"ప్లీజ్! జయగారూ!"
"ఎప్పుడు?" అడిగింది నెమ్మదిగా.
"సాయంత్రం ఆరుగంటలకు!"
"సరే."
ఆలోచనల్లోంచి బయటపడింది జయ!
"ఈ అమ్మాయి చాలా బావుంది కదూ?" ఇద్దరమ్మాయిలు తనని చూసిం మాట్లాడుకుంటూ వెళుతున్నారు.
ఎంతో గర్వంగా ఫీలయింది జయ! తను అందగత్తెనని తనకు తెలుసు. ఎంతోమంది తెలియజేస్తూంటారు తనకా విషయం. కొన్ని ప్రేమలేఖలు కూడా వచ్చాయ్, తన అందాన్ని పొగుడుతూ.
"హలో!" దగ్గరకు వస్తూ చిరునవ్వుతో పలకరించాడు కిషోర్.
జయ చిన్నగా నవ్వింది తనవంక చూసి.
"వెళ్దామా?" అడిగాడతను.
"ఊ!"
ఆటోలో కూర్చున్నారిరువురూ.
"ఎక్కడికిటు?"
"ఓ అందమైన కాలనీలోకి..."
"ఎందుకక్కడికి?"
"చూద్దురుగాని..." నవ్వుతూ అన్నాడతను.
జయ గుండెలు భయంతో వేగంగా కొట్టుకోసాగినయ్.
ఆటో ఓ అందమయిన ఇంటిముందాగింది.
ఇద్దరూ దిగి లోపలకు నడిచారు.
తన జేబులోనుంచి తాళంచెవి తీసి ఆ ఇంటి తాళం తెరిచాడు కిషోర్.
"ఎవరిదీ ఇల్లు?" అడిగింది జయ ఆశ్చర్యంగా.
"మా ఫ్రెండ్ ది!" లోపలకు నడుస్తూ అన్నాడతను.
అతన్ననుసరించింది జయ.
లోపల ఖరీదయిన ఫర్నిచర్ అందంగా అమర్చబడి ఉంది. లోపలకు రాగానే తలుపు మూసేవేసి ఆమెను కౌగిలించుకున్నాడు కిషోర్. జయ అతని కౌగిట్లో తనను తను మరచిపోసాగింది.
ఆమెను తన చేతుల్లోకెత్తి పక్కన గదిలో ఉన్న మంచం మీదకు చేర్చాడతను. ఆ తరువాత అతని కౌగిట్లో ఈ ప్రపంచాన్ని పూర్తిగా మర్చిపోయిందామె.
* * * *
వారంరోజులు గడిచిపోయినా ఆ పత్రిక నుంచి జవాబు రాకపోయేసరికి విజయకు చిరాకు పుట్టుకొచ్చింది.
"ఏమిటోయ్! ఆ పత్రిక వాళ్ళు ఇంతవరకూ జవాబివ్వలేదేం?" రజనీని అడిగిందామె.
"బావుంది! నాదే తప్పన్నట్లు మాట్లాడతావేం?" నవ్వుతూ అంది రజని.
"మరిప్పుడేం చేద్దామంటావ్?"
రజని కొద్దిక్షణాలు ఆలోచించింది.
"పోనీ ఓ పని చెయ్! కానీ కొంచెం ఖర్చవుతుంది!"
"ఫరవాలేదులే! జీవితంలో ఒక్క మంచి పనయినా చేయకపోతే ఎలా? ఏం చేయమంటావు, చెప్పు!"
"అరడజన్లు కవర్లు కొను! అన్ని పత్రికలకూ రాసి పడేస్తే ఎవరోఒకరు జవాబు రాయకపోరు..."
ఈ ఆలోచన బాగానే ఉందనిపించిందామెకి. ఆరోజే కవర్లు తెప్పించి అన్ని పత్రికల అడ్రసులూ చూసి పోస్ట్ చేసిందామె.
మళ్ళీ ఎదురుచూడటం మొదలయింది.
మరో వారం తర్వాత ఓ పత్రిక నుంచి ఆమెకు జవాబు వచ్చింది. అందులో ఆ రచయిత అడ్రస్ వుంది. ఆనందంతో పొంగిపోయింది విజయ! ఆ రాత్రి రచయితకు ఉత్తరం రాయడం ప్రారంభించిందామె. ఎలా రాయాలో బొత్తిగా తెలీడంలేదు. కాలేజీలో చదివేరోజుల్లో కథలు కూడా రాసింది తను. కాలేజీ మాగజైన్ లు రెండు కథలు ప్రచురింపబడ్డాయి కూడా! మరిప్పుడీ ఉత్తరం ఎందుకు రాయలేకపోతోందో అర్థంకావడం లేదు. రాత్రి పదకొండైపోయింది.
అప్పటికే చాలా కాగితాలు చింపిపారేసింది విజయ!
ఆమెనే గమనిస్తున్న జయ నవ్వాపుకోలేకపోతోంది.
"ఏమిటక్కా! ఓ రచయితకు ఉత్తరం రాయడం ఇంతసేపా? ఇటివ్వు! నేను రాసి పారేస్తాను" అంది హేళనగా.
"నీ మొఖంలే! నువ్వసలు నవలలు చదవనే చదువవు! ఇంక ఏమని రాస్తావ్?" నవ్వుతూ అంది విజయ.
చివరకు అర్థరాత్రి ఒంటిగంటకు పూర్తయింది ఉత్తరం. చదువుకొంటే సంతృప్తికరంగానే కనిపించిందామెకి.