Previous Page Next Page 
కార్నర్ సీట్ పేజి 5


    ఆఫీస్ కెళ్తూనే శాంతను కలుసుకుందామె.
    "అర్జంటుగా వర్కింగ్ వుమెన్ హాస్టల్లో చేరాలే... మా అత్తయ్య వాళ్ళతో గొడవ పడ్డాను."
    "పెళ్ళి విషయమేనా?"
    "ఊ! రాత్రి తేల్చి చెప్పేయాల్సివచ్చింది."
    శాంత ఆలోచనలో పడింది.
    "కనీసం రెండు నెలలన్నా అయితేగాని ఖాళీ దొరకదు."
    "అంతవరకూ ఎలా?"
    "పోనీ ఓ పని చెయ్...ఎంటర్ ఏజన్సీస్ ఎవరిదగ్గరయినా ఎంక్వయిరీ చెయ్...సపరేట్ ఎకామడేషన్ దొరుకుతుందేమో..."
    ఆ ఆలోచన బాగానే ఉన్నట్లనిపించింది సావిత్రికి.
    సాయింత్రం కోఠీ దగ్గర బస్ దిగి తిన్నగా ఓ ఎజన్సీస్ ఆఫీస్ లోకి నడిచింది.
    ఓ లావుపాటి వ్యక్తి కూర్చుని ఉన్నాడక్కడ.
    అతనికెదురుగా నాలుగు కుర్చీలు...
    అప్పటికే ఓ యువకుడు కూర్చుని ఉన్నాడక్కడ.
    "కూర్చోమ్మా...ఇలా కూర్చోండి!" అన్నాడతడు సావిత్రిని చూడగానే__
    సావిత్రి ఓ కుర్చీలో కూర్చుంది.
    "ఊ చెప్పండి బాబూ__వివరాలు చెప్పండి..." అన్నాడతను ఆ యువకుడితో...
    "అడగందే..."
    "తమరి పేరు?"
    "శ్రీరామ్..."
    "తమరి చిరునామా?"
    "ఏడ్చినట్లుంది...! చిరునామా లేకేగదయ్యా నీదగ్గరకొచ్చింది? ఆ చిరునామా కోసమే నీకు పాతిక రూపాయలు సమర్పించుకున్నాను."
    సావిత్రికి నవ్వాగలేదు.
    అప్పుడు చూసిందనివైపు పరీక్షగా.
    సన్నగా ఉన్నా బలిష్టంగా వుంది శరీరం! స్పోర్ట్స్ మన్ అయుంటాడనటంలో సందేహం లేదు. నవ్వుతూంటే చాలా ఆకర్షణీయంగా ఉందతని రూపం.
    "అంటే తమరు ప్రస్తుతం ఉండం..."
    "ఫుట్ పాత్ అనుకో__"
    "భలేవారే_అది మాత్రం చిరునామా కాదేమిటిసార్. ఈ రోజుల్లో చాలామంది చిరునామా అదే!"
    "మా ఫ్రెండ్ గదిలో ఉంటున్నాను. అంచేత అదేం రాసుకోకు...వారం రోజుల్లో నువ్వు అద్దె ఇల్లు చూపించినా, లేకపోయినా ఆ గది ఖాళీ చేసెయ్యాలి..."
    రామలింగం ఏదో రాసుకున్నాడు.
    "తనలాంటి పరిస్థితే" అనుకుంది సావిత్రి.
    "అద్దె ఎంతలో వుండాలి?"
    "నా జీతం ఎనిమిదొందలు! అందులో మా ఇంటికి కనీసం రెండు వందలయినా పంపాలా వద్దా?"
    "పంపాలి పంపాలి...పంపకపోతే ఎలా?"
    "మిగిలిన ఆరొందల్లో నేను తిండి తినటం కోసం, ఇంకో మూడొందలు అవుతాయి కదా?"
    "ఎందుకవవు?"
    "ఇంక మిగిలింది మూడొందలు! మరి అందులో నా సిగరెట్లకు, సినిమాలకూ, హెయిర్ కటింగ్ కీ, సబ్బులకూ ఓ వంద పోతుందా?"
    "సరే__రెండొందల్లో ఒక గది అని రాస్తాను..."
    "చిన్నదయినా ఫర్లేదు. అందులో నేను కాళ్ళు ముడుచుకోకుండా, తల వంచుకోకుండా పడితే చాలు."
    "సరే...ఏ ఏరియాల్లో కావాలి?"
    "కొంచెం మా ఆఫీసుకి దగ్గరగా అయితే బావుంటుంది. లకడీకఫూల్, హిమాయత్ నగర్; హైదర్ కూడా..."
    అతను రాయటం ఆపి ఆ యువకుడి వైపు చూశాడు సీరియస్ గా.
    "ఆ ఏరియాల్లో రెండొందలకు గది కావాలా?"
    "గదీ, కిచెన్ కూడా దొరికితే ఇంకా బావుంటుంది."
    "సరే! దొరుకుతుంది. కానీ ఇప్పుడు కాదు...భూకంపం వచ్చి పూర్తిగా జన నష్టం జరిగితే, తమరొక్కరే మిగిలితే...అప్పుడు."
    సావిత్రితోపాటు శ్రీరామ్ కూడా నవ్వేశాడు.
    "అయితే ఎంతవుతుందంటారు?"
    "మూడొందల యాభై కనీసం__"
    "మీరు బంజారాహిల్స్ గురించి చెపుతున్నట్లున్నారు"
    "అక్కడికి నీలాంటి వాళ్ళనసలు రానీరు. వెంబడించి తరుముతారు_"
    "అయితే నా రేంజ్ లో గదులెక్కడ దొరుకుతాయి"
    "వూరి బయట...మల్కాజ్ గిరి, కూకట్ పల్లి, దిల్ షుక్ నగర్, వనస్థలిపురం..."
    "బాబ్బాబు మరీ అలా గెంటేయకండి! ఏ పాతికో యాభయ్యో అటూ ఇటూ దగ్గర్లోనే చూడండి..."
    "సరే! రేపు సాయంత్రం రండి."
    శ్రీరామ్ లేచి నుంచుని వెళ్ళబోతూ సావిత్రి వైపు చూశాడు. అంతవరకూ అతనినే నవ్వుతూ చూస్తున్న సావిత్రి చప్పున చూపులు మరల్చుకుంది.
    అతను రెండడుగులు వేసి మళ్ళీ వెనక్కు తిరిగివచ్చాడు.

 Previous Page Next Page