప్టు జనం నిద్రలేచి, అవే ఆఫీసుల్లో, అవే స్కూళ్ళల్లో, అవే ఆటస్థలాల్లో మరొక పన్నెండు గంటలు కార్యకలాపాలు జరుపుతారు.
   
    ఒకరికొకరు సంబంధం లేకుండా ప్రపంచం అలా రెండుగా విడిపోతుంది.
   
    రాత్రిళ్ళు లైట్లు వేసుకుని వెలుగు తెచ్చుకున్నట్టే, మనిషి నిద్రపోయేటప్పుడు తెరలు దించుకుని కృత్రిమంగా చీకటిని ఏర్పరచుకోవాలి.
   
    ఆ రోజు వస్తే 'బాగా చీకటిపడింది' అన్న వాక్యం చదివి జనం అర్ధంకాక బుర్ర బద్దలు కొట్టుకుంటారు.
   
    ఇప్పుడు తాము 'గోధూళివేళ' అంటే ఏమిటో తెలియక బ్రద్దలు కొట్టుకుంటున్నట్టూ.
   
                            *    *    *    *
   
    జేబులో బాల్ పాయింటు పెన్ను నుంచి ఆరు కావొస్తున్నట్టూ అలారం మ్రోగింది.

 Previous Page Next Page