Previous Page Next Page 
మబ్బు విడిపోయింది పేజి 5


    రవి ఇలాంటి ఉపన్యాసం ఇయ్యగానే విద్యార్ధులందరూ క్లాస్ రూం దద్దరిల్లి పోయేలాగ చప్పట్లు కొట్టారు. ఆ సమయానికి ఆ క్లాసులో ఉన్న చంద్రశేఖర్ కి మతి పోయింది. ఏం కాలేజి ఇది? ఒక విద్యార్ధి ప్రెసిడెంట్ పోస్ట్ కి నిలబడుతూ బహిరంగంగా ఎలాటి ఉపన్యాసమిస్తున్నాడు! దానికి ఎంత ప్రోత్సాహం లభిస్తోంది!
    అన్ని క్లాసుల్లోనూ, ఇంత గొప్పగానూ మాట్లాడాడు రవి. ఆ ఉపన్యాసానికి ముగ్ధులయిపోయిన విద్యార్ధి బృందం రవినే ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు. రవి తన స్నేహితులకు బ్రహ్మాండమైన పార్టీ ఇచ్చాడు.
    "ఈ ఎన్నికలు ముందు ముందు మనం నిర్వహించబోయే ఎన్నికలకు నమూనాలు!" అన్న రవి మాటలు గుర్తు వచ్చి చాలా బాధ పడ్డాడు చంద్రశేఖరం.
    ఈ విద్యార్ధులు ఎంతో తెలివిగా, శ్రద్ధగా చదివే విద్యార్ధిని తమకు నాయకుడిగా ఎన్నుకోలేదు. దక్షతతో ఏ కార్యమైనా నిర్వహించగలిగే సామర్ధ్యమున్న వాణ్ణి కూడా ఎన్నుకోలేదు. తమకు పార్టీ ఇస్తానని వాగ్దానం చేసిన వ్యక్తిని ఎన్నుకున్నారు.
    ఎన్నికలు జరిగిన మరునాడు సెలవు ఇచ్చారు. ఆ తరువాత మళ్ళీ యధాప్రకారం కాలేజీ సాగినా రవి తిన్నగా ఇచ్చేవాడు కాడు. తనతో పాటు అప్పుడప్పుడు మురళిని కూడా కాలేజీ మానెయ్యమనేవాడు. మురళికి కాలేజీ మానటం అంతగా ఇష్టం ఉండేది కాదు.... అయినా, రవి మాట కాదనలేక పోయేవాడు. ఇద్దరూ కాలేజీ ఎగ్గొట్టి సినిమాకి పోయి, కాలేజీనుంచి వచ్చినట్లు సాయంత్రం ఇంటికి చేరుకునే వారు. అయితే, మురళి ఆటలు ఎంతో కాలం సాగలేదు__ మురళి తల్లి సత్యవతి టీచర్ కావడంవల్ల కొడుకు చదువు సంధ్యల విషయంలో, క్రమ శిక్షణ విషయంలో శ్రద్ధ తీసుకునేది. అప్పుడప్పుడు కాలేజికి వచ్చి మురళి ఎలా చదువుతున్నాడో, ఎలా ఉంటున్నాడో కనుక్కుంటూ ఉండేది. అలా ఒకసారి సత్యవతి వచ్చినప్పుడు మురళి తరచుగా కాలేజి ఎగ్గొట్టి తిరుగుతున్నాడని తెలుసుకుంది. ఆ సాయంత్రం మురళి ఇంటికి రాగానే సత్యవతి బాగా చీవాట్లు పెట్టి "ఇంకొక్క సారి ఇలా కాలేజీ ఎగ్గొట్టి సినిమాలకీ, వాటికీ తిరిగావంటే, నేనే కాలేజి మానిపించి నీకు ఏ కూలి పనో చూస్తాను" అని బెదిరించింది.
    తల్లి కోపానికి భయపడిన మురళి రవితో "మా అమ్మ ఒక డెవిల్ రా! ఎలాగో నేను కాలేజి ఎగ్గొట్టినట్లు తెలుసుకుంటుంది. ఆ తరువాత నన్ను చంపేస్తుంది. నీతో నేను రాలేను" అన్నాడు.
    "కాలేజికి వెళ్ళి ఏం చెయ్యాలోయ్? అక్కడ చెప్పేవాళ్ళెవరు? నేర్చుకునేవాళ్ళెవరు? లెటజ్ యెంజాయ్!" అన్నాడు రవి నిర్లక్ష్యంగా.
    "హమ్మో! నేను రాలేను...." భయపడిపోతూ అన్నాడు మురళి.
    సత్యవతిని రవికీ తెలుసు. ఆవిడను ఎదిరించటం అంత తేలిక కాదనీ తెలుసు. సత్యవతి దృష్టిలో దుర్మార్గుడు కావటం రవికీ ఇష్టం లేదు. ఆవిడకి తెలియకుండానే పోదామంటున్నాడు. కానీ, ఎలాగైనా తెలిసిపోతుందేమోనని భయపడి మురళి రానంటున్నాడు.
    ఒకరోజు ఒక హరిజన వృద్ధురాలు కర్ర ఊతగా పట్టుకుని వృద్ధాప్యంవల్ల వొణికిపోతూ కాలేజీలో కొచ్చింది. "కుమారుబాబున్నాడా?" అని కనిపించిన అందరినీ అడగటం మొదలు పెట్టింది. కొందరు ఆ ముసలిదాని మాటలు వినిపించుకోకుండానే చీదరించుకుని దూరంగా వచ్చేశారు. మరికొందరు వేళాకోళం చేసి వెక్కిరించారు. ఒకరిద్దరు "కుమార్ అంటే ఎవరు?" అని అడిగారు. ఆ ముసలిది అయోమయంగా చూసి "ఆడు నా మనవడు" అంది.
    "ఇదేదో 'మా వూరికి టిక్కెట్టియ్యండి' అన్న బాపతులా ఉంది" అన్నారు ఒకరు. మిగిలినవాళ్ళు గట్టిగా నవ్వారు. ఎక్కడ ఏ మాత్రం ఎంత చిన్న అవకాశం దొరికినా నవ్వటానికి సిద్ధంగా ఉంటాయి వాళ్ళ మనసులు.
    "బి.యస్ సి. లో ఒక కుమార్ కొత్తగా చేరాడు - అతడేమో!" అన్నారు మరొకరు.
    "పదండి! పిలుచుకొద్దాం! పరోపకార మిదం శరీరం!...." ఎక్కడో విన్న మాటల్ని కోట్ చేస్తూ కుమార్ ని పిలుచుకు రావటానికి వెళ్ళాడు, ఆ త్యాగధనుడు.
    "భలే మంచి డ్రామా చూడబోతున్నాం! ఈ ముసలమ్మ మనవడు మన కాలేజి స్టూడెంటా? వండర్ ఫుల్! అయితే, అవ్వా! నువ్వు కూలిపని చేసి చదివిస్తున్నావా, మీ మనవణ్ణి?...." సరదాగా అడిగాడు ఒకడు.
    "నేనేడ సదివిస్తా దొరా! ఆడే సదువుతుండడు. సూసిపోదామని వచ్చిన....నా పొట్టకే తిండి లేకుంటే, వానికేం పెట్త...." అంటూ దీర్ఘాలు తీసింది ముసలిది.
    "ఓహోహో! కథ మంచి పాకాన పడింది. ఈ కూలిదాని మనవడు కాలేజిలో ఎట్లు చదువుచుండెను? ఎవరు చదివించుచుండిరి? బ్రహ్మాండమైన సస్పెన్!"
    "ఏడిశావ్! ఇందులో సస్పెన్స్ ఏముంది? ఎలాగో ముష్టెత్తుకుని చదువుకుంటున్నాడు కాబోలు!"

 Previous Page Next Page