జంటనగరాలలో రెండు థియేటర్లకి యజమాని, పారిశ్రామికవేత్త, పెద్ద కాంట్రాక్టరు అయిన శివానంద్ డిజిపికి పరిచయస్థుడే అయినా ఇప్పుడెందుకిలా ఫోన్ చేసిందీ అర్ధంకాలేదు. "యస్! శివానంద్!"
"ఇక్కడ కొంపలు మునిగాయి" శివానంద్ ఆందోళనగా చెబుతుంటే డిజిపి మొహంలో రంగులు మారాయి. అంతా విన్నాక నిస్సహాయంగా ఫోన్ క్రెడిల్ చేశాడు.
"కాంట్రాక్టర్ శివానంద్ ఇంటికి ఓ అరగంట క్రితమే సిమిలర్ పార్శిల్ వచ్చిందట. నౌకరుచేత ఓపెన్ చేయించగా అందులో వున్న ఓ స్నేక్ నౌకరుని కాటేసిందట. హీ యీజ్ డెడ్."
డిజిపి చెంపలపైనుంచి స్వేదం ధారలా కారుతోంది.
"మిస్టర్ ప్రసన్నా!" సాలోచనగా చూసాడు ప్రసన్నవైపు. "ఇఫ్ నెసెసరీ టేక్ దట్ బోయ్ ఇంటూ కస్టడీ...ఈ రోజు ఉదయం స్నేక్ షోలో పార్టిసిపేట్ చేసిన యువకుడు జయేంద్ర..."
* * * *
సరిగ్గా ఇదే సమయమో...న్యూనల్లకుంటలోని రామాలయం పక్కనున్న ఓ ఇంటిలో ఆరేళ్ళ చిన్నీ తల్లిదగ్గర మారాం చేస్తున్నాడు.
"నువ్వు చెప్పినవన్నీ ఉత్తుత్తి అబద్ధాలు...ఇంకా నాన్న బేట్ పంపలేదుగానీ" చిన్నీ కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంటే కొడుకుని ఓదార్చడం ఆమెకోపట్టాన సాధ్యం కావడంలేదు.
ఉబ్బసంతో ఆమె మూడు రోజులుగా మంచం దిగలేకపోతోంది. వారం రోజుల నుంచీ క్రికెట్ బేట్ కావాలని తెగ అల్లరి చేస్తున్నాడు చిన్నీ...అక్కడికీ భర్తకి చెప్పి చూసింది కూడా...
తండ్రి సైతం చిన్నీని ఒడిలోకి తీసుకుని కథలు కథలుగా చెప్పేడు. బేట్ తో ఆడితే అమ్మ ఆరోగ్యం దెబ్బతింటుందని, అమ్మ ఆరోగ్యం బాగుపడాలంటే బుద్ధిగా చదువుకోవాలి తప్ప క్రికెట్ ఆడకూడదని. తన నిస్సహాయతని కొడుకు ముందు ఒప్పుకోలేకపోయాడు.
చిన్నీకి కూడా అమ్మంటే చాలా యిష్టమే కాని కథ విన్నంతసేపూ మాత్రమే ఊరుకునేవాడు. తెల్లారాక మామూలుగా మారాం చేస్తుండేవాడు. భర్త సంపాదించేది తన మందులకి మాకులకి చాలకపోతుంటే ఆ యింటి ఆర్ధిక పరిస్థితి గురించి చిన్నీకి ఎలా చెప్పి ఒప్పించాలో ఆమెకు అర్ధంకాలేదు.
చివరకు ముందు రాత్రే భర్తతో అందామె. "ఈ వారం నా మందులకి బదులు చిన్నీకి బేట్ తెచ్చివ్వండి" అంటూ.
అతడి కళ్ళలోనూ నీళ్ళు తిరిగాయి. నిజానికి చిన్నీ కోరింది పెద్ద కోరికేమీ కాదు కాని తన ఇబ్బంది చాలా అబద్ధం చెప్పిస్తూంది. 'ఎకనమిక్స్' గురించీ 'మనీ ఇన్ ఫ్లేషన్' గురించీ ఆలోచించని వయసు చిన్నీది. అందుకే ఆ రోజు అప్పు చేసినా మధ్యాహ్నం పన్నెండు గంటలకల్లా తీసుకొస్తానన్నాడు.
దానితో స్కూలుకి సైతం వెళ్ళడం మానేశాడు చిన్నీ.
పదకొండు గంటలనుంచీ ఎంత ఉత్సాహంగా ఎదురు చూడటం మొదలుపెట్టాడూ అంటే బేట్ అందుకోగానే తన స్నేహితులందర్నీ కలిసి పేరు పేరునా తన గర్వాన్ని ప్రకటింపజేయాలని తెగ సంబరపడ్డాడు.
పన్నెండు అయింది. పన్నెండున్నర కావస్తోంది.
నీరసంగా మంచం పైనుంచి లేచిన అమ్మ అన్నం వడ్డిస్తానన్నా కసురుకున్నాడు. అసలు బేట్ లేకపోతే అన్నమే తిననని భీష్మించుక్కూర్చున్నాడు.
అక్కడ నిజంగా తండ్రి యిదే ఏర్పాటులో చాలా బిజీగా అప్పులు సేకరించే కార్యక్రమంలో మునిగాడని గాని మరో గంట గంటన్నరలో వస్తాడని గాని వూహించక పోవడంతో కళ్ళలో నీళ్ళు కుక్కుకుని "అన్నీ ఉత్తుత్తి అబద్ధాలంటూ" ఏడవటం మొదలుపెట్టాడు.
సుమారు ఆ గంట వ్యవధిలో చిన్నీ ఆ వ్యాక్యాన్ని ఎన్నిసార్లన్నాడో ఆమెకో గుర్తులేదు. చివరికి ఇంటి ద్వారం దాటి రోడ్డుమీదకే వచ్చి నిలబడ్డాడు తండ్రి కోసం ఎదురు చూస్తూ.
పిలిచి పిలిచి సొమ్మసిల్లి, తల్లి నీరసంగా మంచంపై వాలిపోయింది.
చిన్నీ జంక్షను దాకా నడిచాడు. బస్ స్టాపులో మరో పది నిమిషాలపాటు దిగే ప్రతి ప్రయాణీకుడ్నీ పరిశీలనగా చూసి ఏడుపు ఉధృతమైపోతుంటే చివరగా అమ్మని అల్లరి పెట్టాలని, ఇంటికి తిరిగివస్తుంటే యింటిముందు తారట్లాడుతూ ఓ మనిషి కనిపించేడు.
అతడి చేతిలో ఓ పేకెట్టు వుంది.
ప్రాణం లేచి వచ్చినట్టయింది చిన్నీకి. "నాన్న పంపేరా?" అన్నాడు. అది తప్పకుండా బేట్ అయి వుంటుందన్న నమ్మకంతో.
"మరేం...నీ పేరేంటి?" అడిగాడా అపరిచిత వ్యక్తి.
"చిన్నీ...అయితే యిది క్రికెట్ బేట్ అన్నమాట!" అతడి కళ్ళల్లోకి సైతంచూసే సహనం లేనట్లు పేకెట్ అందుకుని యింటిలోకి పరుగెట్టాడు.
ద్వారం తెరిచి గట్టిగా కేకవేశాడు అమ్మకోసం...మాగన్నుగా నిద్రపోతున్న ఆ నిర్భాగ్యపు తల్లికి చిన్నీ పిలుపు వినిపించలేదు.
చిన్నీ ఉత్సాహంగా పేకెట్టుపై వున్న పురికొసతాడుని లాగేశాడు. ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాడని.
తను గర్వంగా చెప్పుకోవాల్సిన స్నేహితులంతా గుర్తుకొస్తుంటే ఆనందంతో కళ్ళలో నీటిపొరలు అలుముకుంటున్నాయి.
పేకెట్ పైన కవరు తీసి ఉత్సాహంగా బేట్ కోసం చేయిచాచిన చిన్నీ ఒక్కసారిగా ఉలిక్కిపడి ఆక్రందన చేశాడు "అమ్మా!" అంటూ.
తల్లి నిద్రలేచింది.
కాని అప్పటికే ఓ కట్లపాము చిన్నీ పెదవిని కాటేసి ఆమెవైపు దూసుకుపోయింది.
మరో అరగంటలో ఇంటిలో అడుగు పెట్టిన చిన్నీ తండ్రి అప్పు దొరక్క అప్పులు చేస్తే నష్టాల గురించి కొడుక్కి కథగా చెప్పాలనుకున్నాడు గాని అక్కడ నేలపై తల్లి గుండెలపై తల పెట్టుకుని వున్నాడు.
ఉద్వేగంగా యిద్దరినీ చేరుకున్నాడు. అర్ధమైపోయింది యిద్దరూ బ్రతికి లేరని...తన కథతో అవసరం లేకుండా యిద్దరూ ఎప్పుడో కళ్ళు మూసేరని.
* * * *
ఉస్మానియా మార్చురీ రూమ్ లో అడుగు పెట్టిన డిజిపి తక్కిన పోలీసాఫీసర్సుతో తెల్లబాటలు కప్పబడిన ప్రతి శవాన్నీ పరీక్షగా చూస్తున్నాడు. ఆ రోజు పోలీసు రికార్డ్స్ ప్రకారం ప్రత్యర్ధి పంపిన పార్శిల్సు ఇరవై రెండైతే బ్రతికింది ఆరుగురు మాత్రమే.
కొందరు సకాలమో హాస్పిటల్ కి చేరక మరికొందరు షాక్ తో మార్గ మధ్యంలోనే ప్రాణాలు వదిలారు...ఇలా వారు మొత్తం పదహారుమంది. అందులో ఓ కానిస్టేబుల్ వున్నాడు.
ఫోర్సెనిక్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్న మాటలు వింటూ చివరగా చిన్నీ శవం చూసి ఆగిపోయాడు.
ఇంకా ప్రపంచాన్ని సైతం పూర్తిగా చూడని పసికందు. ఏ మనుషులపై కసితోనే లేక తన లాలిత్యాన్ని అర్ధం చేసుకోని యీ ఆటవిక వ్యవస్థపై ద్వేషంతోనో ప్రవాసానికి తరలిపోయిన చిన్ని ప్రాణి.
డిజిపి మనసే ద్రవించిందో లేక ఎంత పోలీసాఫీసరయినా తనూ ఓ తండ్రే అన్న అనుభవమే మెదిలిందో అది కానినాడు ఒక్కరోజులో పదహారుమంది శవాలకు తనో కాపరిగా చూడాల్సి వచ్చిందనో కళ్ళలో ఎరుపు జీరలు చోటుచేసుకున్నాయి.
హాస్పిటల్ నుంచి బయటకు వస్తుంటే పత్రికా విలేఖర్లు చుట్టుముట్టారు. "ఇన్ని దారుణాలకి కారణమైన వ్యక్తులెవరు...?" "ఎవర్నైనా అనుమానిస్తున్నారా...? ఈ మారణహోమానికి ముగింపెప్పుడు?"
అయితే కొన్ని ఈవెనింగ్ ఎడిషన్స్ ఈ దారుణాలని పబ్లిష్ చేసాయి. చాలా రోజుల తర్వాత హాట్ కేక్స్ లా అమ్ముడుపోవడంతో పత్రిక యాజమాన్యాలు ఈ సంఘటనలకి అధిక ప్రాధాన్యతనిచ్చాయి.
అధికారపక్షం గుండెల్లో రైళ్ళుపరిగెత్తితే ప్రతి పక్షాలు ఇది అవకాశంగా ప్రభుత్వాన్ని దిగిపొమ్మని గోలపెట్టడం ప్రారంభించాయి.
రాజధానిలో ఎక్కడచూసినా ఇదేవార్త. ఏ ఇంట చూసినా ఇదే చర్చ...మంత్రి మండలిలోని అతి ముఖ్యమైన సహచరులతో ముఖ్యమంత్రి సమావేశం జరిపారు హడావుడిగా.
ఆ రాత్రి ఏడుగంటల ఇరవై అయిదు నిమిషాలకి జంటనగరాల పొలీస్ కమీషనర్ అయిదు నిమిషాలపాటు ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
"ఇది కొందరు సంఘ విద్రోహక శక్తుల చర్య. బ్లాక్ మాంబా ముఠాగా వ్యవహరించబడుతున్న ఈ శక్తుల్ని చాలా త్వరగా పట్టి తీరాలన్న సంకల్పంతో అహర్నిశలూ మేం శ్రమిస్తున్నాం. సాధ్యమైనంత తక్కువ వ్యవధిలో ఇన్ని మరణాలకి కారణమైన ఆ వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోగలమని బలంగా నమ్ముతున్నాం. దీనికోసమై ప్రత్యేక స్క్వాడ్స్ తో దర్యాప్తు జరుపుతున్నాం కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ప్రజలకో విజ్ఞప్తి. అపరిచితులైన వ్యక్తులుగాని లేక పోస్టల్ డిపార్టుమెంటు నుంచిగాని ఎటువంటి పార్శిలు వచ్చినా అంగీకరించకండి. తప్పని సరి పరిస్థితుల్లో మా సిబ్బంది చేత మీ సమక్షంలో తెరిపించే ప్రయత్నం చేస్తాం. అనుమానాస్పదమైన ఏ వ్యక్తి గురించైనా వెంటనే మీ సమీప పోలీస్ స్టేషన్ కిగాని, కంట్రోల్ రూంకి ఫోన్ చేసి తెలియజేయండి. ఎటువంటి వేళల్లో అయినా మాతోబాటు హాస్పటల్ సిబ్బంది మీ సేవకోసం సిద్ధంగా ఉంటామని హామీ ఇస్తూ, ఈ రోజు నిస్సహాయంగా ప్రాణాలు వదిలిన వ్యక్తుల కుటుంబాలకి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాం."