Previous Page Next Page 
ఇది ఒక కుక్క కథ పేజి 5

    స్వామి దగ్గర జవాబు సిద్ధంగానే ఉంది- "అవన్నీ ఇప్పుడు అప్రమత్తం. ఇప్పుడేం జరిగినా తప్పు నామీదకే వస్తుంది. నా అంతస్తు వేరు, మీ అంతస్తు వేరు. మిమ్మల్ని వలలో వేసుకున్నానంటారు, నమ్మకద్రోహం చేశానంటారు, అత్యాశకు పోయానంటారు. అన్నింటికీ ఒక్కటే కారణం- నేను పేదవాణ్ణి, మీరు కలిగినవారు. నేను మిమ్మల్ని వివాహం చేసుకోవడంలో నమ్మకద్రోహం, అత్యాశ, అనే పదాలు వెతికినా కనిపించని స్థాయికి నేను ఎదిగేవరకూ మీరు ఆగగలిగితే అప్పుడు చూద్దాం. అంతవరకూ ఈ విషయం మీ నాన్నగారికి చెప్పి - ఆయన దృష్టిలోనూ, సమాజం దృష్టిలోనూ నన్ను చెడ్డవాణ్ణి  చేయకండి."
    ఈ మాటలు మీనాక్షి మౌనంగా వింది. తర్వాత స్వామి పాఠం మొదలుపెట్టాడు. ఆమె బుద్దిగా వింది. పాఠమంతా అయిపోయాక- "మనమింకా చాలా చిన్నవాళ్ళం- పెద్దమాటలు మనకు వద్దు" అన్నాడు స్వామి.
    "ఎంత చిన్నవాళ్ళం? ఒకరిఒళ్ళో ఒకరు కూర్చోవచ్చా?" అంది మీనాక్షి.
    స్వామి ఉలిక్కిపడ్డాడు. రవంత ఆవేశం కలిగిందతనికి. మీనాక్షి అతనికి దగ్గరగా జరిగింది. స్వామి కదల్లేదు. ఆమె ఇంకా దగ్గరగా జరిగింది. ఆమె శరీరం అతనికి తగుల్తోంది. మీనాక్షి నెమ్మదిగా, "నాన్నగారికి చెప్పన్లెండి" అంది. అలా అనడంలో ఏదో ప్రోత్సాహం కనబడింది స్వామికి. ఒక్కసారి ఆమెను దగ్గరగా లాక్కుని....ముద్దుపెట్టుకుంటే??
    అప్రయత్నంగా స్వామి కుక్కవంక చూశాడు. అది మొరగడానికి సిద్ధంగా ఉన్నట్లు అతనికి తోచింది. అయితే ఆ క్షణపుటావేశంలో అది మొరిగితే మొరగనీ అనిపించిందతనికి. అయినా ప్రిన్సిపాలుగారు తనకు మూడు ఛాన్సులిచ్చారు. ఈ అవకాశాన్నుపయోగించుకుని తర్వాత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది.
    శరీరం తిరగబడుతోంది. మనసు హితబోధ చేస్తోంది. ఎన్ని ఆలోచిస్తున్నా అతని చూపు కుక్కవైపే ప్రసరించి ఉంది. అది మొరగడానికి సిద్ధంగా ఉంది.
    స్వామి అక్కడింకో పదినిమిషాలు ఉన్నాడు. కానీ కుక్క మాత్రం మొరగలేదు.   
                                   5
    గదిలో ఇద్దరే ఉన్నారు- స్వామి, మీనాక్షి!
    మీనాక్షి స్వామికి దగ్గరగా జరుగతోంది. స్వామి ఆమెను వారించలేకపోతున్నాడు. ఆమె అతన్ని బాగా సమీపించింది. స్వామి ఆగలేకపోయాడు. చటుక్కున ఆమెను గట్టిగా కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నాడు.
    కుక్క పెద్ద కంఠంతో భౌ భౌ మని మొరగసాగింది.
    స్వామి చటుక్కున లేచి కూర్చున్నాడు.
    కల! తీయనిదో - భయంకరమైనదో తెలియని ఒక కల!
    స్వామి తేలికగా శ్వాస విడిచాడు. తను చేసిన తప్పు కలలోనిది. నిజం కాదు. తను కలలో తప్ప తప్పులు చేయడు. తప్పులు చేయాలనుకుంటే కలలో చేస్తాడు.
    ఈ ఆలోచన స్వామికి వెగటుగా తోచింది. తను కలలో మాత్రం ఎందుకు తప్పుచేయాలి? అంటే తన ఊహల్లో తప్పు ఉన్నదన్నమాట! అంతరాంతరాల్లో తప్పు దాగుని ఉన్నదన్న మాట! ఆ తప్పు కలలో బయటకు వచ్చింది.
    'కలలో కూడా తప్పు చేయకూడదు' అనుకున్నాడు స్వామి. అది యధాలాపంగా అతననుకున్నది కాదు. వివేకానందుడు, మహాత్ముడు, అరవిందుడు మొదలైన మహాపురుషుల నతడు స్మరించుకున్నాడు. తనకు మనోబలాన్నిమ్మనమని ప్రార్ధించాడు. తనకు వచ్చిన పరీక్షలో తట్టుకు నిలబడ గలిగిన శక్తిని ప్రసాదించమని వేడుకున్నాడు. ఆ నిర్ణయం, ఆ ప్రార్ధన, ఆ వేడ్కోలు- ఏ క్షణంలో జరిగాయో కాని అది చాలా బలమైన క్షణం.
    మర్నాటి నుంచీ స్వామి మీనాక్షి వద్ద చాలా నిగ్రహంగా ప్రవర్తించాడు. అతని గంభీర నిగ్రహాన్ని చూసి మీనాక్షి కూడా చనువు చూపించడానికి భయపడేది. అయితే అప్పుడప్పుడు దూరంగానే ఉండి వారు చనువుగా ప్రేమ కబుర్లు చెప్పుకునేవారు. పరస్పరం అభిమానం వ్యక్తపర్చుకునేవారు.
    స్వామికి చెడ్డపేరు రాకుండా ఉండడంకోసం మీనాక్షి తన ప్రేమను తనలోనే దాచుకుంది. అతనివద్ద చనువుగా ఉండటం తగ్గించింది. శ్రద్ధగా చదువుతుంది. ఇంటర్ ఫస్టు క్లాసులో ప్యాసయింది. ఆమె బియ్యే ఫస్టియర్ చదువుతుండగా ఒకరోజున రుద్రరాజు స్వామిని పిలిచాడు.
    "మిష్టర్ స్వామీ! నువ్వు వేరే ఎక్కడైనా రూమ్ చూసుకోవాలి."
    ఎందుకో అర్ధంకాక, ఏమని అడగాలో తెలియక అయోమయంగా ఆయనవంక చూశాడు స్వామి.
    "నేను చెప్పింది అర్ధమైంది కదా?" అన్నాడు రుద్రరాజు.
    "నేనేం తప్పు చేశాను?"
    "తప్పు చేసింది నువ్వు కాదు- నేను. నాకు ట్రాన్స్ ఫరయింది" అన్నాడు రుద్రరాజు. ఆయన కళ్ళలో విషాదం చదవగలిగాడు స్వామి. రుద్రరాజుగారిని ట్రాన్సుఫర్ చేయించడానికి తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నట్లు అతనూ విన్నాడు. కాని అంత త్వరలో నిజంగానే జరుగుతుందని అతననుకోలేదు.
    "నీ చదువు గురించి బెంగపడకు. నేను అన్నమాట తప్పను. ఇక్కడున్నా లేకపోయినా, నీకు ప్రతి నెలా డబ్బు పంపిస్తాను. నీ చదువు పూర్తిచేయించే బాధ్యత నాది" అన్నాడు రుద్రరాజు.
    స్వామి కళ్ళముందు మీనాక్షి మెదిలింది. ఇందిరలాగే ఆమె కూడా తనకు దూరమైపోతుందని అతనికి అర్ధమయింది. బహుశా తను జీవితంలో ఆమెను మళ్ళీ చూడలేకపోవచ్చు.
    "ఒకసారి అమ్మాయిని కూడా పలకరించు. మళ్ళీ నీకులాంటి ప్రయివేట్ మేష్టారు దానికి దొరక్కపోవచ్చు" అన్నాడు రుద్రరాజు.
    స్వామి మీనాక్షి దగ్గరకు వెళ్ళాడు.
    "నాకు ఏడుపొస్తోంది" అంది మీనాక్షి.
    "ఎందుకు?" అన్నాడు స్వామి తగ్గుస్వరంతో.
    "చెబితే ఏమిటి ప్రయోజనం?" అంది మీనాక్షి.
    "నాకూ ఏడుపొస్తోంది. కాని ఎందుకో తెలియడంలేదు. మీరు చెబితే కారణం తెలుసుకుందామని" అని కళ్ళు తుడుచుకున్నాడు స్వామి.
    మీనాక్షి ఆశ్చర్యంగా "మీరు....మీరు....ఏడుస్తున్నారా?" అంది.
    "ఏం__నేను మనిషినికానా?" అన్నాడు స్వామి.
    "మీరు మనిషి కాదు__భగవంతుడు" అంది మీనాక్షి.
    "అవును__నా పేరు సీతారామస్వామి. ఆ రాముడిలాంటిదే నా కథ" అన్నాడు స్వామి.
    రాముడికి లక్ష్యముంది- ఆ లక్ష్యసిద్ది కోసం భార్యను కోల్పోయాడతను. స్వామికీ లక్ష్యముంది- ఆ లక్ష్యసిద్ది జరిగేవరకూ భార్య గురించి ఆలోచించే అవకాశం లేదు.
    "మనం మళ్ళీ కలుసుకుంటామా?" అంది మీనాక్షి.
    "సినిమాలు చూడకపోయినా ఇది సినిమా డైలాగులాగే ఉంది నాకు" అన్నాడు స్వామి నవ్వడానికి ప్రయత్నిస్తూ.
    "ఇది సినిమా అయిపోయినా బాగుండును. డైరెక్టరు మనని కలిపి ఉండేవాడు."
    స్వామి నవ్వి- "నిజ జీవితాన్ని క్లుప్తంగా మూడు గంటల్లో చూపించేదే సినిమా__మనం మళ్ళీ కలుసుకుంటామని నాకు అనిపిస్తోంది" అన్నాడు.
    "ఇదీ సినిమా డైలాగే!" అంది మీనాక్షి నవ్వడానికి ప్రయత్నిస్తూ.
    స్వామి ఒకడుగు ముందుకు వేశాడు. అప్పుడే అతనికి అక్కడున్న కుక్క కనిపించింది. భయంగా దానివంక చూశాడతను. అయితే కుక్క మాత్రం అతని వంక కౄరంగా చూడడం లేదు. ఆ క్షణంలో అతను మీనాక్షి నేమిచేసినా తను కలుగజేసుకోననడానికి సూచనగానో, లేక అతనిపై తనకేర్పడిన నమ్మకానికి సూచనగానో అది రెండు కళ్ళూ మూసుకుంది.
    అయినా స్వామి ఇంకో అడుగు ముందుకు వేయలేదు. పైగా వెనకడుగు వేసి ప్రిన్సిపాలుగారిని కలుసుకున్నాడు.
    "మిస్టర్ స్వామీ! నిన్ను నేను మరిచిపోలేను. రానున్న తరంలో కూడా మంచివాళ్ళుంటారన్న నమ్మకాన్ని నాక్కలిగించావు. అవకాశాలు వచ్చినా ఒక్కసారి కూడా నువ్వు పొరపాటు చేయలేదు. నేను నీకు కాపలాగా ఉంచిన కుక్క ఒక్కసారి కూడా మొరగలేదు. అయితే ఒకవిషయం గుర్తుంచుకో. నా కుక్క నాతో వచ్చేస్తుంది. కాని అది నీకు కాపలాగా ఉందన్న విషయాన్ని ఎన్నడూ మరువకు. అదే భ్రమలో ఉంటూ నీ జీవితాన్ని నడిపించుకో.  నిజాయితీగా ఉండడానికీ, తప్పులు చేయకపోవడానికీ కుక్క కాపలా అవసరం లేకుండా జీవించు. తప్పక వృద్ధిలోకి వస్తావు" అన్నాడు రుద్రరాజు.
                                    6
    స్వామి పరీక్షలో యూనివర్సిటీకి ఫస్టుగా వచ్చాడు. అదేసమయంలో అతను  అయ్యేయస్ లో కూడా సెలక్టయ్యాడు. రుద్రరాజుగారికా విషయాన్ని రాస్తే ఆయన అతన్ని అభినందిస్తూ ఉత్తరం రాశాడు__"జియోఫిజిక్స్ లో డిగ్రీ తీసుకుని అయ్యేయస్ ఆఫీసరు నవ్వాలనుకుంటే నేను హర్షించలేను. దేశం నీకిచ్చిన శిక్షణ, ఆ శిక్షణ గురించి చేసిన ఖర్చూ ఆ విధంగా వృధా అయినట్లే గదా! ఏ సబ్జక్టు చదివానో దానికి పూర్తి న్యాయం చేకూర్చు. దానికే అంటి పెట్టుకుని ఉండు. నేను నిన్నాపలేను, శాసించలేను. కాని ఆవేదనతో కూడిన నా సలహా ఇది...."
    స్వామి ఆ ఉత్తరం చదువుకున్నాక అయ్యేయస్ గురించి మరిచిపోయాడు. అతను తన ప్రొఫెసరు దగ్గర రీసెర్చిలో చేరాడు. రీసెర్చి సమయంలో అతనికి స్కాలర్ షిప్ వచ్చేది. ఆ మొత్తాన్ని పొదుపుగా వాడుకుంటూ అందులో కొంత తల్లిదండ్రులకు కూడా పంపిస్తూండేవాడతను.
    స్వామి రీసెర్చిలో చేరిన పది నెలలకు అతనికి అమెరికాలో పై చదువులు చదివే అవకాశం వచ్చింది. స్వామి ప్రొఫెసరు కూడా ఇండియాలో రీసెర్చి కట్టిపెట్టి ఫారిన్ వెళ్ళిపొమ్మని అతనికి సలహా ఇచ్చాడు. స్వామి ఈ విషయమై ప్రిన్సిపాలు కుత్తరం రాసి తన ఇంటికి కూడా వెళ్ళాడు. తండ్రి స్వామి ప్రగతి చూసి చాలా ఆనందించి__"ఇంత గొప్పవాడివివై పోతున్న నీకు నేను తండ్రినేనా అని అనుమాన మొస్తోందిరా?" అన్నాడు.
    "నువ్వు నా కడుపున బిడ్డవని నమ్మలేకపోతున్నాన్రా!" అంది తల్లి.
    "ఎలా అనుకోగలమే__కనిపారేశాం కాని, వీడి గురించి ఏం చేశాం మనం? వీడు మనింట్లోనే ఉండి ఉంటే మిగతావాళ్ళకు లాగానే వీడూ ఉండును" అన్నాడు స్వామి తండ్రి.
    స్వామికి ఇద్దరు అన్నలు, ముగ్గురు చెల్లెళ్ళు, ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. స్వామి అన్నలిద్దరూ చిన్న చిన్న చదువులతో ఆగిపోయి, బాగా చిన్న ఉద్యోగాలు  చేసుకుంటున్నారు. వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. వాళ్ళు సంపాదించేది వాళ్ళ సంసారానికే చాలదు. ఇద్దరు చెల్లెళ్ళిప్పుడు పెళ్ళికి సిద్ధంగా ఉన్నారు. తమ్ముళ్ళిద్దరికీ చదువులు బాగా వస్తున్నాయి కాని, చదివించగలనన్న ధైర్యం స్వామి తండ్రికి లేదు. ఇంటి పరిస్థితులు చూస్తే స్వామికి ఆవేశంలాంటిది కలిగింది. ఫారిన్ వెళ్ళడానికి ప్రస్తుతం అయిదారు వేలకు పైగా రొక్కం కావాలి. ఆ విషయమై తండ్రితో మాట్లాడదామని అతను వచ్చాడు. కానీ ఇంటికి వచ్చి చూస్తే అతనికి కొత్తరకం ఆవేశం కలిగి__తక్షణం ఏదైనా ఉద్యోగంలో చేరి తనవాళ్ళందర్నీ పోషించాలన్న కోరిక కలిగింది. తనవాళ్ళంతా ఇలాంటి దశలో  ఉండగా కేవలం తన భవిష్యత్తు గురించే ఆలోచించడం స్వార్ధమనిపించుకుంటుందని అతనికి తోచింది.       

 Previous Page Next Page