Previous Page Next Page 
ఒక రాధ ఇద్దరు కృష్ణులు పేజి 5


    "కేసా ?"

    "ఔను."

    రైటర్ నిర్లక్ష్యంగా కాగితం అందుకుంటూ, "ఏం కేసు ?" అన్నాడు.

    "ఇమ్ పెర్పెనేషన్."

    రైటరు నిద్రమత్తు వదిలిపోయింది. "వ్వాట్ ?" అని అరిచాడు.

    "నాలాగే ఒకడు ఈ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ నా పేరు ఉపయోగిస్తూ మోసం చేస్తున్నాడు."

    "అంటే ?" అర్ధం కానట్టు అడిగాడు.

    "నా స్నేహితుడి దగ్గరికి నాల్రోజుల క్రితం వెళ్ళి నాలుగయిదొందలు అప్పు తీసుకున్నాడు."

    "ఎందుకిచ్చాడట నీ స్నేహితుడు ?"

    "అతను నా ప్రాణస్నేహితుడు. సాధారణంగా అవసరమొస్తే ఒకరినొకరు తప్పక సాయం చేసుకుంటాం."

    "అయితే మాత్రం ? ఎవడో వెళ్ళి నీ పేరు చెబితే ఇచ్చేయటమేనా ?"

    "అతడు నా పేరు చెప్పలేదు" విసుగ్గా అన్నాడు మురళి.

    "మరి ?"

    "నేనే తను అన్నాడు."

    రైటరు ఉలిక్కిపడి, అంతలోనే సర్దుకుని, "ప్రాణస్నేహితుడు అంటున్నావు, నీలా వేషం వేసుకున్నవాడిని ఆ మాత్రం గుర్తుపట్టలేడా?" అన్నాడు ఎగతాళిగా.

    "గుర్తు పట్టలేదు అందుకే ఈ రిపోర్టు."

    రైటరు కంప్లయింటు చదవబోయి, ఇంగ్లీషులో ఉండటం చూసి ఆ ప్రయత్నాన్ని విరమించుకుని, "నేను నమ్మను" అన్నాడు.

    "నేనే మీ స్థానంలో వుంటే నేనూ నమ్మను. కానీ జరిగింది అది."

    రైటరు ముందుకు వంగి, పెద్ద రహస్యం శోధించినవాడిలా "నువ్వు కుర్రవాడివి" అన్నాడు. చాలా నేర్చుకోవాలి నువ్వు."

    "ఏమిటి ?"

    "నీ స్నేహితుడు నిన్ను మోసం చేశాడు."

    "ముందు నేనూ అలానే అనుకున్నాను. కానీ ..."

    "ఊఁ. కానీ ?"

    "వాడు ప్రొద్దున్న - నేను రెగ్యులర్ గా వెళ్ళే మంగలిషాపుకి వెళ్ళి గెడ్డం గీయించుకున్నాడు - నా పేరుమీద."

    "నేన్నమ్మను."

    "నేనూ నమ్మను. కానీ జరిగింది అది."

    రైటరు కాగితం ఫైల్లో పెడుతూ, "సరే - చూస్తాంలే" అన్నాడు.

    మురళి కుర్చీలోంచి లేవకుండా, "అంతే కాదు. వాడింకో పని కూడా చేశాడు" అన్నాడు.

    "ఏమిటి ?"

    "రాత్రి నాకు మత్తుమందిచ్చి, గదిలో ప్రవేశించి నా గెడ్డాన్ని నీట్ గా షేవ్ చేశాడు. నేను నిజంగానే ప్రొద్దున్న మంగలిషాపుకి వెళ్ళానని నాకే భ్రమ కలిగించటానికి."

    రైటరు మొహంలో వర్ణించ వీల్లేనటువంటి భావం కదలాడింది. "ఇది పోలీస్టేషను" అన్నాడు. "ఏడిపించటానికీ, ఆటలాడుకోవటానికీ అబ్బాయిల హాస్టలు కాదు."

    "తెలుసు" అన్నాడు మురళి, అదే స్వరంతో. "ఇదంతా ఏదో పెద్ద ఎత్తుమీద ఎవరో నన్ను ఒక పెద్ద కేసులో ఇరికించటానికి వేస్తున్న ప్లాను అని నాకు తోస్తూంది." 
   
    "ఎటువంటి కేసు."

    మురళి కుర్చీలోంచి లేచాడు. "అది ఆలోచించవలసింది పోలీసులైన మీరు ! అతడి కెవరిమీదైనా కక్ష వుండి వుండవచ్చు. అందరూ చూస్తూ వుండగా వాళ్ళని హత్య చేయవచ్చు. అందరూ చూస్తూ వుండగా వాళ్ళని హత్య చేయవచ్చు. ఆ కేసు నా మీదకు రావొచ్చు. అలాంటిది జరక్కుండా వుండటానికే ఈ రిపోర్టు. వెళ్ళొస్తాను" అంటూ గుమ్మంవైపు నడిచాడు.

    "మాట."

    మురళి ఆగి, తల తిప్పాడు.

    "నేను నీకో సలహా ఇవ్వనా ?"

    ఏమిటన్నట్లు చూశాడు మురళి.

    "డిటెక్టివ్ పుస్తకాలు ఎక్కువ చదవక."

    మురళి మొహం ఎర్రబడింది. "నేనూ మీకో సలహా ఇవ్వనా ?" అన్నాడు.

    "ఏమిటి ?"

    "పక్కడ్రాయరు సొరుగు తీసినా మెలకువ రానంతగా ఎప్పుడూ డ్యూటీలో వుండగా నిద్రపోకండి. 'పోలీసుస్టేషనులోనే దొంగతనం' అని పేపరులో పడగలదు. ఇదిగో మీ కలం" అని జేబులోంచి దాన్ని తీసి బల్లమీద పెట్టేసి వెళ్ళిపోయాడు.


                        *    *    *


    రాధ -

    అయిదడుగుల ఒక ఇంచీ  పొడవు, సన్నగా, నాజూగ్గా వుంటుంది. ఆ అమ్మాయి మొహం ఎలా వుంటుందో చాలామందికి తెలియదు. కాలేజీనుంచి ఇంటికి - ఇంటి నుంచి కాలేజీకి తల బాగా వంచేసుకుని వెళుతూ వుంటుంది. స్నేహితులకి మాత్రం ఆ అమ్మాయి సోగకళ్ళు, పోకచెక్క నోరూ అంటే తెగ ఇష్టం. ఇష్టమంటే మరో అర్ధంలో కాదు, ఇష్టం అంటే తెగ చూడాలనిపించేదన్నమాట.  

 Previous Page Next Page