Previous Page Next Page 
రామాయణము పేజి 5

                                 

   
   
                                               2.    విశ్వామిత్రుడు
    నందిని మహిమను గుర్తించిన రాజునకు ఒక కోర్కె జనించినది. "మునీంద్రా ఈ గోరత్నమును నాకు దయచేయుడు. దీనికి మూల్యముగా లక్ష ధేనువులను మీకు సమర్పించెదను" అని అర్ధించినాడు. మహర్షి "నేను నిత్యమూ చేయు జపతపాదులకు ఈ నందినియే నాకాధారము.
    'గాధి' అను రాజు కలడు. అతనికి 'సత్యవతి' అను కుమార్తెయూ 'విశ్వామిత్రుడు' అను కుమారుడునూ జన్మించినారు. గాధి సత్యవతిని 'బుచీకుడ'ను యువకునకిచ్చి పరిణయము చేసెను. ఆ దంపతులకు ముగ్గురు పుత్రులు పుట్టినారు. ఆ మువ్వురిలో మధ్యముని పేరు 'శునశ్శేఫుడు'.                      

    విద్యావంతుడూ పరాక్రమవంతుడూ ఐన విశ్వామిత్రుడు గాధి అనంతరము రాజు ఐనాడు.
    కొంతకాలము గడచిన పిమ్మట గాధేయుడు (గాధిపుత్రుడగు విశ్వామిత్రుడు) తన తనయులలో ఆఖరు వానిని నగర రక్షణకు నియమించి తక్కిన సుతులనూ ఒక అక్షౌహిణి సేననూ వెంటపెట్టుకొని దేశాటనమునకు బయలుదేరినాడు.
    మార్గ మధ్యమున వారికి దశరథుని గురువైన వసిష్ఠ మహాముని ఆశ్రయము తారసిల్లినది.
    వసిష్ఠుడు బ్రహ్మదేవుని పుత్రులలో ఒకడు. మహామంత్రవేత్త; జపతపాదులలో ఆయనను మించిన వారు లేరు...ఆ మహర్షి విశ్వామిత్రునకు స్వాగతము పలికి కుశలమును అడిగి పిమ్మట "రాజూ నీవూ నీ పరివారమూ నేడు నా ఆతిథ్యమును స్వీకరించి వెళ్ళవలెను" అని కోరినాడు.
    విశ్వామిత్రుడు: మునీంద్రా, నీ ప్రియ వాక్యముల వల్ల నాకు సత్కారము జరిగినది చాలును. ఇంత బలగముతో ఉన్న నేను విందు కొరకు ఆగి మీ ఆశ్రమ జనమునకు శ్రమ కలిగించుట భావ్యము కాదు.
    వసిష్ఠుడు: మాకు శ్రమ కలుగదు; సందేహించక ఆగిపొమ్ము.
    విశ్వామిత్రుడు తనలో "ఈ మునికి ఇంతటి ధైర్యము ఎచ్చట నుండి వచ్చినది?" అని అచ్చెరువందుచూ ఆగిపోవుటకు అంగీకరించినాడు.
    కామధేనువు, కల్పవృక్షము వలె ఏమి కోరిననూ సమకూర్చెడి శక్తి కలది. ఆ సామర్ధ్యము కామధేనువు కూతురు 'నందిని'కినీ కలదు. ఆ నందిని బ్రహ్మదేవుని పుత్రుడూ సత్వగుణ సంపన్నుడూ మహనీయుడూ ఐన వసిష్ఠ మహర్షి సేవా భాగ్యమునభిలషించి ఆ తపోనిధి ఆశ్రమమున నివసించు చున్నది. నాడు నందినితో వసిష్ఠుడు "వత్సా రాజునకునూ రాజు సుతులకునూ, దండు నకునూ పంచభక్ష్య పరమాన్నములతో విందును సిద్ధము చేయుము" అనెను...నందిని సమకూర్చిన షడ్రసోపేతమగు భోజనమును అతిథులందరూ ఆరగించి సంతుష్టులైనారు. 
    నందిని మహిమను గుర్తించిన రాజునకు ఒక కోర్కె జనించింది. "మునీంద్రా ఈ గోరత్నమును నాకు దయచేయుడు. దీనికి మూల్యముగా లక్ష ధేనువులను మీకు సమర్పించెదను" అని అర్ధించినాడు. మహర్షి "నేను నిత్యమూ చేయు జపతపాదులకు ఈ నందినియే నాకాధారము. సత్కార్యాచరణమునకు ఈ శౌరభేయి నాకెంతగానో తోడ్పడుచున్నది. నేడు నీకునూ నీ బలగమునకునూ నేను ఆతిథ్యమీయ గలిగినది ఈ సురభి సాయమే వలననే కదా? ఈ కామధేనువును నేను విడువజాలను. నీవు అన్యధా భావించవలదు" అనెను.

    విశ్వామిత్రునకు కోపము వచ్చినది. క్రోధమునకు వశ్యుడైన వానికి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానము నశించును. "ఈ ధేనువును బలవంతంగా తీసుకొనిరండు!" అని గాధేయుడు తన భటులను ఆజ్ఞాపించినాడు.
    నందిని తనను సమీపించిన రాజు సేవకులను పడదన్ని తప్పించుకొని వచ్చి మహర్షి ముందు నిలిచి దుఃఖించుచూ "ఋషి పుంగవా రాజు దౌర్జన్యమునకు పూనుకొనగా మీరట్లు మిన్నకున్నారేమి? నేనేమి అపరాధమును చేసితిని?" అని మొఱపెట్టుకొన్నది. వసిష్ఠుడు "పాలకుని శిక్షించరాదు. అంతియెకాక వీరందరికిని ఇంతకుముందే కదా ఆతిథ్యమిచ్చితిని? అతిథుల యెడ కాఠిన్యము వహించుటయా? అన్న సంకోచమునూ కలుగుచున్నది" అన్నాడు. నందిని "మహాత్మా, అటులైనచో మీరు కలుగజేసికొనక్కర లేదు. నన్ను నేను రక్షించుకొనుటకు అనుజ్ఞను ఇండు, చాలును" అన్నది. వసిష్ఠుడు "స్వయంరక్షణాధికారము నీకెపుడునూ ఉన్నది. నీవు శత్రువులను సంహరించ గల సేనను సృష్టించుకొనుము" అన్నాడు.
    నందిని మరలిపోయి 'అంభా' అని రంకె వేసినది. తన మేనిపై గల ప్రతి రోషము నుండియూ ఖడ్గపాణులగు వేలాది వీరులను సృజియించినది. నందినిణి చుట్టూముట్ట వచ్చిన రాజ సైనికులను ఆ ఖడ్గదారులు ఎదుర్కొని నిర్విశేషముగ హతమార్చినారు. విశ్వామిత్రునితో వచ్చిన అతని పుత్రులు క్రుద్దులై ఆయుధములతో వసిష్ఠుని చుట్టుముట్టగా ఆ తపస్సంపన్నుడు ఉగ్రుడై హుంకరించి వారినందరినీ భస్మము చేసినాడు!
    గాధినందనుడు కుమారుల సంఘ మరణమునకునూ తనకు కలిగిన పరాభవమునకునూ తట్టుకొనలేక తన రాజధానికి తిరిగి వచ్చెను. "వసిష్ఠుని వధించి పగను తీర్చుకొందును!... నందిని పంపిన వీరులు మాపై  పడినప్పుడు మా ఆయుధములు మమ్ము కాపాడలేకపోయినవి. వాటిని విసర్జించి కొత్త ఆయుధములను ఆర్జించవలెను".
    ఆ నిశ్చయమునకు వచ్చి అతడు మిగిలియున్న ఆఖరు కుమారునకు పట్టము కట్టి సతీసమేతుడై హిమాలయమునకు పోయెను. ఒక అరణ్యమున ఆశ్రమమును నిర్మించుకొని ఉగ్రమగు తపస్సును చేసి శివుని ప్రత్యక్షము చేసికొనెను.
    "పరమేశ్వరా శక్తిమంతములగు అస్త్రశస్త్రములనన్నిటిని నాకు ప్రసాదించుము" అని ప్రార్ధించెను. ఉమాధవుడు 'తథాస్తు' అని అంతర్హితుడయ్యెను.
    విశ్వామిత్రుడు వర గర్వముతో వసిష్ఠుని ఆశ్రమమును తిరిగి ప్రవేసించి మునిని 'బయటకు రమ్మ'ని కేక వేసెను.
    "వసిష్ఠా నిన్ను తెగటార్చవచ్చితిని. నా యీ మొదటి అస్త్రముతోనే నిన్ను యమసదనమునకు పంపెదను!"
    వసిష్ఠ మహర్షి మౌనమును వహించి అరుగుపై పద్మాసనమును వేసికొని కూరుచుండి తన చేతనున్న బ్రహ్మదండమును తనముందు బారెడు దూరమున నేలపై నిలబెట్టెను. విశ్వామిత్రుని అస్త్రము దూసుకొని వచ్చి, ఆ మంత్రదండము ముందు పడిపోయినది! రాజు నివ్వెరపోయెను. అతడు సంధించిన రెండవ అస్త్రమునకునూ ఆ గతియే పట్టినది! రాజు ఒకదాని వెనుక ఒకటి తన అస్త్రశస్త్రములనన్నింటినీ వసిష్ఠునిపై ప్రయోగించినాడు. ఏ ఒక్కటియూ దండమును దాటిపోలేకపోవుటచే మహర్షికి ఎట్టి హానియూ కలుగలేదు.
    రెండవసారి పరాభవము పాలైన రాజు వసిష్ఠుని మంత్రదండము ముందు కుప్పగా పడియున్న తన నూతనాయుధములను చూచుచూ "ఈ బాణములు శక్తి అంతయూ ఏమైనది?" అని ప్రశ్నించుకొనెను. సత్యము గోచరించినది. బ్రహ్మర్షియగు వసిష్ఠుని ముందు తన రాజసము పనిచేయదు. తానునూ బ్రహ్మర్షియై వసిష్ఠునిపై పగను తీర్చుకొనవలెను!
    రాజు హిమాద్రిని వదలి ధర్మపత్నిని తోడ్కొని దక్షిణాపధమునకు పోయి బ్రహ్మదేవుని గూర్చి చాలాకాలము తపమొనరించెను. ఎట్టకేలకు కమలాసనుడు ప్రత్యక్షమై "తపోధనా, ఇంక నీవు రాజర్షిగా పరిగణింపబడుదువు" అని వచించి అంతర్ధానుడయ్యెను.
    రాజు "రాజర్షిగా మాత్రమేనా?" అని నిరుత్సాహుడయ్యెను. మరుక్షణముననే నిస్పృహ నుండి తేరుకొని "నేను బ్రహ్మర్షిని ఐతీరెదను! వసిష్ఠునిపై పగను తీర్చుకొని నా పరాభవాగ్నిని చల్లార్చుకొనవలెను" అని అతడు మరల నిశ్చయమునకు వచ్చెను.
    దక్షిణ వనమున నున్న కాలమున విశ్వామిత్రునకు నల్వురు పుత్రులు జన్మించినారు. వారితో అతడు "నేను ఇంక నిత్యమూ నదికి పోయి స్నానానంతరము ఒక ఏకాంత స్థలమున నైష్ఠికుడనై కూరుచుండి నా తపమును  సాగించెదను. నేను లేని సమయమున మీరు కుటీరమున అప్రమత్తులై యుండి మీ తల్లిని కాపాడుచుండవలెను" అని చెప్పి బయలుదేరినాడు.
    మార్గ మధ్యమున ఆజానుబాహుడూ ఉన్నతకాయుడూ ఐన చండాలుడొకడు ఎదురై దూరమున నిలిచి "తపోధనా, నమస్కారము" అన్నాడు.
    "ఎవరు నీవు?"
    "నేను సూర్యవంశజుడనైన 'త్రిశంకువు' అను రాజును. 'వినాశకాలే విపరీతబుద్ధిః' అనునట్లు నాకొక వింత కోరిక కలిగినది. సౌందర్యవంతుడనగు నాకు ఈ బొంది (దేహము)తో స్వర్గమునకు పోవలెనన్న ఇచ్ఛ జనించినది. కుల గురువగు వసిష్ఠ మహర్షిని 'నా మనోరధమును సిద్ధింపజేయు యజ్ఞమును నాచే చేయించుడు' అని కోరినాను. ఆయన 'అది సాధ్యము కాదు, పొమ్ము' అన్నారు. నేను పట్టువదలక గురువు కుమారులను ఆశ్రయించినాను. వారు 'అది అసాధ్యమని మా తండ్రి వచించినారు కదా. నీ విడ్డూరపు ప్రయత్నమును విరమించుకొని రాజ్య పరిపాలనమున శ్రద్ధ వహించుము పొమ్ము' అన్నారు. నేను 'సహనమును' కోల్పోయి, 'రాజ్యములో పురోహితులకు కొఱత లేదు. సమర్దుడగు మరియొక యాజకుని నియమించుకొని కృతార్థుడనయ్యెదను' అన్నాను. వాసిష్ఠులు (వసిష్ఠుని కుమారలు) ధిక్కరించితినన్న ఆగ్రహముతో నన్ను 'చండాలుడవు కమ్ము!' అని శపించినారు... వెంటనే నామేను - లావణ్యమును కోల్పోయి ఈలాగున నల్లబడి పోయినది! విలువైన నా దుస్తులు మురికి గుడ్డలుగా మారిపోయినవి! రత్న ఖచిత సువర్ణాభరణము లన్నియూ వీగిపోయినవి!" అని వాపోయినాడు.
    అంతయూ ఆలకించిన విశ్వామిత్రునకు ఒక ఆలోచన వచ్చినది. "నా తపమును కొంత వెచ్చించి ఈ త్రిశంకువును సశరీరునిగా స్వర్గమునకు పంపెదను. పిమ్మట వసిష్ఠునితో 'బ్రహ్మర్షినని విఱ్ఱవీగుటయే కాని నీ శిష్యుడేయగు త్రిశంకువు అభీష్టమును ఈడేర్చలేకపోయితివి. నీవు నెఱవేర్చలేని కార్యమును నేను నిర్వహించితిని చూడుము!' అని పరిహసించి పరాభవించెదను!"      

 Previous Page Next Page