Previous Page Next Page 
కోమలి పిలుపు పేజి 6

    "అయితే నేను నిన్ను ప్రేమిస్తున్నానంటావు. మరి నువ్వూ నన్ను ప్రేమిస్తున్నావా?" అన్నాను.
   
    "నేను నిన్ను ప్రేమించకపోతే ఆ రాలుగాయివెధవకి క్షమార్పణ చెప్పుకుందుకు ఎందుకొప్పుకుంటాను?" అన్నది కోమలి.
   
    "అయితే కొండల్రావు నిజమే చెప్పడన్నమాట" అన్నాను.
   
    ఆమె కిసుక్కున నవ్వింది.
   
    "నవ్వుతావేం?" అన్నాను చిరుకోపంతో.
   
    "మనమిద్దరం ప్రేమించుకుంటున్నామన్న విషయం కొండల్రావు చెప్పేదాకా తెలియలేదా నీకు?"
   
    పాయింటే మరి....ఎలాగైనా కోమలి తెలివైనది. ఆమె ఏం చెప్పదల్చుకున్నదో మా సంభాషణ ఎటువైపు దారి తీస్తున్నదో నేనూహించలేకుండా ఉన్నాను.
   
    "అదీ నిజమే. ఎందుకంటే నేను ప్రేమ గురించి ఇప్పట్లో ఆలోచించలేను నా బీయస్సీ పూర్తవ్వాలి. ఇంకా పెద్ద చదువులుచదవాలి. ఆపైన ఉద్యోగం రావాలి. అప్పుడు గదా నేను ప్రేమ గురించి ఆలోచించేది" అన్నాను.
   
    ఆమె మళ్ళీ కిసుక్కున నవ్వి "నా నవ్వుకు నువ్వు కోపగించుకోకు కానీ నీ మాటలు ప్రేమ పరువును తీసేస్తున్నాయి. ప్రేమ అంటే రెండు హృదయాలు చేరిక. దానికి ఓ టైము, ముహూర్తం ఉండవు. నువ్వు మాట్లాడుతున్నది పెళ్ళి గురించి. పెళ్ళి వేరు, ప్రేమ వేరు మనిద్దరిమధ్యా ప్రేమ ఎప్పుడో పుట్టేసింది" అన్నది.
   
    కోమలి చొరవైన మనిషని నాకు తెలుసు ఆమె గురించి మాట్లాడేటప్పుడు ఆమె చొరవ చూడడం మొదలు నాకు.
   
    "ప్రేమ వేరు.... పెళ్ళి వేరు అంటున్నావు ప్రేమ పెళ్ళికి దారితీయదా?"
   
    "నువ్వు చలం పుస్తకాలు ఒక్కటీ చదవలేదా అన్నది కోమలి.
   
    "అయితే వారం రోజులపాటు లైబ్రరీకి వెళ్ళి చలం పుస్తకాలు చదువు. ప్రేమంటే ఏమిటో తెలుస్తుంది తర్వాత మనం మళ్ళీ కలుసుకుని మాట్లాడుకుందాం.
   
    "ఏం మాట్లాడుకుందాం?" అన్నాను ఆమెతో.
   
    "చలం పుస్తకాల గురించి..." అన్నది కాస్త చిరాగ్గా.
   
                                                                    o    o    o    o
   
    కోమలి చెప్పినట్లే వారంరోజుల్లో నేను దొరికిన చలం పుస్తకాలు చదివాను. వాటిలో గుప్తవేదాంతం ఉన్నదని తోచింది. కానీ నా మనసు ఆ వేదాంతాన్నర్ధం చేసుకునే స్థాయికి ఎదగలేదు. ఆ పుస్తకాలు నన్ను బాగా రెచ్చగొట్టాయి. నేను, కోమలి ఒకటైతే మేము ఆ తర్వాత పెళ్ళి చేసుకోకపోయినా తప్పుపట్టని ఓ మహారచయిత వున్నాడని మాత్రం నాకు అర్ధమయింది. నా వయసు ఆ నవలల్లో ఎదురైన సంఘటనలకే ఎక్కువ ప్రభావితమయింది.
   
    వారం రోజుల తర్వాత కోమలి ఓ రోజు మా ఇంటికి వచ్చింది. ఆమె మా ఇంటికి రావడమూ నాతో వంట గురించి మాట్లాడటమూ మా ఇంట్లో సహజమైన సన్నివేశం.
   
    "నేను చెప్పిన పుస్తకాలు చదివావా?"
   
    "ఆ పుస్తకాలు నువ్వూ చదివావా?" అన్నాడు అసలు ఆ ప్రశ్నకు బదులు చెప్పకుండా.
   
    "నేనెప్పుడో చదివాను. నీ అభిప్రాయమేమిటి?"
   
    "అవి వయసులో వున్నా పిల్లలు చదవకూడదు అన్నాను.
   
    కోమలి కిసుక్కున నవ్వి "నువ్వి లాగే అంటావు అనుకొన్నాను. కానీ అసలు సంగతి మరిచిపోయావు" అన్నది.
   
    "ఏమిటి?"
   
    "ఆ రోజుకు వారం రోజుల తర్వాత మనం మయూరా గార్డెన్ లో కలుసుకోవాలనుకున్నాం" అన్నది కోమలి.
   
    "నా కిష్టం లేదు"
   
    "నా కిష్టమైనవన్నీ నీ కిష్టమే . నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు"
   
    "లేదు" అన్నాను.
   
    "నిన్ను చలం రచనలు చదవమని ఎందుకు చెప్పానో తెలుసా?"
   
    "ప్రేమగురించి తెలుసుకుంటావని"
   
    "కాదు__నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో లేదోనని."
   
    "అంటే?"
   
    "నన్ను ప్రేమిస్తున్నవాడివైతే నా మాటవిని నేను చెప్పినట్లు చేస్తావు"
   
    "చదవకుండా చదివానని అబద్దం చెప్పానేమో"
   
    "నువ్వు చదివావని అభిప్రాయం వినగానే తెలిసిపోయింది. చదవకుండా అయితే చాలా గొప్పగా వున్నాయని చెప్పి వుండేవాడివి. నీ ఆలోచనలస్థాయి నాకు బాగా తెలుసు చలం కధలు నీకెలా అర్ధమవుతాయో నాకు తెలుసు"
   
    "అంటే?"
   
    "నా మాటవిని చలం పుస్తకాలు చదివావు అలాగే నా మాట విని మయూరా గార్డెన్స్ కి కూడా రావాలి" అన్నది కోమలి.
   
    తప్పులేదు నాకు. ఆ రోజే ఇద్దరం సాయంత్రం ఐదుగంటల ప్రాంతాల మయూరా గార్డెన్స్ లో కలుసుకున్నాం.
   
    "ఇప్పుడు చెప్పండి__చలం పుస్తకాలమీద నీ అభిప్రాయం?" అన్నది కోమలి.
   
    "ముందు నీ అభిప్రాయం చెప్పు..."
   
    "అధి ఉత్తమ సాహిత్యం ఒక ప్రేమపిపాసి ఆక్రోశం, అమూల్యమయిన ప్రేమను న్యాయాలపేరిట బందీ చేయడం సహించలేకపోయినా ఒక రసహృదయుడి ఆవేదన..." అన్నది కోమలి.

 Previous Page Next Page