అదే టైమ్ కి పక్కింట్లో "ఏమండీ- లేవండీ" అంది రుక్మిణి మొగుణ్ణి కుదుపుతూ నారాయణ్ 'ఊ' అంటూ మూలిగి ఇట్నుంచి అటు తిరిగి పడుకున్నాడు.
"హిందీలో వార్తలు కూడా అయిపోవస్తున్నాయి లేవండీ" దుప్పటి లాగుతూ అంది. అతడు చప్పున ఆమెని లోపలికి లాక్కున్నాడు. రెండు నిమిషాల తరువాత ఆమె అతికష్టంమీద బైటపడి "స్నానం చేసి ఏం లాభం- తలంతా మళ్ళీ దువ్వుకోవాలి ఖర్మ" అంటూ వంటింట్లోకి వెళ్ళింది.
తరువాత అరగంటకి నారాయణ్ లేచాడు. "ఒరేయ్ లేవరా" అంటూ బాబిగాన్ని లేపేడు.
తండ్రీ కొడుకులిద్దరూ బ్రెష్ లు నోట్లో పెట్టుకొని పెరట్లోకి వచ్చేరు.
రుక్మిణి "వేన్నీళ్ళు పెట్టనా" అంది.
నారాయణ్ భారంగా మూలిగి, "ఊ" అన్నాడు. ఆమె లోపలి వెళ్ళింది. అరగంటసేపు తోమీ తోమీ - కొడుకుతో తోమించి, లోపలికి వచ్చేడు. ఈలోగా రుక్మిణి వేన్నీళ్ళు పెట్టింది.
"ఈ రోజేం కూర డియర్" అంటూ వంటింట్లోకి ప్రవేశించి మూకుడులో వున్న దొండకాయ వేపుడు ముక్కలు ఒక్కొక్కటే తీసి నోట్లో వేసుకోసాగేడు. రుక్మిణి తల కొట్టుకొని" అబ్బా.....మళ్ళీ యిక్కడ చేరేరూ అక్కడ నీళ్ళు చల్లారిపోతున్నాయి. వెళ్ళండీ" అని బలవంతంగా బైటకి తోసింది.
బాబిగాన్ని స్కూలుకు తీసుకెళ్ళటం నారాయణ్ కి ప్రతిరోజూ ప్రాబ్లమే. వాణ్ణి దించి వచ్చేక మళ్ళీ "చార్లో తాలింపు పెట్టడం నీకు రాదోయ్" అంటూ వంటింట్లో చేరేడు.
"నాకొచ్చుగానీ, మీరు బైటకి వెళ్ళండి" అంది.
దాన్ని వినిపించుకోకుండా పోపుల డబ్బా తీసుకొని ఎండు మిరపకాయలు గిల్లి ప్లేట్లో వేయసాగేడు. రుక్మిణి పొయ్యిమీద మూకుడు పెట్టి నూనె కాగిందా లేదా అని చూస్తుంది.
పెరట్లో కొచ్చిన సుమిత్ర కిటికీలోంచి వీళ్ళిద్దర్నీ చూస్తూంది.
* * *
"సుమీ" అంటూ లోపలి వచ్చేడు రావ్. "చూడు నీకు ఏం ప్రజంటేషన్ తెచ్చానో".
"ఏమిటి" బైటకొచ్చి చూసింది. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యేయి. రావ్ నవ్వుతూ చూస్తున్నాడు.
"స్కూటర్?" అంది.
నవ్వుతూ తలూపేడు ఆమె, తన కళ్ళని నమ్మలేక "కొన్నారా?" అంది.
"మరి?"
"ఓ డియర్" అంటూ గాలిలా దగ్గరికి వెళ్ళి అతడి మెడచుట్టూ చేతులు వేసి ముద్దు పెట్టుకొంది. అతడు కదలకుండా అలానే నిలబడి, "సుమిత్రా......ఒక్క మాటకి జవాబు చెప్పు. ఇదంతా నా మీద ప్రేమా, స్కూటర్ మీదా?" అని అడిగేడు.
ఆమె చప్పున చేతులు తీసేసి కొరకొరా చూస్తూ "యూ ఆరేన్ ఇడియట్" అంది కోపంగా.
అయితే ఆ కోపం రాత్రి తొమ్మిదయ్యేసరికి తగ్గిపోయింది. నెమ్మదిగా అతడి దగ్గర జేరి, "సెకండ్ షోకి వెళదామా" అంది లాలనగా.
ఆ రోజే కొత్తగా కొన్న స్కూటర్ మీద ఎక్కాలని..... భర్తతో కల్సి సినిమా చూడాలనీ ఆమె మనసునిండా కోర్కె నిండుకుంది. అయితే దాన్ని అతడు గుర్తించలేదు. టైప్ మిషన్ ముందు కూర్చున్న వాడల్లా తలెత్తి నిదానంగా ఆమెవైపు చూసేడు.
"ఈ పేపర్లు టైప్ చెయ్యటం రాత్రికి పూర్తవ్వాలి. లేకపోతే లాయరుగారు జాబ్ వర్క్ తాలూకు డబ్బు ఇవ్వరు" అన్నాడు.
"డబ్బు..... డబ్బు..... డబ్బు...." అంది విసుగ్గా. "ఎప్పుడూ డబ్బేనా....."
"మరి ఆ డబ్బే లేకపోతే ఈ రోజు స్కూటర్ ఎలా వచ్చేది?" అని లేచి, ఆమె దగ్గిరకి వచ్చి అన్నాడు, "చూడు సుమీ- కలల్లో బ్రతకటం వేరు, కలల్ని నిజం చేసుకోవటానికి ప్రయత్నించటం వేరు. మనం రెండో వర్గానికి చెందాలని నేను కోరుకుంటున్నాను."
"భార్యతో సినిమాకి వెళ్ళటంలో తప్పేం వుంది?"
"ఈ అర్దరాత్రి పూట నిద్ర మానుకుని సెకండ్ షోకి వెళ్ళక పోతేనేం? దీనివల్ల ఈ రోజు పని నష్టం, రేపు ఆఫీసులో పని కష్టం."
ఆమె అతనివైపు ఉక్రోషంగా చూసి 'నీ అంత క్యాలిక్యులేటెడ్ బ్రతికేవాడితో ఏ ఆడదీ కాపురం చెయ్యలేదు రావ్! నిజం" అన్నది. అంతలో ఆమెకి రోడ్డుమీద నారాయణ్ దంపతులు కనపడ్డారు. "అదిగో, ఆ రుక్మిణి ని చూడు ఎంత అదృష్టవంతురాలో మొగుడూ పెళ్ళాం అంటే అలా వుండాలి. ఆ నారాయణ్ వంటింట్లో భార్యకి సాయం చేస్తాడు. పిల్లలకి దగ్గరుండి స్నానం చేయిస్తాడు. అతణ్ణి చూసి బుద్దితెచ్చుకో. దేనికైనా పెట్టి పుట్టాలి. హూ....." అని విసవిసా లోపలి వెళ్ళిపోయింది. "ఆ రుక్మిణి అదృష్టం ఎవరికీ రాదు....." అనుకుంటూ.
* * *
ఆ మరుసటిరోజు రుక్మిణి సుమిత్ర దగ్గరికి వచ్చింది ఓ గ్లాసుడు పంచదారుంటే ఇమ్మని.
"ఎవరో వచ్చినట్టున్నారు" అడిగింది సుమిత్ర.
"అవును వదినగారూ! మా క్లాస్ మేట్స్ ఇక్కడో స్నేహితురాలి పెళ్ళుంటే వచ్చారు" అని తమింటివైపు చూసింది. ఆమె మొహం వాడిపోయింది కొద్దిగా ఆ ఆడవాళ్ళ మధ్య ఒక కుర్చీలో ఆమె భర్త నారాయణ్ కూర్చుని కబుర్లు చెబుతున్నాడు. వళ్ళో కొడుకు కూర్చొని వున్నాడు. నారాయణ్ వంటిమీద చొక్కా బనీనూ లేవు.
"ఈయనకి బుద్దిరాదు వదినగారూ అన్నీ ఆడంగి చేష్టలే-" అని గ్లాసు తీసుకొంటూ అంది- "మీ ఆయన్ని చూస్తే ముచ్చటేస్తుంది. అన్నీ టైం ప్రకారం చేస్తారు. స్కూటర్ కూడా కొన్నారు కదా మొగాడంటే అలా వుండాలి వదినగారూ. మా ఆయనావున్నాడెందుకు- వంటింట్లో చేరి కబుర్లు చెప్పమంటే మాత్రం తయారు. మహాబద్దకస్తుడు. అర్ధరాత్రిపూట హఠాత్తుగా మూడ్ వస్తే సినిమా అంటారు. ప్రొద్దున్న తొమ్మిదింటి వరకూ లేవరు. ఈయన్తో వేగలేక చస్తున్నాను వదినగారూ! మీ అదృష్టం ఎవరికీ రాదనుకోండి" ఆమె చెప్పుకు పోతూంది.
సుమిత్ర తెల్లబోయి చూస్తూనే వుంది.
--* * * *--