Previous Page Next Page 
పడిలేచే కడలితరంగం పేజి 6

    సరిగ్గా పదకొండు పదిహేనుకు రంగనాధంగారికి పిలుపు రావటంతో హడావుడిగా లోపలికి నడిచారు.

    మెత్తని మక్ మల్ కార్పెట్ పై నడుస్తూ సినిమా సెట్ లా వున్న గంటల అందాల్ని ఇంద్రధనస్సులోని రంగుల్ని తలపింపచేసే డిస్టెంపర్ గోడల్ని గోడలపై అందంగా అలంకరించబడిన ఆయిల్ పెయింట్స్ నీ, కార్వ్ డ్ వుడెన్ వార్డ్ రోబ్స్ నీ చూస్తూ రెండు గదుల్ని దాటారు. తర్వాత ఓ విశాలమైన హాలు. దాని నానుకుని కిరీటి పర్సనల్ రూమ్.

    స్వింగ్ డోర్ తెరచుకుని లోపల అడుగు పెడుతుంటే రంగనాధంగారి గుండె దడదడలాడింది....

    రివ్వల్వింగ్ ఛెయిర్ లో కూర్చుని ఫోన్ లో ఎవరితోనో మాట్లాడుతున్న కిరీటి ఒక్క క్షణం రంగనాధంగార్ని చూసి తలపంకించి 'ప్లీజ్ బి సీటెడ్' అంటూ సంజ్ఞ చేసి తన పనిలో తాను నిమగ్నమైపోయాడు.

    "యస్ మిస్టర్ సిన్హా! ఇన్సూర్డ్ మెటీరియల్ అని నిర్లక్ష్యం చేయకండి. నలభై లక్షల ఖరీదుచేసే హారిజాంటల్ బోరింగ్ మెషినది. జాగ్రత్తగా పేక్ చేసి షిప్ కు లోడ్ చేయండి. ఐయామ్ వాట్ గోయింగ్ టు టాలరేట్ యివెన్ మైన్యూట్ డేమేజెస్..... ఓకె!" అంటూ ఫోన్ క్రెడిల్ చేశాడు.

    సెంట్రలైజ్డ్ ఏసి కావడంతో రంగనాధంగారు కాస్త చలిగా ఫీలవుతుంటే 'యస్.... ఎనీ డ్రింక్స్' అంటూ పలకరించాడు కిరీటి.

    అక్కర్లేదన్నట్టుగా తల అడ్డంగా వూపి "నా పేరు రంగనాధం...... రాజానరేంద్రదేవ్ కుమారుడ్ని." అంటూ తనను తాను పరిచయం చేసుకుంటూంటే 'అఫ్ కోర్స్' అన్న సన్నని నిట్టూర్పుతో రేబాన్ కూలింగ్ గ్లాసెస్ ని తీసి టేబుల్ పై వుంచాడు కిరీటి.
    రంగనాధంగారి కనుబొమలు ముడిపడ్డాయి.

    మగాళ్ళను సైతం మైమరపింపచేసే కిరీటి నేత్రద్వయాన్ని చూస్తుంటే బాగా పరిచయమున్న వ్యక్తిలా అనిపించాడు.

    కాని ఎంత ప్రయత్నించినా ఆ వ్యక్తి ఎవరైంది గుర్తు పట్టలేకపోయారు.

    "నేను మీకు అప్పిచ్చిన చక్రవర్తి ఫైనాన్సింగ్ కంపెనీ ఛైర్మన్ని....."

    కిరీటి చెప్పిన వాక్యంతో రంగనాధంగారి ఆలోచనలు తెగిపోయాయి. అతనితో కాకపోయినా ఆ సంస్థతో తనకు సుపరిచితమే.
    కోర్టు నిర్ణయం మాకు అనుకూలంగా వచ్చిన విషయము మీకు తెలుసనుకుంటాను."

    తెలిసిన విషయాన్ని మరోమారు తెలియపరచడంలో ఉద్దేశ్యమేమిటో ఆయనకు అర్థంకాలేదు.

    "ఇలా ఈనాడు మిమ్మల్ని పిలిపించడంలో గల ఉద్దేశ్యం మిమ్మల్ని ఆదుకోవాలనుకోవడం....."

    ఉలిక్కిపడ్డారాయన.... కోర్టుకు లాగిందెందుకు..... అంతా నిర్ణయమయ్యాక ఆదుకోవడమెందుకు?

    "నాకు తెలుసు నా మాటలకు మీరు ఆశ్చర్యపోతున్నారని.... కాని యీ వ్యవహారం ఇంతవరకూ రావటానిక్కారణం మీరు రాజానరేంద్రదేవ్ వంశానికి చెందినవారని మాకు తెలియకపోవటం.... రెండవది....."

    ఫోన్ ఎక్స్ టెన్షన్ బజర్ వినిపించడంతో రిసీవరు అందుకున్నాడు కిరీటి.

    "యస్..... కిరీటి హియర్.... నోనో మిస్టర్ మల్హోత్రాఫ్యాక్టరీ ఎక్స్ టెన్షన్ కి పన్నెండ్రాఫ్ క్రోర్ సరిపోదని మీ బ్యాంక్ ఛైర్మన్ కు చెప్పండి... ఐ నీడ్ మినిమమ్ పోర్ క్రోర్స్ యస్.... దట్సాల్....."

    ఫోన్ క్రెడిల్ చేశాడు.

    "యస్..... రెండవది... మీ అమ్మాయి శిల్పంటే నాకు ఇష్టముండటం..... మూడవది.... ఆమెను నా భార్యగా చేసుకోవాలన్న అభిలాష కలగటం...."

    కిరీటి నిర్మొహమాటానికి రంగనాధంగారు షాక్ తిన్నారు.

    అవమానంతోనూ, ఆవేశంతోనూ ఆయన చేతులు బిగుసుకున్నాయి.

    "మీ పరిస్థితిని అవకాశంగా తీసుకున్నట్టుగా మీకు అనిపిస్తే..... ఐయామ్ వెరీ సారీ" కిరీటి భుజాలెగరేశాడు.

    "అవకాశం తీసుకుంటున్నందుకు నేను బాధపడటం లేదు మిస్టర్ కిరీటి! మీ సాహసానికి నేను ఆశ్చర్యపోతున్నాను."

    "నాకు డొంకతిరుగుడుగా మాట్లాడటం చేతకాదు రంగనాధంగారూ! ఐయామ్ బిజీమెస్ మేన్."

 Previous Page Next Page