"ఏం సూర్యా!ఎలా నమ్మాలి ఈ సన్యాసి మాటలు అనుకుంటున్నావా?"
"కలలో తప్ప, నేను చంద్రరేఖని చూడలేదు స్వామీ! ఒకసారి ఆమెను చూడాలని వుంది. చూపిస్తారా?"
"నేను చూపించడం దేనికి? నీ ఎదురుగా కిటికీలోనే వుంది చూడు! ఏమ్మా చంద్రరేఖా! కన్పించకుండా వేధిస్తున్నావు కదా అతడివి? ఇప్పుడు కన్పించు! నిన్ను చూడాలనుకుంటున్నాడు. అలా కళ్లెర్రజేయకు, శాంత పడు!" మాట కాదు, ఆజ్ఞలు ధ్వనించింది ఆయన కంఠం.
కుతూహలంతో చూసాడు సూర్య. అంతవరకూ శూన్యంగా వున్న కిటికీలో కన్పించింది. అదీ కన్నుమూసి తెరిచేంతలో మాయమైపోయింది. ఆ మబ్బుతునక మాయమవుతుంటే, కిటికీ రెక్కలు టపటప కొట్టుకున్నాయి. ఆ శబ్దం అందరూ విన్నారు. కిటికీ రెక్కలు టపటప కొట్టుకోవడం అందరూ చూశారు. అందరి శరీరాలు మీద రోమాలు నిక్కబొడుచుకున్నాయి.
మబ్బుతునక సూర్య ఒక్కడికే కనిపించింది.
దేశికాచారి అక్కడే వున్నాడు. ఆయనకూడా చూడలేకపోయాడు.
చిరునవ్వుతో అడిగారు ఆత్మానందులు -
"చూశావా! చంద్రలేఖని?"
"ఆమె రూపం కనిపించలేదు. ఒక మబ్బు తునక... అదీ కదిలిపోయే మబ్బుతునకలా కనిపించింది."
"ఆత్మ .. అదే ప్రేతాత్మ. ... దానికొక రూపం ఏమున్నది? ఏ రూపమైనా ధరించగలదు. ఏ రూపం లేకుండానూ వుండగలదు."
"ఆ ఆత్మ మీ సమక్షానికి వచ్చేధైర్యం ఎలా చేయగలిగింది స్వామీ? వచ్చినదాన్ని ఎందుకు వదిలిపెట్టారు? అతడిని ఇకముందు బాధించకుండా భస్మీపటలం చేయలేకపోయారా?" అన్నాడు దేశికాచారి.
'ఆమెకింకా కర్మ విమోచనం కాలేదు. భస్మీపటలం ఎలా చేయగలను చెప్పు? వాయోగశక్తి కొంత ఖర్చుపెట్టి భస్మం చేయగలను. కానీ ఏమిటి లాభం చెప్పు?
ఆమెకి మళ్లీ జన్మ, అకాలమరణం, మళ్లీ ప్రేతరూపం. ఈ ప్రేతత్వం నుండి విముక్తి పొందడానికి ఇంకొంతకాలం పడుతుంది. తరువాత ఆమె జన్మ ఎత్తి చక్కని జీవితం గడుపగలదు.'
"అంతవరకూ ఆమె ఇతడిని పీడిస్తూ వుండాల్సిందేనా?"
"ఇతడూ కర్మపీడితుడని చెప్పానుకదా! అతడు నన్నీవిధంగా కల్సుకోవడం వృధా పోదు" అంటూ ఆత్మానందులు కుడిచేత్తో సూర్య శరీరాన్ని నిమురుతున్నట్లుగా తాకారు.
ఆ తాకడం గాంధారి కొడుకును తాకి వజ్ర శరీరుడిగా మారుస్తున్నట్లుగా వుంది.
"చంద్రలేఖ ఇక నిన్ను తాకలేదు. కానీ ఆమె నీమీద మరో విధముగా దెబ్బతీసే అవకాశం లేకపోలేదు. నిన్ను తాకకుండా చేశానన్న కోపముతో ఆమె మరింత రెచ్చిపోయే అవకాశం వుంది."
"మరి ఎలాగ స్వామీ?"
"ప్రతిసారీ ఎవరో వచ్చి నిన్ను రక్షించలేరు. నిన్ను నువ్వే రక్షించుకోవాలి. నీ ఆత్మశక్తిని జాగృతపర్చు, నువ్వు ఎక్కువగా శ్రమించే పనిలేదు. గతజన్మలో గొప్ప సాధకుడివి. గొప్ప శక్తి నిక్షిప్తమై వుంది. నీలో. శక్తిపూజ చేసి శక్తినే నీ స్వాధీనంలోకి తెచ్చుకున్నావు. కొద్దిగా శ్రమిస్తే, నీ శక్తి నీ కవతతమవుతుంది.
ఎల్లుండి రాత్రి నదీగర్బాన నీకు మంత్రోపదేశం చేస్తాను మండలం రోజులు దీక్షకి కూర్చో. మంత్రసిద్ది పొందావా- - నువ్వే ఒక ఆట ఆడించగలవు చంద్రలేఖను."
"నిధి గురించి విన్నప్పటినుండి నా మనసు నిధి గురించే ఆలోచిస్తున్నది స్వామీ సామాన్య మానవుడిని. ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. ఆ గుహలో ఇంకా వుందా? ఎవరయినా తీసుకెళ్లారా?" మారుతి అడిగాడు ఆపుకోలేని కుతూహలంతో.
"ఆ నిధిని ముట్టలేవు నాయనా!"
"కాపలాగా కేతకి లేదుగా?"
"కాపలాగా కేతకి లేదు. కానీ నిధి నిక్షేపాలను దుష్టశక్తులు ఆవరించి వుంటాయి. ఆ నిధిని ఆశించిన వాళ్ళు ప్రాణాలే పోగొట్టుకోవలసి వస్తుంది. నిధి వ్యామోహం మంచిదికాదు మారుతీ!"
అక్కడ కూర్చున్న భక్తుల్లో ఒకాయన లేచి అన్నాడు -
ఈ దేశంలో ఆకలికి అలమటించే జనాలకి కొదవలేదు. కోట్లాది రూపాయలు విలువచేసే ధనం ఆ గుహలో పడివుండటంవలన లాభమేమిటి, దాన్ని బయటికితెచ్చి పేదవాళ్లను పంచటంవలన ఆ ధనానికి ఒక సార్దకత ఏర్పడుతుంది కదా! మీవంటి యోగులు అందుకు పూనుకోవచ్చుకదా!"
"చాలా చక్కగా సెలవిచ్చావు నాయనా! మన చుట్టూ ఆకలికి అలమటించే జనాలకి తక్కువేమీలేదు. కానీ మనం సుష్టుగా తినే అన్నం లోనే పట్టెడన్నం తీసి బీదవాడికి పెట్టగలిగే సదాలోచన వుంటే, దేశంలో ఆకలికి అలమటించేవాళ్లు వుండరనే నా నమ్మకం. తనకు కావాల్సిన దాని కంటే ఎక్కువ పోగేసుకునే దురలవాటును ప్రతి ఒక్కరూ దూరం చేసుకోగలిగితే, అసలీ దేశంలో పేదతనమే వుండదుకదా! పరిమితికి లోబడి తీసుకున్న ఆహారం శరీరానికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే పరిమితికి లోబడిన సంపాదన మనిషికి నైతిక బలాన్నిస్తుంది. ..." చిరునవ్వుతో సెలవిచ్చారు ఆత్మానందులు.
"సంసారం అన్న విషవలయంలో చిక్కుకున్నవాళ్లం. మాకంత సదాలోచన కలగదు స్వామీ. మనిషికి డబ్బు ప్రాణవాయువు లాంటిది. డబ్బు లేకపోతే ఊపిరే ఆగిపోతుంది."
"మనిషికి ఏదోనాటికి మరణం తధ్యమేకదా! మరణం తరవాత ఈ ప్రపంచంలో వుండడు. వెంట ఈ డబ్బు రాదు. అప్పుడు ప్రాణవాయువు తను చేసుకున్న సత్కర్మలే. దుష్కర్మలు చేస్తే పాపలోకాలకీ, సక్తర్మలుచేస్తే పుణ్యలోకాలకీ తీసుకెళతాయి. మరణం తరువాత" మనం ఏమిటి?" అని ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోగలిగితే, మనిషికి ప్రాణవాయువు, డబ్బు అని చెప్పలేవు. మనిషికి డబ్బే ముఖ్యమని చెప్పలేవు."
"మాయాపాశంతో చుట్టబడిన ఈ మనసు మరణం తరువాత ఏమిటన్న ప్రశ్న వేసుకోనివ్వదు స్వామీ!"
"కానీ, సాధుసత్సంగంలో తరచూ ఆధ్యాత్మిక సంబంధమైన చర్చలలో పాల్గొనటంవల్ల ఆ మాయాపాశం బలహీనపడి కట్లుత్రెంచుకోవచ్చు నాయనా! ముందు నీకు 'కట్లు తెంచుకోవాలి' అన్న సంకల్పం కలగాలి కదా! తరువాత అది ధ్యేయం కావాలి. సాధన అదే ప్రారంభమవుతుంది."
సూర్య ఆ సంభాషణల్లో పాలుపంచుకోకపోయినా, ఆసక్తిగా వింటున్నాడు.
ఇంతసేపటికి అతడు కల్పించుకుంటూ అన్నాడు -
"డబ్బుంటే చాలా మంచి పనులు చేయవచ్చునని నాకూ అనిపిస్తుంది స్వామీ! నాకెన్నో కలలున్నాయి. పెద్ద హాస్పిటల్ కట్టాలనీ, ఏ రోగానికయినా చికిత్స జరిగేలా సదుపాయాలు కల్పించాలనీ, అది దేశంలోనే పెద్ద హాస్పిటల్ గా పేరు పొందాలనీ, అక్కడ బీద రోగులకు ఉచితంగా వైద్య సేవ లందించాలనీ... కానీ డబ్బు లేకపోవడంవల్ల నా కల నిజం చేసుకోలేకపోతున్నాను, నాన్నగారు నన్ను ఊరికి దూరంగా వుంచి చదివించారు. ఆయన ఎన్నో ఇబ్బందులు పడుతుకూడా నేను అడిగినట్టల్లా డబ్బు పంపించి 'మేం జమిందారులం,మాకేం తక్కువ?' అన్న భ్రమలో వుంచారు. చదువు పూర్తిచేసుకుని నేనిక్కడి వచ్చేసరికి వాస్తవం నా కళ్లెదుట నిలబడింది.
ఒక్కసారిగా జీవితం తలకిందులైనట్లు అనిపించింది. మామూలు పంచికట్టు వైద్యుడిలా నా జీవితం కొనసాగుతోంది ప్రస్తుతం. పెద్ద పెదద్ హాస్పిటల్స్ నుంచి ఉద్యోగం ఇస్తామని మంచి ఆఫర్లు వచ్చినా, వెళ్లలేక పోయాను. నాన్నగారిని చూసుకుంటూ ఇక్కడే వుండాలనిపించింది. మీరు చెప్పిన గుహ గురించి మేం ఇంతకుముందే విన్నాం. ఒకసారి ఆపుకోలేక అక్కడికి వెళ్లివచ్చాం కూడా. కానీ మాకది మామూలు కొండగానే అనిపించింది. అందులో గుహ వుండటం ధనం వుండటం, అందుకు సంబంధించిన కథలు వట్టి ట్రాష్ అనిపించింది. నిజంగా అక్కడ అపారమైన నిధి నిక్షేపాలు వుండటమే నిజమైతే, అది తెచ్చి దేశంలోకాదు - ప్రపంచం లోనే అత్యున్నతమైన హాస్పిటల్ నిర్మాణం చేపట్టవచ్చుకదా? ఇంత మంచి ప్రజోపయోగకరమైన పని చేయాలనుకున్నప్పుడు ఆ నిధి మీద ఆశపడితే తప్పేమిటి?"
"నిస్వార్దమైన నీ ఆలోచన మంచిదే. పదిమందికి ఉపయోగపడే పని అంటే నీకు సాపడాలనిపిస్తుంది. మంచి మనసుతో నువ్వు కనే ఆ కల నిజం కావాలని ఆశీర్వదిస్తున్నాను."
"అయితే ఆ నిధి రహస్యం చెప్పండి స్వామీ!"
'నిధి రహస్యాలు బహిరంగపరచరాదు. ఏకాంతంలో చెబుతాను. కానీ గుప్త నిధుల జోలికి వెళ్ళకపోవటమే మంచిది. ఎన్నో మారణ హోమాలు, రక్తపాతాలూ, కాంతా కనకాల కోసమే జరిగాయి కదా!'
* * * * * *
నిండు పున్నమి.....
పండువెన్నెల...
నిండుగా ప్రవహిస్తున్న ఏరు వెన్నెల్లో జరజరా ప్రాకిపోయే గోధుమవన్నె త్రాచులా వుంది.
ఆ నిశ్శబ్దంలో ఏటి మోతు ప్రకృతి పాడుతున్న అధ్బుత సంగీతంలా వుంది.
గ్రహణం పట్టడానికి ముందే చాలామంది వచ్చారు నదీ స్నానాలకి.
గ్రహణ సమయంలో మంత్ర జపానికి మంచి బిగువుంటుందని కొందరూ, మంత్రోపదేశానికి కొందరు వచ్చారు.
కనిపించని రాహుకేతువుల నోట చందమామ చిక్కాడు. క్రమంగా బింబం కరిగిపోసాగింది. వెన్నెల మసకబారింది.
ప్రకృతి తెల తెల్లచీర విడిచి, నల్లచీర కట్టుకున్నట్లుగా అయింది.
నదీగర్బంలో....
ఎదురుగా చిన్న గోచీ తప్ప ఆచ్చాదనేమీలేని ఆత్మానందులు!
బక్కపలుచగా వున్న ఆయన శరీరం, ఆ మసక వెన్నెల్లోనూ ఒక విధమైన కాంతితో వెలిగిపోతూంది. నిర్మలంగా చూస్తున్న ఆయన కళ్లు రెండు అఖండజ్యోతుల్లా వున్నాయి. సూర్య చెవి దగ్గర ఆయన పెదవులు గుసగుసలాడుతున్నట్లుగా మంత్రోపదేశం చేశాయి.
సూర్య శరీరంలో చిత్రంగా ఏవో తంత్రులు మీటినట్లుగా అయ్యాయి.