Previous Page Next Page 
తులసి పేజి 5

    ఈసారి పైకప్పు వెతకటం మొదలు పెట్టాడు. చూరుకింద, తాటాకుల మధ్యా వెతికాడు. ఏమీ దొరకలేదు.

    ఉన్నట్టుండి అతడు ఆగిపోయేడు.

    ఎవరో తనని గమనిస్తున్న భావన. అతడు నెమ్మదిగా ఊపిరి పీల్చుకున్నాడు. మళ్ళీ వెతకసాగాడు.

    దక్షిణం వైపు చూరుకి అడ్డంగా వున్న తాటాకు తొలగించేడు. అక్కడ కనబడింది చిన్న తాటాకుల కట్ట, చప్పున చేత్తో బయటకు లాగాడు. అదే అతడు చేసిన తప్పు. ఆ ఊపుకి కాగితాలు నుసినుసిగా రాలిపోయాయి. నాలుగు సంవత్సరాల్నుంచి ఆ చూరులో శిధిలమైన కాగితాలు......

    అతడు మోకాళ్ళ మీద వంగొని ఒక్కొక్క కాగితమే వెతకసాగేడు. చిన్న చిన్న ముక్కలుగా మిగిలిపోయిన కాగితాలు. సున్నితంగా వాటిని ఒక్కొక్క దానినే వేరుచేస్తూ కావాల్సిన దానికోసం చదవసాగేడు. అన్నీఒరియాలోనే వున్న కాగితాలు. అయిదు నిమిషాల తర్వాత దొరికింది ఒక కాగితం -అది తెలుగులో వుంది.

    అతడికి తెలుగురాదు. ఆ కాగితం వైపే చూస్తున్నాడు. అతడి మనసు చెబుతున్నది. ఆ కాగితమే కావల్సింది అనీ. కానీ దాన్ని బయటకు తీసుకువెళ్ళడానికి వీల్లేదు. గాలికి నుసినుసి అయిపోతుంది. మడత పెట్టడానికి కూడా వీల్లేదు.

    అతడో క్షమం ఆలోచించి, ఆ కాగితాన్ని అక్కడే వుంచి - లేచేడు పైన చిన్న రాయి వుంచి - లేచేడు బయటకు రావడానికి ఉద్యుక్తుడై వెనుదిరిగి గుమ్మం దగ్గిర నిలబడ్డ వ్యక్తిని చూసి స్థాణువైపోయాడు.

    అక్కడ విషాచి నిలబడి వున్నాడు.

    దార్కాని చూసి చిరునవ్వుతో అడుగు ముందుకేసి "సెహభాష్ దార్కా! నా అంచనా తప్పుకాలేదు. అప్పుడూ కాలేదు. ఇప్పుడూ కాలేదు" అన్నాడు. దార్కా మాట్లాడలేదు. విషాచి దగ్గరకొచ్చి అన్నాడు.

    "కాద్రా మరణించిన రోజు రాత్రే నేను ఈ పాకంతా వెతికేను. ఈ ఉత్తరం దొరికింది నాకు. సాయంత్రం నీకు ఏమీ దొరకలేదు అని ఎందుకు చెప్పానో తెలుసా -"

    దార్కా తెలీదన్నట్టు తలూపేడు.

    "ఇంక ఇక్కడ పనిలేదు. పోదాం పద."

    ఇద్దరూ బయటకు నడిచారు. రాత్రి పన్నెండున్నర కావొస్తూంది. ఎముకల్ని కొరికే చలి.

    ఇద్దరూ నడుస్తుంటే విషాచి చెప్పడం మొదలు పెట్టాడు.

    "కాద్రాని చంపిన వాళ్ళమీద పగతీర్చుకోవటం కోసం నిన్ను ఎన్నుకున్నాను దార్కా. నా అంచనా తప్పు కాలేదని నువ్వు నిరూపించావు. చాలా తొందర తొందరగా విద్యలన్నీ నేర్చుకున్నావు. కానీ ఒక్క అనుమాత్రం మాత్రం నాకు మిగిలిపోయింది. నేనెంత కసితో, పగతో రగిలి పోతున్నానో, అంత పట్టుదలా నీకూ వుందా లేదా అని.....

    అందుకే ఈ రోజు రాత్రి నీకు ఈ పాక పరిశోధన గురించి చెప్పాను. నిజంగా నీకు నా కున్నంత పగవుంటే -ఈ రాత్రి నువ్వు నిద్రపోవు. ఆ పాకను నువ్వు స్వయంగా శోధిస్తే తప్ప నీకు నిద్ర పట్టదు. నా అంచనా నిజమైంది. రాత్రంతా దాని గురించే ఆలోచిస్తూ వచ్చాను.

    దార్కా! ఒక్క విషయం చెప్తాను విను. మాంత్రికుడికి కావాల్సింది పట్టుదల. ఎటువంటి పరిస్థితుల్లోనూ అతడు నిరాశ చెందకూడదు. ప్రేతాత్మలు సరదాగా అతడ్ని ఏడిపిస్తూ వుంటాయి. క్షుద్ర దేవతలు పరీక్షిస్తూవుంటారు. వీటన్నింటికి తట్టుకొని నిలబడి వుండగలగాలి.... ఆ ఉత్తరం నాలుగు సంవత్సరాల క్రితం మరింత జీవంతో వుంది. అప్పుడే చదివాను దాన్ని. కానీ దురదృష్టవశాత్తు అందులో నా కెక్కువ సమాచారం దొరకలేదు. సంతకం పెట్టిన తల్లి అన్న పదాన్ని వదిలిపెట్టు. కాద్రా కాష్మోరాని ప్రయోగించింది తులసి అనే పాపమీద. ఆ పాప ఆంద్ర దేశంలో వుంటుంది అంతే. అంతకన్నా ఎక్కువ తెలీదు. ఇప్పుడు చెప్పు దార్కా - ఎలా -ఎలా -ఆ ముగ్గుర్నీ పట్టుకోవడం?"

    నడుస్తున్న దార్కా ఆగాడు. అతడితోపాటు కదుల్తూన్న ప్రకృతి కూడా ఆగినట్టుది. అతడి కంఠం ట్రాన్స్ లో వున్నట్టూ వినిపించింది.

    "ఆ ముగ్గుర్నీ పట్టుకోవాలి అంటే ముందు తులసి ఎక్కడున్నదో కనుక్కోవాలి."

    "ఎలా? ఆంధ్రదేశంలో ఆ పేరు మీద ఎంతమంది వుండివుంటారు?"

    "ఉండరు" దార్కా కంఠం స్థిరంగా పలికింది. "తులసి అన్న పేరు మీద ఎక్కువమంది వుండి వుండరు. వెతకాలి. ఒక్కోవూరు వెతుక్కుంటూ జల్లెడతో గాలించాలి. అంగుళం అంగుళం శోధించాలి."

    విషాచి సాలోచనగా అతన్ని చూస్తూ ఇంకో ప్రశ్న వేశాడు. "కానీ నీకు దొరికిన తులసే మనకు కావాల్సిన తులసి అని నమ్మకం ఏమిటి.. ఎలా దాన్ని ధృవపర్చుకోవడం?"

    మొట్టమొదటిసారి దార్కా పెదవులు నవ్వుతో విచ్చుకున్నాయి.

    "నీకు తెలియకనే అడుగుతున్నావా విషాచీ"

    "నిజంగా తెలీదు దార్కా -ఈ సమస్యకు పరిష్కారం తెలియకే నాలుగు సంవత్సరాలనుంచీ కొట్టుకుంటున్నా. ఏ ఆధారంతో తులసిని పట్టుకుంటావ్?"

    దార్కా పెదవులమీద నవ్వు ఆగిపోయింది. కళ్ళు మామూలుగా మారిపోయినయ్. అవే కళ్ళు పులి కుందేలు మీదకు పంజా విసరబోయే ముందు సాగించే నిస్తేజమైన చూపు.

    "ఏ ఆధారంతో పట్టుకుంటావ్ దార్కా" ఆలస్యం భరించలేనట్టు అడిగేడు విషాచి. దార్కా నడుము గుడ్డలోంచి శిధిలమైన బొమ్మ తీసేడు. దాని మధ్యగా కట్టబడిన వెంట్రుక లాగి, "ఈ వెంట్రుక సాయంతో" అన్నాడు.

    విషాచి నిర్విణ్ణుడై "వెంట్రుక సాయంతోనా -ఎలా?" అన్నాడు.

    "నా గురువైన విషాచీ, నిజంగా నీకు తెలియకనే అడుగుతున్నావా చెబ్తా విను. వెతగ్గా వెతగ్గా నాకు దొరికిన తులసి మనకి కావల్సిన తులసో కాదో చెప్పాలంటే -ఆ దొరికిన తులసికి చేతబడి చెయ్యాలి. ఆ తులసి ఇప్పటికే పదహారేళ్ళ వయసు వున్న అమ్మాయి అయివుంటుంది. అలాటి కన్నెపిల్లలకి ఎవరైనా చేతబడి చేయాలంటే -వాళ్ళ రక్తపు గుడ్డను బొమ్మకు చుట్టి - వాళ్ల తాలుకా ఒక వస్తువును బొమ్మతో కలిపి భూమిలో పాతి పెట్టాలి. నేనన్న ఆ వస్తువు ఈ 'వెంట్రుక' నేను సంపాదించిన రక్తపు గుడ్డా ఈ వస్తువు ఒకే అమ్మాయివి అయన పక్షంలో..... దార్కా నవ్వేడు. "అలా పాతిపెట్టిన పదిరోజుల్లో ఆ తులసికి నెలలు ఆగిపోతాయి. పొత్తికడుపులో నొప్పితో చేతబడి ప్రారంభం అవుతుంది. ఆ తులసే మనకు కావాల్సిన తులసి. ఆ తరువాత ఆ ముగ్గురు ఎవరో తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. ఒకవేళ ఆ తులసి మనకు కావాల్సిన అమ్మాయి కాకపోతే భద్రంగా బొమ్మని తవ్వి తీయాలి. ఆ వెంట్రుకతో మళ్ళీ వెతకడం ప్రారంభించాలి. ఇంకో తులసి పేరున్న అమ్మాయి దొరికే వరకూ అలా వెతుకుతూనే వుండాలి........"

 Previous Page Next Page