"ఏదో బలవత్తరమైన కారణం ఉండిఉంటుంది. లేకపోతే నన్ను చూడకుండా ఇన్ని రోజులు ఉండగలడా?" అనుకొంది చివరకు. "నన్ను చూడకుండా ఉండలేకపోవటమేమిటి?" అని తనను తనే ప్రశ్నించుకుంది. సమాధానం చెప్పుకోలేక సిగ్గుపడిపోయింది.
4
యధాలాపంగా ప్రక్కకు చూసిన ఉమ త్రుళ్ళిపడింది. అతను, అతనే! స్కూటర్ లేదు. నడుస్తున్నాడు. ఎందుకో?
ఉమ కళ్ళు మెరిశాయి.
"అబ్బ! ఎన్నాళ్ళకు కనిపించారు"
"చూడనా మరి!"
"నాకూ మిమ్మల్ని చూడకపోతే తోచటం లేదు."
ఈ మాటలు వాళ్ళ పెదవులు మాట్లాడుకోలేదు. కళ్ళు మాట్లాడుకున్నాయి. అంతలో ఉమ తెలివి తెచ్చుకుని తల దించుకుంది. గబగబ అడుగులు వేసింది. ఇల్లు చేరేవరకు ఎటూ చూడలేదు.
కొన్ని క్షణాలలో కొన్ని కోట్ల భావాలను ప్రకటించిన అతని అందమైన కళ్ళామెను వదలటంలేదు. అంతలో మాలతి మరణమూ, శోభ మాటలూ గుర్తువచ్చి గుండెలు ఝల్లుమన్నాయి. ఏవైనా కాని పరిస్థితులు సంభవిస్తే ఎదుర్కోగలిగే ధైర్యం తనకెంత మాత్రమూ లేదు. పరిస్థితులకు దూరంగా ఉందటమే కర్తవ్యం.
అతని అభిమానం నిజమైనదేనేమోనని మనసు మూల్గింది. ఏమో! సర్వ మానవ ప్రాణులనూ లాలించే 'ఆశ' ఆ భావనకు ఊపిరి పోస్తూంది. "కానియ్యి. నామీద అంతగా అభిమానమున్నవాడు ఇవాళ కాకపోతే, రేపు నన్ను పలకరించకపోడు. సవ్యంగా సమాధానాలిస్తాను. నిజమైన అభిమానమయితే వచ్చి పెద్దలతో మాట్లాడుతాడు అనుకొని నిద్ర పట్టించుకోవటానికి ప్రయత్నించసాగింది.
ఉమ అనుకున్నట్లే ఆ మరునాడే అతను పలకరించాడు.
"చూడండి మిస్...."
"ఉమ...."
దడదడలాడే గుండెలతో వినయంగానే సమాధానమిచ్చింది.
"చదువుకొంటున్నారా?"
"థెరిసా కాలేజీలో బి.ఎస్.సి. చదువుతున్నాను."
"చింతలపూడిలో ఉంటున్నారా?"
"అవును."
"రోజూ ఇంతదూరం నడిచి..." ఆగిపోయాడు అతడు.
"మేం ఉన్నవాళ్ళం కాము. అందుకని సాధ్యమైనంత ఖర్చు తగ్గించటానికి ప్రయత్నిస్తాము. మా ఇల్లు దగ్గిరే. నడవగలను."
ఈ విషయం ముందే స్పష్టం చెయ్యాలనుకుంది ఉమ.
అతను చాలా సంకోచపడ్డాడు. సంభాషణ మళ్ళించడానికి "నా సబ్జక్టు సైన్స్ కాకపోయినా, నాకు సైన్సంటే చాలా ఇష్టం" అన్నాడు. 'మీరేం చదువుతున్నా'రని అడగాలనుకొని, మొహమాటంతో అడగలేకపోయింది.
"మీ నాన్నగారు...."
"మా నాన్నగారు పోయారు. తహశీల్దారుగా పనిచేసి రిటైరయ్యారు. మేము నలుగురు అక్కచెల్లెళ్ళం. నలుగురు అన్నదమ్ములం. మా అన్నయ్య ప్రభాకర్ పెద్దవాడు. మా అక్కయ్య బి.ఏ. పాసయి ఉద్యోగం చేస్తుంది. మిగిలిన వాళ్ళంతా చిన్న చిన్న పిల్లలు. చింతలపూడిలో రిటైర్డ్ తహశీల్దారు గారిల్లంటే ఎవరైనా చెప్తారు."
గబగబ చెప్పేసి తన అతిధోరణికి తనే సిగ్గుపడింది. అతను "ఓహో" అని ఊరుకున్నాడు.
అంతలో అటు ఏదో కారు వచ్చి అతడిని చూసి ఆగింది. ఆ కారు డాక్టర్ రావుదని ఉమకు తెలియదు. రావు అతడిని కారులో ఎక్కించుకోవటం, కారు సాగిపోవటం క్షణాలలో జరిగిపోయింది. తన సర్వప్రాణాలనూ ఎవరో లాక్కుపోతున్నట్లన్పించింది ఉమకు. ఇంకా కొంచెంసేపు సంభాషణ జరిగి ఉంటే ఏం మాట్లాడుకుని ఉండేవారో! లక్ష రకాలుగా ఆలోచించింది ఉమ. ఆ తరువాతి రోజు కూడా అతను కలిశాడు. అతడిని చూస్తూనే ఉమ మనసు ఉత్సాహంతో ఉరకలు వేసింది.
"ఉమాదేవీ!" అని రెండుసార్లు పిలిచి, ఏదో చెప్పబోయి ఆగిపోయాడతడు.
"ఏవిఁటండీ!" మృదువుగా ప్రశ్నించింది.
"అదే! నేను మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నాను" గబుక్కున అనేశాడు అతను.
ఉమ బిత్తరపోయింది. ఇదేమిటీ? ఇతను పెళ్ళి ప్రస్తావన లేకుండా ప్రేమ అంటాడేమిటీ? ఇప్పుడేం చెయ్యాలి? ఏం సమాధానం చెప్పాలి?
తనకు మాలతి గతి పట్టకూడదు.
ఏ సమాధానమూ ఇవ్వకుండా తల వంచుకొని నడవసాగింది. సహజంగా చాలా బిడియస్థుడయిన అతనికి ఆ గంభీరమూర్తిని తిరిగి పలకరించే సాహసం కలగలేదు.
ఆ రోజు ఉమకు దుఃఖం ఉబికివచ్చింది. ఇలా జరిగిందేమిటీ? తనేం చెయ్యాలి? అతను తమ ఇంటికి రావాలని వివరాలన్నీ చెప్పింది. ఆ మాత్రం అర్థం చేసుకోలేడా? ఇతని ప్రేమ స్వరూపమేమిటి? ఏమని సమాధానం చెప్పాలి? మాలతి అమాయకమైన రూపం కళ్ళముందు మెరిసింది.
ఉహు! మెత్తబడకూడదు. అతనికి చనువియ్యకూడదు. అయినా నిర్మానుష్యంగా ఉన్న ఆ రోడ్డుమీద మాటలేవిఁటి? అతనికి తన ఇంటి వివరాలన్నీ చెప్పింది. అంతగా తను కావాలనుకుంటే తమ ఇంటికే వస్తాడు.
ఆ తరువాతి రోజు కూడా అతను కనిపించాడు.
"నిన్న మిమ్మల్ని కష్టపెట్టినట్లున్నాను" బేలగా అన్నాడు.
ఉమ అతని వైపు చురుగ్గా చూసింది.
"నడిరోడ్డుమీద ఈ మాటలేవిఁటీ?" అంది. అంతవరకే అనగలిగింది.