Previous Page Next Page 
రేపటి మహిళ పేజి 6


    "నేన్నమ్మను. వీళ్ళల్లో తప్పకుండా మృదుల వుంది. ఇదేదో తేల్చుకోకుండా నేనిక్కడ్నించి కదల్ను."
    "సారీ సర్! మీరు మృదుల భర్తగారనే గౌరవంతో ఇప్పటివరకు నమ్రతగా మాట్లాడాను. ఒకవేళ మృదులగారు ఇక్కడవున్నా మాకు తెలియదు- తెలిసికోవడానికి ప్రయత్నించం__ మరొకర్ని తెలుసుకోనియ్యము."
    "నేను పోలీసు రిపోర్టిస్తాను ఇక్కడేదో గూడుపుఠాణి జరుగుతోందని."
    కళ్ళగంతల వ్యక్తి వెటకారంగా నవ్వేడు.
    "మిస్టర్! తెలుగుదేశంలో పుట్టి పెరుగుతూ మరీ ఇంత అమాయకులేమిటి. మీరు? కళ్ళకిగంతలు కట్టుకుని ముఖం ఆనవాలు తెలియకుండా వున్న ఇక్కడి పెద్ద మనుష్యుల్లో ఎవరు ఎంత ప్రముఖులో మీకేమైనా తెలుసా? ఆ గంతల వెనక ఒక పోలీసాఫీసరే వున్నా ఆశ్చర్యపోనక్కరలేదు. మీరు తొందరపడి రిపోర్టులాంటిది చేస్తే_ నాకేం ప్రమాదం లేదు కాని మీరే రిపోర్టిచ్చి యింటికెళ్ళేలోగా ఏదో ఒక నేరంమీద జైలుపాలు కావచ్చు."
    బెదిరిపోయాడు భాగవతార్. వేదికమీద కూర్చుని రాగాలాపన చేస్తున్నప్పుడు ఎంత ఆత్మవిశ్వాసంతో వుంటాడో మిగిలిన సమయాల్లో అంత పిరిగ్గా ఉంటాడు. అందులోనూ దెబ్బలాటలు_ కోర్టులు_ కేసులు అంటే అతనికి తగని భయం. అతడు పబ్లిక్ ఫిగర్. కేసు గొడవల్లాంటివేవైనా వస్తే ఆ విషయం క్షణాల్లో పేపర్ల కెక్కేసి ఇమేజి పాడైపోతుంది.
    రిపోర్టు మాట వదిలేసి మేలి ముసుగుల్లో వున్న ఆడవాళ్ళని పరీక్షగా చూడసాగాడు. కొందరు ఇబ్బందిగా కదిలారు.
    "కి క్ హిమ్ అవుట్" కీచుగా అరిచింది ఒకావిడ.
    కళ్ళగంతల్లో తెల్లటి అంగరఖాలల్లో వున్న యిద్దరు మగవాళ్ళు భాగవతార్ చెరోపక్కకి వచ్చి అతడి రెండు చేతులు పట్టుకుని మెట్ల వైపు నడిపించారు.
    "నో! నో! లీవ్ మీ! నన్నొదిలేయండి మృదులను పంపేయండి__ నేనూర్కోను_ ఐ విల్ కిల్ యూ...." అని అరుస్తూ గింజుకోసాగాడు భాగవతార్. అతడి మాటలేమాత్రం లక్ష్యపెట్టకుండా ఒక రకంగా మోసుకుంటూ మెట్లెక్కించి హాల్లోకి తోసేసి తలుపులు లోపల బోల్డు పెట్టేసుకున్నారు. దబుక్కున హాల్లో కూలబడ్డాడు భాగవతార్. నవ్వాపుకోలేక కిసుక్కున నవ్వాడు బయటవున్న జవాన్.
    "మీరంతా మనుష్యులతో బంతులాడుతున్నారేంటండీ" అడిగాడు.
    భాగవతార్ వాడివైపు గుఱ్ఱుగా చూసి ఏ సమాధానం చెప్పకుండా మళ్ళీ పైకి అల్మరాలా కనిపించే ద్వారం తెరవడానికి ప్రయత్నించాడు. ఎంత ప్రయత్నించినా అది తెరుచుకోలేదు.
    "ఏయ్! ఈ తలుపు తెరు." అన్నాడు నౌకరుతో. నౌకరు మాట్లాడలేదు.
    "ఎలా తెరుచుకుంటుందీ తలుపు....?"
    ".... .... ...."
    "నేను లోపలికి అర్జంటుగా పోవాలి...."
    ".... .... ...."
    "ఏం జరుగుతోందిక్కడ.... వీళ్ళంతా ఎవరసలు.... మృదులనేం చేసారు...."
    ".... .... ...."
    "ఇలాంటిది యింకో ద్వారం వుందా?"
    ".... .... ...."
    "ఇదుగో ఈ పదిరూపాయలు తీసుకో," జేబులోంచి పది రూపాయలు నోరు తీసి వాడికిచ్చాడు .అందుకుని వాడు జేబులో పెట్టుకున్నాడు.
    "ఇప్పుడు చెప్పు. ఏం జరుగుతోందిక్కడ?"
    ".... .... ...."
    "నిన్నూ ...." చేయెత్తి కొట్టబోయాడు. ఆ చేతిని గట్టిగా పట్టుకున్నాడు నౌకరు. బాధతో విలవిల్లాడిపోతూ ఒదులు అని అరిచాడు.
    "నోర్మూసుకుని ఇక్కడ్నుంచి పోతావా?"
    "పోతాను.... పోతాను...."
                                                                            *    *    *
    కారులో స్టీరింగ్ ముందు కూర్చున్న భాగవతార్ కి కొన్ని నిముషాలు బుఱ్ఱ పనిచేయలేదు. మృదుల తననెందుకిలా ఆడిస్తోంది? ఇంతకీ ఎవరు మృదుల ప్రియుడు? మెరుపులా ఒక ఆలోచన తోచింది. ఆ యింటి ముందు నుంచి కారు కొంత దూరం నడిపించి ఒక వారగా పార్క్ చేసి ఆ యింటి వేపే చూస్తూ కూర్చున్నాడు. ఇంట్లోవాళ్ళు బయటికొచ్చేసాక ముసుగులు తీస్తారు కదా? అప్పుడు మృదులని పట్టుకోవచ్చు.
    భాగవతార్ ఊహించినట్టే ఆ ఇంట్లోంచి ఒకరి తరువాత ఒకరుగా బయటికొచ్చి సందు మలుపు తిరగ్గానే ముసుగులు తీసేస్తున్నారు. చాలామంది స్కూటర్లలోను, కార్లలోను వెళ్తున్నారు. అయిడెంటిటి బయటపడకుండా ఉండడానికి కాబోలు ఒకరు బయటికొచ్చిన పది నిముషాల తరువాత గాని మరొకరు రావటంలేదు. ఒక్కొక్కళ్ళని పరిశీలనగా చూస్తూ దాదాపు రెండుగంటలు కూర్చున్నాడు. కొంతమంది కారుల్లో వెళ్ళిన వాళ్ళ ముఖాలు కనబడలేదు కాని మృదుల కాదని గుర్తించగలిగాడు. కార్లో గిరజాల జుట్టువాడు దూసుకుపోయాక అరగంట గడిచినా ఎవరూ వెళ్ళలేదు. అందరూ వెళ్ళిపోయి వుంటారు. మృదుల ఇక్కడ లేదన్నమాట. లేక తన కంట్లో కారం కొట్టి మాయమైందా? ఏమో అంతా ఇంద్రజాలంలా వుంది. మృదుల కోసం తరచుగా యింటికొచ్చే రెండవ వ్యక్తి అనంగ్. ఒకసారి అతని గదికి కూడా వెళ్ళిచూసొస్తే....
    అనంగ్ తల్లిదండ్రులు ఏదో పల్లెటూర్లో వుంటున్నారు. అతనికింకా పెళ్ళికాలేదు. బి.కామ్ పాసై ఉద్యోగం కోసం వెతుక్కుంటూ నవలలు, కథలు రాస్తున్నాడు. రచయితగా పేరు సంపాదించుకున్నాడు. శృంగారానికి సంబంధించిన కథలు బాగా రాస్తాడని అభిమానులు చెప్పుకుంటారు.
    భాగవతార్ కారు పార్క్ చేసి అనంగ్ గది ముందుకొచ్చేసరికి ఆడపిల్లల కిలారు నవ్వులు స్వాగతం పలికాయి. గది తలుపులు లేవు. పిల్లిలా నడుచుకుంటూ లోపలికెళ్ళాడు. గతుక్కుమన్నాడు. ఇంట్లో మృదుల గదిలో స్టాండ్స్ మీద వరసగా వున్న ప్లాస్టిక్ ముఖాలన్నీ అక్కడే సజీవంగా తిరుగుతున్నట్లనిపించింది. ఆ గది చిన్నది. ఒక మంచం, ఒక కుర్చీ, ఒక టేబిల్. ఇవే వున్నాయి. ప్లాస్టిక్ ముఖాలు తొడుక్కున్న వాళ్ళంతా ఆడపిల్లలే. ఒకమ్మాయి కుర్చీలో కూర్చుంటే మరో నలుగురు కుర్చీ చేతులపైన కూర్చున్నారు. మరో పదిమంది టేబిల్ మీద ఇరుక్కుని కూర్చున్నారు.
    మరో డజనుమంది మంచంమీద ఒకళ్ళమీద ఒకళ్ళు పడుతూ సర్దుకున్నారు. భాగవతార్ ని చూడగానే మంచం మీద కూర్చున్న అనంగ్ లేచి, మీరా! రండి. సారీ! మిమ్మల్ని కూర్చోబెట్టడానికి యిక్కడ చోటులేదు. ఈ ఆడపిల్లల మధ్య సర్దుకుంటానంటే నాకభ్యంతరం లేదు." అన్నాడు.    
    "వీళ్ళంతా ఎవరు?"
    "నా ఫాన్స్."
    "ఆ ప్లాస్టిక్ ముఖాలెందుకు?"
    "వీళ్ళకి తామెవ్వరో నాకు తెలియడం యిష్టంలేదట. అందుకని యిలా ప్లాస్టిక్ ముఖాలు తొడుక్కొచ్చారు. తమ విషయం బయటపడనంత వరకు ఏం చేసినా ఫరవాలేదని వీళ్ళ అభిప్రాయం. అఫ్ కోర్స్, నిజం కూడా అంతేననుకోండి. సమాజం కోసం కాకపోతే నీతి నియమాలనేవి ఎవడిక్కావాలి?"
    "వీళ్ళెవరో తెలుసుకోవాలని వుండదా మీకు?"
    "ఉండదు. వీళ్ళ ముఖాలతో నాకేం పని?"
    గుటక మింగాడు భాగవతార్. ప్లాస్టిక్ ముఖాలు తొడుక్కున్న అమ్మాయిలు నిర్భయంగా-నిస్సంకోచంగా విరగబడి నవ్వేరు.
    "మన పూర్వకాలం నుంచి ఇలాంటి ఆచారాలు వుండేవండి. రెడ్డి రాజుల కాలంలో వసంతోత్సవంలో ఆడ మగ తామెవ్వరో తెలియకుండా మేలి ముసుగులతో, విశృంఖలంగా సరససల్లాపాలు జరుపుకొనేవారట!"
    "అదృష్టవంతులం, ఈ కాలంలో అలాంటివి లేవు."
    "అదృష్టవంతులమే! ఈ కాలంలోనూ అలాంటివి వున్నాయి మరో రూపంలో."
    గుటక మింగాడు భాగవతార్.
    "ఏదేనా పని మీద వచ్చారా?" అడిగాడు అనంగ్.
    భాగవతార్ రెండు నిముషాలు మాట్లాడలేదు. అమ్మాయిలనందరినీ పరిశీలనగా చూస్తూ నిలబడ్డాడు. మొహం తెలియకపోయినా శరీరాన్నిబట్టి మృదులని గుర్తు పట్టగలనేమో-అనుకున్నాడు. అక్కడమ్మాయిలందరూ చీరల్లో వున్నారు. అతడు మృదులని జీన్స్ లోను - పాంట్ బ్లౌజ్ లలోనూ తప్ప - చీరలో ఎప్పుడూ చూడలేదు పెళ్ళిలో తప్ప. చీరలో ఎలా వుంటుందో వూహించడం కూడా అతనికి సాధ్యం కావడంలేదు. భాగవతార్ అలా చూస్తోంటే ప్లాస్టిక్ కోతి మొహం తొడుక్కున్న అమ్మాయి నాలుక బయటికి జాపి వెక్కిరించింది. కుక్క మొహం అమ్మాయి మొరిగి భయపెట్టింది. భాగవతార్ ఒక అడుగు వెనక్కి వేసాడు.
    "ఏదేనా పనివుంటే చెప్పండి. ఫరవాలేదు చెప్పండి." అన్నాడు అనంగ్.
    "మృదులతో చిన్నపని వుంది. ఇంట్లో లేదు ఇక్కడికొచ్చిందేమోనని...." నసుగుతూ అన్నాడు.
    అమ్మాయిలంతా ఒక్క పెట్టున గొల్లున నవ్వారు.
    పంది మొహం అమ్మాయి ముందుకొచ్చి భాగవతార్ భుజంమీద చెయ్యి వేసి. "డాళింగ్! నాకోసం మరీ యింత బెంగపడిపోవడం ఏమయినా బాగుందా?" అంది.
    ఎలుగుబంటి మొహం తొడుక్కున్న ఆడపిల్ల గద్దిస్తూన్నట్లు, "ఏయ్! ఇక్కడికెందుకొచ్చావు? ఇక్కడికి ఆడపిల్లలొస్తారు. వాళ్ళతో స్నేహం చేసుకుందాం- అని ఆశతో కదూ! ఎన్నాళ్ళనుంచి వేస్తున్నావు ఇలాంటి వెధవ్వేషాలు?" అని పోట్లాటకి దిగింది.

 Previous Page Next Page