"నీ బర్త్ డే కదా... రెండు గంటలసేపు, నీ వైభవాన్ని కళ్ళారా చూడాలని వచ్చాను" సిగార్ వెలిగిస్తూ అన్నాడు కృపానంద దేశ్ ముఖ్.
నీ వైభవాన్ని, నీ సంపదను, నీ అంతస్తును, నీ వైభవాన్ని కళ్ళారా చూడటానికి వచ్చానని తనతో చెప్పేవాళ్ళు చాలా అరుదన్న విషయం తెలిసిన శుక్రవర్ణ మహంత నవ్వాడు.
"ఈ మార్బెల్లా సిటీని, ఈ కాస్టిలీయస్ట్ గెస్టుల్ని చూసి నా వైభవాన్ని అంచనా వేస్తున్నారా మీరు... అలాగనుకుంటే, మీరు పొరపాటు పడినట్టే" నవ్వుతూ అన్నాడు శుక్రవర్ణ మహంత.
"నువ్వు తలచుకుంటే ఓపెన్ స్పేస్ లో ఫంక్షన్ ని ఎరేంజ్ చేయగలవ్.. ఆ విషయం నాకు తెలుసు. కానీ అటు అమెరికన్స్, ఇటు రష్యన్ డీలింగ్స్ పాడవటం ఇష్టంలేక... ఫంక్షన్ ని ఇక్కడ ఎరేంజ్ చేసి వుంటావ్... అవునా?"
ప్రపంచాన్ని తన గ్రిప్ లో వుంచుకోడానికి ప్రయత్నిస్తున్న శుక్రవర్ణ మహంతకు అది పొగడ్తో, తిట్టో అర్ధంకాలేదు. సంశయంగా కృపానంద దేశ్ ముఖ్ వైపు చూశాడు.
"నౌ... అయామ్... వెరీ హేపీ కృపానంద సాబ్! కమాన్... పార్టిసిపేట్ విత్ మీ హేవ్ యువర్ ఫన్."
శుక్రవర్ణ మహంత టాపిక్ ని డైవర్టు చెయ్యడం వెంటనే గ్రహించాడు కృపానంద దేశ్ ముఖ్.
మరో మాట మాట్లాడకుండా ముందుకు అడుగువేశాడు.
అతిరధులు, మహారధుల మధ్య శుక్రవర్ణ మహంత బర్త్ డే ఫంక్షన్ ప్రారంభమైంది.
కార్యక్రమం నలభై అయిదు నిమిషాలసేపు జరిగింది.
స్పానిష్ శిల్పుల నేర్పరితనానికి- అత్యద్భుత కళా వైభవానికి నిదర్శనంలా వుంది ఆ డైనింగ్ హాల్.
రాయల్ గెస్టుల్ని స్వయంగా ఇన్ వైట్ చేస్తున్నాడు శుక్రవర్ణ మహంత. పాదరసం రంగు డిన్నర్ జాకెట్లో ఫ్లాష్ లైట్ల వెలుగులో గులాబీ రంగు శుక్రవర్ణ మహంత బుగ్గలు, పెదవులు మరింత ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి. డైనింగ్ హాల్ కు ఎడమ ప్రక్కన ప్రత్యేక వేదిక మీద మాడ్రియల్ సింగర్స్ మంద్ర స్వరంతో ఆలపిస్తున్న గీతాలు. ఆహుతుల్ని మత్తులోకి తీసుకెళ్తున్నాయి. డైనింగ్ టేబుల్ మధ్యన శుక్రవర్ణ మహంత కూర్చున్నాడు. ఎడమ ప్రక్కన కుందనిక, కుడి ప్రక్కన క్వీన్ ఎలిజిబెత్, ఆమెకు కొంచెం దూరంలో బ్రూక్ షీల్డ్స్, ఆ తర్వాత మైకెల్ జాక్సన్ బెనజీర్ భుట్టో వరసగా... అతిధులందరూ కూర్చున్నారు.
లైట్ బ్లూ కలర్ యూనిఫార్మ్ లోని సిబ్బంది బంగారు ప్లేట్స్ లో వంటకాల్ని వినయంగా వడ్డిస్తున్నారు.
కాస్ట్ లీ జోకులు, విలువయిన నవ్వులు, ఖరీదయిన సొగసులు... అంతర్జాతీయ వ్యాపార సంబంధాలు... సుతిమెత్తని నవ్వుల వెనక ఎత్తుగడలు... ఊహకు అందని వ్యక్తుల విచిత్ర వ్యూహాల వింత సమ్మేళనం.
రాబర్ట్ మర్చంట్ ఆధ్వర్యంలో డిన్నర్ ఏర్పాట్లు సిస్టమేటిగ్గా జరిగిపోయాయి.
ఆ ఏర్పాట్లను చూసి ఆనందించాడు మహంత.
ఒక్కసారిగా హాలు నిశ్శబ్దంతో నిండిపోయింది.
తన ఆతిధ్యాన్ని స్వీకరిస్తున్న రేర్ గెస్టులవైపు ఆనందంగా చూసి, అకస్మాత్తుగా ఏదో జ్ఞాపకానికొచ్చి...
తలతిప్పి తన ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ రాబర్టు మర్చంట్ వైపు సాలోచనగా చూశాడు మహంత.
ఆ చూపులోని భావాన్ని అర్ధం చేసుకున్నాడు రాబర్టు మర్చంట్. రెండడుగులు ముందుకు వేసి...
"ఎస్ మిస్టర్ చీఫ్! మీరు చెప్పినట్టుగానే సిద్దార్ధ ఈ ఫంక్షన్ కు రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాటు చేశాను" ఇంగ్లీషులో చెప్పాడు రాబర్టు మర్చంట్.
సిద్ధార్ధ మహంత... మరణించిన మొదటి భార్య మాయాదేవి కొడుకు.
మహంత ఎంపైర్ కి కాబోయే వారసుడు.
"ఈ ఫంక్షన్ కి సిద్ధార్ధని మీరు ఎలో చేసుంటే బావుండేది" నెమ్మదిగా అంది సెకండ్ వైఫ్ కుందనిక.
ఆమె గుండ్రటి కళ్ళవైపు సూటిగా చూశాడు మహంత. మహంత కనుచూపుల్లోని భావాన్ని వెంటనే గ్రహించిన కుందనిక మరో మాట మాట్లాడలేదు.
సిద్ధార్ధ విలక్షణమైన పేరులాగానే, విలక్షణమైన వ్యక్తిత్వం... వ్యక్తిత్వం ఒక వ్యక్తికి సహజంగానే వచ్చే గుణం. కానీ సిద్ధార్ధ విషయంలో అది నిజం కాదు. ఒక శిల్పి, శిల్పాన్ని తయారు చేస్తున్నట్టుగా సిద్ధార్ధను తయారు చేస్తున్నాడు మహంత.
సిద్ధార్ధ మహంత ఏకైక కుమార రత్నమని అందరికీ తెలుసు.
కానీ... సిద్ధార్ధ ఎక్కడుంటాడో, ఎలా వుంటాడో, ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలీదు.
ఒక్క మహంతకు, రాబర్టు మర్చంట్ కు తప్ప.
సిద్ధార్ధ జ్ఞాపకం రాగానే మహంత హృదయం ఆనందంతోనూ, గర్వంతోనూ వుప్పొంగిపోయింది.
అప్పటికి గెస్టులు ఒక్కొక్కరూ డైనింగ్ టేబుల్ దగ్గర్నించి లేవడం ప్రారంభించారు.
* * * *
కోస్టాడీ సోల్ బీచ్ ప్రాంతంలోని ఎయిర్ పోర్టులో స్పెషల్ ఫ్లైట్స్ ఒక్కొక్కటీ నెమ్మదిగా పైకి లేస్తున్నాయి.
తన సహజసిద్ధమైన పద్ధతిలో రాయల్ గెస్ట్ లకు వీడ్కోలు పలుకుతున్నాడు మహంత.
క్వీన్ ఎలిజబెత్, బిల్ క్లింటన్, యాసర్ అరాఫత్, బెనజీర్ భుట్టో, రాస్ పెరో, మైకేల్ జాక్సన్ లు ఎక్కిన ఫైట్ల్స్ గాల్లోకి ఎగురుతున్నప్పుడు స్పెషల్ ఆర్మీ వాయించిన వీడ్కోలు సంగీతం హృద్యంగా వుంది.
ఎయిర్ పోర్టు దగ్గర్నించి తిరిగొస్తూ బీచ్ మైదానంలో ఆగాడు మహంత.
బీచ్ పోర్టులో లాండ్ చేసిన మహంతకు చెందిన స్పెషల్ డొమెస్టిక్ షిప్పుల్ని చూస్తున్నారు కొంతమంది గెస్టులు.
ఆ రెండు డొమెస్టిక్ షిప్స్ రెండు ప్యాలెస్ ల్లా వున్నాయి. సముద్ర ప్రయాణాలు చేసేటప్పుడు ఆ షిప్పుల్ని వాడతాడు మహంత. ఒక షిప్ లో తను, తన ఫ్యామిలీ, తన పర్సనల్ స్టాఫ్... రెండో షిప్ లో మిగతా డొమెస్టిక్ స్టాఫ్.