Previous Page Next Page 
ఆక్రోశం పేజి 5


    ఆ బర్త్ డే గిఫ్ట్ సింహపు పిల్ల.

 

    నవ్వుతూ సింహపు పిల్లను అందుకుని ఆ సింహపు పిల్లను ముద్దాడుతూ దాని కళ్ళవైపు చూశాడు మహంత.

 

    "బ్యూటీఫుల్ లయన్ కచ్..." పక్కనున్న కుందనిక మహంత వైపు చూస్తూ అంది.

 

    "గోళ్ళు పెరగని ప్రతి క్రూర జంతువూ అందంగానే కన్పిస్తుంది" తనదైన స్టయిల్లో అనేసి ప్రమోద్ పుష్కర్ణ భుజమ్మీద చరిచి ముందుకు అడుగు వేశాడు.

 

    మహంత నవ్వుతూనే మామూలుగానే ఆ కామెంట్ చేశాడు. ఆ కామెంట్ లోని గూఢార్ధాన్ని వెతుక్కుంటున్నాడు ప్రమోద్ పుష్కర్ణ.

 

    ప్రమోద్ పుష్కర్ణ ఎస్.ఎమ్ బిజినెస్ వరల్డ్. ఇండియాలోని ఆఫీసుకి చీఫ్ ఎగ్జిక్యూటివ్!

 

    గార్డెన్ లోకి అడుగుపెట్టిన శుక్రవర్ణ మహంత, అతిధుల అభినందనల్ని అందుకోవడానికి రెండుగంటలు పట్టింది.

 

    శుక్రవర్ణ మహంత ఎంపైర్ లో అతి కీలకమైన పవర్ ఫుల్ పర్సనల్ ఎగ్జిక్యూటివ్. అసిస్టెంటు రాబర్ట్ మర్చంట్ వెంటరాగా గార్డెన్ అంతా కలయ తిరుగుతున్నాడు మహంత.

 

    బిల్ క్లింటన్, యూసర్ అరాఫత్ ల అభినందనల్ని అందుకొని, ముచ్చట్లాడి, మైకేల్ జాక్సన్ ని ప్రేమగా కౌగలించుకొని, బ్రూక్ షీల్డ్స్ పెదవులపై ముద్దు పెట్టుకుని, జెఫ్రీ ఆర్బర్ తో జోకులేసి, ముందుకెళ్తున్న శుక్రవర్ణ మహంత-

 

    దూరంగా-

 

    స్విమ్మింగ్ ఫూల్ దగ్గర ఒంటరిగా టేబుల్ ముందు కూర్చుని, నీళ్ళలోని వెలుగు కదలికల్ని చూస్తున్న ఆ వ్యక్తివైపు చూసి ఆశ్చర్యంగా ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ రాబర్టు మర్చంట్ వైపు చూశాడు.

 

    "ఎవరా వ్యక్తి? అక్కడ ఒంటరిగా కూర్చున్నాడేం..." సంశయంగా అడిగాడు మహంత.

 

    "హి లైక్ లోన్లీనెస్! మీకా విషయం తెలుసు. ఎవరో కూడా మీకు తెలుసు" ఇంగ్లీషులో చెప్పి, మెల్లగా నవ్వాడు రాబర్ట్ మర్చంట్.

 

    ముఖం స్పష్టంగా కనిపించకపోయినా, ఆ వ్యక్తిని పోల్చుకున్నాడు శుక్రవర్ణ మహంత.  

 

    ఆ వ్యక్తిని చూసి పదేళ్ళయింది. బర్త్ డే ఫంక్షన్ కి రమ్మని అందరితోపాటూ ఆ వ్యక్తికి కూడా ఇన్విటేషన్ కార్డు పంపాడు.

 

    హాట్ లైన్ లో స్వయంగా మాట్లాడి, ఇన్ వైట్ చేద్దామనుకున్నాడు. పనుల వత్తిడి వల్ల మరిచిపోయాడు.

 

    ఆయన్ని ఆ సమయంలో అక్కడ చూడడం శుక్రవర్ణ మహంతకు థ్రిల్లింగ్ గా వుంది.

 

    దానిక్కారణం వాళ్ళిద్దరి ముప్పైఏళ్ళ సాహచర్యం.

 

    గబగబా ముందుకి నడిచాడు శుక్రవర్ణ మహంత.

 

    రాబర్టు మర్చంట్ అక్కడే ఆగిపోయాడు. తను మహంత వెనక ఎంతవరకు వెళ్ళాలో ఆ హద్దులు రాబర్టు మర్చంట్ కు తెలుసు.

 

    తనకు బాగా సన్నిహితుడైన ఆ వ్యక్తి ఫంక్షన్ కు వచ్చినట్లు ఎవరూ చెప్పకపోవడం ఆశ్చర్యంగా వుంది శుక్రవర్ణ మహంతకు.

 

    అడుగుల చప్పుడికి తల తిప్పాడు ఆ వ్యక్తి.

 

    ఆ వ్యక్తి-

 

    కృపానంద దేశ్ ముఖ్. అరవై రెండేళ్ళ దేశ్ ముఖ్ యుద్ధ వీరుడిలా వుంటాడు.

 

    ఆరడుగుల పొడవు, శ్వేతవర్ణంలోకి మారుతున్న నలుపురంగు జుత్తు, బంగారు రజాన్ని, పాలమీగడతో కలిపినట్టు దేహం రంగు, చిన్న కళ్ళు, పొడవాటి ముక్కు, బండగా వున్నా ఠీవిగా కన్పించే పెదాలు.

 

    కృపానంద దేశ్ ముఖ్ గురించి ఆ ఫంక్షన్లో అతితక్కువ మందికి తెలుసు. దేశ్ ముఖ్ ప్రతిభ ఏమిటో తెల్సిన ఒకే ఒక వ్యక్తి శుక్రవర్ణ మహంత.

 

    కృపానంద దేశ్ ముఖ్ ద్రోణుడైతే. శుక్రవర్ణ మహంత అర్జునుడు.

 

    కృపానంద దేశ్ ముఖ్ గురించి ప్రపంచానికి తెలియకపోవచ్చు. ఇండియాకు బాగా తెలుసు.

 

    చిన్న చేపలా కనబడే దేశ్ ముఖ్ వ్యాపారంగంలో ఒక తిమింగలం.

 

    ఆ విషయం తెల్సిన ఏకైక వ్యక్తి శుక్రవర్ణ మహంత.

 

    కృపానంద దేశ్ ముఖ్ ఇండియాలోని, ఆధ్రప్రదేశ్ లోని, తెలంగాణా ప్రాంతపు దేశ్ ముఖ్ ల వంశానికి చెందినవాడు.

 

    ఎంతటి విషాద పరిస్థితుల్లోనైనా పెదవుల మీద చిరునవ్వు, మృదువైన చేతులకు మెత్తని గ్లవ్స్... కృపానంద దేశ్ ముఖ్ విలక్షణతకు, అనుభవ పరాకాష్టకు చిహ్నాలు.

 

    "నువ్వు అడివిలోకి వెళ్ళినప్పుడు పులిని నమ్ము. క్షేమంగా తిరిగి వస్తావు... నీళ్ళల్లోకి దిగినప్పుడు మొసలిని నమ్ము హాయిగా ఒడ్డున పడిపోతావ్.. కానీ... వ్యాపార ప్రపంచంలో అడుగుపెట్టినప్పుడు, మనిషిని నమ్మకు... మోసపోతావ్" కృపానంద దేశ్ ముఖ్ మిత్రులతో అప్పుడప్పుడూ చెప్పేమాట యిది. ఆ మాటకు ఆయనెప్పుడూ కట్టుబడి వుంటాడు.

 

    ఆయన చెప్పే ఇంకొక మాట...

 

    "ఇండియా ఈజ్ ఓన్లీ మై బిజినెస్ వరల్డ్" అలా అని కృపానంద దేశ్ ముఖ్ చెప్పడానికి కారణాలున్నాయి.

 

    "వరల్డ్ ఈజ్ మై బిజినెస్ సెంటర్" ఇలా చెప్తున్న వ్యక్తి శుక్రవర్ణ మహంత.

 

    ఇద్దరి మధ్యా ప్రధానమైన తేడా యిదే.

 

    వాళ్ళిద్దరూ కన్పించని రెండు భిన్న ధృవాలు.

 

    వ్యాపార మానవ మృగాలు!!

 

    నిరంతరం తమ వ్యాపారాలకు పదునుపెట్టే గురుశిష్యులు.

 

    తలతిప్పి చూసిన కృపానంద దేశ్ ముఖ్ ప్రసన్నంగా నవ్వాడు. లేచి శుక్రవర్ణ మహంత చేతిలో చెయ్యి కలిపి, అభిమానంగా గుండెలకు హత్తుకుని-

 

    "విష్ యూ హేపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మైడియర్ శుక్రా..."

 

    'చప్పుడు చెయ్యని సద్దాం బాంబులా మీరొస్తారని వూహించలేదు" శుక్రవర్ణ మహంత తెలుగులో పలకరించాడు.

 

    వాళ్ళిద్దరూ కల్సుకున్నప్పుడు తెలుగులోనే మాట్లాడుకుంటారు. మిగతావాళ్ళకు ఆ భాష సైన్ లాంగ్వేజ్ లా వుంటుంది.

 

    కృపానంద దేశ్ ముఖ్ సూటిగా శుక్రవర్ణ మహంత కళ్ళవైపు చూశాడు.

 

    బిలియనీర్ ప్రస్తుత మనస్తత్వాన్ని, కళ్ళతోనే అంచనా వేస్తున్నాడు కృపానంద దేశ్ ముఖ్.

 

    "నువ్వు ఏదీ ఎప్పుడూ అకారణంగా చెయ్యవు... ఇరాన్, ఇరాక్ వార్ కి మూడేళ్ళ క్రితమే నువ్వు జార్జిబుష్ తో స్నేహం చేసినవాడివి. వార్ జరుగుతున్నప్పుడే, నీ గురించి ప్రపంచానికి తెల్సింది... కానీ జార్జిబుష్ తో నువ్వు స్నేహం చేసినప్పుడే నువ్వెందుకు చేస్తున్నావో నాకు తెలుసు... ఇప్పుడూ అలాంటిదేదో చేస్తున్నావని నాకు తెలుసు" అని ఒక్కక్షణం ఆగి, గ్లాసులోని షాంపైన్ ని సిప్ చేసి-

 Previous Page Next Page