Previous Page Next Page 
నిశ్శబ్దం-నీకూ-నాకూ మధ్య పేజి 6


    "రీనా."

    "సర్"

    "ఈ కొత్త ఉద్యోగం నిర్వహించగలనంటావా?"

    ఆమె అతనివైపు ఆప్యాయంగా స్నేహ పురస్కారంగా చూసింది. "తప్పకుండా నిర్వహించగలరు సర్ మీరు. కావల్సిందల్లా మాట్లాడగలగటమే."

    "అరే.... అదే లేదు నాకు?"

    "లేకపోవటం ఏమిటి సర్. రేమండ్ గ్లెండింగ్ కన్నా స్పీడుగా మాట్లాడగలరు."

    "గ్లెండింగ్?"

    "కొత్త న్యూస్ ఏమిటంటే మొన్నే కీలింగ్ ఆల్ డ్రిచ్ అనే అతడు కొత్త వరల్డ్ రికార్డు సృష్టించేడట. గ్లెండింగ్ నిముషంలో మూడువందల ఏభై ఆరు మాటలు మాట్లాడాడని నేషనల్ హెరాల్డు వ్రాసింది".

    "సాధారణంగా మనిషి నిముషంలో ఎన్ని మాటలు మాట్లాడగలడు?"

    "నూరు- నూట ఇరవై."

    "నువ్వు ఎంత స్పీడుగా డిక్టేషన్ తీసుకోగలవు రీనా?"

    "షార్టుహాండ్ హైస్పీడు పాసయేను సర్. నూట అరవై దాకా వ్రాయగలను."

    "నేను తడుముకోకుండా మాట్లాడదామనుకొంటున్నాను.... కొంచెం డిక్టేషన్ తీసుకొని నేనెంత స్పీడుగా మాట్లాడగలనో లెక్కపెట్టి చెప్తావా ప్లీజ్."

    రీనా నవ్వి - "ష్యూర్ సర్" అని వెళ్లి పెన్సిల్, ప్యాడూ తెచ్చుకొని కూర్చొంది.

    అతను చెప్పటం మొదలుపెట్టాడు.

    మాటలు- ప్రవాహంలా వస్తూన్న మాటలు! గుండె లోతుల్లోంచి భావాన్ని వెలువరిస్తున్న మాటలు.

    ఆమె చెయ్యి మిషన్ లా కదుల్తూంది. చెవి రింగు వూగుతుంది. పంటితో పెదాన్ని బిగపట్టి రాసుకుపోతోంది.

    మాటలు.

    పోస్టియర్ కాలమ్ నుంచి సెన్సరీ పాత్ వేస్ ద్వారా మెదడుకు చేరుకునే భావాలు. ఆంటీరియరు కాలమ్ నుంచి లారింగ్స్ ద్వారా గాలి వోకల్ కార్డ్సుణి వైబ్రేట్ చేస్తే....

    మాటలు! మాటలు!!

    రెండు నిమిషాల తరువాత అతని వాక్ప్రవాహం ఆగింది.

    ఆమె లేచి, నవ్వి, వెళ్లిపోయింది. మరుక్షణం టైపు మిషన్ చప్పుడు లయబద్ధంగా వినిపించసాగింది.

    మిత్ర నుదుటిమీద పట్టిన చెమట తుడుచుకున్నాడు.

    అయిదు నిమిషాల తరువాత లోపలికి వచ్చి టైప్ చేసిన కాగితం అందించింది.

    "రెండు నిముషాల్లో రెండు వందలా డెబ్భై నాలుగు అంటే నిమిషానికి నూటముప్పై ఏడు సర్!"

    "నాట్ బాడ్."

    ఆమె నవ్వి స్వింగ్ డోర్సు తెరుచుకొని వెళ్ళిపోయింది. వాచీ చేతికి పెట్టుకొని, వళ్ళు విరుచుకొన్నాడు. గాలికి కాగితం రెపరెపలాడుతోంది. యధాలాపంగా దాన్ని చేతులోకి తీసుకొని మొదటి లైను చదివేడు. మరుక్షణం కుర్చీలో నిటారుగా అయ్యేడు. కళ్ళు పెద్దవయ్యాయి. ముందుకు వంగి చదవసాగేడు.

    "....నా ముందు కూర్చొన్న అమ్మాయి రీనా. ఆమె చెవిరింగు గాలికి వూగుతూ వుంటే చూడటానికి ఎంతో బావుంది. ఈ అమ్మాయి లేకపోతే, నా ఆబ్సెంట్ మైండ్ వల్ల ఎక్కడుండేవాణ్ణో! పెదాలు బిగించి, చూపంతా వ్రాయటం మీదే కేంద్రీకరించి ఈ అమ్మాయి ఇలా తీక్షణంగా వ్రాసుకొంటూ పోతూవుంటే ఎంతయినా ముచ్చటేస్తుంది. ఇంత ఒద్దికైన అమ్మాయితో ఇంతకాలం కొంచెంసేపైనా సరిగ్గా మాట్లాడలేకపోయేను. ఒక సాయంత్రమైనా సరదాగా గడపలేకపోయేను. ఆ వేళ్ళు ఎంత స్పీడుగా కదుల్తున్నాయో! ఇంత హుషారైన అమ్మాయిలు జీవిత భాగస్వాములైతే మగవాడికి అంతకన్నా కావల్సిందేమిటి? ఒక అత్యంత తెలివైన మెడుల్లా అబ్లాంగేటా మెదడులో వున్న వెధవని నేను. ఇన్ని సంవత్సరాలుగా ఈ అమ్మాయి ఇలా ఎదురుగా నేను చెప్పినవి రాసుకునిపోతూ వుంటే నా ఆప్యాయతని మంచి మాటల్లో ఒక్కసారి కూడా ప్రదర్శించలేదు. ఇప్పుడనుకొని ఏం లాభం?"

    చదవటం పూర్తిచేసేసరికి అతడి మొహం అంతా తెల్లగా రక్తం లేనట్లు పాలిపోయింది. చాలాసేపు నిస్త్రాణంగా అలానే కుర్చీలో కూర్చొండిపోయేడు. అయిదు నిముషాల తరువాత సత్తువ తెచ్చుకొని ఇంటర్ కమ్ నొక్కేడు.

    "రీనా."

    "సర్"

    "ఐయామ్ సారీ రీనా?"

    అవతలివైపునుంచి క్షణం తటపటాయించిన నిశ్శబ్దం- "ఇట్సాల్ రైట్ సర్."

    "నువ్వేమీ అనుకోలేదుగా. నా సంగతి నీకు పూర్తిగా తెలుసు."

    నవ్వి "తెలుసు, సర్!"

    అతడు తేలిగ్గా వూపిరి పీల్చుకున్నాడు.

    "థాంక్యూ రీనా"


                                                           *    *    *


    సాయంత్రం నాలుగున్నర వరకూ అతడు ముఖ్యమైన కాగితాలు చూడటంలో మునిగిపోయేడు. దాదాపు అయిదు అవుతూండగా చంద్రం నుంచి ఫోను- "ఏమిటి మధ్యాహ్నం ఫోన్ చేశావుట. నేను లేన్లే" అన్నాడు.

    మిత్ర తన ప్రమోషన్ గురించి చెప్పేడు.

    "హాయ్" అరిచేడు చంద్రం అట్నుంచి. "కంగ్రాచ్యులేషన్స్ గురో! మనవాళ్ళందరికీ చెప్పి పార్టీకి వచ్చెయ్యమంటాను."

    "సర్లే. అది మామూలేగా."

    "అవును మామూలే" అట్నుంచి అన్నాడు చంద్రం. "అందరికీ మామూలు పార్టీ ఇస్తున్నావు. ప్రాణస్నేహితుణ్ణి మరి నాకేం ఇస్తావు?"

    స్నేహపూరితమైన కంఠంతో- "అడుగు చంద్రం. నీకేం కావాలి?" అన్నాడు.

    "మళ్ళీ అడిగేక కాదనకూడదు."

    "అనను."

    క్షణం నిశ్శబ్దం.

    ".... నీ రూం కావాలి- రెండు గంటలపాటు."

    మిత్ర క్షణం తటపటాయించి- "సరే" అన్నాడు. అవతల్నుంచి చంద్రం- "థాంక్స్ గురూ" అని అరిచేడు. "సరీగ్గా ఆరింటికి వస్తాను- నువ్వు ఆరున్నరకి వెళ్ళిపోయి ఏడున్నరకల్లా వచ్చెయ్యి చాలు."

    శంభు ఫోన్ పెట్టేసి మళ్ళీ తన పనిలో మునిగిపోయేడు. సరీగా అయిదింటికి రీనా వచ్చి వెళ్ళిపోతున్నానని చెప్పి వెళ్ళింది.

    అతడూ కాగితాలు డ్రాయర్లో పడేసి లేచేడు.

    ఇంటికి వెళ్ళబుద్ధి కాలేదు. వెళితే హరిదా తప్ప ఇంకెవరూ వుండరు.

    వెనీషియన్ బ్లెండ్స్ దగ్గర నిలబడి క్రిందికి చూడసాగేడు. మనుష్యులు బొమ్మల్లా కనపడ్తున్నారు. ఆఫీసులు వదలటంవల్ల రోడ్డు రష్ గా వుంది. సినిమాకి బయలుదేరిన జంటలు కొన్ని, షికారుకొచ్చిన జంటలు కొన్ని.

    రీనా క్రాస్ చేసి అటు వెళ్ళింది- మోటార్ సైకిల్ మీద జేమ్స్ ఆగి, నిలబడి నవ్వుతూ మాట్లాడుకొంటున్నారు. ఆమె వెనుక సీట్ ఎక్కి అతని నడుము చుట్టూ చెయ్యివేసి కూర్చుంది. అట్నుంచి ఒక జంట మాట్లాడుకొంటూ వస్తోంది. ఇట్నుంచి ఇంకోటి వెళుతూంది. ఏం మాట్లాడుకొంటారు వీళ్ళంతా?

    ఒక టేప్ రికార్డు చేసి....

    చప్పున ఏదో ఆలోచన వచ్చినట్టూ నిటారుగా అయ్యేడు.

    టేప్ రికార్డర్.

    ఎస్- టేప్ రికార్డర్.

    తన గదిలో ఈ సాయంత్రం....!!


                         *    *    *


    పుస్తకాలు పెట్టుకొనే బల్లకింద వున్న పాత పేపర్ల కట్ట కొద్దిగా ముందుకు జరిపి, దాని వెనుక టేప్ రికార్డర్ పెట్టి, బల్ల వెనుకనుంచి వైర లాగి, టేబిల్ లైటు వైరుతో మెలిక వేసి ఫ్లగ్ అమర్చేడు. స్విచ్ ప్రక్కనే వున్న గూట్లో టూత్ పేస్టు డబ్బాలో మైకు అమర్చేడు. స్పూల్ సరిగా వుందో లేదో చూసి, రికార్డ్ ప్లే బటన్ నొక్కాడు. స్పూల్ తిరగటం మొదలుపెట్టింది. గది అన్ని మూలల్నుంచి చిటికెలు వేశాడు.

    మైకు పవర్ ఫుల్ ది.

    స్పష్టంగా రికార్డు చేసింది. టేప్ రికార్డు మీద పేపర్లు సరిగ్గా అమర్చేడు. బటన్లు నొక్కేవుంచి, ఫ్లగ్ స్విచ్ ఆఫ్ చేసేడు. ఆఖరి సారి అన్నీ సరిగ్గా వున్నాయో లేదో చూసుకొని సంతృప్తి చెందేడు.

    ఇదంతా అయ్యేసరికి నుదుటిమీద చెమటపట్టింది. ఓ క్షణం తప్పు చేస్తున్నానా అన్న సంశయం. మళ్ళీ ఫర్లేదనుకొన్నాడు. అంతా తరువాత చంద్రానికి చెబితే సరదాగా నవ్వుకోవచ్చు. సంశయాన్ని థ్రిల్లే గెల్చింది.

    జరగబోయేవి తలచుకొని అతడికి మాటిమాటికీ నవ్వు రాసాగింది. మళ్ళీ అంతలోనే అంతా సవ్యంగా జరుగుతుందా అన్న టెన్షన్.

    ....సరిగ్గా ఆరింటికి చంద్రం వచ్చేడు. చాలా హుషారుగా వున్నాడు. "ప్రోగ్రాంలో చిన్న మార్పు గురూ" అన్నాడు.

    శంభు ఉలిక్కిపడి "ఏమిటి" అన్నాడు.

    "ప్రోగ్రాం ఒక గంట ముందుకు జరిగింది. ఆరున్నర అన్నాను కదా. కాదు, ఏడున్నర."

    శంభు తేలికగా వూపిరి పీల్చుకొని "అంతేకదా" అన్నాడు.

    చంద్రం కుర్చీలో కూర్చుంటూ...... "సాయంత్రం బావుంది" అన్నాడు.

    "అవును."

    "చలిగాలి పెడ్తోంది"

    "అవును".

    "వర్షం వచ్చేలా వుంది."

    "అవును."

    "నువ్వదోలా వున్నావ్"

    "అవు..... ఆఁ...... కాదు" అని - "ఎలా వున్నాను..... బానే వున్నాను" తడబడ్డాడు.

    "నేనిలా రూము అడిగినందుకు నువ్వేం ఫీల్ అవటం లేదుగా!" కాళ్ళూపుతూ అడిగేడు.

    "లేదు"

    చంద్రం కాలు ముందుకి వూపినప్పుడల్లా పేపర్ల కట్టకి అది తగిలి, అది వెనక్కి జరుగుతోంది. శంభు ఊపిరి బిగపట్టేడు.

    "నీకే మాత్రం అభ్యంతరమున్నా చెప్పు, మన స్నేహం దీనివల్ల పాడవటం ఇష్టంలేదు."

    "లే- లేదు. నువ్వా కుర్చీలోంచి లే. ఇలా కూర్చో."

 Previous Page Next Page