"నీకు ధైర్యం ఉండాల్సిన అవసరం లేదు. మేమంతా నీ పక్కన వుంటాంగా..."
"పోనీ ఆ చెంపదెబ్బ కూడా మీరే కొట్టకూడదూ."
"ఇంకా నయం. నీ బదులు మమ్మల్నే ముద్దు పెట్టించుకోమన్నావు కాదు__"
"అది కాదే __"
"ఇదిగో రాధా ! ఇంకేం మాట్లాడకు. నువ్వు వాడి చెంప పగలగొట్టి తీరాల్సిందే."
* * *
మురళీ వాళ్ళుంటున్న హాస్టల్ కి ఒక ప్రత్యేకత వుంది. ఆ ప్రత్యేకత పేరు 'రామలింగం' వార్డెను.
రామలింగందో ప్రత్యేక తరహా ఫిలాసఫీ. 'హాస్టలు కుర్రాళ్ళు మొదటి ఒకటి రెండు సంవత్సరాలు చాలా నమ్రతగా వుంటారు. తరువాత చచ్చినా మాట వినరు. అందుకని మొక్కగా వుండగానే వాళ్ళని వంచాలి. మురళిలాగా మానులైతే కష్టం_'అదీ అతడి ప్రిన్సిపలు.
సామదానభేద దందోపాయాల్లో ఏదైనాసరే - ఉపయోగించి హాస్టలు పిల్లలందర్నీ అదుపులో పెట్టాలి అని అతని తాపత్రయం.
ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఇవ్వొచ్చు. మచ్చుకి __
ఎదురుగా నిలబడిన కుర్రవాడిని ఓరకంటితో చూస్తాడు రామలింగం. అతడో కొత్త పక్షి అని తేల్చుకాగానే "యస్, వాడ్డూయు వాంట్" అంటాడు ఇంగ్లీషులో.
"సాయంత్రం మా బాబాయి కూతురి పెళ్ళి వుంది సార్ ! అంచేత రాత్రి లేటుగా రావటానికి పర్మిషను" నమ్రతగా అడుగుతాడు కుర్రాడు.
రామలింగం మాట్లాడడు. సాధారణంగా ఇటువంటి వాటిని సామరస్యంతోనే చేదిస్తాడు అతను.
"ఏమిటి ? మీ సొంత బాబాయి కూతురు పెళ్ళా ?"
"అవున్సార్ ! సిటీ కమ్యూనిటీ హాల్లో."
రామలింగం తల దించుకుని రిజిష్టర్ ఫిలప్ చేస్తూ అతని వంక చూడకుండానే "నీకో సంగతి చెప్పనా?" అంటాడు నెమ్మదిగా.
ఆ కుర్రాడు ఏదో చెప్పబోయేంతలో "బహుశా మీలాంటి సుత్తిగాడిని పిలిచి ఉండరు సార్..." అంటూ గది కిటికీ బయటివేపు నుంచీ ఓ గొంతు వినిపిస్తుంది. రామలింగం మరుక్షణం చిరుతపులిలా కిటికీ దగ్గరకు ఎగిరి దూకి బయటనుంచీ అలాంటి బేవార్స్ వాగుడు వాగిన కుర్రాడిని గుర్తుపట్టాలని ప్రయత్నిస్తాడు. అయితే ఆ కుర్రాడు చిరుతపులి కంటే ఎక్కువ వేగంగా ఎగిరి దూకగల జంతువులా ఆ పాటికి అక్కణ్నుంచి పరుగెత్తిపోతాడు.
ఈ వ్యవహారం అంతా చూస్తున్న కుర్రాడికి నవ్వాగలేదు.
దాంతో రామలింగానికి అరికాలి మంట నెత్తికెక్కి __
"నువ్వు పెళ్ళికి వెళ్ళడానికి వీల్లేదయ్యా ! పర్మిషనివ్వను ! ఒకవేళ నాకు తెలీకుండా వెళ్దామనుకుంటున్నావేమో! సాయంత్రం అటండెన్స్ తీసుకుంటాను ! జాగ్రత్త!" అంటాడు.
కానీ ఒకోసారి ఈ ప్రహసనం ఇంత సులభంగా ముగియదు. ముఖ్యంగా మురళి గాంగ్ తో.
* * *
రూమ్ లోకి ప్రవేశించిన కనకారావ్ ని అనుమానంగా చూస్తూ "ఏం కావాలి" అని అడిగాడు రామలింగం. కనకారావు మురళి గాంగ్ మనిషి అని తెలుసు.
"మా ఫ్రెండ్ అదే - విన్సెంట్ గాడు లేడండీ. అదే స్పోర్ట్స్ మన్ __ మీరూ చూసే వుంటారు. ఆగస్ట్ టెన్తున హాస్టల్ కి వచ్చాడూ - మీరు కూడా చూసే వుంటారు __ గళ్ళ చొక్కా - టైట్ పాంటు ..."
రామలింగానికి చిరాకేసింది. "సంగతేమిటో చెప్పు" అన్నాడు విసుగు అణుచుకుంటూ.
"అదేనండీ ! పాపం వాడి సైకిల్ ని - లారీ ఢీ కొందిట ! వాడిని హాస్పిటల్లో చేర్చారట - ఒకటో రెండో కాళ్ళు కూడా ఫ్రాక్చర్ అయాయట - వెంటనే వెళ్ళి వాడిని చూడాలి ! మీరు పర్మిషనిస్తే ... గాంధీ హాస్పిటల్ కెళ్ళి ..."
"ఇప్పుడు నువ్వెళ్ళి చూసినా ఏం లాభం ? కాళ్ళు మళ్ళీ వస్తాయా ఏమన్నానా ?" అన్నాడు రామలింగం వెటకారంగా.
"చేసేదేం లేదనుకోండి ! కానీ ఫ్రెండ్ కదండీ ! పాపం ! మంచి స్పోర్ట్స్ మన్ ! ఎంతో కాలం నుంచీ సైకిల్ తొక్కుతున్నాడు- నేను వెళ్ళి చూడకపోతే-"