Previous Page Next Page 
చీకటి కడుపున కాంతి పేజి 5

 

    ఒక్కసారి బావురమని ఏడవగాలిగితే బాగుండుననిపించింది వారిజకు. చిత్రం! ఒక్క కన్నీటి బొట్టు కూడా రాలేదు. ఆ కన్నీరు సహితం కొందరు అదృష్ట వంతులకే లభిస్తుంది. ప్లాస్క్ , గ్లాజు గ్లాసు తీసుకుని వచ్చాడు రామచంద్ర. కాఫీ గ్లాసులో పోసి వారిజ ముందుంచి "ముందు యిది తాగండి ... తరువాత వెనక్కు తిరిగి వెళ్లిపోదాం . మిమ్మల్ని ఎత్తుకుని తీసి కెళ్ళే వాడినే! నా మీద మీరుంచిన నమ్మకాన్ని వమ్ము చేసుకోలేను..." అన్నాడు.
    కాఫీ అందుకుని అతని ముఖంలోకి చూసింది వారిజ. తీక్షణంగా మెరుస్తోన్న ఆ కళ్ళలో ప్రతిఫలిస్తోన్న నిర్మలతానికి తట్టుకోలేక తల దించేసుకుంది. రామచంద్ర అందించిన కాఫీ తనలో ఏదో జీవశక్తిని నింపునట్లనిపించింది వారిజకి. వెనుకటి దిగులు కరిగిపోగా నవ్వుతూ త్రుళ్ళుతూ పాకను సమీపించింది. "ఇంకా ఇళ్ళకు పోదాం . తాలుక ఆఫీస్ ప్రక్కనున్న పెంకుటిల్లు మాది. ముందు పూల మొక్కలుంటాయి. మీ కెప్పుడు రావాలనిపిస్తే అప్పుడూ మా ఇంటికి రండి.
    నిస్సంకోచంగా నిండుగా నవ్వుతూ అన్నాడు రామచంద్ర. ఆ నవులోని పవిత్రతకు మనసులో శ్రద్ధాంజలి ఘటిస్తూ నెమ్మది నెమ్మదిగా అడుగులు వేసింది వారిజ.


                                                      --------

    చెళ్ళు చెళ్ళు మని వినిపిస్తోన్న దెబ్బల చప్పుడుకు ఆశ్చర్యపోతూ లోపల ప్రవేశించిన వారిజ వీరన్న చెంపలు పగల కొడుతున్న రామచంద్రను చూసి నిర్ఘాంతపోయింది, మెరుపులా వెళ్లి అడ్డుగా నిల్చింది. "ఆగండి! ఏమిటిది! నిన్ననే కదా నా ప్రాణానికి ప్రాణమని చెప్పారు? ఇదేనా స్నేహమంటే? ఎందుకలా కొడుతున్నారు?"
    "చూడండి మరి, వాడెం వాగుతున్నాడో? మీరు మీరు .....ఛీ! నా నోటితో అనలేను...." అన్ని దెబ్బలు తిన్న ఎదిరించని వీరన్న రోషంగా తలెత్తాడు.
    "నేనే అంటాను- ముఖ మెదురుగానే అంటాను. ఈ వారిజ చెడిపోయింది. నిన్ను సర్వనాశనం చెయ్యడానికి నీ దగ్గర చేరింది. ఈవిడకు దూరంగా వుంది రామచంద్ర బాబు . నన్ను చంపినా సరే ఈవిడి వలలో నువ్వు పడటానికి ఒప్పుకోను.'
    వారిజ ముఖం పాలిపోయింది. నిలబడ లేక తూలింది. ఆ ముఖం చూసిన రామచంద్రలో ఆగ్రహం అవధులు దాటింది. చేతి కందుబాటులో వున్నా గాజు గ్లాసును వీరన్న మీదకు విసిరి కొట్టాడు - అది వీరన్న నుదుటికి కొట్టుకుని రక్తం చిమ్మింది. వారిజ కళ్ళలోంచి రక్తం చిమ్మింది.
    "ఛీ! ఛీ! ఏమిటిలా తయారవుతున్నారెండుకు మీరు? మీరు సహించలేని ఒక మాటన్నందుకు మిమ్మల్ని అభిమానించే వ్యక్తిని అంతగా హింసిస్తారా? వీరన్న అనటం కాదు నేనంటున్నాను , అవును - నేను చెడిపోయిన దాన్నే ఏం? అలా తెల్లబోయి నిల్చున్నారేం? నామీదకీ విసరండి ఒక గ్లాసు. వీరన్నను సేవకుడు గనుక కొట్టగలిగారు నన్నూ కొట్టండి సందేహం దేనికి?"
    రామచంద్ర మూడుడిలా వారిజ ముఖం కేసి చూసి అక్కడ్నించి పారిపోయాడు.
    వారిజ లోపలికెళ్ళి ఒక గిన్నెతో నీళ్ళు తీసుకొచ్చి వీరన్న పక్కన కూర్చుని తన రుమాలు నీళ్ళలో తడిపి అతని గాయాన్ని తుదవబోయింది.
    'వద్దమ్మా!' అన్నాడు వీరన్న బాధగా.
    "ఏం వీరన్నా! నిన్నూ వలలో వేసుకుంటానని భయపడుతున్నావా? ఫరవాలేదు వీరన్నా! యజమాని క్షేమం కోసం రక్తం చిందించగలిగిన నీలాంటి ధీరుల్ని ఎంతటి వగలాడి మాత్రం ఏం చెయ్యగలదు ? నీ రక్తం చూడలేకపోతున్నాను, తుడవనివ్వు. "వీరన్న ఆశ్చర్యంగా వారిజ ముఖంలోకి చూశాడు. అతని కళ్ళలోంచి జలజల నీళ్ళు రాలాయి. ఏం మాట్లాడలేకపోయాడు.
    వారిజ అతని కళ్ళల్లో నీళ్ళు చేత్తో తుడిచి , తడి రుమాల్తో రక్తం తుడిచి, మరో తడిగుడ్డ గాయం మీద ఉంచింది. ఇంతకంటే ప్రస్తుతానికి నేనేం చేయలేను వీరన్నా? వెళ్ళి డాక్టర్ని పంపిస్తాను. డాక్టర్ వచ్చి ఏ అయిడినో రాసి కట్టుకట్టితే త్వరలోనే తగ్గిపోతుంది.'
    "డాక్టర్ అక్కర్లేదమ్మా! అదే తగ్గిపోతుంది" అని, ఒక్క క్షణం ఆగి , బరువుగా ఊపిరి వదిలి మళ్ళీ అన్నాడు.
    "మా బాబు సంగతి నీకు తెలియదమ్మా! అయన ప్రతిదీ చాలా తీవ్రంగా తీసుకుంటాడు. ఏం చేసినా మనసారా చేస్తాడు. అయన నిన్ను ప్రేమిస్తే తన కంఠంలో ప్రాణం ఉండగా నిన్ను మరవలేడు. అప్పుడు అయన బ్రతుకేం కావాలి? నువు ....నన్ను క్షమించమ్మా.
    "నిన్ను క్షమించడానికి నేనవర్ని వీరన్నా! నాకంటే ఎన్నో రెట్లు ఉన్నత శిఖరాల మీద ఉన్నావు నువు చెప్పింది అర్ధమయింది. ఇక మీదట మీ బాబుకి దూరంగా ఉంటాను సరేనా!"
    "అమ్మా౧ నీకు కష్టం కలిగిస్తున్నాను . నాకు తెలుసు కాని......."
    "నాకు కష్టమా ! హు నా కసలు కష్టమనేది లేదు వీరన్నా. అదీ గాక మీ బాబు మనసారా నన్ను ప్రేమించి ఆ కారణంగా జీవితాంతం బాధపడటం నేనే సహించలేను . సరే వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను."
    వారిజ లేచేలోగానే డాక్టర్ని తీసుకుని రామచంద్ర వచ్చాడు. డాక్టర్ వీరన్న నుదుటి భాగాన్ని మళ్ళీ కడిగి మందు రాసి కట్టుకట్టి వెళ్ళిపోయాడు.
    "వీరన్నా?" దుఃఖంతో పూడుకు పోతున్న గొంతు చీల్చుకుంటూ అన్నాడు రామచంద్ర.
    "నువు నన్ను కొట్టు వీరన్నా!"
    వీరన్న నవుతూ రామచంద్రను సమీపించి మృదువుగా చెంపలు తట్టాడు. "బాబూ! నాది పొరపాటే! వారిజమ్మ దేవత. "తలవంచుకొని అనేసి వెళ్ళిపోయాడు . రామచంద్ర వారిజ వంక చూశాడు. వారిజ నవింది.
    వారిజ నవును ఇంతవరకూ ఎన్నోసార్లు చూశాడు రామచంద్ర. కొన్నిసార్లు పులకించాడు. కొన్నిసార్లు పరవశించాడు. కొన్నిసార్లు ముగ్ధుడయ్యాడు. కొన్నిసార్లు లజ్జ పడ్డాడు. ఉద్రిక్తుడయ్యాడు కాని, ఇలాంటి నవును ఇంతవరకూ ఎన్నడూ చూడలేదు.
    ఆ నవు చూస్తోనే హృదయం ద్రవించి పోయింది. అంత దీనంగా ఉందా నవ్వు.
    "వద్దు! వారిజా. అలా నవకు. మాములుగా నవు" దీన స్వరంతో అన్నాడు. వారిజ నవ్వలేదు. ఆవిడ ముఖం గంబీరంగా మారిపోయింది. "నేను వెళ్తాను.... మళ్ళీ మీ ఇంటికి రాను మీరు రావద్దు . నేనిక్కడ నుంచి వెళ్ళేతప్పుడు మాత్రం మీకు చెప్పి వేళతాను."

 Previous Page Next Page