Previous Page Next Page 
నిషా పేజి 7

                    "ప్రతివాదివీ నువ్వే, సాక్షివీ నువ్వే అయితే నీ వాదానికి విలువేమీ ఉండదు!"    


                "సాక్ష్యం చూపిస్తేనే వాళ్ళ పెళ్ళిని ఒప్పుకొందురుగాని" శాంతంగా అన్నాడు  ధర్మలింగం.  "వికాస్ బాబూ, మీ అమ్మగారి గదిలో ఇరవయ్యేళ్ళనాటి ఆల్బం ఒకటి ఉంటుంది. వెదికి పట్టుకురండి!"

    మేనమామ జయరాజ్ వెంటరాగా వికాస్ లేచి లోపలికి వెళ్ళాడు.

    ఆ పిల్లవాడి భవిష్యత్తు ఆ ఫోటోమీద ఆధారపడివుంది అనుకొన్నారంతా.

    పావుగంట తరువాత ఒక ఆల్బంతో తిరిగివచ్చాడు వికాస్.

    ధర్మలింగం చేతికి తీసుకుని ఆల్బం త్రిప్పేయసాగాడు.

    "ఇదిగో.......మీ మమ్మీ పెళ్ళి ఫోటో!"

    సౌదామిని మెడలో మోహనవంశీ మాంగల్యం కడుతున్నప్పుడు తీసిన ఫోటో అది!

    ఆ ఫోటో తీస్తున్నప్పుడుగాని, ఆ పెళ్ళి జరుగుతున్నప్పుడుగాని భవిష్యత్తులో తన కొడుకును ఓ ఘోర అవమానం నుండి అది రక్షిస్తుందని ఎంతమాత్రం అనుకొని ఉండదు సౌదామిని.
 
    ఆ ఫోటో ఉదయకాంతారావు, మిగతా బంధువులు చూడడం పూర్తి అయ్యాక తిరిగి లోపల పెట్టమని ఆల్బమ్ వికాస్ చేతికిచ్చాడు ధర్మలింగం.

    ఆస్తి కబళించాలని వేచి ఉన్న ఉదయకాంతారావుకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది! వికాస్ ముఖంమీద అందరి బంధువుల ఎదుట అక్రమసంతానమన్న బురదచల్లి అతడు సిగ్గుతో, అవమానంతో పారిపోయేలా చేయాలనుకున్న పథకం తలక్రిందులైపోయింది. వాళ్ళిద్దరికీ పెళ్ళి అయిందనికానీ, తన పథకానికి గొడ్డలివ్రేటులా ఆ ఫోటో ఉందనికాని తెలియదు. తెలిస్తే వాళ్ళ చావులకంటే ముందే ఆ ఫోటో మాయం చేయించేవాడు.

    ఇంతదూరం వచ్చి, ఇంత కష్టపడి ఈ ఎస్టేట్ ను వదిలేసుకోవలసిందేనా?

    ఇంతదూరం వచ్చి వట్టి చేతుల్తో వెనుదిరిగేది లేదు. ఈ బచ్చాగాడిని లేపేయడం తనకో లెఖ్ఖ కాదు. వాడిని లేపేస్తే లైన్ క్లియర్! రాజ్యలక్ష్మి కొడుకు  'నేనున్నా'నని వస్తాడా.........  'మీ తండ్రినీ, తమ్ముడినీ వెదుకుతూ వెళ్ళు నాయనా' అని పంపించేస్తాడు వాడిని కూడా.

    దశ దినకర్మ పూర్తికాకముందే ఉదయకాంతారావు వెళ్ళిపోయాడు.

    ప్రస్తుతం అతడు పిల్లిలా తోకముడుచుకు పోయినా, అతడు మాటువేసిన పులి అని, అతడివల్ల ముందుముందు ఈ వంశోద్ధారకులకు ముప్పు రాబోతున్నదని ఎవరూ గుర్తుంచకపోయినా ధర్మలింగం గుర్తించాడు.

    రాజదంపతుల కర్మకాండ ముగిసింది.

    అన్నదానం, బ్రాహ్మణ సంతర్పణ అన్నీ భారీగా జరిగాయి.

    బంధుమిత్రులు ఎక్కడి వాళ్ళక్కడకు వెళ్ళిపోయారు.

    ఆరోజు సాయంత్రం ధర్మలింగంతో చెప్పాడు జయరాజ్  "సిటీకి ఎవరినైనా పంపి ప్లేన్ టికెట్లు మూడు తెప్పించి పెట్టండి, ధర్మలింగం గారూ! ఈరోజు తేదీ ఏడు కదా? పదో తేదీన వెళ్ళిపోతాం!"

    "మూడు టిక్కెట్లా? మీతో వికాస్ బాబు కూడా వస్తున్నాడా?" విభ్రాంతిగా అడిగాడు ధర్మలింగం.

    "వికీని తీసుకొనే వెడుతున్నాం!"

    "ఉదయకాంతారావు చాలా రోజులుగా ఈ ఎస్టేట్ మీద కన్నేసి ఉంచాడు. దశ దినకర్మరోజు ఆయన చేసిన రాద్దాంతం అందుకోసమే. ఈ పరిస్థితిలో మీరు చినబాబును ఇక్కడినుంచి తీసికెళ్ళిపోతే ఎలా? చినబాబును తీసికెళ్ళడమంటే మీ అక్కగారి ఎస్టేట్ ను దాయాదికి కావాలని అందించి వెళ్ళినట్టేననుకోండి!"

    "ఇక్కడ విడిచివెడితే వికీని మృత్యువుకు అప్పగించి వెళ్ళినట్టే అవుతుంది కదా!"

    "ఎందుకని మీరలా అనుకొంటున్నారు?"

    "అక్కా, బావ హత్య చేయబడ్డారు. హత్యకు వేరే కారణాలేం కనిపించడం లేదు! ఎవరో ఈ ఎస్టేట్ మీద కన్నేయడం వల్లనే ఈ దుర్ఘటన సంభవించింది. అక్కా బావను చంపినవాళ్ళు వికీని మాత్రం వదిలిపెడతారా?"

    "ఆ ప్రమాదం ఉన్నమాట నిజమే. కాని, ప్రమాదముందని. ప్రాణభయముందని ఆస్తిపాస్తులను వదులుకొని, జన్మభూమిని వదులుకొని పారిపోతారా? పిరికితనమేనా మీరు మీ మేనల్లుడికి నేర్పుతున్నది?" చురుగ్గా అడిగాడు ధర్మలింగం.

    "వాడెంతవాడని హంతకులకు ఎదురునిలిచి వీరోచితంగా పోరాడమని చెప్పేది? ఇరవయ్యేళ్ళొచ్చినా బొత్తిగా లౌక్యం తెలియనివాడు. తన చదువేమో, తన పెయింటింగ్స్ ఏమో అన్నట్టుగా తనదైన  ప్రపంచంలో బ్రతుకుతున్న అమాయకుణ్ణి హఠాత్తుగా తీసుకువచ్చి పులిబోను తెరిచి అందులో పడేస్తామంటే ఎలా? పెద్ద ఎస్టేట్. నిజమే! ఎంత పెద్దదయినా ప్రాణం తరువాతదే కదండీ ధర్మలింగంగారూ?" అడిగాడు జయరాజ్.

    పెద్ద మేనమామ విజయ్ రాజ్ అందుకొన్నాడు.  "మాకున్నది ఒకే ఒక్క ఆడపిల్ల - మా అక్క ఆమె పోయింది. ఆమె గుర్తుగా మేం వికీని చూసుకొంటాం. ఎట్టి పరిస్థితిల్లోనూ మేం వాడిని పోగొట్టుకోలేం. ఆస్తిదేముంది? నాకు పిల్లలు లేరు. అన్నయ్యకు ఒక్కతే కూతురు - రాగిణి! రాగిణినిచ్చి వివాహం జరిపితే మా ఇద్దరి ఆస్తీ వికీదే అవుతుంది. ఒక మాజీ సంస్థానాధీశుడి ఆస్తి కాకపోయినా మాదీ అంత తక్కువేంకాదు."

    ధర్మలింగం గంభీరంగా అన్నాడు. "ఎక్కువ తక్కువ సమస్య కాదు. ప్రాణంకంటే ఆస్తీ ఐశ్వర్యమూ ముఖ్యం కాదు. ఆ సంగతి నేనొప్పుకొంటాను, విజయ్ బాబూ, కాని, వంశమర్యాద ముందు, ముఖ్యంగా కన్నతల్లి మర్యాదముందు ఏ కొడుకు ప్రాణమూ ముఖ్యమైంది కాదు. కన్నతల్లి మర్యాద కాపాడలేని కొడుకు జీవించీ నిరర్ధకమే. ఈ ఆస్తిని తృణప్రాయంగా త్యజించి చినబాబు వెళ్ళిపోతే, దాయాదులు అతడిని అక్రమసంతానమని ప్రచారంచేసి ఈ ఆస్తిని ఆక్రమించుకొంటారు. వికీబాబు తాను అపనింద భరించడానికి సిద్దపడినా కన్నతల్లి కళంకినిగా ప్రపంచం ముందు నిలబడాల్సి వస్తుంది. అందుకని, మీరు ఈ వారసత్వం కాదనుకొని వెళ్ళడం సబబుకాదు.

 Previous Page Next Page