Previous Page Next Page 
సినీ బేతాళం పేజి 5

                                 

                                         

    పట్టు విడవని నిర్మాత అర్ధరాత్రి అవగానే మళ్ళీ ఊరి బయటున్న సెన్సార్ ఆఫీస్ కెళ్ళి ఫిలిమ్ బాక్స్ భుజాన వేసుకుని ఊరి వేపు నడవసాగాడు. అప్పుడు బాక్స్ లోని సెన్సార్ విలన్లాగా నవ్వి ఇలా అంది.
    "రాజా! ఎందుకలా వడివడిగా నడుస్తున్నావ్? నేను కధ చెప్పెలోగానే మీ ఇల్లు చేరుకోవాలనా? పిచ్చివాడా! నా కధ లేందే నువ్వసలు నడవలేవు గుర్తుంచుకో! సినీ ఫీల్డులో చేరిన ప్రతి నిర్మాత , దర్శకుడూ, మంచి కధలకు మొఖం వాచిపోయి ఉన్నారనుకో! ఎవరే ,కధ చెప్పినా చెవులు రిక్కించుకొని మరీ వింటున్నారు. బావుంటే అక్కడికక్కడే చెప్పినవాడి దగ్గర కొని పారేస్తున్నారు - రచయిత ఎవరయినా గానీ! ఇంకొంతమంది దేవాంతక దర్శకులు రచయిత దగ్గర కధంతా విని "ఓశ్ ఇదా! ఇది నేను కూడా రాశాను. సగం షూటింగు కూడా అయిపొయింది" అని అబద్దం చెప్పేసి రచయిత వాళ్ళూరికి బండెక్కగానే ఆ కధతోనే సినిమా ప్రారంభిస్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నీకూ టైం పాస్ కి ఓ కధ చెప్పాలని విను.
    "అనగనగా మగువ అనే ఓ మగువ వుండేదో ఊళ్ళో! ఆ మగువకు తెగువెక్కువ! ఆమెకు బోలెడు డబ్బుంది. చాలా మందికి లేని అందమయిన శరీర సౌష్టవం ఉంది. ఈ రెండూ ఉండగా ఇంకా లోటేమిటని ఓ సినిమా హీరోని ప్రేమించేసింది. అతనికి ప్రేమ లేఖలు కలుసుకుంది. ఆ హీరోకి ఆమె శరీర సౌష్టవం కన్న ఆమె డబ్బు అందంగా కనబడింది. అంచేత తనూ టకీమని ప్రేమలో పడ్డాడు. ' ఇలా ప్రేమలో పడడం మీకు కొత్తేముంది? ఇప్పటికీ ఎంతో మంది నాలాంటి వాళ్ళని ప్రేమించి ఉంటారు కదూ?" అనడిగింది మగువ హీరో నిజస్వరూపం తెలుసుకోడానికి  కాని ఆ హీరో అలా ప్రశ్నలేసే వాళ్ళని చాలా మందిని చూశాడు. అంచేత తెర మీద నేర్చుకున్న డైలాగుల్లో ఒకటి వినిపించాడామేకి! తను తెర వెనుక మరే స్త్రీనీ చూడలేదని, చూసినా తాకలేదనీ ఒకవేళ తాకినా అన్నాచెల్లెళ్ళ భావంతోనే తాకాననీ చెప్పేశాడు. మగువ ఆ మాటలకు మురిసిపోయి అలాంటి అపర శ్రీరామ చంద్రుని చేసుకోవడం తన అదృష్టమని ఆనందించింది.
    ఇద్దరికీ ఝూమ్మని పెళ్ళయిపోయింది.
    ఆ రాత్రే ఆమెను విమానంలో మద్రాస్ తీసుకెళ్ళి పోయాడు హీరో.
    ఏరో డ్రం నుంచీ ఓ పెద్ద పడవ లాంటి కార్లో హీరో మేడకు చేరుకున్నారు.
    'ఇది మనకు తొలిరేయి మగువా! మన జీవితంలో మైలు రాయిలా నిలిచిపోవాలి హాయి! కానీ నాకు పొద్దున్నే అయిదింటికి షూటింగుంది. సూర్యోదయం షాట్స్, అందుకని పెందలాడే పడుకుందాం ఏం?" అనేసి కాసేపు ప్రణయ కలాపాలు జరిపి నిద్రలోకి జారిపోయాడు.
    ఉదయం అయిదింటికి అతను లేచి రడీ అయి 'మగువా! నే వెళుతున్నా! అన్నాడు.
    "ఒకే!' అంది మగువ ఇంకా నిద్రమత్తులోనే.
    'ఇంకో గంటాగితే నౌఖరు వస్తాడు! వాడితోనే కాఫీ, టిఫిను తయారు చేయించుకో" చెప్పేసి వెళ్ళిపోయాడతను.
    మగువ మళ్ళీ నిద్రలో మునిగిపోయింది.
    గంటవగానే నౌఖరు వచ్చేశాడు. ఇల్లంతా నీట్ గా సర్దేసి ఆ తరువాత పడగ్గదిలో కొచ్చి అక్కడి మగువ వంటి మీదున్న దుప్పటి కాస్తా లాగి పారేశాడు.
    మగువ ఉలిక్కిపడి కెవ్వున అరుస్తూ తన నగ్న శరీరాన్ని చేతుల్తో కప్పేసుకుంటూ కూర్చుంది.
    నౌఖరు ఆమె వేపు కోపంగా చూశాడు.
    "నోర్మూసుకో! ఏమిటా గావుకేకలు! ఏదో కొంప మునిగినట్లు! టైమెంతయిందో తెలుసా? ఎడవుతోంది . లేచి త్వరగా బట్టలు కట్టుకుని నీ కొంపకు పో!" రోజూ ఏడింటి దాకా పడుకోవటం బాగా అలవాటయిపోయింది వీళ్ళకు' అన్నాడు గొణుక్కుంటూ.
    మగువ తెల్లబోయింది.
    ఏడుస్తూ బట్టలు కట్టుకుని ఆ రోజే విదాకులకి అర్జీ పెట్టుకుంది.
    ఇంతవరకూ చెప్పి సెన్సార్ ఇలా అడిగింది.
    "రాజా ! మగువ కావాలని ఆ హీరోని చేసుకుని మళ్ళీ విడాకులెందుకు కోరింది. ఈ కధలో నీతి ఏమిటి? ఈ ప్రశ్నలకు తెలిసీ సమాధానం చెప్పక పోయావో..."
    "తెలుసులే? నా తల వెయ్యి ముక్కలవుతుంది. అంతేగా! ఆ హీరోకి రోజుకో అమ్మాయిని ఇంటికి తెచ్చుకునే అలవాటుందని మగువకు నౌఖరు మాటల వల్ల తెలిసింది. అలాంటి శీలం లేనివాడు తనకవసరం లేదని విడాకులకు అర్జీ పెట్టుకుంది. ఈ కధలో నీతి ఏమిటంటే ఏది తెర వెనుక డైలాగో, ఏది తెర మీద డైలాగో తెలీందే హీరో మాటలు నమ్మి పెళ్ళాడరాదు" అన్నాడు నిర్మాత చిరాగ్గా.
    ఈ విధంగా అతనికి మౌనభంగం కాగానే సెన్సార్ ఫిలిమ్ బాక్స్ తో సహా సెన్సార్ ఆఫీసు వేపు ఎగిరిపోయింది .

                                         ***

 Previous Page Next Page