"హల్లో హల్లో హల్లో_ ఎంతకాలానికి చూశాన్రా నిన్ను_" ఆనందంగా లోపలికొస్తూ అన్నాడు ఓ వ్యక్తి.
అతనిని కొంచెం కష్టంమీద గుర్తుపట్టాడు భవానీశంకర్.
"నువ్వు...నీ పేరు...భరద్వాజ్ కదూ?"
"ఎగ్జాక్ట్ లీ! ఎగ్జాక్ట్ లీ! అయితే పేరు కూడా మర్చిపోయావన్నమాట! అవునులే_ రెండేళ్ళు చాలా ఎక్కువే... వెరీగుడ్, వెరీగుడ్_" మంచంమీద పడుకుంటూ అన్నాడతను.
"నువ్వేం చేస్తున్నావిక్కడ?"
"బిజినెస్ బ్రదర్! బిజినెస్."
"ఏం బిజినెస్?"
"ఏదొకటి? ఎప్పుడుకప్పుడు మార్చేస్తుంటాను."
"నేనిక్కడ ఉన్నట్లు నీకెలా తెలుసు?" ఆశ్చర్యంగా అడిగాడు భవానీశంకర్.
సిక్త్స్ సెన్స్ బ్రదర్! మన ఫ్రెండ్స్ ఎప్పుడెవరు హైద్రాబాద్ వచ్చినా తెలిసిపోతుంది మనకు? నువ్వు స్నానం కంప్లీట్ చేసిరా! తర్వాత మాట్లాడుకుందాం!"
భవానీశంకర్ స్నానంచేసి వచ్చాడు.
"కమాన్ బ్రదర్! ఆకలి! త్వరగా ఆర్డర్ చేసెయ్ భోజనం_ భోజనం చేసి రెండ్రోజులయింది.
భవానీశంకర్ మళ్ళీ ఆశ్చర్యపోయాడు "రెండ్రోజులా?"
"అవును బ్రదర్! 48 గంటలు."
"ఎందుకని?"
"ఆర్ధిక పరిస్థితి బ్రదర్! మన ఫైనాన్స్ మినిష్టర్ బడ్జెట్, మన బడ్జెట్ ఒకటే విపరీతమయిన లోటు."
భవానీశంకర్ ఇద్దరికీ భోజనం ఆర్డర్ చేశాడు.
భరద్వాజ్ వారంరోజులుగా భోజనం లేనివాడిలా త్వరత్వరగా తినేశాడు.
"థాంక్యూ బ్రదర్! ఇంతకూ నువ్ దేనికొచ్చినట్లు?"
"భవానీశంకర్ జేబులో నుంచి కాగితం తీసి మడతవిప్పి అందులోని అమ్మాయిబొమ్మ చూపించాడు.
"ఎలా వుందీ అమ్మాయి?"
"సినిమా తార లాగుంది. ఎవరీ పిల్ల?"
"అది తెలుసుకోడానికే ముఖ్యంగా ఇక్కడికొచ్చాను."
"విష్ యూ బెస్టాఫ్ లక్! అన్నట్టు నా బిజినెస్ కి అర్జంటుగా కొంత హెల్ప్ కావాలి బ్రదర్. ఓ వెయ్యి రూపాయలు సర్దగలవా?"
"ఊహు! సారీ!"
"పోనీ అయిదొందలు?"
"కుదరదు."
"ఆల్ రైట్, పాతిక రూపాయలయినా, బిజినెస్ కాపిటల్ ఆ మాత్రమయినా లేపోతే"
"సరే" ఒప్పుకున్నాడు భవానీశంకర్.
"థాంక్యూ బ్రదర్? ఇంతకూ ఆ కాగితం మీదమ్మాయి గురించి ఎందుకు తెలుసుకోవటం?"
"ఆమెను ప్రేమించాను."
"వెరీగుడ్! ఆ మాత్రం కర్టెసీ వుండాల్సిందే. నేనూ అంతే. అందమయిన ఆడపిల్ల కనిపించినప్పుడల్లా ప్రేమించినట్లు నటిస్తాను. లేపోతే పాపం వాళ్ళు 'హర్ట్' అవుతారు. అన్నట్లు యింకొక పాతిక చూడకూడదూ?"
"సారీ?"
"ఆల్ రైట్! పాతికతోనే ఎడ్జస్ట్ అవుతాన్లే. డోంట్ వర్రీ! 'హా'! నిద్రొస్తోంది. నిద్రపోయి నాలుగురోజులయింది బ్రదర్. నన్ను సాయంత్రం వరకూ నిద్రలేపకు" అంటూ మంచంమీద వరిగిపోయాడతను.
"ఇక్కడ మనవాళ్ళింకెవరయినా కనిపించారా?" అడిగాడు భవానీశంకర్.
"ఒకళ్ళేమిటి? మొత్తం మన క్లాస్ లోని జనాభా అంతా ఇక్కడే తిరుగుతున్నారు. డూ యూనో దీపక్? వాడు మారిస్ బిస్కెట్స్ లో ఆఫీసర్. కానీ ఉపయోగం లేదు. కేవలం పద్నాలుగు రూపాయలు యిచ్చాడు నేను అయిదువేల రూపాయలు అడిగితే. హోప్ లెస్ ఫెలో. ఓ.కే. నిద్రొస్తోంది. హా!" అంటూ ఆవలించి మరుక్షణంలో గుర్రుపెట్టసాగాడు.
భవానీశంకర్ డ్రస్ చేసుకుని హోటల్ గదినుండి బయటికొచ్చాడు.
రోడ్డంతా చాలా బిజీగా వుంది. అందమయిన అమ్మాయిలు కొంగల్లా నెమ్మదిగా నడుస్తూ షాపింగ్ చేసేస్తున్నారు. భవానీశంకర్ వాళ్ళందరినీ జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు.
తన జేబులో కాగితం మీదున్న అమ్మాయి ఎక్కడోచోట హఠాత్తుగా తటస్థ పడవచ్చు.
కొద్దిదూరం నడిచాక ఆటో పిలిచాడతను.
"దేవతా పబ్లికేషన్స్ ఆఫీస్" అన్నాడు ఆటోడ్రైవర్ తో.
పావుగంటలో ఓ పెద్ద భవనం ముందు ఆగింది ఆటో.
'దేవతా పబ్లికేషన్స్' అన్న పెద్ద బోర్డు కనబడుతోంది దానిముందు. లోపలకు నడుస్తోంటే వాచ్ మెన్ ఆపేశాడు.
"ఛీప్ ఎడిటరు సాంబమూర్తిని కలుసుకోవాలి బ్రదర్!"
"రిసెప్షన్ లోకెళ్ళి అపాయింట్ మెంట్ తీసుకోవాల్సార్."
"అది మిగతావారందరికీ బ్రదర్. మనక్కాదు. నేనూ, సాంబమూర్తిగాడూ బెస్టు ఫ్రెండ్స్. నీకు తెలుసా?"
వాచ్ మెన్ కొంచెం జంకాడు.
"అలాగా సార్?"
"అలాగా ఏమిటి నీ తలకాయ. వాడి బట్టతలమీద ఎప్పుడూ లాగి కొడుతూండేవాడిని."
వాచ్ మెన్ ఆశ్చర్యపోయాడు. "కానీ ఆయనకు బట్టతల లేదు కదండీ?"
"లేదా?"
"కొంచెం కూడా లేద్సార్"
"అలాగా? అదివరకుండేది మరి. ఈమధ్య జుట్టు పెంచాడేమో మళ్ళీ దొంగవెధవ. వస్తా" అనేసి లోపలికి నడిచాడతను.
ఈసారి వాచ్ మెన్ అతనిని అడ్డగించలేదు.
* * * *
'దేవతా పబ్లికేషన్స్' సంస్థ నుంచి చాలా పత్రికలు వెలువడుతుంటాయ్. ఓ దినపత్రిక, ఓ వారపత్రిక, ఓ స్త్రీల మాసపత్రిక, ఓ కుటుంబ మాసపత్రిక, ఓ సినిమా పత్రిక, ఓ పిల్లల పత్రిక ఇలా ఎన్నో పత్రికలు. అయితే వీటన్నిటిలోకీ వారపత్రిక ఒక్కటే ఆ సంస్థకు లాభాలు సమకూరుస్తుంటుంది. మిగతావన్నీ అంతంతమాత్రమే. అంచేత ఛీఫ్ ఎడిటర్ సాంబమూర్తి దృష్టి ఎక్కువగా వారపత్రికఅమీద కేంద్రీకరింపబడి వుండటంలో ఆశ్చర్యం లేదు. అప్పుడే ప్రింటవుతోన్న ఆనాటి వారపత్రిక తెప్పించుకుని పేజీలు తిరగేయసాగాడతను. అలా పేజీలు తిరగేస్తున్నప్పుడు ఎవ్వరినీ లోపలకు పంపగూడదని తన ఆఫీస్ ప్యూన్ కి ఖచ్చితమయిన ఆదేశాలు జారీచేశాడు.
ఐదో పేజీలోని ఎనౌన్స్ మెంట్ చూస్తూనే ఉలిక్కిపడ్డాడతను.
"త్వరలోనే ప్రారంభం. ఆంధ్రా ఇర్వింగ్ వాలెస్ గానూ, ఆంధ్రా ఫ్రాయిడ్ గానూ ప్రసిద్దికెక్కిన శ్రీకుమార్ కలంనుంచి మరో అద్భుతమయిన సీరియల్ తేదీకై ఎదురుచూడండి.
గమనిక : దయచేసి ఈ సీరియల్ ను ఒంటరిగా చదవకండి."
వెంటనే బెల్ నొక్కాడతను. ప్యూన్ పరుగుతో వచ్చాడు.
"మన వీక్లీ ఎడిటర్ ని రమ్మను త్వరగా."
మరుక్షణంలో వీక్లీ ఎడిటర్ వినయంగా వచ్చి కూర్చున్నాడు.
"ఏమిటండీ ఇది? ఏమిటీ ఎనౌన్స్ మెంట్? ఆంధ్రా ఇర్వింగ్ వాలెస్ ఎవరు?"
"ఇంకెవరండీ మన ఆస్థాన రచయిత శ్రీకుమార్."
సరిగ్గా ఆ సమయంలోనే భవానీశంకర్ ప్యూన్ ని తప్పించుకుని అతనికి దొరక్కుండా పరుగెత్తుకొచ్చేశాడు లోపలకు.
సాంబమూర్తి అతనివంక కోపంగా చూశాడు.
"హల్లో! గుడ్ మాణింగంకుల్! మీ ఆరోగ్యం ఎలా వుందంకుల్?" ఆనందంగా పలుకరించాడు భవానీశంకర్.
"ఎవర్నువ్వు" కోపంగా అడిగాడు సాంబమూర్తి.