"నేనేం కూశాను? సుమతి భర్తలా ఉండాలని మీరు ముచ్చట పడుతోంటే, ఆ లక్షణాలన్నీ పూర్తిగా రానియ్యమన్నాను. అంతే....."
పరస్పరం దారుణంగా ద్వేషించుకొంటూ, కాట్ల కుక్కల కంటే ఘోరంగా ఆ భార్యాభర్తలిద్దరూ పోట్లాడుకొంటూంటే, ఆ మాటలన్నీ గుమ్మం బయటికి స్పష్టంగా వినిపిస్తున్నాయి. కృష్ణారావు తులసి ముఖంలోకి చూసి తమాషాగా నవ్వాడు. ఆ నవ్వును ఎదుర్కోలేక తలదించుకుని తలుపు తట్టింది.... భార్యాభర్తల పోట్లాట తాత్కాలికంగా ఆగింది. నీలకంఠం వచ్చి తలుపుతీశాడు. ఎదురుగా నిలబడ్డ కృష్ణారావునీ, అతని కారునీ, తులసినీ మార్చి మార్చి చూసి విషపు నవ్వు నవ్వాడు.
"ఇంత ఆలస్యమయితే ఏమయిపోయావో అని ఇంట్లో అంతా ఆందోళన పడుతున్నారు. ఇదా, సంగతి?" అనేశాడు. కృష్ణారావు గట్టిగా నవ్వి "వెళ్ళొస్తాను తులసి గారూ!" అని వెళ్ళిపోయాడు.
కృష్ణారావు ఉండగానే, నీలకంఠం అలా మాట్లాడినందుకు తులసి అణువణువూ భగ్గుమంటోంది. లోపలికివచ్చి "ఏం మాటలవి బావగారూ" అంది తీక్షణంగా.
"ఏమన్నాను?" అమాయకంగా అడిగాడు నీలకంఠం.
నీలకంఠంలో ఉండే గొప్పతనమే అది. మనసును చిత్రవధ చేసేమాటలని, అమాయకంగా ముఖం పెట్టగలడు. అవతలి వాళ్ళను రెచ్చగొట్టి వాళ్ళు నోటికి వచ్చినట్లు తిడుతుంటే, పరమ సాత్వికుడిలాగ నోరుమూసుకుని వినోదించగలడు. అతనితో వాదించి ప్రయోజనం లేదని అనుభవం మీద తెలుసుకుంది తులసి. సంస్కారం, సభ్యత మంచి, చెడు, ఇవేమీ లెక్కచెయ్యడు. తను చెయ్యాలనుకున్నది చేస్తాడు. చేతనయితే అతనికి దూరంగా ఉండాలి. లేకపోతే, చచ్చినట్లు సహించాలి. మరో మార్గంలేదు.
పోవాలి దూరంగా..... చాలా చాలా దూరంగా..... ఎక్కడికి? ఎలా?
"వెళ్ళిన పని ఏమయిందే?" ఆరాటంగా అడిగింది సుమతి.
"నన్ను పనిలోంచి తీసేశారు. మరొక అమ్మాయిని నా ప్లేసులో వేసుకున్నారు కూడా....."
"ఆఁ!......"
సుమతి ఎంతో ఆరాటపడుతుంటే నీలకంఠం అతి శాంతంగా "తీసెయ్యక ఏం చేస్తారు? రోగిష్టిదాన్ని ఎవరు పనిలో పెట్టుకుంటారు?" అన్నాడు.
సుమతి రెచ్చిపోయి "ఏమిటీ? తులసి రోగిష్టిదా? అన్ని రోగాలూ మీకే, దానికే రోగమూ లేదు. ఎందుకో, ఏమిటో, చెయ్యి చచ్చుబడిపోయింది. కొంచెం రోజుల్లో స్వాధీనమవుతుంది" అంది గట్టిగా.
సుమతి అంత గట్టిగా అరుస్తున్నా నీలకంఠం అతి శాంతంగా "మీ ఇంట్లో రోగం లేనిదెవరికీ? అసలు మీ వంశమే రోగిష్టివంశం. మీ అమ్మకి గుండెజబ్బు, నీకు మూర్ఛల రోగం, మీ చెల్లెలికి పక్షవాతం....." అన్నాడు చిరునవ్వుతో.
"మా చెల్లెలికి పక్షవాతమా? ఇలా లేనిపోని పేర్లు పెట్టే మీ నోటికొస్తుంది పక్షవాతం! నాకు మూర్ఛల రోగమా? పెళ్ళికాక ముందు నేను ఎలా వుండేదాన్నో, ఎవరినైనా అడగండి. నా ఊపిరి లాగేసి, నా మనసును ముక్కలు చేసి, నా గుండెలు పిండి, చివరికి నన్ను....."
మాట్లాడుతూ వుండగానే సుమతి ముఖం ఎర్రబడి పోయింది. పిడికిళ్ళు బిగుసుకుపోయాయి. క్రింద పడిపోయింది. వంటినిండా బురద పులుముకుని, మట్టిలో యదేచ్చగా ఆడుకొంటున్న రాధ, రాజు_ఇద్దరూ ఘోల్లుమంటూ తల్లిమీద పడ్డారు. అదేదీ తనకు సంబంధించిన విషయం కానట్లు, లోకంలో వింతను చూసి వినోదిస్తున్నట్లు, కూచున్న చోట నుంచి కదలకుండా నవ్వుకొంటున్నాడు నీలకంఠం.
ఉదయం ఎప్పుడో కొద్దిగా ఆదరాబాదరా తిని ఇంటి నుండి బయలుదేరింది తులసి. కూచుంటే లేవలేనంత నీరసంగా వుంది. కానీ, కళ్ళముందు జరుగుతున్నది చూస్తూ లేవకుండా ఎలా కూచోవటం? ఎంత చీదరగా ఉన్నారు పిల్లలిద్దరూ? తన పిల్లల విషయం పట్టించుకోకుండా భార్యను సతాయించి పోస్తున్నాడు భర్త. పిల్లల విషయం కూడా మరిచిపోయి, భర్తతో హోరాహోరీ పోట్లాడి మూర్ఛపోయింది భార్య. ఫలితంగా.....
ఎక్కువసేపు ఆలోచిస్తూ కూచోలేకపోయింది తులసి. లేచి వెళ్ళి అక్క తల తన వళ్ళోకి తీసుకుని ముఖంమీద నీళ్ళు చల్లింది. తడిగుడ్డతో తుడిచింది. కొంతసేపటికి కళ్ళు తెరిచిన సుమతి, తనమీద పడి ఏడుస్తున్న పిల్లల్ని చెరో చేత్తో దగ్గరకు తీసుకుని, నీరసంగా గోడకి జేర్లగిలబడింది. అంతలోనే గుర్తుచేసుకున్నట్లు "అయ్యో! నా మతిమండ! పాపం, తిరిగి తిరిగి వచ్చిన నీకు కాస్త కాఫీ అయినా ఇవ్వలేదు. కాఫీ తయారుచేస్తాను" అని లేవబోయింది.
తులసి విసుగ్గా "నాకు కాఫీ వద్దు. ఏం వద్దు. నువ్వు కొంచెంసేపు విశ్రాంతిగా కూచో!" అంది.
"నాకు ఒకటే విశ్రాంతి....." అని విసుక్కుంటూ సుమతి లేవబోతుంటే నీలకంఠం అడ్డుపడి "మీ చెల్లెలికి నువ్వు శ్రమపడి కాఫీ ఇవ్వక్కర్లేదులే? ఆవిడ కాఫీ ఫలహారాలన్నీ చేసే వచ్చింది" అన్నాడు.
"అదేం మాట! కాఫీ ఫలహారాలు ఎక్కడ చేస్తుంది? పాపం. ఏనాడూ హోటల్ కయినా వెళ్ళదు....."
"ఏనాటి మాటో నాకు తెలియదు కానీ, ఈనాడు మాత్రం దర్జాగా కృష్ణారావు కార్లో వచ్చింది. ఎక్కడికీ వెళ్ళకుండా, ఏమీ తినకుండా వస్తే ఇంత ఆలస్యమెందుకవుతుంది?"
"నోటికొచ్చినట్లు మాట్లాడకండి. తులసి కృష్ణారావు కారులో ఎందుకొస్తుంది?"
"నిజమో, అబద్ధమో మీ చెల్లిలినే అడుగు."
సుమతి ఉద్రేకపడిపోతూ "అవునా తులసీ! నువ్వు కృష్ణారావు కారులో వచ్చావా?" అంది.
కుళ్ళుగా, వెటకారంగా నవ్వుతోన్న నీలకంఠాన్నీ, ఉద్రేకపడుతూ ఒగరుస్తోన్న సుమతినీ చూసి తల్లి గదిలోకి వచ్చింది తులసి. "కర్మ!" అంటూ సుమతి నుదురు కొట్టుకోవటం తులసికి వినిపించింది.
తులసి తల్లి దగ్గరకి వచ్చేసరికి అక్కడ మరొక 'సీన్' రసవత్తరంగా సాగుతోంది.
"జానకీ! ఒక్క అయిదు రూపాయలుంటే ఇవ్వు.... ఈ అయిదు రూపాయిలూ అయిదువందలు చేసి తెస్తాను....."
"రామచంద్రా! లేవలేక మంచంలో పడిఉన్నదాన్ని నన్నిలా పీక్కుతింటారేమిటండీ! తెచ్చిన వందలూ, వేలూ చాలుగాని, మా ప్రాణాలు తియ్యకుండా మమ్మల్నిలా బ్రతకనియ్యండి."