"అచ్చు విజయశాంతిలా వున్నారు. మీ ఇద్దరికీ ఏమీ తేడాలేదు. చూడగానే మిమ్ములను కావేరి అని అనుకోరు. ఆకాశంలో నుంచి దిగి వచ్చిన అప్సరసను అనుకుంటారు. మరో యాంగిల్ లో చూస్తే సూపర్ స్టార్ జయసుధలాగా వున్నారు. మీరే కనుక సినిమా హీరోయిన్ అయితే జయప్రద-జయసుధ, విజయశాంతి, సుహాసిని, శ్రీదేవి లాంటి అందాలతారలందరూ పారిపోవలసిందే!"
"నిజంగానా నాగులూ!"
"ఇందాక మీరు నా గురించి ఎంత నిజం చెప్పారు? నేనూ అంతకంటే ఎక్కువ నిజం చెప్పుతున్నాను. అసలు నన్ను అందరూ చిరంజీవిలాగానే వుంటావంటారు. మీరు కూడా అలాగే అన్నారు. నా మాట అబద్దం అయితే మీరు జయసుధ నటించిన సినిమా ధర్మాత్ముడు చూస్తే మీకే తెలియగలదు."
"ఆ సినిమా మీ హాలుకి వస్తుందా?"
"ఆ మధ్య ధర్మాత్ముడు సినిమా తేవాలని చూశారు మా యజమాని! కాని ధర ఎక్కువ చెప్పటంతో మరో బొమ్మ తెచ్చాం."
"నీకూ తెలుసా? ఏసినిమా ఎంత ఖరీదు గలదో?"
"ఆఁ నేర్చుకున్నానమ్మాయిగారూ! మా సినిమాహాల్లో పనిచేసే, అదేనండీ, సినిమా రీలు వేసి చూపించే అతనికి ఇంగ్లీషు బాగా వచ్చుననుకుంటాను!....ఆయన మాట్లాడే వన్నీ నేను నేర్చుకుంటున్నాను!"
కావేరి సమాధానం చెప్పాలనుకుంటూ వుండగానే ఊరు మొగదల వచ్చేయటంతో మౌనం వహించింది. కొంత దూరం వెళ్ళిన తరువాత-
"సినిమా పాటల పుస్తకాలు పంపించుతావు కదూ?" అనడిగింది ఆగి.
"మరిచి పోలేనుగా ఈ సారి తప్పకుండా పంపించుతాను."
ఇంకా ఆ తరువాత నాగులు సైకిల్ తొక్కుకుంటూ గూడెంవైపుకి వెళ్ళిపోయాడు. కావేరి నాగులు మాటలు నెమరు వేసుకుంటూ ఇంటికి వచ్చింది. అప్పటి వరకూ మరిచిపోయిన నెప్పి తల్లిని చూడటంతోనే గుర్తుకు వచ్చింది. అప్పటికప్పుడు పొట్టమీద చేతులుంచుకుని నెప్పి నప్పి అని అంటే తల్లి నమ్మదని, ఆ బాధ నంతటినీ ముఖంలో చూపించుతూ గదిలోకి వెళ్ళి పుస్తకాలు గూటిలో వుంచి విసురుగా మంచం మీద బోర్లా పడుకున్నది.
"ఏమయిందే కావేరీ!" అక్కడికి వచ్చి అడిగింది సుభద్రమ్మ.
"కడుపులో నెప్పిగా వుందమ్మా! స్కూలులో కూర్చోలేక పోయాను...మాష్టారుని అడిగి వచ్చేశాను." బాధ నటించుతూ అంది.
"అంత దూరం ఈ బాధతో ఎలా నడిచావే? పోనీ స్కూలులోనే ఓ మూల పడుకోక పోయావా?"
తల్లి అమాయకత్వానికి నవ్వు వచ్చింది కావేరికి.
"స్కూలులో అలా పడుకోనివ్వరు. అది మన ఇల్లు అనుకుంటున్నావా?" ఇంకా సుభద్రమ్మ ఏం మాట్లాడలేదు. ఆ తరువాత కావేరిని నఖశిఖ పర్యంతం పరిశీలించి అంది.
"మిరియాల కషాయం త్రాగితే సాయంత్రానికి తగ్గి పోతుంది!"
"మా మాష్టారు కూడా అలాగే అన్నారు. త్వరగా ఇవ్వు అమ్మా! నెప్పి భరించలేకపోతున్నా... అబ్బా!.... అమ్మా!....ఈ మాయదారి నెప్పి నాకే రావాలా? నడిచి వస్తుంటే ఎంత బాధ గలిగిందో?"
కావేరి పడే బాధకి ఆ తల్లి మనసు విల విలలాడింది__కషాయం తీసుకు వచ్చేటందుకు వంట ఇంటిలోకి వెళ్ళింది.
హమ్మయ్యా! తల్లిని బాగానే నమ్మించ గలిగాను. సినిమాలో కూడా ఇంతేగా! ఆ సీను ప్రకారం యాక్టు చేయగలరు. ఆ తరువాత మామూలుగా అయిపోతారు! తను బాగానే నటించగలదు, ఫరవాలేదు. అని సంతృప్తి పడింది. తల్లి కషాయం పోసుకుని తెస్తున్న కంచు గ్లాసుని చూడగానే కోమటి కొట్లో ఉప్పుకొలిచే వెదురుగడతో తయారుచేసిన శేఠు గుర్తుకు వచ్చింది. ఇప్పుడు ఆ కషాయమంతా త్రాగితేనే గాని తల్లి వదిలి పెట్టదు. అంత కషాయం త్రాగాలంటే ఎంత బాధ?....అందుకుని నిద్రపోతున్నట్లు గట్టిగా కళ్ళు మూసుకుని పక్కకి తిరిగి పడుకున్నది.
"కావేరీ....!కావేరీ__!"
తట్టి లేపినా లేవలేదు! ముక్కుతూ మూలుగుతూ అలాగే వుండిపోయింది కావాలనే.
"నిద్ర పట్టినట్టున్నది! పిచ్చి మొద్దు రెండవ ఆట సినిమాకి వెళ్ళటం నడిచి వెళ్ళి నడిచి రావటం! అర్దరాత్రి వరకూ సరిపోయింది పోనీ ఇంటికి వచ్చాక పడుకున్నదా? అంటే అదీ లేదు! చదువుకుంటూ కూర్చున్నది."
అంటూ తల్లి వెళ్ళి పోవటంతో ఈసారి మరింత అద్భుతంగా నటించాననే అనుకుని మురిసిపోయింది కావేరి. కొంతసేపున్న తరువాత తల్లి ఆ చుట్టుప్రక్కల లేదనుకుని నిర్ధారించుకుని ఆ కంచు గ్లాసులోని కషాయాన్ని కిటికీలోనుంచి బైటికి పారబోసి తిరిగి ఆ గ్లాసుని మంచం క్రింద వుంచి తిరిగి కళ్ళు మూసుకున్నది.
"అన్ని మైళ్ళు నడిచి వెళ్ళిరావటం అంటే మాటలా? ఏం చదువులు? ఏం లోకము? కడుపులో నెప్పేం ఖర్మ? కాళ్ళూ నడుం కూడా నెప్పి పెడతాయి! ఎందుకొచ్చిన చదువులు? పెళ్ళి చేసేస్తే పోలా?" ఆ అంటున్నది కామాక్షి అత్తయ్య అని యిట్టే కంఠస్వరాన్ని బట్టి గ్రహించింది కావేరి!
"చెప్పితే విన్నదా?....నాలుగురోజులు పస్తులున్నది....దానికి వంత పాడాడు నీ కొడుకు!...."చదివించండి!" అని మాకు నచ్చచెప్పాడు...ఎలాగూ యిప్పటినుంచీ యింట్లో కూర్చుంటే కారేరికి మాత్రం ఏం తోస్తుంది? ఎలాగూ శంకరం అన్నయ్య చదువు అవ్వాలి! అప్పుడు అన్నయ్యకి పెళ్ళి....ఆ తరువాతనేగా నా పెళ్ళి! అందుకు ఆలస్యంపడుతుంది....చదివించమన్నాడు వినాయకం! దానిముందే అలా అంటే యింకేమనగలం? వప్పుకోక తప్పలేదు!"
సమయానుకూలంగా ఆడబిడ్డముందు మనసులోని భావాన్ని వినాయకం అన్న మాటలూ చెప్పేసి ముఖభావాలు ఎలా వుంటాయోనని క్రీ గంట పరిశీలించసాగింది సుభద్రమ్మ.
"అంటాడు!....ఎందుకు అనడు?....సలహాలు బాగానే ఇస్తాడు. పెద్దాడికి చదువు అవ్వాలి! ఉద్యోగం రావాలి! అప్పుడు చేసుకుంటానన్నాడు..అంతవరకూ తను పెళ్ళి చేసుకోకుండా వుంటానన్నాడా మా వినాయకం!..." అనడిగింది కామాక్షమ్మ.
"తనన్న మాటలు అంతేకదా వదినా!"
సమయానుకూలంగా మాటలు వదలటంలో సుభద్రమ్మ సిద్దహస్తురాలు! మేనల్లుడికి యిష్టమే! కాని ఆడబిడ్డ అభిప్రాయం ఎలా వుంటుందో తెలుసుకోవాలంటే యిదొక మార్గం సమయానికి లభించింది!
ఆ మాటలతో కామాక్షి ముఖంలో మార్పులు కలిగాయి...తనను సంప్రదించకుండాను....అసలు తను కావేరిని కోడలిగా చేసుకుంటానని అనలేదు!...తనంతట తానే నిర్ణయించుకున్న కొడుకుమీద కోపం వచ్చింది.... అప్పుడిహ ఏమన్నా బాగోదని చెప్పి మౌనంగా యివతలకి వచ్చేసింది.
పోనీలే! మేనత్తకి యిష్టంలేదు! తన పెళ్ళి వినాయకం బావతో జరక్కపోతేనే ఎంతోమంచిది!....తను సినిమా హీరోయిన్ అయిపోవచ్చును!....అఖిలాంధ్ర ప్రేక్షకులు తను గ్లామర్ హీరోయిన్ గా నివాళులు అర్పించాలి! అభిమానసంఘాలు వెలవాలి!...తను నటించిన అన్ని సినిమాలూ శతదినోత్సవం, రజితోత్సవం చేసుకోవాలి! అప్పటికిగాని తన ప్రతిభ యిలాంటి పల్లెటూరి గబ్బిలాయిలాంటి మేనత్తకి తల్లికి ఏం తెలుస్తుంది? వాళ్ళకి తెలిసింది ఒక్కటే! ఈడు వచ్చిన ఆడపిల్లకి పెళ్ళి చేయటమే! కోపంగా అనుకుంది కావేరి!
తల్లిగాని, మేనత్తగాని యింక ఆ గదిలోకి రారనుకుని మంచం మీదనుంచి లేచి వెళ్ళి తన పుస్తకాల మధ్యలో దాచిన తన ఫోటోలని తెచ్చుకుని తిరిగివచ్చి మంచంమీద పడుకున్నది. తల్లి ఎప్పుడు వస్తే అప్పుడు ఆ ఫోటోలను తలగడక్రింద దాచి వేయాలనుకున్నది...తన ఫోటోలను అటుయిటు తిప్పి చూసుకుంటూ వుండగా నాగులు అన్న మాటలు గుర్తుకు వచ్చాయి కావేరికి!
"అచ్చు విజయశాంతిలా వున్నారు....మీ యిద్దరికీ ఏమీ తేడా లేదు! చూడగానే మిమ్ములను కావేరి అని అనుకోరు! ఆకాశంలో నుంచి దిగి వచ్చిన అప్సరస అనుకుంటారు! మరో యాంగిల్ లో చూస్తే మరో యాంగిల్ లో చూస్తే సూపర్ స్టార్ జయసుధలాగా వున్నారు. మీరే కనుక సినిమా హీరోయిన్ అయితే జయప్రద-జయసుధ, విజయశాంతి, సుహాసిని, శ్రీదేవి లాంటి అందాలతారలందరూ పారిపోవలసిందే!"
తను ఏ సినిమాతారకంటే తీసిపోయింది? కాలం కలిసివస్తే తను పెద్దతార అయిపోవాలి! అవ్వాలంటే తను ఈ పల్లెటూరిలో వుంటే ఎలా వీలవుతుంది? తను ఏదో మార్గం ఆలోచించాలి! లేకపోతే తన కోరిక తీరదు! ఏం చేస్తే తను కథానాయకి అవగలదు? ఆ ఫోటోలను గుండెలకు అదుముకుంటూ ఆలోచించుకుంటున్నది!
"అత్తయ్యా! కావేరి యింకా స్కూలునుంచి రాలేదా?"
బైట వినాయకరావు మాటలు విని ఫోటోలను తలగడక్రింద వుంచి గట్టిగా కళ్ళు మూసుకుని గోడవైపుకి తిరిగి పడుకుంది.
"గదిలో పడుకున్నది. స్కూలునుంచి అప్పుడే వచ్చేసింది....కడుపులో నెప్పిగా వుందని!" అని మేనల్లుడు గదిలోకి వెళ్ళటానికి అన్నట్లుగా గడపలోనుంచి పక్కకి తప్పుకున్నది సుభద్రమ్మ.
"ఎలావుంది కావేరీ!" అనడిగాడు కొంచెంగా ముందుకు వంగి.