"అవును డియర్! అంతా సినిమాల్లోలాగా జరిగిపోయింది! నాలాంటి బాంక్రప్ట్ ఫెలోని నీలాంటి కోటీశ్వరురాలు లవ్ చేసిందంటే...ఆహా! ఇంతకూ ఎందుకు నన్ను ప్రేమించావ్ ప్రతిమా అసలు? నీ మానసిక ఆరోగ్యం బావుండలేదా?"
ప్రతిమ నవ్వేసింది.
"బావుండబట్టే లవ్ చేశాను. నీకో విషయం తెలుసా?"
"ఏమిటది?"
"మిగతా అందరికంటే నువ్వు చాలా మేన్లీగా కనబడతావు నాకు!"
"అలాగా! ఇంటికెళ్ళగానే అద్దంలో చూసుకుంటాను."
"భవానీ!"
"ఎస్ డియర్!"
"ఐ లవ్ యూ!"
"వెరీ కైండాఫ్ యూ!"
"ఐ లవ్ మై డాడ్ ఆల్సో!"
"నాట్ సో కైండాఫ్ యూ!"
"దయచేసి అలా మాట్లాడకు. నువ్వెలాగయినా డాడీకి నీమీద పూర్తి నమ్మకం, మంచి అభిప్రాయం కలిగేందుకు ప్రయత్నించాలి."
"చూస్తుండు డియర్! మీ డాడీ వచ్చి కళ్ళవెంబడి నీరు పెట్టుకుని పశ్చాత్తాపంతో సలసలా కాగిపోతూ ఏడ్చేస్తాడు 'అయ్యో! భవానీశంకర్ ఇంత గొప్పవాడని తెలుసుకోలేకపోయానే' అంటూ తన తల దేవుడి విగ్రహానికి కొట్టుకోవటం ప్రారంభిస్తాడు. బాల్ హెడ్ అవడం వల్ల తల కొబ్బరికాయ పగిలినట్లు పగిలి రక్తం చిమ్ముతుంది. దేవుడు కైలాసంలో వులిక్కిపడతాడు. ముల్లోకాలూ భూకంపం వచ్చినట్లు వూగిపోయాయి. బాక్ గ్రౌండ్ లో మీ డాడీ పాట..."
బేరర్ ఆర్డరిచ్చినవన్నీ తీసుకొచ్చి వారి ముందుంచడంతో అతని 'ఫ్లో' ఆగిపోయింది. ఇద్దరూ భోజనం చేయసాగారు.
మర్నాడు భవానీశంకర్ ఉదయం పదిగంటలకల్లా ఆఫీస్ కి చేరుకునేసరికి అప్పటికే ఆఫీస్ మధ్యలో నిలబడి జగన్నాథం మీద గట్టిగా అరుస్తున్నాడు మార్కండేయులు. అతని చేతిలో ఫైల్ లో పైకీ కిందకూ వూగిసలాడుతున్న ఓ సన్నని గీత లాంటి గ్రాఫ్ వుంది.
"ఏమిటిది? 'ఏమిటిది!' అని నేను నిన్నడుగుతున్నాను" అరిచాడు మార్కండేయులు గ్రాఫ్ కాగితం బయటకు లాగి చూపిస్తూ.
"సేల్స్ తాలూకు గ్రాఫ్ సార్"
"నాకూ తెలుసా విషయం. నేనడిగేదదికాదు! ఈ గ్రాఫ్ ఇలా పైకి ఏడవకుండా కిందకు ఎందుకు అఘోరిస్తోంది అని అడుగుతున్నాను."
"ఎందుకంటే? సేల్స్ కొంచెం ఎగుడు దిగుడుగా వుండబట్టి"
"అదే 'ఎందుకు?' అనడుగుతున్నాను. ఎందుకు? ఎందుకని? ఎందుచేత?"
"పబ్లిసిటీ సరిగ్గా లేదని నేననుకుంటున్నాను సార్."
"అయితే దానికి బాధ్యత ఎవరిది?"
"నాదే సార్. కానీ పబ్లిసిటీ ఇన్ ఛార్జ్ పోస్ట్ ఖాళీగా వుండటం వల్ల...."
మార్కండేయులుకి అర్థమయ్యింది.
అటు తిరిగి ఇటు తిరిగి తన మీదకే రావడంతో చటుక్కున అక్కడి నుంచి జారుకోక తప్పలేదతనికి.
సరిగ్గా అప్పుడే భవానీశంకర్ ఎదురొచ్చాడతనికి ఉత్సాహంగా. అతనిని చూస్తూనే పోయిన కోపమంతా తిరిగి వచ్చేసిందతనికి.
"సో! దేర్ యూ ఆర్?" అన్నాడు అతనికి అడ్డంగా నిలబడి.
భవానీశంకర్ అతని కోపాన్ని పట్టించుకోలేదు "హలో జెంటిల్మన్! ఐయామ్ హియర్!" అన్నాడు చిరునవ్వుతో.
"ఆల్ రైట్! నా రూమ్ కి రా!" అరిచాడు మార్కండేయులు.
భవానీ అతనిని ఫాలో అయిపోయాడు. గదిలోకెళ్ళాక భవానీని కూర్చోమనకుండా తనే కూర్చున్నాడు కుర్చీలో.
"అయితే తెలుగు సినిమాలు బాగా చూస్తావన్నమాట నువ్వు" మండిపడుతూ అడిగాడు.
భవానీశంకర్ కి అర్థం కాలేదు. "ఒక్క తెలుగు సినిమాలేమిటి మైడియర్ సర్. మనకి లాంగ్వేజ్ తో సంబంధంలేదు. మిగతా భారత ప్రజలందరిలాగా ఏదో ఒక సినిమా తాలూకు బొమ్మలు తెరమీద కదులుతూంటే చాలు! కళ్ళప్పగించేయటమే!"
"చూసి ఆ సినిమాల్లో జరిగినట్లు చేస్తుంటావు. అంతేనా?"
"చాలావరకూ కరెక్ట్! సినిమాల్లో కనిపించేవన్నీ చేయటం కష్టంగానీ, వాటిల్లో మనకు కన్వీనియెంట్ అయినవి మాత్రం లాగించేస్తుంటాం. ఉదాహరణకు అడుక్కు తినే పరిస్థితిలో పుట్టి, పెరిగిన హీరో కోటీశ్వరురాలయిన హీరోయిన్ ని ప్రేమించటం, ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలనుకోవటం, హీరోయిన్ తల్లితండ్రులు అడ్డు చెప్తే ఇద్దరూ పారిపోయి కొడైకెనాల్ వెళ్ళి ప్రేమించుకుంటారు! ఒండర్ ఫుల్ లవ్ స్టోరీస్ సార్! వాటినే 'టీనేజ్ లవ్ స్టోరీస్' అంటారు మనవాళ్ళు! మంచి ఫార్ములా అది. ఇంచుమించుగా అన్ని సినిమాలూ హిట్ అవుతాయి."
"కాని అవి సినిమాలు" గద్దిస్తూ అన్నాడతను.
"అఫ్ కోర్స్ అవి సినిమాలు"
"అండ్ ఏ సినిమా ఈజే సినిమా!"
"అఫ్ కోర్స్ ఏ సినిమా ఈజే సినిమా"
"సినిమా ఎప్పటికీ నిజ జీవితం కాలేదు. కాలేదు...కాబోదు."
"అఫ్ కోర్స్! కాని నిజ జీవితం కూడా ఎప్పటికీ సినిమా కాలేదు"
"మా అమ్మాయికి డబ్బుంది కదాని ప్రేమించినట్టు డ్రామా ఆడి పెళ్ళి చేసుకుని ఆస్తంతా కొట్టేయాలనుకుంటున్నావేమో! అది ఇంపాజిబుల్."
భవానీశంకర్ ఆశ్చర్యపోయాడు. "హారినీ! మీ డొంక తిరుగుడంతా ఇందుకా?"
"మర్యాదగా మాట్లాడటం నేర్చుకో."
"ఏం? 'హారినీ' పదం బావుండలేదా?"