రాజు సైకిల్ ఎక్కి కూర్చున్నాడు.
రెండు నిముషాల్లో మంగప్ప దుకాణం ముందాగింది సైకిల్.
అతనిని చూస్తూనే మంగప్ప మొఖంలో కళ తప్పింది.
"ఏయ్ మంగప్పా! మా పార్టీవాళ్ళు బంద్ చేయించిన రోజు నీ దుకాణం తెరచి సరకులు అమ్ముకున్న విషయం మర్చిపోయావా? ఆరోజు నేను చూసీ చూడనట్లు ఊరుకున్నా కాబట్టి సరిపోయింది. అదే నేను మా పార్టీ వాళ్ళను పిలిపించి నీ దుకాణం లూఠీ చేయిస్తే ఏంచేసి వుండేవాడివి?"
"అదికాదు గురూ...అదివరకు బాకీ....."
"అలాగా! సరే బాకీ తీరుస్తాను. రేపే తీరుస్తాను నీ బాకీ! నీక్కావలసింది బాకీ తీర్చటమేగా! తీరుస్తా!"
చిరంజీవి వెనక్కు తిరగబోతూంటే మంగప్ప పరుగుతో వచ్చి చిరంజీవి చేతిలోని సంచి లాక్కున్నాడు.
అరెరెరె! అంత కోపమయితే ఎలా గురూ...ఏం కావాలో చెప్పు?"
"ఏమీ అఖ్ఖర్లేదు." మళ్ళీ సంచి లాక్కుని రాజుతోపాటు ఇంటివేపు సైకిల్ నడపసాగాడతను.
"అరెరె! గురూ! ఆగ్గురూ! గురూ...గురూ!"
చిరంజీవి వినిపించుకోలేదు.
ఇంటికి తిరిగివచ్చేసి మంచం మీద కూలబడిపోయాడు.
అతని మనసంతా చిరాగ్గా తయారయింది.
తను నిజంగా జీవితాన్ని నరకం చేసుకుంటున్నాడు. ఇదంతా నా తాగుడు అలవాటు వల్లే జరుగుతుంది. అంతకు ముందు డబ్బుకి లోటుండేది కాదు. వెయ్యి రూపాయల జీతం వచ్చేది. కానీ తన తాగుడు ఎక్కువయిపోవటంతో ట్రావెల్ ఏజెన్సీ యజమాని తనను డిస్మిస్ చేసేశాడు.
అప్పటినుంచీ జీవితం దుర్భరమైపోయింది. తనతోపాటు తన అక్కయ్య పిల్లల జీవితం కూడా!
"మావయ్యా! నువ్వు త్వరగా స్నానం చేసెయ్. భోజనం వడ్డించేస్తాను."
చిరంజీవి ఉలిక్కిపడి వంటింటివేపు చూశాడు.
రజని స్టౌ ముందు కూర్చుని ఉంది. స్టౌ మీద అన్నం ఉడుకుతోంది.
చిరంజీవి ఆశ్చర్యంగా రజని దగ్గరికి నడిచాడు.
"బియ్యం ఎక్కడివి?"
"కృష్ణయ్య అంకుల్ ఇచ్చాడు మావయ్యా! మేము వద్దని చెప్తూనే వున్నాం. కానీ బలవంతంగా ఇచ్చాడు" భయంగా అందామె.
"పోనీలేమ్మా! రేపు నేను అన్నీ తీసుకొస్తాను. అప్పుడు అతని బియ్యం అతనికిచ్చేద్దాం."
"అవే తాగుబోతు మాటలంటే" అంటూ లోపలికొచ్చాడు కృష్ణయ్య.
నేను నీ మొఖం చూసి ఇవన్నీ ఇవ్వటం లేదు. నీలాంటి తాగుబోతుకి సహాయం చేసినా కూడా పాపమే! పాపం పసిపిల్లలు ఆకల్తో మాడుతున్నారని ఇచ్చా! అంతేకాని బియ్యం, కూరలు అప్పుగా ఇస్తున్నానని చెప్పలేదు" అంటూ ఓ గిన్నెలో కూర తీసుకొచ్చి రజని ముందుంచాడు.
చిరంజీవి ఏమీ మాట్లాడలేదు.
కృష్ణయ్య మొఖం చూపించాలంటే సిగ్గుగా ఉంటుంది.
ఎన్నోసార్లు తనకు హితబోధ చేశాడు తాగుడు మానెయ్యమని. కానీ తను అతని మాటను పెడచెవిన పెట్టాడు.
అందుకే అతనికి కోపం వచ్చి తనతో మాట్లాడటం మానేశాడు.
"తినండ్రా బాబూ! మీకేమయినా కావాలంటే నన్నడగండి. అంతేగాని మామయ్యగాడు ఏదో చేస్తాడని భ్రమ పడకండి. వాడుత్త తాగుబోతు. తాగి నిద్రపోవటం తప్పితే వాడివల్ల ఇంకేమీ ప్రయోజనం లేదు. గుడ్ నథింగ్ ఫెలో!"
కృష్ణయ్య వెళ్ళిపోయాడు.
చిరంజీవి మనసంతా పాడయిపోయింది.
కృష్ణయ్య చెప్పింది నిజమే. తను గుడ్ ఫర్ నథింగ్ ఫెలో.
మరికొద్దిసేపట్లో అందరూ భోజనాలు ముగించారు.
చిరంజీవి బట్టల అల్మారా తెరచి అందులో ఉన్న డ్రైవర్ యూనిఫారమ్ బయటకు తీశాడు.
బటన్స్ రెండు చోట్ల విరిగిపోయినాయి. అప్పటికప్పుడు సూది దారం తెచ్చుకుని కొత్త బటన్లు చకచక కుట్టసాగాడు.
యూనిఫారం సరిగ్గా లేకపోతే భారత్ టూర్స్ అండ్ ట్రావెల్స్ యజమాని స్వామి తనను ఆఫీస్ లోకి కూడా రానివ్వడు.
యూనిఫారం విషయంలోనూ, గడ్డం విషయంలోనూ అతను చాలా స్ట్రిక్టుగా ఉంటాడు. అతని ట్రావెల్స్ లో పని చేస్తున్న పదిహేనుమంది డ్రైవర్లు ఎప్పుడూ నీట్ యూనిఫారంలో ఉండాల్సిందే! అలా వున్నవారినే సెలక్ట్ చేసుకుంటాడతను.
అతనికేమాత్రం నీట్ నెస్ నచ్చకపోయినా క్షణాల్లో డిస్మిస్ చేసేస్తాడు. ఆ విషయంలో నిజంగా నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తాడు.
"నా సంస్థ కేవలం డబ్బు కోసం నడపటం లేదు. డబ్బు కంటే ముఖ్యం పేరు! భారత్ టూర్స్ అండ్ ట్రావెల్స్ కి అందుకే అంత ప్రాధాన్యత ఇస్తారందరూ" అంటాడతను.
నిజంగానే ఆ సంస్థకు జంట నగరాల్లో చాలా మంచి పేరుంది. అందుకే స్టార్ హోటల్స్ అన్నీ తమ ట్రావెల్స్ పోర్టు అవసరాలకు ఆ సంస్థనే ఆశ్రయిస్తాయ్.
యూనిఫారం ఇస్త్రీ కూడా చేసుకున్నాక త్వరత్వరగా గడ్డం గీసుకున్నాడతను.
భారత్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆఫీస్ కి చేరుకునేసరికి సాయంతం మూడయిపోయింది.
అతనిని చూస్తూనే మిగతా డ్రయివర్లందరూ అతని చుట్టూ మూగారు.
"అరె! ఏమైపోయావ్ గురూ ఇంతకాలం?"
"బాగా మందెక్కువ కొట్టేస్తున్నావని అంటున్నారే? నిజమేనా?"
"ఇంకెక్కడయినా వర్క్ చేస్తున్నావా బ్రదర్?" అంటూ రకరకాల ప్రశ్నలతో అతనిని ముంచెత్తారు.
"నిజమే గురూ! ఇన్నిరోజులూ నాకేదో శని పట్టుకుంది. అందుకే తాగుడికి బానిసయిపోయాను. కానీ ఇప్పుడు స్పృహలో కొచ్చేశాను. ఇంకెప్పుడూ అలాంటి పని చేయను మళ్ళీ!"
అందరూ పగలబడి నవ్వుతూంటే అతను కోపంగా చూశాడు. దాంతో నవ్వులాగిపోయినయ్.
స్వామి దగ్గరకు నడిచాడతను.
సెక్రటరీ అతనిని చూసి చిరునవ్వు నవ్వింది.
"ఓ! మీరా? ఏమిటి సంగతి? మీ గురించి చాలా కథలు వింటున్నాను" అడిగిందామె.
"అవి కథలు కాదు మిస్! నిజాలు! బాస్ తో ఇంటర్వ్యూ కావాలి. ఎరేంజ్ చేస్తారా దయచేసి?"
"ఎందుకు?"
"మళ్ళీ ఉద్యోగంలో చేరతాను."
ఆమె నవ్వింది.
"మిమ్మల్ని ఇంకా ఉద్యోగంలోకి తీసుకుంటారనే అనుకుంటున్నారా మీరు?"
"ఓ...యస్! నాకు సెంట్ పర్సెంట్ నమ్మకం ఉంది."
"నాకు లేదు."