Previous Page Next Page 
స్వర్గసీమ పేజి 5

 

    అతని మాటల్ని మధ్యలోనే అడ్డుకుంటూ అంది "దివినించి దిగివచ్చిన దేవతవలె వచ్చింది మీ పాలికి. ఇహ ఇదేం అదేం అనుకుని అంతే చాలనుకుని ఆడదాని ముఖం ఎరగని వాడిలా ఆవిడ ప్రక్కనే కూర్చుని వెళ్లి అలాగే సినిమా చూసి వచ్చారు. పోనీ లెండి, ఏదో పాపం! అలసిపోయారు గానీ భోజనం కానిద్దురు పదండి"
    ఆవిడ చేతిని బలంగా నొక్కుతూ అన్నాడు "శ్రీ.....నన్ను నమ్మవా?"
    చేయి విడిపించుకుంటు అంది "నమ్మకమా? అదెందుకు?ఎక్కడుంది? అయినా సినిమాలో ఆవిడ ప్రక్క బుద్దిగా కూచున్నాను. కనీసం ఆమె చేయి కూడా అలా ముట్టుకోలేదు అని నమ్మించటానికేనా?"
    దీనంగా అన్నాడు మాధవ్" నాది నిజంగా తప్పే, కాదనను కానీ నాలో దోషం లేధంటున్నాను. నన్ను మన్నించమంటున్నాను. శ్రీ......ఇంక ఎందుకు దేప్పటం? ఇది నీకు భావ్యమేనా?"
    నిష్టురంగా అంది "ఆహా! భావ్యమే, మీరు మీ ఫ్రెండ్ సినిమాకి వెళుతుంటే హాయిగా కాఫీ టిఫిన్ యిచ్చి, టాటా చెప్పి వీడ్కోలు యిచ్చి ధియేటర్ నుంచి తిరిగి వచ్చాక మీ యిద్దరికే కర్పూర హారతి యిచ్చె విశాలహృదయం నాకు లేదు. నన్నే మయినా అనండి. నా భర్త నాకే కావాలి. నా వశవర్తే కావాలి. మరో ఆడది నా భర్తని స్పృశించటం కలలో కూడా అంగికరించను నేను. అలాంటిది నా ఎదురుగా ఒకే రిక్షాలో........"
    ఆ సన్నివేశం తలచుకునేసరికి ఆమెలో దుఃఖం పొంగి వచ్చింది. ఓడిపోతున్నాననుకుని రాబోయే ఏడుపుని నిగ్రహించుకుంటూ పెదవులు బిగపట్టుకుని మంచం మించి దుకేసినట్టుగా దిగి వంటింట్లోకి వెళ్ళి కళ్ళు వత్తుకుని మౌనంగా పిట వాల్చి పళ్ళెం పెట్టి అన్నీ వడ్డించ సాగింది.
    నివెరపోయిన మాధవ్ మౌనంగా ఆమెని అనుసరించి పిటపై కూర్చున్నాడు.
    వడ్డన అంతా ముగించి చేయి తొలుచుకుని నేయి తీసుకుని వచ్చింది.
    అతనింకా అపోసనమేపట్టలేదు.
    అతని కేసి చూసేసరికిదీనంగా ....బిక్క ముఖం వేసుకుని.......
    అయినా అభిమానం మాటాడనివలేదు. ఓ వేపు మనస్సు ద్రవించిపోతున్నా, నేయి గిన్నెవంచబోతున్నట్టుగా అతనివేపు చూసింది.
    రుద్ధ కంటంతో అన్నాడు "నిజంగా యీ తప్పుని మన్నించలేవా శ్రీ....." ఒక్క క్షణం ఆగి మళ్ళీ అన్నాడు లేవబోతూ "ఇహ ఈ భోజనం మాత్రం ఎందుకు?"

    అతన్ని ఆపుతూ అంది "భోజనంముందునుంచి అలా వెళ్ళకండి"
    ఎంతో ప్రేమ వుట్టిపడేట్టు ఆవిడ అన్న ఆ ఒక్కమాటా అతనిలో ఆశకి జీవం పోసింది. ఆబగా అన్నాడు. "మరయితే నన్ను క్షమించినట్టేనా?"
    గంభీరంగా అంది "క్షమించినట్టేకానీ ఒక్క షరతు."
    సంతోషంగా అన్నాడు "ఒక్కటేమిటి, ఎన్ని షరతులయినా సరే, సరే ముందా షరతేమిటో చెప్పు."
    తూచి తూచి అంది "ఇహ ముందు నుంచి మీరెప్పుడు ఎవరితో ఎలాటి పరిస్థితుల్లోనయినాయిలా ప్రవర్తించకూడదు ఇంట్లో తప్ప ఎక్కడా ఏమి తీసుకోరాదు. మనకేం తక్కువ చెప్పండి. ఎవరినుంచి ఎందుకైనా ఏ రూపంలోనయినా ప్రతిఫలం సికరించరాడు.
    ఇద్దరం కలిసి తప్ప ఏది ఒంటరిగా చేయరాదు."
    "సరే! సరే! అన్ని అంగికారమే. కానీ ఒక్క సందేహం స్నానం పాపం లాంటివి?"
    సిగ్గుగా అంది. "పొండి మీరెంత సిగ్గువిడిచినా యిలా అనొచ్చా."
    నవుతూ అపోసనం పట్టి అన్నం కలుపుకుంటూ అన్నాడు. "భార్య భర్తల మధ్య సిగ్గేమిటి? తొలిరోజే అది యిల్లు విడిచిపోతే."
    అతనేదో యింకా అనబోతుంటే "అబ్బ ఇహ వూరుకుందురు.......మీరూ మీ వ్యాక్యనాలు" అంది.
    ఇహ ఏమి అనకుండా భోజనం చేశాడు.
    ఎంత ప్రేమించుకుని అభిమానించుకునే భార్యా భార్తలయినా కాస్త మాటా వచ్చాక చివర రాజీపడినా కాస్త బెట్టుసరి వుండనే వుంటుంది.
    ఉదయం లేస్తూనే గతరాత్రి జరిగిందంతా గుర్తుకువచ్చి అలాగే మంచం పై పడుకుని ఎదురుగా నున్న రాధాకృష్ణులు పటం కేసి చూస్తూ వుండిపోయాడు మాధవ్ మనసు నిండా ఆలోచనలు ముసురుకుంటూ వుండగా.
    అప్పటికి ఉదయం ఏడుగంటలుదాటి వుంటుంది. ప్రాతర్మందా నిలాలు ఆగిపోయినా చల్లచల్లగగాలి వీస్తూనే వుంది. పడమటి గదిలో చల్లని గాలిని ఓ విధమైన మత్తుతో నిర్లిప్తతతో అనుభవిస్తుంటే ఆలోచనలు ముసురుకోసాగాయి.
    రాదాకృష్టులు!
    నిజంగా ఎంత మధురమైనజంట!
    ప్రేమ! ప్రేమ అంటారే తప్ప నిజంగా భర్తని ప్రేమించే భార్యలెందరు? ఆరాధించే యిల్లాళ్ళెందరు?
    కాకపోతే సినిమాలకి చీరలకి, నగలకి అవసరమయినపుడు ప్రేమని గుమ్మరిస్తారుతప్ప!
    నటన! నటన!! అంతా నటన!!!
    పైగా ప్రేమించటం అంతా తమ సొత్తేనని మగాడికి ప్రేమించటం తెలీదని వాదన! ఒట్టి కల్పన, అభూతకల్పన.
    లేకపోతే యీ నాడు తన పతిదేవుడిని మనసారా ప్రేమగా చూసే భార్యా ఎక్కడ? ఆ కారణంగా అవ్యాజంగా అనురాగం కురిపించే స్రీ ఎక్కడైనవుందా?
    ఎక్కడయినా అలాటి అమృతమూర్తులు కనిపిస్తే సాట్టాంగ దండ ప్రణామం చెయ్యాలి. కానీ కర్మ కొద్దీ ఎవరైనా కాఫీ యిస్తే కృతజ్ఞత తెలిపినంత తేలిగ్గా 'నిన్ను ప్రేమిస్తున్నాను ప్రియా' అనే వాళ్ళే తప్ప. నిజంగా భర్తని మనసారా ప్రేమించే వాళ్ళు ....ప్చ్....ప్చ్......

    గోడనున్న గడియారం ఎనిమిది కొట్టింది, నిట్టూర్చి ఆలోచనలకి స్వస్తి చెప్పి బాత్ రూమ్ లోకి వెళ్ళి ముఖం కడుక్కుని అలాగే స్నానం చేసేసివచ్చేశాడు.
    ఒళ్ళు తుడుచుకుని పట్టుపంచె చుట్టుకుని ఎలాగో నాలుగు ముక్కలు గొణగటం అయిందనిపించాడు. అతని మనస్సు మనస్సులో లేనప్పుడు యిక ఆ పూటకి సంధ్య నామమాత్రమే అది పగలయితేనే, రాత్రయితే అసలు నీళ్ళువదులుతాడు. సంధ్యకి మనస్సు సరిగా లేకుండా మంత్రాలు పటిస్తూ నామ మాత్రపు జపం చేస్తూ కాలం గడిపేకన్నా మానటమే మెరుగనుకొంటాడతను.
    పట్టుపంచె విడిచేసి లుంగి చుట్టుకుని అల్మారా వద్దకి వెళ్లి నిలుచున్నాడు. ఒక్కో పుస్తకమే అలా అలా తిరగేసి విశ్వనాధ వారి వరలక్ష్మి త్రిశతి తీసుకుని పడక్కుర్చిలో వాలి చదవటానికుపక్రమించాడు.

 Previous Page Next Page