Previous Page Next Page 
దశావతారాలు పేజి 5


    పసుపచ్చ గులాబి దగ్గరికి నడచిన రాజేశ్వరి దృష్టి ఆ మొక్కమీద లేదు.
    "అయితే వదినా, ఈ విషయం మీకు నిజంగా తెలీదూ?" అంది రాజేశ్వరి.
    రాజేశ్వరిలో ఈ ధోరణి మామూలుగా లలితకు నచ్చదు. ఇదే మరొక విషయమైతే రాజేశ్వరికి మాట్లాడే అవకాశం ఇచ్చి ఉండేది కాదు. కానీ ఇప్పుడిది తను తెలుసుకోవాలి! తెలుసుకుని తీరాలి!
    "మీరు ఏ విషయమో చెప్పకుండా తెలుసో, తెలియదో నేనెలా చెప్పగలను?" అంది.
    "అన్నయ్యగారు ఆ అయిదువేలూ దానికోసమే తీసి ఉంచారు!" ఉలికిపడింది లలిత.
    "దానికోసమే అంటే...?"
    "ఎంత అమాయకులు వదినగారు? మనం ఆడవాళ్ళం. ఇంత అమాయకంగా ఉండబట్టే వాళ్ళు మననలా ఆడిస్తున్నారు?"
    "సంగతేమిటి చెప్పరాదు!"
    "హమ్మో! నేను మీకు చెప్పానని తెలిస్తే మావారు నన్ను తవ్వి పాతేస్తారు !"
    "తెలియ నివ్వనులెండి !"
    "ఏవిటో నాకూ చెప్పాలని లేదు. చిలుకా గోరింకల్లా ఉన్న దంపతుల మధ్య కలతలు రేపినదాన్ని అవుతానేమో!" మండిపోతోంది లలితకు ...
    "ప్లీజ్ చెప్పండి! సంసార మన్నాక కలతలు రాకమానవు. మనం సర్దుకోకమానము..."
    "ఇంచుమించు నెల రోజుల క్రిందట అన్నయ్యగారు ఎవరినో తీసుకొచ్చారు. మీరు ఏమీ అనుకోనంటే ఆవిడ బజారు మనిషిలా కనిపించింది. అక్కడ్నుంచి వీళ్ళు ముగ్గురు గదిలో తలుపు లేసుకుని ఒకటే గుసగుసలు ... నాకేమీ తెలియనియ్యలేదు..."
    రాజేశ్వరి మాటలలో తనకు తెలియనియ్య లేదనే అక్కసు ఎక్కువగా ధ్వనిస్తోంది.
    "బహుశః ఆ డబ్బుకూడా ఈవిడ కోసమే డ్రా చేసి ఉండచ్చు. ఏదో డబ్బు ... ఖర్చు ... అనుకోవడం విన్నాను..."
    లలిత కాళ్ళలో వణుకు పుట్టింది. తిన్నగా నిలబడలేక వెనక్కు వెళ్ళి గోడనానుకుంది. లలిత స్థితి చూసినకొద్ది రాజేశ్వరిలో హుషారు ఎక్కువ కాసాగింది.
    "చెబితే నమ్ముతారో, నమ్మరో కాని వదినా, దాని వయసు మన వయసుకు రెండింతలుంటుంది. పోనీ రూపురేఖలు కూడా అంతంత మాత్రమే! చీకీ పారేసిన తాటి టెంకలా ఉంది. ఈ మొగవాళ్ళకిదేం పోయేకాలమో...."
    అనర్గళంగా మాట్లాడుతోన్న రాజేశ్వరి హాల్లోంచి శ్రీనివాసరావు కేక పెట్టడంతో ఆగిపోయింది.
    లలిత చెయ్యినొక్కి "వదినా! నేను చెప్పానని అనేవు. నా ప్రాణాలు తీస్తారు. నీ మీది ప్రేమకొద్దీ మనసూరుకోక చెప్పేసాను" అనేసి హాల్లోకి పరుగుతీసింది.
    "గోపాలం వస్తే నేను వచ్చి వెళ్ళానని చెప్పండి. వాడినోసారి రమ్మనండీ_" అని రాజేశ్వరితో వెళ్ళిపోయాడు శ్రీనివాసరావు. - గోపాలం సాయంత్రం నలుగవుతుండగా వచ్చాడు. అప్పటివరకూ లలిత భోజనం చెయ్యకుండా అలాగే కూర్చుంది.
    లలిత ముఖం చూడగానే గోపాలానికి జాలి కలిగింది.
    "అంతవరకు భోజనం చెయ్యలేదూ !" అన్నాడు అభిమానంగా.
    "మీరు చేసేసారా ?"
    "ఆ !" అపరాధిలా సిగ్గుపడుతూ అన్నాడు గోపాలం...
    "ఎక్కడ? దానింట్లోనేనా ?"
    నిర్ఘాంతపోయి నిలబడ్డాడు గోపాలం.
    "నీకేమైనా పిచ్చి పట్టిందా ?"
    "లేదు. పట్టించుకోను. నాకు పిచ్చెక్కితే మీరు నాకు విడాకులిచ్చి సుఖంగా మరొకరిని పెళ్ళిచేసుకోవచ్చు. కానీ నా పిల్లలేమయి పోతారు ?"
    "అర్ధంలేకుండా మాట్లాడకు ?"
    "పోనీ ఆ అర్ధమేదో మీరు వివరించరాదు ?"
    "ఎవరు చెప్పారు నీకు ఈ సంగతి ?"
    "ఎవరు చెప్పినా, నిజమవునా ? కాదా ?"
    గోపాలం చటుక్కున లలిత్ దగ్గరగా వచ్చి లలిత రెండు చేతులు పట్టుకున్నాడు.
    "లలితా ! మనకు పెళ్ళయి పదేళ్ళవుతోంది. నేను నీకు బాగా తెలుసు. నేను అలాంటి వాడినేనా ?"
    లలితకు కళ్ళ నీళ్ళు తిరిగాయి.
    "ఇన్నాళ్ళు అలాగే అనుకున్నాను. అలా అనుకోబట్టే నా డబ్బు మీడబ్బు అని ఆలోచించకుండా నేను సంపాదించినదంతా మీకే ఇచ్చాను. బేంక్ ఎకౌంట్ మీ పేర ఉన్నా, నా పేర ఉన్నా ఒకటే అనుకుని మీ పేరనే ఉండనిచ్చాను. దానికి ఫలితం అనుభవిస్తున్నాను_"
    "అలా మాట్లాడకు లలితా! నేను మాత్రం ఎప్పుడైనా నీ కిష్టంలేని పని చేశానా ?"
    "అయితే ముందా అయిదువేలు తీసుకురండి."
    "ఎలా? అవసరమని తీసుకున్నాడు. వాడుకుని ఉంటాడు."
    "పోనీ నోటు రాయించి తీసుకురండి ..."
    గోపాలం మాట్లాడలేదు_లలితతో కసి పెరిగింది.
    "అయితే ఇదంతా నిజమేనన్న మాట !... అదెవరో వయసు మీరినది ... చీకి పారేసిన తాటిటెంకలా ఉన్నది.... మీ ప్రియురాలేనన్నమాట..."
    "లలితా ! నిష్కారణంగా పాపలు మాటలు మాట్లాడకు."
    "మాట్లాడను! ముందా డబ్బు పట్టుకురండి !"
    "నా వల్ల కాదు !"
    "ఇకముందు నా జీతం మీ కియ్యను."
    "నీ యిష్టం ..."
    "అసలు నే నీ యింట్లో ఉండను."
    "నీ యిష్టమొచ్చినట్లు చేసుకో !"
    "అంతేకాని ఆ డబ్బు తీసుకురారు !"
    "తీసుకురాలేను !"

 Previous Page Next Page