చటుక్కున వారిజ రెండు చేతులూ పట్టుకున్నాడు రామచంద్ర ." వద్దు వారిజా, అలా అనకు ....నువు రోజు రావాలి....." మృదువుగా చేతులు విడిపించుకుంది వారిజ.
"ఎందుకు....?"
"ఏమో....?"
"అది స్పష్టంగా ఆలోచించుకొండి ముందు."
'ఆలోచించ నక్కర్లేదు.....ఒక్క రోజు నిన్ను చూడక పొతే నాకు పిచ్చెక్కుతుంది."
"ఎప్పటికో ఒకప్పటికి విడిపోవాల్సిన వాళ్ళమే గదా! అప్పుడేం చేస్తారు."
'విడిపోక ఏం చేద్దామను కుంటున్నారు?" కొన్ని క్షణాలు వారిజ నల్లపూసల మీద నిలిచాయి రామచంద్ర చూపులు ......భరించరాని బాధతో క్రిందకు వాలాయి.
"ఏం చెయ్యను -- కాని, నువు రా వారిజా...! అలా వాగ్దానం చేస్తే కాని వెళ్ళ నియ్యను." వారిజ దారికి అడ్డుగా నిలిచాడు రామచంద్ర.
"ఊహు! రామ - రాదలచులేదు. ఇలాంటి ఆశలు అంత కంతకు ఎక్కువవుతాయే కాని అణగిపోవు......అయినా మీ వస్తువు కాని దాని మీద మీ కింత వ్యామోహం దేనికి....?
"వ్యామోహమా ? నాకా? నీమీడా?"
"ఇదంతా ఏమిటి మరి? అడ్డు లేవండి....." పాలిపోయిన ముఖంతో అడురుతోన్న పెదవులతో, నిప్పులు రగులుతోన్న కళ్ళతో తన ఎదురుగా నించున్న రామచంద్రను తప్పించుకుని బయటపడింది వారిజ.
కన్నీళ్లు కూడా రాని తన మండే కళ్ళను బరువుగా మూసుకుని, తన గుండెలు ఎందుకు బ్రద్దలు కావా అని ఆశ్చర్యపోతూ పక్క మీద దొర్లింది వారిజ రాత్రంతా.
-------------
నాలుగు రోజులు రామచంద్రను కలుసుకోకుండా నిగ్రహించుకున్న తరువాత తనకింక ఆ ఊళ్ళో ఉండవలసిన అవసరం లేదని పించింది వారిజకి. తన సామాన్లు సర్దుకుని వెళ్ళే ముందు సెలవు తీసుకునెందుకు రామచంద్ర ఇంటికి బయలుదేరింది. సంధ్య పలచబడి పోతోంది - చిక్కని చీకటి మెత్తగా పరచుకుంటోంది.
ఏదో అపరాధం చేయబోతున్నదానిలా వణికింది వారిజ. అయినా ఆమె వణుకుతున్న చేతి వేళ్ళు రామచంద్ర గేటు తలుపులను తెరిచాయి. లోపలికి అడుగుపెట్టింది. అడుగులు చప్పుడు విన్న రామచంద్ర "ఎవరు...? వీరన్నా!" అన్నాడు.
ఆ కంఠస్వరం విన్న వారిజ ఉలికిపడింది. అతి నీరసంగా నూతిలోంచి వచ్చినట్లుగా వుంది. గదిలో చీకటి, సిచ్ వేసింది. లైట్ కాంతిలో వారిజను చూసిన రామచంద్ర ముఖం ఒక్కసారి వెలిగింది. "వారిజా!" అన్నాడు రెండు చేతులు జాపి, ఆ చేతులలో వాలిపోయింది ఆమె.
రామచంద్ర చేతులు వారిజను బలంగా చుట్టేశాయి. కాల్చేస్తున్నాయి వారిజ శరీరాన్ని. జ్వరంతో, వేడిలో. "వారిజా...! వారిజా....! వచ్చావు ....నా మీద కోపం లేదూ? విరిగిపోతోంది అతని కంఠస్వరం ఊద్రేకంతో నీరసంతో.
"మీ మీద కోపమా.....? భలేవారే- మీ మీద ఎందుకు కోపం? ఈ నిర్భాగ్యురాలికి జీవిత మాధుర్యాన్ని రుచి చూపించినందుకా ?" రామచంద్ర చేతులు సడలి పోయాయి. అతని గుండెల మీద నుంచి లేచి పక్కనున్న కుర్చీలో కూర్చుంది వారిజ.
మాసిపోయిన అతని గెడ్డాన్ని, పాలిపోయిన అతని చెక్కిళ్ళనూ , నీరసంగా వున్న కళ్ళనూ బాధగా చూస్తూ "జ్వరం వచ్చిందా! మరి నాకెందుకు కబురు చేయలేదు " అంది. "ఎందుకు కబురు చేయాలి? మీరు నాకేవరని?' తల్లి మీద అలిగిన పసిపిల్లాడిలా రోషంగా అన్నాడు. జ్వరంతో కాలిపోతున్న అతని చేతిని తన చేతిలోకి తీసుకుని నవింది వారిజ.
"ఎవరినని రాగానే అలా ఆర్తిగా గుండెల కదుముకున్నారు?" పాలి పోయింది రామచంద్ర ముఖం." మీరు వెళ్ళిపొండి ఇక్కడ్నుంచి వెంటనే!"
"వెళ్ళను గాక వెళ్ళను - మీకు జ్వరం నయమయ్యాక కాని నేనిక్కడ్నింఛి కదలను." దీర్ఘంగా నిట్టూర్చాడు రామచంద్ర. "అలా కాదు వారిజా! నువన్నమాట అబద్దం కాదు. నీ మీద నాకు వ్యామోహం వుంది. హాలా చాలా వుంది. నా శక్తులన్నీ ఉపయోగించి కూడా ఈ వ్యామోహాన్ని జయించలేక పోతున్నాను. మన స్నేహాన్ని స్నేహంగానే నిలప గలిగే శక్తి సన్నగిల్లి పోతోంది నాలో. ఇలాగే వుంటే ఏనాడో నిన్ను నాశనం చేసి నేను నాశనం అవుతాను .......వెళ్ళిపో వారిజా!"
వారిజ అతని కళ్ళలోకి చూస్తూ అంది. "నాకసలు భయం లేదు. వెళ్ళవలసిన అవసరమూ లేదు. మీది వ్యామోహమే అయితే మన స్నేహం ఇంత గాడంగా అల్లుకునేదే కాదు. మీకున్నది వ్యామోహం కాదు, ప్రేమ! మీరు నన్ను ఏనాటికి నాశనం చెయ్యలేరు. నేనెంత క్షుద్రురాలినాయినా మీ ప్రేమను అపురూపంగా గుండెల్లో దాచుకున్నాను. మిమ్మల్ని పతనం కాకుండా కాపాడుకోగలను."
"నువ్వు క్షుద్రురాలివా? నేను నమ్మను.....'
"నమ్మండి...." వారిజ నవ్వుతూ లేచి అతని తల తన తోడ మీద పెట్టుకుని నెమ్మదిగా వత్త సాగింది. రామచంద్ర ఆమె చేతిని గట్టిగా పట్టుకుని . వీల్లేదు వారిజ! నువులే! ఇంత అతి చనువు వద్దు" అన్నాడు.
"ఏం?" అంది వారిజ. లేవకుండానే అతని శిరస్సు నిమురుతూ . రామచంద్ర చెయ్యి వారిజ చెయ్యి మీద బిగుసుకుంది. "నాకిది అర్ధం కావటం లేదు వారిజా! ఈ అనుబంధాన్ని సెక్స్ తో ముడి పెట్టలేను.....ఎన్నటికీ అంత నీచానికి పాల్పడలేను గనుక, సెక్స్ తో సంబంధం లేదని అనలేను. నువ్వు స్త్రీవి కాకపోతే నీకోసం ఇంత అలమటించే వాడ్ని కాదు గనుక. మనుష్యుల మనసులిలా ఆకర్షణ సుడిగుండాలలో ఎందుకు కొట్టుకు పోతుంటాయో నీకు తెలుసా?"
"ఏం చెప్పగలను? ఈ విశ్వమంతా ఆకర్షణ మీద ఆధారపడే కదా పరిభ్రమిస్తోంది? ఈ ఆకర్షణ నుండి తప్పించుకో గలిగిన వాళ్ళెవరు? మీరిప్పుడా విషయాలన్నీ ఆలోచించకండి. కళ్ళు మూసుకు పడుకోండి.'
"వారిజా! నీ వళ్ళో తల పెట్టుకుని , ఇలా నువ్వు తల రాస్తోంటే ఇంతకు మించి నాకేమి అక్కర్లేదని పిస్తోంది. నీ స్పర్శ నేను అనుభవించగలిగినంత వరకూ ఎంతటి బాధనయినా నాకు సౌఖర్యకరమే అవుతుంది.'
"వెళ్ళిపో వారిజా! నువు మరొకరి సోత్తువి....ఈ సౌఖ్యాన్ని పొందే అర్హత నాకు లేదు ......వెళ్ళు." బలవంతాన తన తల ఆమె ఒళ్లో నుంచి తొలగించబోయాడు రామచంద్ర. వారిజ అతనిని లేవనియ్యకుండా అదిమి "ఉద్రేక పడకండి." మీరేం తప్పు చేయటం లేదు. నేనవరి సోత్తునూ కాను. ఒక్క మీకు తప్ప ఎవరికీ చెందను. నా సేవను పొందే అర్హత మీకంటే ఎవరికీ ఎక్కువ లేదు. చుడండి.... అంటూ సూత్రం గొలుసులా వున్న తన గొలుసును పైట లోంచి బయటకు తీసింది. దానికి ఏదో చిన్న లాకెట్ ఉంది. మంగల్యాలు లేవు. "నల్లపూసలు అంతే! ఒకరు కట్టినవి కావు నేనే సరదాకి కట్టుకున్నవి" రామచంద్రకి ఒళ్ళు తెలీలేదు.....రెండు చేతులతో వారిజను దగ్గరికి లాక్కుని బలంగా గుండెల కదుముకుని , చెక్కిళ్ళ మీదా, కన్నుల మీదా ముద్దుల వర్షం కురిపించాడు. ఆవిడా పెదవుల మీద పెదవుల పెదవులోత్తి , ఆవిడా శక్తిని తాను గ్రహిస్తూ , తన జీవశక్తిని ఆమె కందించాడు, ఆర్తితో ఆవిడ శరీరాన్ని పెనవేసుకున్నాడు.