Previous Page Next Page 
ఛాలెంజ్ పేజి 3

   

  గత్యంతరంలేక చూపులు మరో వేపుకు మరల్చుకుంది.

    "ప్రమీలా!" నెమ్మదిగా పిలిచాడు రాజశేఖరం.

    "ఎస్సర్"

    "యూ ఆర్ వెరీ బ్యూటిఫుల్" తన్మయత్వంతో చూస్తూ అన్నాడు.

    ప్రమీల మరింత సిగ్గుపడింది.

    అప్పుడామె మరింత సౌందర్యంతో వెలిగిపోతున్నట్లనిపించిందతనికి.

    "మీరు పొగుడుతున్నారు" అందామె.

    "నోనోనో! అది ఇండియాలో, అమెరికాలో మాకు పొగడటం ఏమాత్రం అలవాటులేదు. నేను ఫాక్టే మాట్లాడతాను.... కావాలంటే పందెంకట్టు! నేను గెలిస్తే నువ్వు ఒక రూపాయ్ యివ్వాలి. నువ్వు గెలిస్తే నీకు నేను పదివేలిస్తాను సరేనా?"

    "వద్దు సార్! మీరే గెలుస్తారెలాగో"

    "అయితే వప్పుకో! నువ్వు అందగత్తెవి"

    ఆమె సిగ్గుపడింది అందంగా.

    ఇంతకాలం తను భ్రమలో వున్నాడు.

    అందం అంటే కేవలం అమెరికన్ గాళ్స్ లోనే వుంటుందనుకున్నాడు.

    కానీ ఇప్పుడు తెలుస్తోంది.

    'అందం' అంటే భారతదేశ స్త్రీలలోనే వుంది.

    అతనికి తన భార్య జూలియా గుర్తుకొచ్చింది.

    ఆమె గుర్తుకొచ్చేసరికి అతని మనసంతా అదోలా అయిపోయింది.

    తను జూలియాని పెళ్ళి చేసుకునే విషయంలో తొందరపడ్డాడు.

    కొంచెం తాపీగా ఆలోచించి వుంటే, ఇంకెంత కాలం జూలియాను అర్ధం చేసుకోడానికి ప్రయత్నించి వున్నట్లయితే, పరిస్థితి మరోలా వుండేదేమో.

    మిగతా అమెరికన్ అమ్మాయిల్లా కాకుండా జూలియా చాలా కామ్ గా, రిజర్వ్ డ్ గా వుండేది. అదే తనను ఆకర్షించింది.

    మొదటి పరిచయంలోనే ఆమెక్కూడా తనంటే ఆసక్తి కలిగింది.

    "ఓ! యూ ఆర్ ఫ్రమ్ ఇండియా!" అంది ఆసక్తితో.

    పార్టీ అయ్యేలోపల ఇద్దరూ చాలా విషయాలు మాట్లాడుకున్నారు.

    ఎంతో కాలంనుంచీ ఇద్దరికీ సన్నిహితత్వం వున్నట్లు ఫీలయ్యారు.

    ఒకరి ఫోన్ నెంబర్ ఒకరు తీసుకుని విడిపోయారు.

    రెండోసారి కలుసుకున్నప్పుడు ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు.

    జూలియా ఫిలాసఫీ చదివింది.

    అందుకే భారతదేశమంటే ఆసక్తి అని చెప్పింది.

    ఆ రోజు తన ఫ్లాట్ లో విందు యిచ్చాడామెకి.

    ఆ రాత్రి మంచు తుఫాను రావటంవల్ల తనింట్లోనే వుండిపోయిందామె.

    తెల్లవార్లూ ఇద్దరూ ప్రణయం జరిపారు.

    అప్పుడే తను ఆమెకు, మిగతా అమెరికన్ గాళ్స్ కీ తేడా కనిపెట్టాడు.

    మిగతావాళ్ళు సెక్స్ ని ఓ 'గేమ్'గా భావిస్తారు. తనూ అంతే!

    కానీ జూలియా సెక్స్ ని ఒక కమ్యూనికేషన్ గా భావించింది.

    అది తనకు నచ్చింది.

    అంతవరకూ తనకు సెక్స్ మీదున్న అభిప్రాయాల్ని జూలియా ఒక్కరాత్రిలో మార్చేసింది.

    ఆ క్షణంలోనే తను నిర్ణయం తీసుకున్నాడు-ఆమెనే పెళ్ళి చేసుకోవాలని.
 

 Previous Page Next Page