Previous Page Next Page 
స్వర బేతాళం పేజి 5

    ప్రకాశరావు  ఒకప్పుడు  ఆమెకు పై అధికారే కాకుండా  కుటుంబ స్నేహితుడు కూడా. తండ్రి పోయినప్పుడు  ఆస్థి వ్యవహారాలన్నీ  చక్కబెట్టిందాయనే. రిటైరు అయినా  ఏ విషయంలోనైనా  సలహా కావాలంటే ఆయన దగ్గరకే  వెళుతుంటుంది పద్మజ.

    ఈ మధ్య  పార్టీల కెళ్ళాలంటే  విసుగ్గా  ఉంటోంది. వెళ్ళినప్పటి నించీ  తల్లీ తండ్రీ  లేని తనకు పెళ్ళిళ్ళు చేయాల్సిన బాధ్యత  తమ మీదే వున్నట్లుగా  మాట్లాడతారందరూ. వెళ్ళకపోయినా  బాగుండదు. పెళ్ళిచేసుకో కూడదనేం  కాదుగానీ ఆ విషయం  గురించి  ఆలోచించలేదింతవరకూ.

    'ఇవాళ ఎంతమంది ప్రశ్నలు ఎదుర్కోవాలో? అనుకుంటూ కారు పార్కు చేసింది పద్మజ.

    అప్పటికే  పార్టీ  మొదలైనట్లుంది. అంతా హడావిడిగా  వుంది.

    "హల్లో పద్మా, ఒక్కదానివే వచ్చావేం! హిమజ రాలేదా?" మిసెస్ ప్రకాశరావు పలకరించింది.

    "లేదు ఆంటీ! దానికోసం చూసే ఆలస్యమైంది. రాధావాళ్ళేరీ?" చుట్టూ చూస్తూ అడిగింది.

    "ఇక్కడే ఉండాలమ్మా చూడు" మరెవరో అతిధులు రావడంతో హడావిడిగా వెళ్ళిపోయిందావిడ.

    హాలంతా కలయ చూసింది పద్మజ. రాధ ఒక పెద్ద గుంపులో నిలబడి, సీరియస్ గా వాదిస్తోంది.  అటువేపు  నడిచింది పద్మజ.

    "హల్లో పద్మా! ఏమిటి కనిపించడం మానేశావు ?"  మధ్యలో డాక్టర్ రామకృష్ణ అడ్డుపడ్డాడు.

    "హలో అంకుల్ ! మీ కోసమే చూస్తున్నాను. మీరిచ్చిన టాబ్లెట్లు బాగా పనిచేస్తున్నాయి! హాయిగా నిద్రపోతున్నాను."

    "అలా అని అలవాటుగా  చేసుకోకు. అయినా ఆఫీసు విషయాల గురించి అంత టెన్షన్ పనికిరాదమ్మా ! ఆ విషయాలు ఆఫీసులోనే  మరచి పోతుండాలి."

    "పద్మక్కా వచ్చావా, నీ కోసమే చూస్తున్నాను. ఒకసారి ఇటురా, మన పరువు  కాపాడాలివ్వాళ నువ్వు-సారీ అంకుల్" అని రామకృష్ణతో  చెప్పి పద్మజని  హడావిడిగా లాక్కెళ్ళింది రాధ.

    అక్కడ అమ్మాయిలూ  అబ్బాయిలూ  కలసి ఒక పదిమంది దాకా వున్నారు.

    "చూడక్కా! ఆడవాళ్ళకు  బుర్ర  ఉండదంటూ  జోక్స్ వేస్తున్నారిక్కడ. ఇక మొదలు పెట్టండి" ధీమాగా అంది రాధ.

    "నమస్కారం ఝాన్సీరాణిగారూ" అన్నాడతను.

    తలలెత్తి  సూటిగా  చూసిందతని వైపు. సీరియస్ గా చూస్తున్నా కళ్ళు కొంటెగా  నవ్వుతున్నాయి.

    "నమస్తే రాణాప్రతాప్ గారూ" అంది తనూ సీరియస్ గా. అందరూ ఫక్కున నవ్వారు.

    "జోక్ గా తీసుకోకండి. మా అక్క అడిగే ప్రశ్నలకి  మీరూ సమాధానం చెప్పాలి మరి" అంది రాధ.

    "అసలు పరిచయం చెయ్యకుండానే ?"

    "ఓ. సారీ! ఈమె మా పద్మజక్క. అక్కా  వీరు గిరిధర్ అని."

    "ఆగండాగండి. నన్ను నేనే పరిచయం  చేసుకుంటాను. పేరు గిరిధర్, ఊరు ప్రస్తుతం యిదే. ఎగుడు దిగుడుల మధ్య మతి పోగొట్టు కుంటున్న  వాణ్ణి."

    "అంటే ?"

    "ఎగుమతి, దిగుమతి  వ్యాపారస్తుణ్ణిలెండి."

    ఆ పరిచయాల సంగతి వదిలేసి యిందాక  అడిగిన ప్రశ్న  అడగండి."

    "మి. టి. గు. టి. చా . పు. లాంగ్. నా అంటే ఏమిటి అని అడిగానండి. ఎవ్వరూ చెప్పలేక పైగా నా మీద అరుస్తున్నారు. క్లూ కూడా ఇచ్చాను, అందరికీ తెలిసినదే అది అని."

    నవ్వింది పద్మజ. "టిబెట్లను ఎవరెస్టు శిఖరాన్ని పెలిచే పేరేది."

    "బాప్ రే. నిజంగా మీరు జీనియస్" ఆశ్చర్యంగా అన్నాడు గిరి.

    "మా అక్క ఐ.ఏ.ఎస్." గర్వంగా అంది రాధ.

    "నిజంగానా. నేను ఐ.ఏ.ఎస్సేలెండి" సీరియస్ గా అన్నాడతను.

    "అంటే?"

    "ఐ యామ్ ఎ స్టుపిడ్ అని" అందరూ నవ్వారు. పద్మజ మొహం ఎర్రబడింది.

    "ఇందాకటి యింకో ప్రశ్న చెప్పక్కా. మొనాలీసా పెయింటింగ్ ప్రత్యేకత ఏమిటి? ఆమె చిరునవ్వు తప్ప యింకేముందో నువ్వే చెప్పు. ఇంకేదో ప్రత్యేకత ఉంది మీరు సరిగా చూస్తే - అంటున్నారీయాన."

    "మోనాలీసాకు కనుబొమ్మలు లేవు. ఆ రోజుల్లో అదొక ఫాషన్. అసలామె బొమ్మ వేసినపుడు ఆమె భర్తకు నచ్చక ఆ పెయింటింగ్ తీసుకెళ్ళలేదుట. అప్పుడా దేశ యువరాజు దాన్ని కొనుక్కుని బాత్రూంలో తగిలించుకున్నాడట." చెప్పింది పద్మజ.

    అందరూ నిశ్శబ్దంగా  అయిపోయారు. నిజంగా అన్నిసార్లు ఆ బొమ్మను  చూసినా ఈ విషయాన్ని గమనించలేదెప్పుడూ.

    గిరి పెద్దగా నవ్వి చప్పట్లు కొట్టడంతో  అందరూ చేతులు కలిపారు.

    "ఇప్పుడు నువ్వో ప్రశ్న వెయ్యక్కా, చూద్దాం" అంది ఉత్సాహంగా రాధ.

    "వద్దులే' నవ్వేసింది పద్మజ. "ఐ.ఏ.ఎస్. కి ప్రిపేర్ అయ్యేటప్పుడు అన్నీ చదివేదాన్ని. ఇప్పుడు పుస్తకం ముట్టుకోవడానికి  టైం ఉండడంలేదు" మర్యాదగా తప్పించుకోబోయింది.

    "ఒకటన్నా  అడగాలి తప్పదు. మీ తెలివితేటలూ నిరూపించుకోవాలిగా" అన్నాడు గిరి.

    "సరే ఒక అగ్గిపెట్టె ఇవ్వండి అంటూ - "చాలా పాత లెక్క....కానీ ఎంతమంది చేయగలరో చూద్దాం" అని అందులోంచి 17 అగ్గిపుల్లలు తీసి అయిదు చతురస్రాలుగా అమర్చింది.  

 Previous Page Next Page