అతడు చివ్వునవెనుతిరిగి పారిజాతనూ, మనోహర్ నూ మార్చి మార్చి చూశాడు. అతడోసారి పగబట్టిన పాములా తల విదిలించి గిరుక్కున వెనక్కి తిరిగి గబగబా వెళ్ళిపోయాడు.
"నువ్వు చేసిన అవమానానికి వాడు బుద్ది తెచ్చుకొని ఊరుకొంటాడంటావా? ప్రతీకారం తలపెడితే?" భయంగా అడిగింది.
"ఏడిశాడు వెధవ!" నిర్లక్ష్యంగా తల ఎగురవేశాడు మనోహర్. చాతీమీద చేత్తో కొట్టుకొని, "వీడిముందు ఇలాంటి వాళ్ళు వందమంది వచ్చినా ఏం చెయ్యలేరు తెలుసా?" అన్నాడు సగర్వంగా.
అపురూపంగా చూసింది పారిజాత అతడి కేసి. ఇరవయి రెండేళ్ళకే ఇరవై అయిదేళ్ళలా కనిపించే మనోహర్ శరీరం సమున్నతంగా , దృఢంగా బంగారు ఛాయతో మెరిసిపోతూ ఉంటుంది. నిత్యం వ్యాయామంతో తన శరీరాన్ని ఆరోగ్యాన్ని ఎంతో శ్రద్ధగా చూచుకొంటాడు మనోహర్. మనోహర్ లాంటి వాడు తనకు అండగా నిలవగా ఇలాంటి బక్క పీనుగులు వందమంది వచ్చినా తను భయపడే అవసరం లేదు.
పారిజాత అడుగులు ఠీవిగా పడసాగాయి.
"వెళ్ళు, పారూ! ధైర్యంగా ఉండు. నేనుండగా నీకేం భయం? నీ జోలికి మళ్ళీ వాడొస్తే చెప్పు! ఎముకలు విరిచేస్తాను!" స్కూటర్ స్టార్టుచేసి వెళ్ళిపోయాడు మనోహర్.
కాని, ఎంతోకాలం నిలువలేదు పారిజాత గర్వం, ధైర్యం. మరునాడు బడిలో అడుగుపెడుతూనే స్కూల్ గోడలనిండా తన పేరుతో మనోహర్ పేరుకలిపి రాసిన వ్రాతలు కనిపించాయి. అవి ఎంతో జుగుప్సగా ఉన్నాయి, అన్నీ అశ్లీలపు పదాలతో.
పారిజాత వణికిపోయింది. ఏడుస్తూ కూలబడింది.
"ఇంతకీ ఎవరే ఈ మనోహరుడు?" పారిజాత క్లాసు పిల్ల పారిజాత గడ్డం ఎత్తి కొంటెగా ప్రశ్నించింది.
"మా ఇంటి వాళ్ళ అబ్బాయి"
"అయితే కథ కొంతలో కొంత నిజమన్న మాట!"
"ఛీఛీ! అతనికీ నాకూ అలాంటి సంబంధంలేదు తెలుసా?"
"అలాంటి సంబంధమంటే?"
ఉడికిపోయింది పారిజాత. "చిన్నప్పటినుండి తెలిసినవాడు... ఒక్క కాంపౌండ్ లో పెరిగాం, అతడి దగ్గర నాకు చనువుందికాని, మీరు ఊహించుకొనే చనువులేదు. అయినా నేను సంజాయిషీ. ఇచ్చు కోవడమేమిటి మీకు! నాకీ చదువొద్దు, సంధ్య వద్దు. ఈ రోజుతో ఈ బడికొక నమస్కారం"
పుస్తకాలు తీసుకొని క్లాస్ లోకి వెళ్ళకుండా రివ్వున స్కూల్ దాటి వచ్చేసింది పారిజాత.
కూతురు స్కూల్ కొక నమస్కారం పెట్టి వచ్చేసిందని తెలిసి ఒక నిట్టూర్పు విడిచాడు కృష్ణారావు "ఎవరో అల్లరి పెట్టారని చదువు మానుకోవడమేమిటమ్మా? ఇంట్లో కూర్చుని ఏం చేద్దామని?" అని విసుక్కొన్నాడు.
"ఇంట్లో చదివి ప్రవేట్ గా పరీక్ష ఇస్తాను, నాన్నా?"
"ప్రయివేటుగా పరీక్ష ఇవ్వడం అంత సులభం కాదు, సరైన కోచింగ్ లేకపోతే ఎంత తెలివైన వాళ్ళయినా పరీక్షకు తయారు కావడం కష్టం!"
"కష్టమైతే పీడాపోయింది. నేనేం చదువను?"
"చదువు లేకుండా ఇంట్లో కూర్చొని ఏంచేస్తావమ్మా?"
"చదివినా, చదువులేకపోయినా ఆడవాళ్ళంతా ఏం చేస్తారు నాన్నా?" తలొంచుకొని, గోళ్ళుగిల్లుతూ అంది.
జవాబు సులభమే కాని, జవాబు చెప్పాక తను ఆమె ముందు నిలవడం ఎంతకష్టం? ఈ చిట్టితల్లికి అప్పుడే పెళ్ళి చేసుకోవాలనే కోరిక కలిగిందా? నిండా పదహారు సంవత్సరాలైనా లేని ఈ పిల్ల అప్పుడే గృహిణిగా జీవించాలని కోరుకుంటూందా?
చదివినా చదవక పోయినా ఆడవాళ్ళంతా ఏం చేస్తారు? పెళ్ళి చేసుకొంటారు, పిల్లల్ని కంటారు. సంసారం చేసుకొంటారు.
తన పారుకు తను పెళ్ళి చేయగలడా?ఆమెను అపురూపంగా చూసుకొనే వరుణ్ని తీసుకు రాగలడా? ఇన్నాళ్ళు పిల్లలకి పాఠాలు చెప్పి వెనక వేసింది ఏం లేదు. తనకూ తన కూతురికి బట్టా పొట్టా గడిచిపోయింది. ఆడపిల్ల పెళ్ళంటే వందలతో అయిపోయేదికాదు? వేలు కావాలి. ఈ దరిద్రుడికి? వేలకు వేలు ఎక్కడినుండి వస్తాయి.?
డబ్బులేదని పిల్లకు పెళ్ళి చేయకుండా ఉంటాడా? బికారి కాని, శ్రీమంతుడు కాని కన్నకూతుర్ని ఓ అయ్య చేతిలో పెడితేనే కదా అతడి ధర్మం పూర్తి అయ్యేది?