Previous Page Next Page 
నిషా పేజి 6

    అడవిగాలిస్తూ జీవులు తిరుగుతుండగా ఒక పగలు గడిచి రెండో పగలు ప్రారంభమైంది. చివరికి కనిపించాయి. రాజదంపతుల శవాలు. అప్పటికే వాళ్ళ శరీరంలో కొంత నక్కలు, తోడేళ్ళు పీక్కుతిన్నాయి. దుర్గంధం కూడా ప్రారంభమైంది శరీరాల నుండి.

    పోలీసుల్ని రప్పించడంలో ఎంతమాత్రం జాప్యం జరుగలేదు.

    చకచకా ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి అయ్యాయి. పోస్ట్ మార్టంలో తేలిన విషయం ఏమిటంటే, సౌదామిని హత్య చేయబడలేదు. భయంతో గుండె ఆగిపోవడం వల్ల మరణించింది! మోహనవంశీ హత్య చేయబడ్డాడు! మరణానికి ముందు చాలా చిత్రహింసలకు గురి అయినట్టు వెల్లడి అయింది. కొరడాతో క్రూరంగా బాదినట్లుగా శరీరం వాతలతో కమిలిపోయింది. కత్తిమొనతో తొడలమీద, వీపుమీద గాట్లు పెట్టబడ్డాయి. గోళ్ళు చీల్చబడ్డాయి. చివరికి తలమీద పడిన దెబ్బవల్ల అధిక రక్తస్రావమయ్యి మరణం సంభవించింది.

    అదీ పోస్ట్ మార్టం రిపోర్ట్.

    ఫార్మాలిటీస్ అన్నీ ముగించి శవాల్ని అప్పగించడం జరిగింది.

    మోహనవంశీ మేనల్లుడు రంగనాధం, మేనేజరు ధర్మలింగం శవాల్ని స్వాధీనపరుచుకున్నారు. పెద్ద భార్య, కుమారుడి దగ్గరికి మనిషిని పంపడం జరిగింది కాని, కొడుకు ప్రస్తుతం ఇండియాలో లేకపోవడం వల్ల రాలేదు! రాజ్యలక్ష్మి "ఆ ఇంట తీసిన కాలు తిరిగి పెట్టను" అన్న ప్రతిజ్ఞకు ఇప్పటికీ కట్టుబడడం వల్ల రావడానికి విముఖత చూపింది.

    ఇక సౌదామిని సోదరులకు కేబిల్ ఇవ్వడం జరిగింది కాని వాళ్ళు మేనల్లుడిని తీసుకొని వచ్చేసరికి ఆలస్యమౌతుందని, శరీరం ఖండఖండాలై ఇప్పటికే దుర్గంధం అలుముకోవడం వల్ల ఇంకా ఉంచడం మంచిదికాదన్న అభిప్రాయానికి వచ్చేశారందరూ.

    రంగనాధం చితికి నిప్పంటించగా ఒకే చితిమీద ఇద్దరి శవాలు బూడిద అయ్యాయి.

    అంతిమ సంస్కారం జరిగిన అయిదారు రోజుల తరువాత, సౌదామిని కొడుకు వికాస్ చంద్రను తీసుకొని సౌదామిని అన్నదమ్ములు వచ్చారు.

    అక్క , బావ ఉత్సాహంగా వేటకని అడవికి వెళ్ళిన వాళ్ళు దుండగుల చేతిలో పడి దారుణమైన హత్యకు గురి అయ్యారని ఇక్కడికి వచ్చాకగాని వివరాలతో తెలియలేదు వాళ్ళకు. తెలిశాక వికాస్ ను ఇక్కడ విడిచి వెళ్ళడం క్షేమం కాదన్న నిర్ణయానికి వచ్చారు అన్నదమ్ములు.

    ఆరోజు దశ దినకర్మ.

    ఏర్పాట్లన్నీ ధర్మలింగం చేతులమీదుగానే జరిగిపోతున్నాయి.

    రాజ్యలక్ష్మి, ఆమె కొడుకు తప్ప రావలసిన బంధువులంతా వచ్చారు. దాయాది ఉదయకాంతారావు కూడా వచ్చాడు. కర్మ వికాస్ చేత చేయించడం చూసి తన అభ్యంతరాన్ని తీవ్రస్వరంతో తెలియజేశాడు.  "ఇతడి తల్లిని మా అన్నగారు ఉంచుకున్నారు. వాళ్ళిద్దరికీ పెళ్ళి జరుగలేదని ప్రపంచమంతా తెలుసు. ఇతడు వాళ్ళిద్దరి అక్రమ సంతానం. అక్రమ సంతానానికి కర్మచేసే అధికారం ఏ శాస్త్రంలోనైనా వుందేమో వెదికి చెప్పండి అవధానిగారూ!"

    "కర్మ చేసే అధికారం అక్రమ సంతానానికి ఉండదు. దీనికోసం శాస్త్రం వెదకాలా?" ధృడమైన స్వరంతో అన్నాడు అవధాని.

    వికాస్ ముఖం పాలిపోగా తలదించుకు కూర్చున్నాడు.

    అతడి మేనమామల ముఖాలు అవమానంతో జేవురించాయి.
 
    ఉదయకాంతారావు ముఖంలో విజయహాసం మెరిసింది.

    మిగతా బంధువులు ఊపిరి బిగపట్టుకొని చూస్తున్నారు! ఇప్పుడు ఏం జరుగుతుందా అని!

    మోహనవంశీ సౌదామినితో కలిసి వుంటున్నాడని తప్ప వాళ్ళిద్దరికీ పెళ్ళి జరిగినట్టు చాలా మందికి తెలియదు. వాళ్ళ తప్పేం లేదు. పెళ్ళి అన్నది మోహనవంశీ ఆత్మతృప్తికోసం ఓ గుళ్ళో క్లుప్తంగా జరిగింది ముగ్గురు నలుగురు సాక్షుల సమక్షంలో ఆ ముగ్గురు నలుగురిలో ధర్మలింగం తప్ప అందరూ కాలధర్మం చేశారు. సౌదామినికి పెళ్ళయిన గుర్తులేవీ ఆమె ఒంటిమీద ఎవరూ చూడలేదు! ఒక్కోసారి ఆమె ముఖానికి బొ్ట్టుపకూడా వుండేది కాదు! ఎందుకంటే ఆమెకు సంప్రదాయాలన్నా సెంటిమెంట్స్ అన్నా తగని చిరాకు.

    అందరూ ఊపిరి బిగబట్టుకొని చూస్తున్న సమయంలో ధర్మలింగం కంఠం దృఢంగా ఖంగుమని పలికింది. "వికాస్ బాబు అక్రమసంతానం కాదు. సక్రమ సంతానమే. సౌదామిని దేవికి, రాజా మోహనవంశీకి సింగపట్నం గుడిలో వివాహం జరిగింది"

    "పెళ్లి పత్రికలు వేశారా? పెళ్ళికి వచ్చిన బంధుమిత్రులెవరు?" ఎగతాళిగా అడిగాడు ఉదయకాంతారావు.

    "పెళ్ళికి పత్రికలు వేయలేదు. బంధుమిత్రులెవర్నీ పిలువలేదు. అలాంటి తతంగాలు. ఆర్భాటాలు సౌదామినీ దేవికి నచ్చేదికాదు. అందుకే గుడిలో క్లుప్తంగా వివాహం చేసుకున్నారు మోహనవంశీ గారు."

    "చాలించు కట్టు కథ! వాళ్ళిద్దరికీ పెళ్ళి జరుగలేదు." ఉగ్రస్వరంతో అరిచాడు ఉదయకాంతారావు  "ఆమెను తెచ్చి ఇంట్లో పెట్టాడన్న దుఃఖంతోటే వదిన రాజ్యలక్ష్మీ దేవి ఇల్లు విడిచిపోయింది."

    "కట్టు కథ కాదు. ఆ పెళ్ళి ఏర్పాట్లు నా చేతులమీదుగానే జరిగాయి. ఈ నారాయణావధాని తండ్రి రామావధానిగారు ఆ పెళ్ళికి పౌరోహిత్యం వహించారు. ఆయన జీవించిలేరు సాక్ష్యం చెప్పడానికి. ప్రస్తుతం మీ కళ్ళెదుటున్నాను ప్రధానమైన సాక్షిని!" అన్నాడు ధర్మలింగం.

 Previous Page Next Page