Previous Page Next Page 
ఆనందోబ్రహ్మ పేజి 8

 

      "చెప్పాడు."
   
    ఇద్దరూ కారువైపు నడుస్తున్నారు.
   
    "కొద్దిగా వైన్ తీసుకుందామా?"
   
    "ష్యూర్."
   
    ఇద్దరూ కార్లో బయల్దేరారు. కీర్తి అన్నాడు-
   
    "ఈ కన్ఫ్యూజన్ అంతా మా డిపార్టుమెంట్ వాళ్ళు ఇంటింటికీ తిరిగి సర్వేచేసి తీసుకొచ్చిన సమాచారంవల్ల వచ్చింది. మొత్తానికి తేలిన దేమిటంటే, తమకేం కావాలో ప్రజలకే తెలీదని."
   
    "మరి మీరేమనుకున్నారు డాక్టర్?"
   
    "వెల్..... ఒక మనస్తత్వ శాస్త్ర నిపుణుడిగా నేను గుర్తించిందేమిటంటే రచయిత పాఠకుల అభిప్రాయాల మీద, నిద్రాణమైన కోర్కెల మీదా రచనలు చేస్తాడని. ఒక్క మాటలో చెప్పాలంటే మొగవాళ్ళు హీరోతో తమని తాము గుర్తించుకోవటం ద్వారా, స్త్రీలు హీరోయిన్ లో తమ ఊహల్ని నిక్షిప్తం చేసుకోవటం ద్వారా రచనని పాపులరైజ్ చేస్తారు."
   
    "డాక్టర్! ఎస్.ఎస్.ఎ. నియమించిన కమిటీలో మీరూ ఒక సభ్యులే కదా.....మీ ఉద్దేశ్యం ఏమిటి?"
   
    కీర్తి ఆ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా జేబులోంచి టేప్ రికార్డర్ తీసి, "మీకు పెంటధాల్ ఇంజెక్షన్ ఇచ్చాక మనిద్దరి మధ్యా జరిగిన సంభాషణలో ఒక భాగం ఇది. వినండి" అంటూ స్విచ్ నొక్కాడు.
   
    గరగర మధ్య అతని కంఠం వినబడింది. "భరద్వాజ! మీరు రచనలు ఎందుకు చేస్తున్నారు?"
   
    కాస్త మైకంలో తన కంఠం నూతిలోంచి వస్తూన్నట్టూ వుంది. భరద్వాజ ఆసక్తిగా విన్నాడు. "ఎందుకేమిటీ? నా జీవనాదారం అంది."
   
    "మామూలు నవలకీ పాపులర్ నవలకీ తేడా ఏమిటి?"

    "ఉన్న పరిస్థితులు వున్నట్టు వ్రాసి పాఠకుడి ఆలోచన్లని విస్తృతం చేయటం ద్వారా నిర్దుష్టమైన అభిప్రాయాన్ని కలుగజేసేది మంచి నవల. అదే కథలో, కావలసిన దానికంటే ఎక్కువ హింస, డ్రామా, సెక్సు, విపరీతమైన అపార్ధాలూ వగైరా చొప్పిస్తే అది పాపులర్ నవల."
   
    కీర్తి టేపురికార్డరు ఆపుచేస్తూ భరద్వాజవైపు చూశాడు.
   
    "ఒక ఫైలు మూసేసేక ఇక దాని గురించి మాట్లాడటం మా సంస్థ నియమాలకి నిషిద్దం. అయినా ఈ కేసు విషయంలో మీకు మేము ఏ విధమైన సంతృప్తికరమైన సమాధానమూ చెప్పలేదు కాబట్టి మీ గురించి నా పరిధిలో నేను కనుక్కున్న ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. కానీ ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం సుమా! దీనికీ ఎస్.ఎస్.ఎ. కీ ఏ సంబంధమూ లేదు."
   
    నోటి దగ్గర పెట్టుకోబోతున్న గ్లాసుని చప్పన క్రిందపెడుతూ "తప్పకుండా చెప్పండి కీర్తీ? ఐ విల్ బి ఆల్వేస్ థ్యాంక్ ఫుల్ టు యు" అన్నాడు.
   
    "ఒక రచయిత ఎందుకు వ్రాస్తాడూ అనేదానికి మూడు సమాధానాలున్నాయి. డబ్బుకోసం! పాపులారిటీ కోసం! తన అహాన్ని నిజాయితీగా సంతృప్తిపర్చుకోవటం కోసం! భావుకుడైనా, విప్లవకవి అయినా, ప్రొఫెషనల రచయితైనా ఎవరైనా సరే! ఈ మూడింట్లోనూ ఏ రెండింటికైనాలంకె కుదురుతుంది కానీ, మొదటి దానికీ మూడోదానికీ అసలు పడదు. ప్రొఫెషనల్ రైటరయిన మీరు క్రమక్రమంగా మూడో అంశమైన మీ 'ఈగో'ని సంతృప్తి పరచాలన్న అంశంవైపు వెళుతున్నారు. అందుకే మీ రచనలు వరుసగా ఫెయిల్ అవుతున్నాయి" సూదిపడితే వినబడేటంత నిశ్శబ్దం వారిద్దరి మధ్యా అలుముకుంది.
   
    భరద్వాజ "మీ అభిప్రాయం తప్పేమో కీర్తీ" అన్నాడు.
   
    "నేను చెప్పింది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే అని చెప్పాను కదా!"
   
    భరద్వాజ ఒక నిర్ణయానికి వచ్చినట్టు లేచి నిలబడి "మీరు నాతో వస్తారా- చిన్న పని వుంది" అని అడిగాడు.
   
    కీర్తి విస్మయంగా "ఎక్కడికి" అన్నాడు.
   
    "మా ఆఫీసుకి."
   
    "దేనికి?"
   
    "చెప్తాను రండి."
   
    ఇద్దరూ ఆఫీసు చేరుకున్నాక లిఫ్టునుంచి తన ఆఫీసు వైపు నడుస్తూ భరద్వాజ అన్నాడు. "మీకు అన్నీ చూపించాను. ఒక్క గది మాత్రం చూపించలేదు. గుర్తుందా....? 'జానపద కథలలో లాటిదికాదు గదా' అని అడిగారు కూడా."
   
    "అవును."
   
    భరద్వాజ ఆ గది తాళం తెరుస్తూ "ఇంతవరకు వచ్చాక ఇక రహస్యం ఏముంది కీర్తి! చూడండి ఇదే...." అంటూ తలుపులు బార్లా తెరిచాడు.
   
    లోపల దృశ్యం చూసిన డాక్టర్ కీర్తి అప్రయత్నంగా అడుగు వెనక్కి వేశాడు.
   
                                   7
   
    బిస్సీ యాజీ!!!
   
    యాజీ గురించి తెలియని వాళ్ళుండరు. పిల్లలు హాస్టళ్ళనుంచి శలవులకు ఇంటికొచ్చినప్పుడు తల్లులు అతని గురించి వాళ్ళకి కథలు కథలుగా చెప్తారు. యువకులు అతడిలా తయారవ్వాలని కోరుకుంటారు. నిరుద్యోగులు అతని సంస్థల్లో కనీసం ఇంటర్వ్యూ వచ్చినా బావుణ్ణు అని భావిస్తారు.
   
    స్విస్ బ్యాంకులో అతడి పేర్న వంద మిలియను డాలర్లు వున్నాయని కొందరూ, కాహ్డు, రెండొందల మిలియను డాలర్లు అని కొందరూ పందెం వేసుకుంటూ వుంటారు.
   
    అతడి గురించి దినపత్రికల్లో వార్త పడనిరోజు లేదు. అతడి ఫోటో లేని వ్యాపార పత్రిక లేదు. అతడు ఈ రాష్ట్రంలో పుట్టటం ఆంద్రదేశం చేసుకున్న అదృష్టమని ప్రెసిడెంట్ వి.ఎన్. నందమూరి తన రేడియో ప్రసంగాలలో తరచు ప్రస్తావిస్తూ వుంటాడు.
   
    అతడు సపోర్టు చేసిన పార్టీ ఎన్నికలలో గెలవక తప్పదు. అతడి కరుణాకటాక్షం లేకపోతే మూలపడకా తప్పదు.
   
    అతడు ఎక్కన్నుంచి వచ్చాడో తెలీదు. బిజినెస్ ప్రపంచాన్ని దద్దరిల్లేలా చేశాడు.
   
    2009లో హెయిర్ స్టాపేజి టానిక్ వచ్చి బార్బర్ల నోట దుమ్ముకొట్టింది. 2010 వచ్చేసరికి హెయిర్ కటింగ్ సెలూన్ లు లేకుండా పోయాయి. 2119 కల్లా మనుష్యులు ఒకప్పుడు క్షవరం చేయించుకునే వారన్న సంగతే ప్రజలు మర్చిపోయారు. కాస్త జుట్టు పెరిగిన తరువాత తమకి కావలసిన షేపు ఏర్పర్చుకుని, ఒక్కసారిగా ఆ టానిక్ వ్రాసుకుంటే ఇక మరి పెరిగేది కాదు. చచ్చిపోయే వరకూ అది అంత సైజులోనే వుండేది. బట్టతల ప్రసక్తే లేదు.
   
    మొదట్లో బార్బర్స్ అసోసియేషన్ వాళ్ళు దీనికి తీవ్రమైన అభ్యంతరం తెలిపారు. కానీ దానికి అంతగా సపోర్టు లభించలేదు. స్టాపేజి టానిక్ 2020 వచ్చేసరికి సుంతీలా మనిషి జీవితంలో భాగమైపోయింది.
   
    ఇలా పది సంవత్సరాలు గడిచాయి.
   
    2030లో యాజీ కొత్త ప్రయోగం చేశాడు. యాభైమంది కుర్రవాళ్ళని ఎన్నుకొని, వాళ్ళు తమ తలలకి ఆ టానిక్ వ్రాసుకోకుండా వుండేటందుకు డబ్బు ఇచ్చాడు. ఈ లోపులో బార్బర్ షాప్ పేటెంట్ ని రిజిష్టర్ చేయించాడు. అంటే దేశంలో ఎవరు బార్బరు షాపు పెట్టుకోవాలన్నా అతడికి రాయల్టీ చెల్లించాలన్నమాట. అప్పటికి దేశంలో ఒక్క  షాపుకూడా లేదు. 'బార్బర్' అన్న పదమే డిక్షనరీలోంచి తొలగించబడింది. అతడు డబ్బిచ్చిన కుర్రవాళ్ళు యువకులు అయ్యారు. రోజుకో రకంగా జుట్టు కత్తిరించుకుని వీధుల్లో తిరగసాగారు.
   
    స్టాపేజి టానిక్ రాయకపోతే జుట్టు పెరుగుతుందనీ దాన్ని ఇష్టం వచ్చిన ఫాషన్ లో కత్తిరించుకోవచ్చుననే వార్త దావానలంలా వ్యాపించింది.
   
    క్షణక్షణానికి ఫాషన్లు మారుతున్న యుగంలో జుట్టు పెంచుకోవటం కొత్త ఫాషన్ అయింది. కావలసినప్పుడు గుండు గీయించుకోవచ్చు. మళ్ళీ జుట్టు పెరుగుతుంది డిజైన్ మార్చుకోవచ్చు.
   
    రెండు నెలలు తిరిగేసరికల్లా దేశంనిండా తిరిగి హెయిర్ కట్టింగ్ సెలూన్ లు వెలిసినయ్.

    బట్టతల వున్నవాళ్ళు మేదావులుగా గుర్తింపబడసాగారు. అమ్మాయిలు వాళ్ళని ఫ్రిఫర్ చేయసాగారు. స్టాపేజి టానిక్ ఉత్పత్తిదారులు తమ ఫ్యాక్టరీలు మూసుకోవలసి వచ్చింది.
   
    అయిదు సంవత్సరాల్లో ప్రతి మంగలి షాపుకీ 0.01 శాతం రాయల్టీ చొప్పున యాజీ సంపాదించినది యాభైకోట్లదాకా వుంటుందని అంచనా.
   
    ఇంతకన్నా గొప్ప విషయం అతడు సాధించినది మరొకటి వుంది.
   
    పాఠాలు చెప్పేవాళ్ళు ప్రొఫెసర్లవుతున్నారు. 'జానపద సాహిత్యంలో బూతుమాటలు' లాంటి చచ్చు సబ్జక్టులమీద రీసెర్చి చేసిన అడ్డమైన వాళ్ళూ తమ పేరు ముందు డాక్టర్ అని తగిలించుకుంటున్నారు. వ్యాపార వేత్తలకు మాత్రం పేరుముందు అది ఎందుకు వుండకూడదు?
   
    అతడి వాదన తొందర్లోనే బలం పుంజుకుంది. వ్యాపారస్తులు, పెట్టుబడిదారులు తలుచుకొంటే కొదవేముంది? ప్రభుత్వం క్షణాలలో ఈ సమస్యని గుర్తించింది. R.A.P.E. (రాయల్ అకాడమీ ఆఫ్ ప్రొఫెషనల్ ఎంటర్ ప్రెన్యూర్స్)స్థాపించబడింది. వ్యాపార రంగంలో విజయాలు సాధించినవారు తమ బాలెన్స్ షీట్స్ నీ, విజయాల వివరాల్నీ పంపిస్తే అకాడమీ వాటిని పరిశీలించి అతడికి డాక్టరేట్ ప్రసాదిస్తూంది.

 Previous Page Next Page