Previous Page Next Page 
కావేరి పేజి 5

   

    నిజంగా ఇప్పుడు కావేరికనుక అరిచినా, కేకలువేసినా అందరూ బిలబిలమంటూవచ్చి తన ఇంటితలుపులు బద్దలుకొట్టటం ఖాయం. అప్పుడు తన పరువుకాస్తా బజారున పడటమేకాక, ఇంకా ఈ పరిసరాలలో తలెత్తుకుని తిరగగలిగే అవకాశం వుండదు.

    ఆ భయంవలననే కావేరిని వదిలేసి గబగబా మరో పుస్తకంలో వున్న కావేరి ఫోటోలుతీసి ఇచ్చాడు.

    "పోయి బయటికివెళ్ళి చూసుకో!"

    కావేరి తలెత్తి మాస్టారివేపుకి చూసింది అలా అనేసరికి.

    ముఖాన, మెడమీద పట్టినచెమటను తుడుచుకుంటూ కావేరిచూపులు తనమీదనే వుండటంచూసి మరలా అన్నాడు.

    "నువ్విలా నా ఇంటికి వంటరిగావచ్చావని ఎవరికయినా చెప్పావంటే నిన్నే తిడతారు అందరూను! ఆడపిల్లవు కదా? నీకేనష్టం! ఇటునుంచి ఇటు వెళ్ళిపో."

    "అలాగే మాష్టారూ? నేనెవరికీ చెప్పను. మీరూ చెప్పవద్దు! ఇంకేమయినా ఫోటోలువుంటే ఇచ్చేయండి! మరలామరలా రావటం వీలవదు అంది నవ్వుతూ!

    "దీనికింకా ఏమీ తెలిసినట్టులేదు! అదే ఇంకో ఆడపిల్లయినట్లయితే ఈ సరికి యింకా యింకా అనేది! వట్టిమొద్దు. ఫోటోల పిచ్చితప్పితే ఇంకో పిచ్చిలేదు! ముందు దీన్ని బయటికి పంపిస్తేనేగాని వీలులేదు" అనుకుని గబగబా విడిచేసిన షర్టు వేసుకుని__

    "పద పద!" అన్నాడు.

    ఫోటోలు చూసుకుంటున్న సంబరంలోవున్న కావేరికి ఆ మాటలోని కాఠిన్యం అర్ధమయింది. తను ఇంటికి వస్తానంటే ఎంతో సంబరపడిపోయిన మాష్టారు ఇప్పుడు వెళ్ళేవరకు అంత కసురుకుంటున్నాడేమిటి? అసలు ఆ చెమట్లు ఏమిటి? ఎందుకలా రొప్పుతున్నాడు? అయినా తన ఫోటోలు ఇక్కడ చూసుకోవటం ఏమిటి? ఇంటికివెళ్ళి తాపీగా చూసుకుంటే బాగుంటుంది! అనుకుంటూ ఫోటోలను పుస్తకాలమధ్యలో పెట్టుకుని గబగబా బయటికి వచ్చేసింది. ఇంకా ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా రోడ్లు దాటుకుని తన ఊరువెళ్ళే బాటలోకి వచ్చింది. కొంతదూరం వేగంగా నడిచి నడిచి ఓ చెట్టుక్రింద నిలబడి ఎవరూ అటుఇటు రావటంలేదని నిర్ధారించుకున్న తరువాత పుస్తకాల మధ్యలోనుంచి తన ఫోటోలుతీసి చూసుకుంది. ఒకసారికాదు పదిసార్లు! మూడే మూడు ఫోటోలు మూడు భంగిమలలో వున్నాయి. తను ఎంత బాగా నటించింది? ఫోటో తీస్తున్నారనికూడా తను అటూ చూడలేదు! తనకి తెలియకుండానే తన ఫోటోలు తీసినప్పటికీ వెలుతురు తనమీదకి పడేసరికి తను అటూ చూసింది. డ్రాయింగ్ మాష్టారు కెమెరా సర్దుకుంటూ తనవైపుకిచూసి నవ్వాడు.

    కేవలం ఆడపిల్ల ఫోటోలు మాత్రమే తీస్తాడన్న ప్రతీతి వున్నది ఆ డ్రాయింగ్ మాస్టారికి. అలా ఎందుకు తీస్తుంటాడో? అప్పుడు ఆ ఫోటోలు తెచ్చుకుని చూసి మురిసిపోతుంటే ఆ అమ్మాయిలవైపు జెలసీగా చూసేది తను! తనను ఫోటోలు తీసిన ఉద్దేశ్యంకూడా అదే! పాపం! తనవల్ల వంటినిండా చెమట్లు తప్పలాభం కలుగలేదు ఆ మాస్టారుకి! నవ్వుకుంది కావేరి. దూరంలో సైకిల్ బెల్ వినిపించేసరికి ఉలిక్కిపడి చేతిలోని ఫోటోలను గబగబా మధ్యలో దాచేసి అటూ చూసింది.

    దగ్గరకు వచ్చిన తరువాత చూసి సైకిల్ ఆపి క్రిందకి దిగాడు.

    "మీరండీ అమ్మాయిగారూ! ఎవరో అనుకున్నాను. ఇక్కడ వున్నారేమిటండీ? యిస్కూలుకి వెళుతున్నారా!" అనడిగాడు.

    "వంట్లో బాగోక వెళ్ళివస్తున్నాను. నువ్వేమిటి ఇలా వచ్చావు? అరే! కొత్తబట్టలు వేసుకున్నావే. నీకీడ్రస్ బాగున్నది నాగులూ! అభిలాషలో చిరంజీవి అచ్చు ఇలాంటి డ్రస్సే వేశాడు. నువ్వసలు అచ్చు చిరంజీవిలాగానే వున్నావురా!" అంది.

    "నిజమా అమ్మాయిగారూ!" నమ్మకం కుదరక అడిగాడు.

    "నేనెప్పుదయినా అబద్దం చెప్పానట్రా? నువ్వు మన దొడ్లో గేదెలకి కుడితిపెడుతూ, గడ్డివేస్తూ పాడేపాటలువిని ఏమనేదాన్నో గుర్తుందా నీకు?"

    "ఆఁ అచ్చు యస్ పి.బాలసుబ్రహ్మణ్యంలాగా పాడుతున్నానని అనేవారు అమ్మాయిగారు?"

    "నువ్వు సినిమా హాలులో ఉద్యోగం చేస్తానంటే అందరూ తిట్టారు తక్కువ జీతం అని!....తిడితే తిట్టారు. నువ్వు మాత్రం ఆ ఉద్యోగం వదలవద్దు! అందులోని మెళుకువలన్నీ తెలుసుకుంటే రేపు నువ్వు సినిమా హాలు కట్టవచ్చును. లేదా సినిమాలే స్వంతంగా తీయవచ్చును. అని ప్రోత్సహించింది ఎవర్రా?"

    "మీరే కదా అమ్మాయిగారూ! అందుకేగా మా అయ్యా అమ్మా ఎన్ని తిట్టినా నేను వచ్చి ఆ ఉద్యోగంలో చేరాను!"

    "మరి అన్ని విధాలుగా నిన్ను ప్రోత్సహించిన దాన్ని నేనయినప్పుడు నీ విషయంలో అబద్దం చెపుతానా?.... నువ్వసలు అద్దంలో చూసుకోలేదనుకుంటాను! నువ్వు అచ్చంగా చిరంజీవిలాగానే వున్నావు."

    ఎంతపని జరిగిపోయింది. కొత్త బట్టలు వేసుకున్న తరువాత అద్దంలో చూసుకోవాలని తోచక పోవటంతో నిజంగానే నాగులుకి ఎంతో బాధ కలిగి నెత్తి మీద మొట్టుకున్నాడు.

    "అరే! అదేమిట్రా నాగులూ! అలా తలమీద కొట్టుకుంటావెందుకు? ఏం జరిగింది యిప్పుడు?" అర్ధం కాక అడిగింది.
    "అదేనండి అమ్మాయిగారూ! అద్దంలో చూసుకోలేదన్నదే నా బాధ!"

    "ఇప్పుడు మీ యింటికి వెళుతున్నావుగా? వెళ్ళి అద్దంలో చూసుకో."

    "మా గుడిసెలో అద్దం పెంకు తప్ప అద్దం వుండదు అమ్మాయిగారూ."

    "పోనీ మా యింటికి రా! అద్దంయిస్తాను. చూసుకుందువు గాని. అన్నట్టు సినిమా పాటల పుస్తకాలు, వాల్ పోస్టర్లు తెచ్చావా?"

    "బజారునుంచి వచ్చేశానమ్మాయిగారూ. మీ కోసమని దాచి వుంచాను నా గదిలో. ఈ సారి మరిచిపోకుండా తీసుకువస్తానుగా అమ్మాయిగారూ! తప్పకుండా తెస్తాను.."

    అంతవరకూ ఉత్సాహంగా కబుర్లు చెప్పిన కావేరికి ఏమీ తెలీదని చెప్పగానే కోపం వచ్చింది.

    "పోనీలేరా? నువ్వు తెచ్చి పెట్టకపోతే ఏమిటిలే? నా దగ్గిర ఎన్నో ఫోటోలు వున్నాయి...మా డ్రాయింగ్ మాష్టారు నేనుస్కూలు నాటకాల్లో వేసినప్పుడు తీశారుగా? నీకసలు చూపించనే చూపించను" బుంగమూతి పెట్టుకుని ముందుకి సాగింది కావేరి.

    "నా మాట నమ్మండి అమ్మాయిగారూ! నిజంగానే హడావుడిలో మరిచిపోయాను. తిరిగి నేను మ్యాటినీ షోకి అందుకోవాలన్న తొందరలో వచ్చేశాను__నా మీద నమ్మకం లేకపోతే ఒక పని చేస్తాను. మనూరి వాళ్ళు ఎవరయినా సినిమాకి వస్తే వారికిచ్చి పంపించుతానుగా! అప్పుడు మీరే అనుకుంటారు అమ్మాయిగారూ! ఈ నాగులు అబద్దం ఆడడు ....అమ్మాయిగారంటే ఎంతో గౌరవం అని!"

    కావేరికి నవ్వు వచ్చింది నాగులు మాటలకి! ఆ డైలాగు కూడా చిరంజీవి నటించిన సినిమాలోనిదే అయివుంటాయి అనుకుంది.

    "అమ్మాయిగారూ! మీ ఫోటోలు ఒక్కసారి చూపించారూ? నా గురించి మీరు చెప్పారు. మరి మీ గురించి నేను చెప్పవద్దా?"

    నాగులు అలా అనేసరికి చటుక్కున పుస్తకాలలోనుంచి తన ఫోటోలు తీసి యిచ్చింది కావేరి! సైకిల్ ని తన నడుంకి ఆనించుకుని ఎడమ చేతితో కళ్ళజోడుని పైకి తోసుకుని మరీ చూశాడు. అటు యిటు ఏంగిల్సు పెట్టుకుని మరీ చూశాడు. కళ్ళజోడు తీసి మరి చూశాడు....చూసి చూసి అన్నాడు.

 Previous Page Next Page