Previous Page Next Page 
స్వర్గసీమ పేజి 6

 తొలి పద్యం చదువుతూనే అతని మనస్సు తిరిగి ఆలోచన సముద్రంలో మునిగిపోయింది.
    పుస్తకం జారిపోయింది చేతుల్లోంచి.

   నిజంగా భార్యని భర్త ప్రేమించగలడు. కానీ భర్తని భార్య!
    అక్కడే వస్తోంది చిక్కు.
    భర్తని ప్రేమించే భార్య కోసం వెతకటం ప్రయాసేనా భార్యనించి ప్రేమని ఆశించటం తప్పేనా, కేవలం భార్యా, భర్త మధ్య ప్రేమ ఎప్పుడూ వన్ వే ట్రాఫిక్కేనా?
    అతని ఆలోచనలు యింకా ఎలా సాగేవో కానీ అంతలోనే కాఫీ తీసుకుని వచ్చింది శ్రీదేవి.
    పక్కనున్న స్టుల్ ని దగ్గరిగా లాగి కాఫీ కప్పుని పెడుతూ "తీసుకోండి" అంది.
    ఏమి అనకుండా కప్పు అందుకుని కాఫీ తాగేసి ఖాళి కప్పు తిరిగి స్టూల్ మీదే పెట్టాడు. తీసుకుని తిరిగి వెళ్ళిపోయింది మౌనంగా.
    చికాగ్గా కుర్చిలోంచి లేచిపచార్లు సాగించాడు.
    అతని మనసు పరిపరి విధాలా పోతోంది.
    "ఏమిటి యివిడ వుద్దేశం? అన్ని తన మాటలే! తన అజ్ఞలే! తన పట్టుదలే! తన పంతాలే! తనే బ్రతిమాలాలి. ప్రామిస్ చెయ్యాలి. రాజీకి వెళ్లాలి, తన అలవాట్లు మార్చుకోవాలి.
    అంతే తప్ప తన .....తన ......యిష్టం ఒక్కటయినా ఒక్కనాడయినా ఆవిడ అనుసరించదు, ఎప్పుడూ తనే.......
    "ఏమండీ!"
    పచార్లు చేస్తున్నవాడల్లా ఆగాడు. వంటింటి గడపలో నుంచుని పిలుస్తోందిఆవిడ.
    "ఇటు రండి"
    ఎందుకని ప్రశ్నించకుండా వెళ్ళేడు.
    చేతిలో నున్న వెండిగ్లాసుక్రింద పెడుతూ అడిగింది! "ఈ గ్లాసు తీసుకుని పక్కింటి బామ్మగారిని అడిగి ఓ గ్లాసుడు పాలు బదులు తీసుకుని రండి"
    "ఎందుకు" చికాగ్గా అడిగాడు. అతనికిలా పక్కిళ్ళలో బదుళ్ళు అవి అడగడం యిష్టం లేదు బొత్తిగా.
    "పరమాన్నం చేస్తున్నాను. అందుకని"
    "తెచ్చి తీరాలా?"
    లేకపోతే ఎలా?"
    ముఖం చిట్లిస్తూ అన్నాడు!" చూడు శ్రీదూ! ఇలా యిరుగిళ్ళకీ పోరుగిళ్ళకీ బదుళ్ళకీ నేను వెడుతుంటే అందరూ ఏమనుకుంటారు?"
    ఒక్క క్షణం ఆగి అన్నాడు మళ్ళీ "మగాడిని లోకువ జేసుకుని అడిస్తోందని అంటారు నిన్నే."
    ఫక్కున నవ్వేస్తూ అంది? ఏం ఫరవాలేదు. మిమ్మల్నేవరూ పత్నిభక్తులు అనరు గాని ముందు వెళ్లిరండి. అవసరం అన్నాక భార్యైనా భర్తనా చేసుకోవాలసిందే కదా?"
    విసుగ్గా అన్నాడు "అయినా నే వెళ్ళను, నీవు వెళ్ళ వద్దూ"
    కోపంగా అంది "అదేం యీ రోజు! మీరు వెళ్లకుంటే ఎలా? యిప్పుడు పాలు అవసరంగా కావాలి."
    "ఎలా ఏమిటి తీసి ప్రక్కన పడేయ్. అది లేకపోతే ముద్దదిగ పోదులే. అంత అవసరం అనుకునే దానివి దానిని ముందస్తుగా తీసి వుంచుకోవాలి"
    "ఆగండి, ఏమిటా దూకుడు. ఎందుకిలా చేస్తున్నారు. ఏమిటి మార్పు మీలో?"
    ధుమ ధుమ లాడుతూ అన్నాడు, "మార్పా? నాలోనా ఆలోచించి మాట్లాడుతున్నావా? నీవు మహారాణిలా వంటింట్లో కూర్చుని పనులు పురమాయిస్తుంటే చేయటానికి నేనేం నీ నౌకర్నా?"
    నివేరపోతూ అంది "ఏమిటది? నేను మహారాణినా ఆలోచించే మాట్లాడుతున్నారా?"
    ఒక్క నిమిషం ఆగింది. అంతలో కోపం కట్టలు తెంచుకుని వచ్చి తిక్కరేగి అంది "ఎవరికోసం అనుకున్నారు యిది మీ కోసం......మీకోసం ఇంత చచ్చి చెడి చేస్తుంటే ఒక్కసారి అలా బామ్మగారింటికి వెళ్ళి ఓ గ్లాసుడు పాలు తీసుకుని రావటానికి యిన్ని మాటలా? అసలు.....అసలు మీకు....మీకు.....కొంచెం అయినా కృతజ్ఞతవుందా? ఈ పాయసం ఎవరికోస మనుకున్నారు మీకోసం, మీ పుట్టినరోజు పండుగకోసం.....తెలుసా?"
    ఒక్క క్షణం నిర్ఘాంతపోయిఅన్నాడు. "అయినా సరే ఇహ నుంచి నేను యిలాంటి పనులు చేయను. అంతేగా ప్రేమతో నా పుట్టినరోజు పండుగ చేయాలనుకున్నదానివి ప్రొద్దున్నే పాలవాడినో, పాల వెంకమ్మనో అడిగి తీసుకోలేకపోయావా?"
    నిట్టూర్చి అంది "పోనిలెండి. ఈ రోజు మీ పుట్టినరోజు మిమ్మల్నేమీ అనదల్చుకోలేదు."
    మౌనంగా గ్లాసు తీసుకుని వంటింట్లోకి వెళ్ళి ఓ నిమిషం తర్వాత తిరిగి బామ్మగారింటికి వెళ్ళింది పాలకోసం.

                                                                 3
    మాధవ్ పుట్టినరోజు పండుగ వెళ్ళాక అయిదారు మాసాలు అలా యిలా గడిచిపోయాయి. అప్పుడప్పుడూ ఏదో చిలిపి కయ్యం వచ్చినా అట్టే సర్ధుకునిపోతున్నారిరువురూ.
    అసలు జీవితమే అంత, ఒక్కోరోజు విశేషాలు ఎన్నో జరుగుతాయ్. ఏ విశేషాలు లేకుండా జీవితంలో ఎన్నో సంవత్సరాలు గడిచి పోయినా పోతాయ్. ఎందుకంటే మాత్రం కారణం ఎవరూ చెప్పలేరు. అది అంతే!

    ఓ రోజు సాయంకాలం ఆఫీసునుంచి హడావుడిగా వచ్చాడు మాధవ్. ఆ రోజే జీతం వచ్చింది. రెండేళ్ళ నుంచి పెండింగ్ లో వున్న యింక్రిమెంట్స్ వచ్చాయి. పైగా ఆ నెలలో ఓవర్ డ్యూటీ చేయటం వల్ల ఎక్స్ ట్రా అవర్స్ కి యాబై పైగా వచ్చింది. ఇన్ని విశేషాలు జరగటంతో శ్రీదేవికి ఓ మంచి టెర్లిన్ చిర తీసుకుని వచ్చాడు ఉత్సాహంగా.
    "శ్రీదూ"
    ఇంట్లో ప్రవేశిస్తూనే ప్రేమగా పిలిచాడు శ్రీదేవిని, కాఫీ కాస్తున్నదల్లా వదిలేసి వచ్చింది.
    చేతిలోని పాకెట్ ని చూపుతూ ఊరిస్తూ అన్నాడు "ఇదేమిటో తెలుసా నీవు వూహించలేవు-- నాకు తెలుసు చెప్పనా- ఇది నీ కిష్టమయిన చీర-- టెర్లిన్ అందునా నీకు మరీ యిష్టమయిన నెమలి కంఠం రంగు."
    ఒక్కసారిగా వెయ్యి కాండిల్స్ బల్బు వెలిగినట్లై పొంగిపోతూ అంది "ఒక్క క్షణం ఆగండి"

 Previous Page Next Page