ఒక సాయంత్రం రాధ పసిగట్టింది, తన వెనుక ఎవరో వస్తున్నారని. ఆ అమ్మాయి తల తిప్పకుండానే, కళ్ళు కదల్చకుండానే ఇలాంటి విషయాలు పసిగట్టేయగలదు.
రాధ సన్నగా వణికింది.
ఇలాంటివి కొత్త, అసలు తనను కూడా 'అనుసరిస్తారని' ఆ అమ్మాయి కలలో కూడా ఎప్పుడూ అనుకోలేదు. ప్రొద్దున్నే అయిదింటికి స్నానం చేసి, తులసి చెట్టు ముందు దీపం వెలిగించి, చదువుకు కూర్చోవటంతో ఆమె దినచర్య ప్రారంభమవుతుంది. ప్రతీ శుక్రవారమూ కాళ్ళకి పసుపు రాసుకోవటం, ఏ చిన్న తప్పు జరిగినా లెంపలు వేసుకుని, కృష్ణ కృష్ణా' అనుకోవటం ఆమె అలవాటు.
అటువంటి రాధమ్మ వెనుక ఎంత అల్లరిపిల్లాడైనా యెలా పడతాడు ? పడగలడు ??
కానీ పడ్డాడు. ఆ విషయం తెలుస్తూనే వుంది.
రాధకి ఏడుపొచ్చింది. ఆ అమ్మాయికి ఈ అనుభవం భయంగా వుంది. 'కృష్ణ కృష్ణా ! ఈ రోజు నా అలంకరణలో ఏదో లోపం వున్నట్టుంది. అందుకే ఎవరో కుర్రవాడు ఇలా చేస్తున్నాడు. నన్ను మన్నించు తండ్రీ!' అనుకుంది.
అంతలో ఎదురుగా తన స్నేహితురాలు రావటం కనిపించి ప్రాణం వచ్చింది. 'ఒసేయ్' అనబోయి, అంతలో ఎవరైనా వింటారని, గబగబా అటువైపు నడిచింది. అంతలోనే అనుకోని సంఘటన ఒకటి జరిగింది.
వెనుక వస్తూన్న కుర్రవాడు వేగంగా ముందుకొచ్చి ఆమె భుజాలు పట్టుకుని వెనక్కి తిప్పి, ఆమె కెవ్వున అరిచే లోపులో బుగ్గమీద గట్టిగా ముద్దెట్టుకుని, మిగతా జనం అలర్ట్ అయ్యేలోపులో అక్కణ్నుంచి మాయమైపోయాడు.
రాధకి, భూమి గిరగిరా తిరుగుతున్నట్టు అనిపించింది. వళ్ళంతా చెమట పట్టేసింది. ఆమె స్పృహతప్పి పడిపోయేదే - కానీ అదృష్టవశాత్తు ఎదురుగా వస్తున్న స్నేహితురాలు పలకరించింది.
"ఇక్కడ ఎక్కువసేపు ఇలా నిలబడితే జనం గుంపులుగా పోగయి మననే వింతమృగాల్ని చూసినట్టు చూస్తారు. తొందరగా వెళ్ళిపోదాం, నడు" అని కంగారుపెట్టింది.
అదృష్టవశాత్తు ఎక్కువమంది జనం పోగవలేదు. ఉన్న కొద్దిమందీ-'కలియుగ మహిమ' అనుకుంటూ ఎవరి దారిన వాళ్ళు సాగిపోయారు. రాధకి సానుభూతి చూపిద్దామనుకున్న వాళ్ళు మాత్రం, ఆ అవకాశం పోయినందుకు బాధపడ్డారు.
భూమి రెండుగా చీలిపోతే బావుణ్ణు అనిపించింది రాధకి. రోడ్డు మీది అందరూ తననే చూసి నవ్వుతున్నారన్న భావం ఆమెని కుంచింప చేస్తూంది. పక్కనే గానీ స్నేహితురాలు లేకపోతే ఏమయ్యేదో పరమాత్మ కెరుక.
"వాడి పని పడదాం లేవే" అందా స్నేహితురాలు కసిగా పళ్ళు కొరుకుతూ.
అంత బాధలోనూ రాధ ఆశ్చర్యంగా తలెత్తి, "వాడు నీకు తెలుసా ?" అని అడిగింది.
"ఎందుకు తెలీదు. మా అన్న స్నేహితుడే. ఆ దౌర్భాగ్యుడి పేరు మురళి" అంది.
"నేనయితే గట్టిగా కేకవేసి ఆ రోడ్డుమీదే చావగొట్టేదానిని" అంది రాజేశ్వరి.
"నేనయితే సరాసరి పోలీస్ స్టేషన్ కెళ్ళి కాంప్లెయింట్ ఇచ్చే దానిని__"
"అయినా వాడలా పైట పట్టుకుని లాగుతూ ముద్దు పెట్టుకుంటూంటే నువ్వెలా ఊరుకున్నావే ? నిజంగా నువ్వు రాధవూ, వాడు కృష్ణుడూ అనుకున్నావా ఏమిటి?" అడిగింది సీత.
రాధ ధీనంగా తలెత్తి చూసింది.
"నేనేం చేయను ! కాళ్లూ చేతులూ ఆడలేదు నాకప్పుడు.
"హరికథలు చెప్పకు. అంత పిరికిదానివి కాలేజీలో ఎందుకు చేరావ్ ? గీతాశ్రమంలో చేరాల్సింది -"
రాధ మాట్లాడలేదు.
"ఇదిగో రాధా ! ఇవాళ నిన్ను ఇంత గొడవ చేసినా కూడా వాడిని వదిలేస్తే రేపు మమ్మల్ని కూడా ఇలాగే ఆటలు పట్టిస్తాడు ! ఏమయినా సరే మనందరం వెళ్ళి ప్రిన్సిపాల్ కి రిపోర్టిద్దాం !" అంది శ్యామల మళ్ళీ.
"అమ్మో ! ప్రిన్సిపాల్ కి రిపోర్టే -" భయంగా అంది రాధ.
"ఏం ? ఎందుకు భయం ? ప్రిన్సిపాలేం మింగేస్తాడా ?"
"అది కాదే ? వాడా కోపం పెట్టుకుని మళ్ళీ అల్లరి పెడితే..."
"అప్పటి సంగతేమోగానీ - రిపోర్టివ్వకపోతే మాత్రం రోజూ నిన్నిలాగే అల్లరి పెడతాడు. ఆఫ్ కోర్స్ - నీకిష్టమయితే మేమేమీ చెయ్యలేం అనుకో."