మోహనవంశీకి గుర్తు వచ్చింది.
తన చదువు పూర్తిచేసుకొని వచ్చిన క్రొత్తలో, ఒకరోజు ఆ శిలాఫలకాన్ని చూడడం తటస్థించింది. దానిమీదున్న లిపి ఏ భాషకో చెందినది. అది ఏమిటో తెలుసుకోవాలన్న కుతూహలం రేగింది. పురాతత్వశాఖలో పనిచేస్తూ ఎన్నోభాషలు, లిపులు తెలిసిన తన స్నేహితుడొకాయన్ని తీసుకువచ్చి చూపాడు. అది చదివి తన మిత్రుడు చెప్పాడు అందులోని విషయం. అది ఒక నిధికి సంబంధించిన శిలాఫలకం. ఆ ధ్వజస్తంభానికి అంబువేటు దూరంలో అపారమైన నిధి భూస్థాపితమై వుందట!
అంబువేటు దూరం అంటే ఆ మిత్రుడు చెప్పలేకపోయాడు. కొందరు పండితుల్ని పిలిచి అడిగాడు. వాళ్ళూ చెప్పలేకపోయారు. ఆ ధ్వజస్తంభానికి ఎటువైపు నిధి వున్నదీ చెప్పలేకపోయారు.
అపారమైన నిధి వుందని శిలాఫలకం మీది రాత ఆశగొల్పుతూంటే నిర్లిప్తంగా ఊరుకోలేకపోయాడు మోహనవంశీ. గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఆ చుట్టుప్రక్కలంతా త్రవ్వకాలు జరిపిస్తే ఉన్నదేదో బయటపడక ఎక్కడికి పోతుంది అన్న నిర్ణయానికి వచ్చి, త్రవ్వకపు పనికి మనుషుల్ని పంపమని మేనేజరు ధర్మలింగానికి ఆదేశమిచ్చాడు.
అప్పటికి మోహనవంశీ తల్లి బ్రతికేవుంది.
"అది ఏ ముదనష్టపు సంపదో, ఎంతమందిని ఉసురుపెట్టి సంపాదించిందో, దానిమీద ఏ శక్తులు కాపలా కూర్చున్నాయో, ముదనష్టపు సంపదకు ఆశపడితే వున్నది ఊడ్చుకుపోతుంది. మీ నాన్నగారు కూడా ఆ నిధికోసం ప్రయత్నించారు. మొదట గునపం నేలకు తాకించిన వాడు తాకించినట్టుగా రక్తంకక్కి నేలకి ఒరిగాడట. త్రవ్వకపు పనికి వచ్చిన వాళ్ళంతా పారిపోయారట. ఇంకా ప్రయత్నం విరమించుకొన్నారు మీ నాన్నగారు! నువ్వూ అలాంటి తెలివి తక్కువ పనిచేసి ప్రాణానికే ముప్పుతెచ్చుకోకు! ఆ నిధిని పొందాల్సి వున్నవాళ్ళకు తనంత తాను లభ్యమౌతుందని చెప్పేవారు మా అత్తగారు! పొందాల్సినవాడు మన వంశంలోనే పుట్టొచ్చు! ఇంకే వంశంలోనైనా పుట్టొచ్చు! నువ్వు మాత్రం ఆ నిధికి ఆశపడి ఎదురుదెబ్బతినకు!"
తల్లి హెచ్చరికను లెక్క చేయకపోవునేమోగాని, ఆ రాత్రి విచిత్రమైన కలపడింది మోహనవంశీకి. ఎర్రటి కళ్ళు., నల్లటి భయానక రూపం కలిగిన స్త్రీ ఒకతె మీది మీదికి వచ్చి తన పొడుగాటి గోళ్ళతో మోహనవంశీ మెడని చీల్చబోతుంటే భయంగా మెలకువ వచ్చిందతడికి!
ఆ కల గురించి తల్లికి చెబితే "నిధి గురించిన ఆలోచన ఇప్పటికైనా మానుకో!" అని సలహా ఇచ్చింది.
అంతే! నిధి గురించిన ఆలోచన మరి మనసులోకి రానివ్వలేదు!
అదే విషయం రంజిత్ కి చెప్పాడు మోహనవంశీ.
"అది మా ముత్తాత దాచిన నిధో, ఏ నిధో తెలియదు. ఆ శిలాఫలకంలో మాత్రం ఇలా ఉంది.
దానితో తృప్తిపడలేదు రంజిత్. నిధి రహస్యం సూటిగా చెప్పకుండా మెలికపెట్టి చెబుతావేంరా? నిధి పాతకోటలో వుంది! ఎక్కడ ఉందో కూడా నీకు తెలుసు!"
"తెలియదు! నాకు తెలియదు!"
"పరశూ! వీడికి గోళ్ళూడగొట్టండిరా! అప్పుడయితే రహస్యం తిన్నగా బయటికి వస్తుంది."
పదునైన చాకుతో మోహనవంశీ గోళ్ళు చీల్చే కార్యక్రమం మొదలైంది!
విలవిల్లాడిపోయాడు మోహనవంశీ.
అతడినుంచి నిధి రహస్యం రాబట్టడాన్కి పెట్టాల్సిన చిత్రహింసలన్నీ పెడుతున్నారు.
కాల్చడం, కత్తితో ఎక్కడపడితే అక్కడ గాట్లు పెట్టడం.......
తను యవ్వనంలో అనుభవించిన విలాసవంతమైన జీవితానికి తనను భూలోకంలోనే శిక్షించడానికి యముడు దూతల్ని పంపించాడా అనిపించింది.
బాధ! భరించలేని బాధ! అరవాలనిపిస్తోంది గొంతుచించుకొని, కాని అహం అడ్డువస్తోంది. పళ్ళు గిట్టకరిచి అనుభవిస్తున్నాడు. భరిస్తున్నాడు.
"నాకు తెలియని రహస్యం మీకెలా చెప్పను? నన్నెందుకిలా బాధిస్తున్నారు?" నిస్సహాయంగా అన్నాడు.
"ఆ కాగడా తీసి కళ్ళమీద పెట్టండిరా!"
కాగడా పట్టుకొన్నవాడు ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుంటే సౌదామిని భయవిహ్వలయై పెద్దగా అరవబోయింది! కాని, ఆ అరుపు బయటికి రాకముందే ఆమెలోని ప్రాణవాయువు ఆరిపోయింది. తెరిచిననోరు తెరిచినట్టుగా ఉండిపోయింది! భీతావహాంగా చూస్తున్న కళ్ళు చూస్తున్నట్టుగా నిలిచిపోయాయి.
మాంసం కమిలిన వాసన గుప్పుమంది. రెండు కళ్ళూ కాలిపోయాయి!
అప్పుడు పెట్టాడు పెడబొబ్బలు మోహనవంశీ. అడవి అంతా మార్మోగాయి కాని, పరిగెత్తుకురావడానికి దరిదాపుల్లో మనుష్యులే లేరు!
"అరవకుండా నిధి రహస్యం కక్కు" రంజిత్ దుడ్డుకర్రతో మోహనవంశీ తలమీద బాదాడు.
దానిమ్మపండులా విచ్చిపోయింది తల. రక్తపుమడుగులో విలవిల్లాడిన శరీరం కాస్సేపటిలోనే చైతన్యం కోల్పోయింది! సౌదామినితో కలిసి అతని ఆత్మ ఎగిరిపోయింది.
అప్పుడు తూర్పురేకలు విచ్చుకొంటున్నాయి.
* * *