"8 డౌన్ సికింద్రాబాద్ లో వ్యాక్యూమ్ కోసం డిటెయిన్ అయిన విషయం మీకు తెలిసిందా?"
"తెలుసు" బలవంతంగా కసి అణుచుకుంటూ అన్నాడు.
"కెన్ యూ డూ సమ్ థింగ్ ఎబౌటిట్?"
రక్తం శరీరాన్ని చీల్చుకుని బయటకు వచ్చేట్లుంది.
"అయ్ నో వాట్ టుడు - అండ్ వాట్ నాట్ టు డూ! మైండ్ యువరోన్ బిజినెస్" అనేసి ఠక్కున ఫోన్ పెట్టేశాడు.
ఫోన్ పెట్టేయగానే ఎక్కడలేని ఆనందం అతనిని అమాంతం ఆవహించింది.
భలే పాఠం చెప్పాడుతను.
చావు దెబ్బ తినివుంటాడు సీనియర్ డి.ఓ.యస్.
అయితే సీనియర్ డి.ఓ.యస్.రామచంద్రరావ్ తనిచ్చిన డోస్ ని అంత తేలిగ్గా తీసుకోడనితనకు తెలుసు. డి.ఆర్.ఎమ్ కి రిపోర్టు చేస్తాడు. కనుక డి.ఆర్ ఎమ్ తనకు ఫోన్ చేయకముందే తను స్టేషన్ కెళ్ళటం మంచిది. లేచి త్వరత్వరగా డ్రస్ చేంజ్ చేసుకుని కారులో సికింద్రాబాద్ స్టేషన్ కి బయల్దేరాడు.
* * *
రాత్రి పదకొండయిపోయింది. అందరూ ఇంజన్ దగ్గరే నిలబడివున్నారు. సీనియర్ డి.యస్.ఇ.చీఫ్ మెకానికల్ ఇంజనీర్, లోకో సేఫ్టీ కౌన్సిలర్, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్, స్టేషన్ సూపరింటెంట్.
ఇంతమంది అధికారులు ఇంజన్ లోపల, బయట నిలబడే సరికి డ్రైవర్ గురుమూర్తి లోలోపల కంగారుగా వుంది.
ఎక్స్ ప్రెస్ ట్రెయిన్ ఇంతసేపూ డిటెయిన్ అయిపోతే ఎవరోకరు సమాధానంచెప్పాల్సి వుంటుంది. సాధారణంగా ఒకరిద్దరినయినా సస్పెండ్ చేయటంచాలా మామూలు విషయం. వ్యాక్యూమ్ క్రియేట్ చేసే బాధ్యత ట్రెయిన్ ఎగ్జామినర్ దే అయినా కూడా డ్రైవర్ల ను కూడా శిక్షించిన సందర్భాలున్నాయి.
హఠాత్తుగా గేజ్ లో ముల్లు కదలటం ప్రారంభించింది. అందరి మొఖాల్లోనూ ఆత్రుత - రిలీఫ్!
యాభై అయిదు మీదకువచ్చింది నీడిల్.
ఇంకా ముందుకి నెమ్మదిగా కదులుతూనే వుంది.
"ఇటీజ్ ఓ.కే" అన్నాడు చీఫ్ మెకానికల్ ఇంజనీర్.
"కమాన్, హరీఅప్" అరిచాడు సీనియర్ డి.యస్.ఇ.దత్తా 'టి.ఎక్సార్' మోహన్రావ్ వేపు చూస్తూ.
రాజు వ్యాక్యూమ్ సర్టిఫికెట్ డ్రైవర్ ముందుంచాడు.
గురుమూర్తికి సంతకం చేయాలంటే భయంగా వుంది మరోసారి నీడిల్ వేపుచూశాడు. ఎందుకో అదినిలకడగా వున్నట్లులేదు.
"ఇంకా ఏం చూస్తున్నావ్? కమాన్! సంతకం చెయ్" అరిచాడు దత్తా.
గురుమూర్తికింక గత్యంతరం లేకపోయింది. అయిష్టంగానే స్మతకం చేశాడు. ఆఫీసర్ ఆర్డర్స్ ఇచ్చాక తను సంతకం చేయకపోతేలేనిపోని గొడవల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. రాజు ఆ పుస్తకం తీసుకుని వెనక్కు పరుగెత్తాడు. డీజిల్ అసిస్టెంట్ మ్జన్ విజిల్ బటన్ ప్రెస్ చేశాడు.
ఆ విజిల్ వినటంతోనే అంతవరకూ ఫ్లాట్ ఫారమంతా తిరుగుతూన్న ప్రయాణీకులందరూ పరుగుతో ట్రెయిన్ ఎక్కేశారు. గార్డ్ బ్రేక్ లోని గేజ్ లో కూడా నీడిల్ ముఫ్ఫయ్ మీదకొచ్చింది.
గార్డ్ ద్వారకానాధ్ గ్రీన్ సిగ్నల్ చూపాలా వద్దాని ఓ క్షణం ఆలోచించాడు కానీ ఆ పక్కనే అసిస్టెంట్ సూపరింటెండెంట్ గట్టిగా అరచాడు "ఇటీజ్ ఓకే-కమాన్ హరీ అప్!" ఎలక్ట్రికల్ హాండ్ సిగ్నల్ లాంప్ ని గ్రీన్ కి మార్చిచూపించాడతను. ట్రెయిన్ స్టార్టయింది.
* * *
"యూ ఆర్ సస్పెండెడ్" అన్నాడు దత్తా 'టి ఎక్సార్' మోహన్రావ్ వేపు కసిగా చూస్తూ.
మోహన్రావ్ నిరుత్తరుడయిపోయాడు.
"అదేమిటి సార్! నేనెంత స్ట్రగులయానో మీరూచూశారు-" దిగాలుపడిన మొఖంతో అన్నాడతను.
అతని మొఖంలోని దిగులు, కలవరపాటు , భయం చూసేసరికి దత్తాకి ఎక్కడలేని ఆనందం కలిగింది. మానసికంగా ఎంతో రిలీఫ్ కలిగిన ఫీలింగ్ తో చకచకబయటకు నడిచాడు.
* * *
హఠాత్తుగా గమనించాడు భవానిశంకర్.
యువరాణిని తనింతకుముందెక్కడో చూశాడు అతని గుండె వేగంగా కొట్టుకోసాగింది. మనసు శరవేగంతో జ్ఞాపకాలనుతవ్వుకుంటూ వెళ్తోంది.
మరింత పరీక్షగా ఆమె మొఖంలోకి చూశాడు.
ఆ విషయం గమనిస్తూనే ఆమె కొంచెం చిరాకుగా చూసిచూపులు మరల్చుకుని కిటికీలోంచి బయటకుచూడసాగింది.
తను ఆ యువరాణిని ఎప్పుడో, ఎక్కడో చూడటమే కాదు ఆమెతో చాలా పరిచయంకూడా వుంది.
కానీ ఎక్కడ అనేది గుర్తురావటం లేదు.
ఆ బాలక్ తో సంభాషణ ప్రారంభిస్తే గానీ ఆ విషయంలో కొంత అయినా ముందుకివెళ్ళటం సాధ్యంకాదని అర్ధమయిందతనికి.
"హల్లో మైడియర్ బాలక్! నీ పేరేమిటి?" అడిగాడతను.
"మనోజ్ కుమార్"
"వెరీగుడ్ నేమ్ బాలక్ అన్నీ దేశభక్తి సినిమాలు తీసే పేరది"
"అవునంకుల్, ఆ సినిమాలు చూసే మా డాడీ ఆ పేరు పెట్టారునాకు"
"జయీ భవ మనజాతే సినిమాజాతి బాలక్ సినీ జాతి - సినీ ప్రజాజీవితాన్ని సినిమా ఫక్కీలో నడిపే ఏకైక నేషన్ మనదే ఇంతకూ మీ డాడీ పేరేమిటి?"
"నాగయ్య"
"ఓ! మీ తాతగారు చిత్తూరునాగయ్యగారి సినీ నటనావైదుష్యాన్ని చూసి ఆనందం పట్టలేక మీ డాడీకి ఆ పేరు పెట్టివుంటారనడంలో ఎలాంటి సందేహంలేదు నాకు."
కుర్రాడు ఆశ్చర్యపోయాడు. యువరాణి నవ్వాపుకుని సీరియస్ గా చిత్రజ్యోతి చదువుకోసాగింది.
"నిజమే అంకుల్, మీకెలా తెలిసిందా సంగతి?"
"అన్నం మెతుకు చాలుబాలక్. మిగతాదంతా దున్నేస్తాం, బైదిబై మీ మమ్మీపేరేమిటి?"
"కాంచన మాల"
"వాళ్ళ డాడీ కాంచనమాల భక్తుడవటంలో అనుమానం లేదుకదూ?"
"అవునంకుల్ మా అమ్మమ్మ గారింట్లో ఇప్పటికీ పెద్ద పెద్ద కాంచనమాల ఫోటోలున్నాయి".
"అద్భుతం మనోజ్ కుమార్! నువ్వు పెద్దయి బాగా డబ్బు సంపాదించిసినిమాలు తీస్తావనడంలో నాకెలాంటి సందేహంలేదు. అసలు మీ కుటుంబానికి 'సినిమా విభూషణ్" పరమ సినీ చక్ర' లాంటి అవార్డులను రిపబ్లిక్ దే పెరేడ్ లో ఎప్పుడో ఇచ్చి వుండాల్సింది. ఎందుకివ్వలేదో తెలీటం లేదు. బహుశా మీ సిస్టర్ పేరు సినిమా పేరు కాకపోవడంవల్ల ఇవ్వలేదనుకుంటాను-"
యువరాణి చివాలున తలతిప్పి కోపంగా భవానీశంకర్ వైపు చూసింది.
"కాకపోవటమేమిటంకుల్ అక్కయ్య పేరు జయసుధ"
జయసుధ అంటేతను కైకలూరులో చదివేటప్పుడు తనతోపాటు ఆరోక్లాసుచదివిన జయసుధ డిబేటింగ్ పోటీలో సెకండ్ ప్రైజ్ కొట్టిన జయసుధ తనుగీతతో స్నేహంచేసినందుకు తనతోమాట్లాడకుండా పచ్చికొట్టేసిన జయసుధ కన్యాశుల్కంతో గిరీశం పాత్రాభినయంచేసిన జయసుధ.
"ఏయ్ మిస్టర్" కోపంగా పిలిచింది జయసుధ.
భవానీశంకర్ ఆశ్చర్యంగా చూశాడామె వైపు.
"యస్ మిస్ జయసుధా"
"ప్లీజ్ మైండ్ యువరోన్ బిజినెస్" కటువుగా అనేసి మళ్ళా సినిమాపత్రిక చదువుకోసాగింది.
"ప్రస్తుతం నా స్వంత బిజినెస్ అంటూ ఏమీలేదు మైడియర్ ప్రిన్సెస్. అది ఏర్పాటుచేసుకునేవరకూ చుట్టుపక్కలున్న వ్యాపారస్తులకు కలిగే అసౌకర్యానికి క్షంతవ్యున్ని".
ఆమె కోపం ఈ సారి బాలక్ మీదకు మళ్ళింది.
"ఒరే మనోజ్"
"ఏమిటక్కా?"
"నువ్వు నోర్మూసుకుని కూర్చో ఎవరు పలకరించినా మాట్లాడవద్దు. ఆ పుస్తకాలు కూడా అతనిదగ్గర పడేయ్".
బాలక్ భయపడిపోయి తను చదువుతున్న ఆస్టిరిక్స్ తీసి భవానీ శంకర్ పక్కన పడేశాడు.
"వెరీ బ్యాడ్ మైడియర్ ఫ్రెండ్, ఓ పక్క దేశమంతా 'నేషనల్ ఇంటె గ్రేషన్' అంటూ కోడయి కూస్తుంటే ఈ స్లీపర్ కోచ్ లోని కంపార్ట్ మెంటులో వున్న ముగ్గురిలో రెండు గ్రూపులు - ఒక గ్రూప్ ని ఇంకో గ్రూప్ చురచురా చూడటం, ఒకరితో ఒకరుమాట్లాడకూడదనీ, ఒకరి పుస్తకాలు ఒకరు చదవకూడాదనీ ఆంక్షలు పెట్టడం - చాలా బాధాకరమైన విషయం ఈ విషయం తెలిసే టి.వి.లో మళ్ళీ ఒక హిందూ, సర్దార్ జీ, ముస్లిమ్ భాయ్ బాయ్ సీరియల్ స్టార్టయిపోతుంది. బై ది బై మీ వంశంలో ఎవరికయినా 'ఎల్టీటిఈ' తో కనెక్షన్స్ వున్నాయా?"
ఆమె ఆ మాటలతో సంబంధం లేనట్లు పుస్తకం చదువుకోసాగింది కానీ ఆ బాలక్ వుండబట్టలేకపోయాడు.
"ఆ, అవునంకుల్! మా పెద్దక్కవాళ్ళ పిల్లల్ని 'ఎల్టీటియి' అంటారు."
"మనోజ్" కోపం పట్టలేకఅందామె.
మనోజ్ కంగారు పడిపోయాడు.
"థాంక్యూ బాలక్ చాలా విలువయిన ఇన్ ఫర్మేషన్ అందించావ్. లేకపోతే మీ తాలూకూ ఎ.కె-47 కి బలయిపోయివుండేవాడిని".
ఆమెకు నవ్వు, కోపం రెండు వచ్చినయ్.
"అన్నట్లు మైడియర్ బాలక్! నువ్వెప్పుడయినా కన్యాశుల్కం పుస్తకం చదివావా?"
"లేదంకుల్, సినిమా చూశాను."