"వలపు! వరమాల! కవిత్వం కూడా వచ్చేసిందే."
"అతడంటే నాకెంత ఇష్టమో చెప్పలేను, ఆయనకీ నేనంటే ఇష్టమే అనిపిస్తోంది. నేనాయనవైపు చూసినప్పుడల్లా ఆయన నన్నే చూస్తూ కనిపిస్తారు. ఆ కళ్ళలో ఏదో మూగభాష! ఆయనకి నేనంటే ఇష్టంలేకపోతే ఆయన నన్నెందుకు అలా చూస్తారు చెప్పు?"
"అతడికి ఇష్టమో కాదో తరువాతి విషయం. పెళ్లి కాకుండా అతడి పేరుతో నీపేరు కలిపి వ్రాసుకోవడమే చండాలంగా వుంది. ఎవరైనా చూస్తే ఎంత అసహ్యంగా వుంటుంది చెప్పు."
"అతడి చేయి పట్టుకొని అతడి సరసన నిలబడే అదృష్టం వుందో లేదో? కనీసం నా పేరు ప్రక్కన అతడి పేరు వ్రాసుకొని తృప్తిపడనీ!"
"మనకు చదువుచెప్పే గురువులు తండ్రితో సమానం అంటారు. తండ్రితో ప్రియుణ్ణి ఊహించడం ఎంత నీచమో, ఇదీ అంతే నీచం........." తీవ్రంగా అంది విశిష్ట.
"బాగుందే! ముప్పయ్యేళ్ళ అందమైన బ్రహ్మచారిని ముందు నిలబెట్టి అతడిలో తండ్రిని చూడమంటే అదెలా సాధ్యం?అది అసంభవమే కాదు, అసహజం కూడా."
"గురువులో తండ్రిని చూచుకోక పోయినా మనం కాలేజీకి వెళ్ళేది చదువు కోసం అన్న విషయం మరిచిపోతే ఎలా? కాలేజీ అంటే స్వయంవర వేదిక అనుకున్నావా? మనది మధ్యతరగతి కుటుంబాలు. ఆ ఆడపిల్లకి పెళ్ళి చేసి పంపించేదే కదా? పై చదువులెందుకు? అన్న మూఢత్వం నుండి బయటపడి మనల్ని చదివిస్తున్నారంటే ఎందుకోసమనుకున్నావు? వేలకి వేలు కట్నాలిచ్చి పెళ్ళిళ్ళు చేయలేమన్న నిస్పృహతో కనీసం చదివిస్తే నన్నా, వాళ్ళ కాళ్ళమీద వాళ్లు నిలబడతారన్న ఆశతో ఎన్నో వ్యయప్రయాసకోర్చి కాలేజీకి పంపి మనల్ని చదివిస్తున్నారు. వాళ్ళ ఆశల్ని వమ్ముచేసే హక్కు మనకేం వుంది?"
"అబ్బా! సుత్తి! ఇంతింత పెద్ద డైలాగులు కొట్టకే. వాళ్ళకి పెళ్ళి చేయలేమేమో అన్న నిస్పృహే మనల్ని పక్కదారి పట్టడానికి పురికొల్పుతుందేమోనని ఎందుకు ఆలోచించవు?"
"సుత్తి అని నువ్వు విసుక్కున్నాసరే! స్నేహితురాలిగా నీకు హితవు చెప్పడం నా ధర్మం. చదువుకోవలసిన వయసులో ప్రేమా దోమా అంటూ వ్యామోహంలో పడితే ఆనక చింతించాల్సి వుంటుంది......."
"నీకిది చదువుకోవలసిన వయసుగా కనిపిస్తే నాకు పెళ్ళి చేసుకోవాల్సిన వయసు అనిపిస్తుంది"
"నేనిప్పుడు మాట్లాడుతున్నది పృధ్వీ సార్ ను ప్రేమించడం గురించి! అర్ధంపర్ధం లేని ప్రేమలెప్పుడూ ఫలించవు. అటు ప్రేమా విఫలమై ఇటు చదువూ గంటకొట్టి నువ్వు రెంటికి చెడిన రేవడివి అవుతావు. నీ ప్రేమకు పెద్దల మద్దతూ, సానుభూతీ వుండవు. గెలిచినా ఓడినా ఆ మార్గంలో నువ్వు ఏకాకివన్న విషయం మరువకు."
"ప్రేమ అంటే నీకు బూచిలా కనిపిస్తోందా? ఎందుకలా బయపెడుతున్నావు నన్ను?"
"ప్రేమ బూచికాదు. కాని ప్రేమించిన మనిషినిబట్టి బూచి అవుతుంది. నువ్వు ప్రేమించింది పృధ్వీసార్ ను. అతడివల్ల మోసపోయిన ఆడపిల్ల కథలెన్నో నేను విన్నాను. అందమైన రూపం! ఆ రూపంతోనే నీలాంటి ఆడపిల్లలను అనుభవించి, ఆనందించి వదిలించుకొనే రకం! ఒక రోజు మన సుభాషిణి మేడమ్ అంది గుర్తుందా? అందమైన స్టూడెంట్ కనబడితే లెక్చరర్స్ నడత పక్కదారి పడుతోంది అనలేదూ? అది ఇతడిని దృష్టిలో పెట్టుకునే అని వుంటుందని నా నమ్మకం!"
"నాకు తెలియని కథలు నీకెలా తెలిశాయే?"
"అవి కథలు కాదు! నిజాలు!"
"ఏమిటి నిజాలు? అతడి మీద ఆశలు పెంచుకొని, అతడి మనసు గెలుచుకోలేని నిస్పృహతో ఏవో కథలు సృష్టిస్తే అవన్నీ నిజాలని నమ్మాలా? ఆయన చెడ్డవాడని నువ్వే కాదు ఎవరు చెప్పినా నేను నమ్మను."
"ప్రేమ గుడ్డిదంటే ఇదే కాబోలు! ఖర్మ! అనుభవించు"
ఆరోజు నుండి కరుణతో మాట్లాడడం మానేసింది విశిష్ట.
కరుణ కూడా వీళ్ళతో కలిసి తిరగడం మానేసింది. కాలేజీకి కూడా ఒక్కతే వెడుతోంది.
ఒకరోజు రత్నమాల అనే అమ్మాయి చెప్పింది. "మీ కరుణ మొన్న పృధ్వీ సార్ తో సినిమాకు వచ్చింది తెలుసా? మా ముందు వరుస లోనే కూర్చొంది. సినిమా చూడ్డానికి వచ్చిందో, కబుర్లు చెప్పడానికి వచ్చిందో అన్నట్లు సినిమా జరుగుతున్నంతసేపు ఒకటే కబుర్లూ, నవ్వులూ"
"నాతో ఎందుకు చెబుతున్నావు? నీకంత కడుపుబ్బరంగా వుంటే సరాసరి వెళ్ళి వాళ్ళింట్లో చెబితే కాస్త ఉపకారం చేసినదానివి అవుతావు!" కోపంగా అంది విశిష్ట.
"మీరిద్దరు దగ్గరి దగ్గరి ఇళ్ళవాళ్ళు. చాలా క్లోజ్ గా వుంటారు కదా? అందుకని చెప్పాను" ఆ పిల్ల మూతిత్రిప్పుతూ వెళ్ళిపోయింది.
కరుణా తను ఎంత సన్నిహితంగా వుండేవాళ్ళంటే తమ స్నేహం చూసి చాలామంది ఈర్ష్యపడేవాళ్ళు. సింధు, బిందు తమ స్నేహబృందంలో వాళ్ళయినా వాళ్ళతో అంత సన్నిహితంగా వుండేది కాదు కరుణ. అలాంటిది ఇద్దరిదీ ఎడముఖం పెడముఖం అయిపోయింది. దీనికంతా కారణం తప్పుదారిన వెడుతున్నావని కరుణ ను హెచ్చరించడమే. మనిషిని దురదృష్టం వెంటతరుముతుంటే మంచి మాటలు కూడా విషతుల్యమౌతాయి.
పృధ్వీ తనని పెళ్ళాడతాడని అతడితో సినిమాలకీ, షికార్లకీ తిరుగుతున్నట్టుంది. పిచ్చిమోహం! అతడి మోజు తీర్చుకొన్నాక అప్పుడు తెలుస్తుంది అతడి నిజస్వరూపం. అప్పుడు చేతులు కాలిన సామెత గుర్తొస్తుంది.
ఒకరోజు కరుణ చెల్లెలు వచ్చింది. "మా కరుణక్క వచ్చిందా?" అంటూ.
"రాలేదే!"
"ఇక్కడికీ రానేలేదా?"
"ఉహూ!"
"మీ ఇంటికనే చెప్పి ప్రొద్దుననగా బయల్దేరింది. ఏదో నోట్సు వ్రాసుకోవాలంది....... ఇక్కడికి రాలేదా? ఇంకెక్కడికి వెళ్ళి వుంటుందబ్బా! సింధు, బిందు వాళ్ళింటికి వెళ్ళిందేమో......." ఆ పిల్ల సణుక్కుంటూ వెళ్ళింది.
కరుణ విషయం వాళ్ళింట్లో చెబితే బాగుంటుందా అన్న ఆలోచన వచ్చిందేకాని కరుణ పృధ్వీ సార్ తో తన తిరుగుళ్ళు ఒప్పుకోకపోతే? తను అనవసరంగా వాళ్ళముందు ఫూల్ అవుతుంది.