రవి మంచం మీద లేచి కూచున్నాడు. ఆ శబ్దం అతడూ విన్నాడు. కానీ మిగిలినవాళ్ళ మనసులలో భయం పోగొట్టి వాళ్ళకు ధైర్యం చెప్పటం అతని కర్తవ్యం.
"అన్నట్లు మీరు దేవుడు, దెయ్యాలు ఇవన్నీ నమ్మరు కదూ! ఇలాంతో మూఢ నమ్మకాలు విమర్శిస్తూ లెక్చర్లు కూడా ఇచ్చినట్లున్నారు" నవ్వుతూ అన్నాడు రవి.
విష్ణు కూడా నవ్వాడు.
"నిజమే! ఇప్పుడూ లేవనే అంటాను. అవేవీ లేవుకాని భయం ఉంది. దేవుడికి-అలాంటి వాడు ఉంటే, భయపడక్కర్లేదు. థియరీ ప్రకారం దేవుడు మనల్నేమీ చెయ్యడు కాబట్టి- కనీసం ఈ జన్మలో మన జోలికి రాడు. కానీ దెయ్యాలు అలాంటివి ఉంటే మనల్ని పీడిస్తాయి. థియరీ ప్రకారం, అందుకని దేవుడంటే నమ్మకం లేకపోయినా, దెయ్యమంటే భయముంది. మనం గుహలోకి వెళ్ళటానికీ ఈ ఏడుపుకీ ఏదో సంబంధం ఉందని నరసింవ్వ అనుమానం."
"నేను మీకొక ముద్దు పేరు పెట్టుకోనా?"
"ఏమిటది?"
"భూత్య?"
"అన్యాయం! నేను కాస్త లావుగా ఉన్నమాట నిజమే కాని, మరీ భూతంలా ఉన్నానా? మీకీ పేరు అనిల సజెస్ట్ చేసి ఉంటుందని నా అనుమానం?"
గట్టిగా నవ్వాడు రవి.
"మీరు భూతంలా లేరు, నవ మన్మధుడిలా ఉన్నారు."
"అనుమానం పెనుభూతం అన్న సామెత విన్నారా? మిమ్మల్ని భూతయ్య అన్నది అందుకు నీ మనసునిండా అనుమానాలేనని లేనిపోని ఆలోచనలు మాని హాయిగా నిద్రపోండి."
చిత్రంగా రవి ఇలా ధైర్యం చెప్పేసరికి విష్ణు మనసు స్థిమిత పడింది. నిద్ర పట్టింది కూడా.
నిద్రలోంచి కుదుపుతో లేచి ఎగిరి కూచున్నాడు. కొంచెంసేపటి వరకూ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఉధృతమైన గాలి. కుర్చీలు, బల్లలూ కూడా ఎగురుతున్నాయి. డేరాలు ఈ క్షణమో, ఆ క్షణమో కూలిపోవటానికి సిద్ధంగా ఉన్నట్లు ఊగుతున్నాయి.
రవి ఎప్పుడు లేచాడో విష్ణువర్ధన్ చెయ్యి పట్టుకుని డేరాల బయటికి తీసుకొచ్చాడు. అలాగే అనిలని, జెన్నిఫర్ నీ తీసుకొచ్చాడు. ఆ తర్వాత డ్రాఫ్ట్స్ మాన్ నీ, టెక్నీషియన్స్ నీ, త్రిసికిని, మరో ఆడ మనిషినీ కూడా తీసుకొచ్చాడు.
మనుష్యులనే ఎగరగొట్టే గాలి. అందరూ ఒకరినొకరు గట్టిగా పట్టుకున్నారు. ఎవరు ఎవరిని పట్టుకున్నారనే ఆలోచన లేదు. మనిషికి మనిషి తోడు అంతే.
గాలి పెద్దగా వీస్తోంది. చూస్తూ ఉండగా డేరాలు కూలిపోయాయి. వస్తువులు కొన్ని చెల్లాచెదురుగా ఎగిరిపోయాయి.
ఎవరూ మాట్లాడటం లేదు. ఒకరి చేతులు మరొకరి చేతుల్లో బిగుసుకుంటున్నాయి. కాల జ్ఞానం నశించిపోయింది. గడుస్తున్నవి సెకన్లో, నిమిషాల్లో లేక యుగాలో?
గాలి ఆగింది.
అప్పుడు చూసుకున్నారు ఒకరినొకరు. త్రిసికి చేతిని గట్టిగా పట్టుకుని ఉన్నాడు విష్ణు అదే తనకి ఆసరా అన్నట్లు.
గభాలున ఆ చేతిని ఒదిలి ఏదో మురికి అంటుకున్నట్టు లుంగీకి తుడుచుకున్నాడు. ఆమె మరో చెయ్యి రవి చేతిలో ఉంది. తను ఆ చేతిని ఒదిలేస్తే ఆమె భయపడుతుందేమోనన్నట్లు "భయంలేదు. ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు వస్తూనే ఉంటాయి" అని ధైర్యం చెపుతూ చెయ్యి వదిలాడు. అతడి మరొక చెయ్యి అనిల నడుముకి చుట్టి ఉంది. ఆ చేతిని అనిల తనే విడిపించింది. ఒక టెక్నీషియన్ ని కావిలించుకుని ఉంది జెన్నిఫర్. గభాలున ఒదిలేసి బెదురుగా అందరినీ చూసింది.
ఎదురుగా ఒక చిన్న సైజు యుద్ధ రంగం కనిపిస్తోంది. డేరాలన్నీ కూలిపోయి తలో మూలకీ ఎగిరిపోయాయి.
విష్ణుతో అన్నాడు రవి "పట్టుపట్టి మనకి బాగా పెద్దదిగా గ్రాండ్ గా కనిపించే డేరా జెన్నిఫర్, అనిలకి, కాస్త చిన్నదిగా ఉండే డేరా టెక్నీషియన్లకి కేన్వాస్ డేరా, వంటవాళ్ళ కోసం మరీ చిన్న డేరా- ఇలా ఏర్పాటు చేయించారు. ఇప్పుడు చూడండి. ఈ ఎక్కువ తక్కువాలన్నీ ఏమయిపోయాయో? ఒక పెద్ద గాలి వీచేసరికి వాళ్ళు, వీళ్ళూ అని భేదం లేకుండా అందరం ఒకరి మీద ఒకరం ఆధారపడ్డాం."
నవ్వింది త్రిసికి.
సాధారణంగా మాట్లాడని, ఏ మాటలూ వినిపించుకోని త్రిసికి మొదటిసారిగా నవ్వింది. ఆ నవ్వులో వెటకారం ఉంది. విష్ణు గుర్రుగా చూశాడు త్రిసికిని. అతడి మనసులో రవి మీద కోపం లేదు, రాలేదు.
గాలి హోరు తగ్గాక మళ్ళీ వినిపించింది ఆ శబ్దం. దూరం నుంచి సన్నగా...
"అదిగో మళ్ళీ ఎవరో ఏడుస్తున్నట్లు..." అన్నాడు విష్ణు. ఆ శబ్దం అందరికీ వినిపిస్తోంది. ఎవరూ మాట్లాడలేరు కొన్ని క్షణాలు.
అనిల అంది. "ఏడుస్తున్నట్లుగా లేదే? ఏదో సంగీతంలా ఉంది."
అన్ని కళ్ళూ ఆశగా అనిలని చూశాయి. ఆ మనసులు అప్పటికప్పుడే సంగీతం వినటానికి సంసిద్ధం అవుతున్నాయి.
విష్ణు అన్నాడు చికాగ్గా "పాటో, ఏడుపో ఏదో ఒకటి. అసలీ ధ్వని ఎక్కణ్ణుంచి వస్తోంది? ఎందుకొస్తోంది?"
రాత్రి నిశ్శబ్దంలో- అదీ మహా నగరాలలో కాకుండా పల్లెటూళ్ళలో అదీ ఊరికి దాదాపు రెండు కిలోమీటర్ల దూరంలో- అదీ, దగ్గరలో దట్టమైన అరణ్యాలున్నప్పుడు వినగలిగితే ఎన్ని వింత శబ్దాలైనా వినిపిస్తాయి.
శ్రీశ్రీ కి తన "కవితా! ఓ కవితా" లో వినిపించిన శబ్దాల కంటే ఎన్నో శబ్దాలున్నాయి లోకంలో.
మనిషి ఒక్కడు అయితే చిన్న అలికిడికయినా జడుసుకుంటాడు. నలుగురితో కలిసి ఉంటే పులి గాండ్రుమన్నా నిలదొక్కుకోగలడు. సంఘం లేకుండా బతకలేడు మళ్ళీ.
ఆ సంఘంలో అనరికంటే తనే గొప్పగా ఉండాలని, మిగిలిన అందరికంటే అన్ని సుఖాలూ తానే అనుభవించాలనీ ప్రయత్నించక మానడు. ఆ ప్రయత్నంలో తనకు ఆధారమైన సంఘానికే చీడపురుగుగా మారిపోతాడు.
కానీ సంఘం చాలామంది అనుకుంటున్నట్లు సంకుచితమైనది కాదు. యాంత్రికంగా అలవాట్లను అనుసరించేదీ కాదు. ఎప్పటికప్పుడు వస్తున్న మార్పుల్లో ఏది సామాజిక శ్రేయస్సుకు అవసరమో, అలాంటి వాటినే గ్రహిస్తుంది. మిగిలిన వాటిని నాశనం చేస్తుంది. కొంత సంఘర్షణ ఎలాగూ తప్పదు.
అందుకే ఈనాటికీ సామాజికాచారాలలో సామూహిక సాధారణ మానవ ప్రవృత్తులు ప్రతిఫలిస్తుంటాయి. సొంతంగా ఆలోచించేది అతి కొద్దిమంది మేధావులే? మిగిలినవారంతా ఆ ఆలోచనలను సహజ మానవ దౌర్భల్యాలతో రంగరించుకుని ఆచారాలుగా రూపొందించేశారు.
"ఎంతసేపు ఇలా నిలబడతాం?" చికాగ్గా అడిగాడు విష్ణు. గాలి తగ్గిపోగానే అతడికి ధైర్యం వచ్చింది. నోరు లేచింది.
"పోనీ కూచోండి?" అతడి భయం అర్థం చేసుకున్న అనిల అల్లరిగా అంది.
అందరిలో భారీ శరీరం విష్ణుదే. నిలబడలేకపోతున్నాడు.
"ఎక్కడ కూచుంటాం. ఇక్కడ?"
"ఇక్కడ తేళ్ళు బాగా తిరుగుతూ ఉంటాయని విన్నాను. మందగా ఉన్న తేళ్ళు ఎక్కడైనా కనిపిస్తే చూసి కూచోండి. మెత్తగా కూచోడానికి బాగుంటుంది" నవ్వింది అనిల.
అతడిలో భయం తగ్గటం ఆమెకి బాగోలేదు. భయంతో కుంచించుకుపోతూ, అలవాటైన దర్పంతో దబాయించాలని చూసినప్పుడు అతడు చాలా తమాషాగా ఉన్నాడు.
అనిల ఆ మాటలనగానే అతడు ఎగిరి రవి పక్కకు వచ్చి అతడిని గట్టిగా పట్టుకున్నాడు. అందరూ నవ్వారు. ఎవరినీ పట్టించుకోకుండా త్రిసికి వైపు చూశాడు విష్ణు.
ఆమె నవ్వటం లేదు. ఈ లోకంతో సంబంధం లేనిదానిలా ఎటో చూస్తోంది తన మామూలు ధోరణిలో.
"డేరాలలోకి వెళ్దాం" అన్నాడు విష్ణు రవితో.
"ఏవీ డేరాలు? మళ్ళీ వేసుకోవాలి."