వెంకట్రావుకి నిజానికి ఏ జబ్బూ లేదు. కానీ రిటైరయ్యాక వ్యాపకమేమీ లేక తీరిగ్గా కూర్చునేసరికి అతనికి లోకంలో ఉన్న జబ్బులన్నీ తనకే ఉన్నట్లుగా తోచేది. ఒకరోజు "నాకు కడుపు నొప్పి" అనేవాడు. మరో రోజు "నాకు తల తిరిగిపోతోంది" అని గొడవ పెట్టేవాడు. "గుండెల్లో పోటు. నేనింక బ్రతకను." అని ఏడ్చేసేవాడు. అతని గోల భరించటం ఇంట్లో అందరికీ కష్టంగా తయారయింది.
"పని లేకపోవటమే పెద్ద జబ్బు" అనేవాడు మోహన్.
"అవునవును. వంట్లో శక్తి ఉన్నంతవరకూ గొడ్డులా మీకందరికీ చాకిరీ చేశాను. ఇప్పుడు నన్ను మీరంతా గొడ్డును చూసినట్లే చూస్తున్నారు" అని ఏడ్చేవాడు.
వెంకట్రావు గొప్ప ఆధ్యాత్మిక భావాలున్నవాడు. అతని ఆధ్యాత్మిక భావాలు అపమార్గంలో నడవడానికి అడ్డురాలేదు. కాని, ఈనాటికి నరకభయాన్ని కలిగిస్తున్నాయి. మృత్యుభయం. దానిని వెన్నంటి నరక భయం... తాను చూడబోయే నరకం మాటెలా ఉన్నా చుట్టుపక్కల వాళ్ళకి నరకం చూపించగలుగుతున్నాడు.
లలిత, తండ్రి సుఖం కోసం శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తూనే ఉంది. అబద్ధపు రోగామైనా, నిజం రోగామైనా, రోగమని గోలపెట్టే తండ్రి అవస్థ చూడలేక ఇంటికే డాక్టర్ ని పిలిపించింది. డాక్టర్ వచ్చి చూసి ఏ రోగమూ లేదని తెలుసుకుని ఊరికే వెళ్ళలేక బలహీనంగా ఉన్నాడని ఏవో టానిక్స్ రాసి ఇచ్చేవాడు. ఇల్లంతా లలిత సంపాదన మీద ఆధారపడి ఉంది. ఆ కాస్త సంపాదనలో టానిక్స్ లాంటివి కూడా కొనాలంటే కష్టమే. అయినా లలిత కొనేది. డాక్టర్ ని ఇంటికి పిలిపించాలంటే విజిటింగ్ ఛార్జెస్ ఇయ్యాలని తెలిసినా చీటికీ మాటికీ డాక్టర్ ని పిలవమని సతాయించేవాడు. అతడు ఏనాడూ ఎవ్వరినీ ప్రేమించలేదు. ప్రేమ వల్ల కలిగే ఆర్ద్రభావాలతో అతనికి పరిచయం లేదు. తనలో తనకు నమ్మకంలేని ఆ వ్యక్తి ఏ ఒక్కరినీ నమ్మలేడు. మందియ్యటం కొంచెం ఆలస్యమయితే "నాకు తెలుసు. మీరంతా నన్ను చంపాలని చూస్తున్నారు" అని వీధిన పడేవాడు. రాగంలో ఉన్నాడు కదా అని పళ్ళు తెప్పించి ఇస్తే "మీరంతా ఏం తిన్నారు? మీరు మంచి మంచి స్వీట్స్ చేసుకు తింటూ నా ముఖాన్న ఈ పళ్ళు పడేస్తున్నారా?" అని కుళ్ళుగా అడిగేవాడు.
లలిత బాధపడుతూనే శాంతంగా చేస్తున్నా, పెళ్ళయిన నాటినుండీ భర్త చేతిలో తిరస్కారాలూ అవమానాలూ తప్ప ఆదరణకు నోచుకోని జానకమ్మకు మాత్రం మండిపోయింది.
"లలితా! చేసిన పాపాలకు శిక్ష అంటూ ఉండద్దా? ఎందుకాయనకు మనం ఇన్ని సేవలు చేయాలి?" అనేది అక్కసుగా... ఈ దశలో సహితం ప్రేమానురాగాలు చూపించలేక అనుమానాలతో కుళ్ళిపోతూ, తన స్వార్థమే తను ఆలోచించుకునే వెంకట్రావును క్షమించలేకపోతోంది జానకమ్మ.
తల్లి మనసు అర్థం చేసుకోగలదు లలిత. నచ్చజెపుతున్నట్లు అంది.
"ఇప్పుడాయన అనుభవిస్తున్నది శిక్ష కాదంటావా అమ్మా! అలాంటి మనసు... ఒక్క క్షణమయినా శాంతికీ స్థిమితానికీ నోచుకోక తననుతాను దహించుకునే మనసు... అలాంటి మనసు కంటే పెద్ద శిక్ష ఎవరికి కావాలి?"
"ఏమో! ఇంత చేస్తున్నాం! ఏమైనా ఫలితముందా? ఇంకా ఏదో తనకు అన్యాయం జరుగుతుందనే ఆక్రోశమే కదా! ఇలాంటి వ్యక్తికి ఏంచేసినా బూడిదలో పన్నీరే!"
"మనం చేసినదానికి బదులుగా వాళ్ళు మనకేదో చెయ్యాలని ఆశించి ఏదీ చెయ్యకూడదమ్మా! ఒక పని చెయ్యటంవల్ల మనకానందముంటేనే ఆ పని చెయ్యాలి. పోనీ, ఏం చేద్దామో నువ్వే చెప్పు. నాన్నని వీధుల్లోకి వెళ్ళగొడదామా! చిన్నప్పటినుండీ చేసిన అన్యాయాలకు ఫలితంగా కుక్క బ్రతుకు బ్రతకమందామా? అలా చేస్తే నీకు హాయిగా ఉంటుందా?". జానకమ్మ సమాధానం చెప్పలేకపోయింది.
"కొంపదీసి నువ్వు కూడా నాన్నలాగ నువ్వుచేసిన పనులకు ఫలితంగా స్వర్గంలో రంభ, మేనక...కాదు! కాదు! నలకూబరుడు... మన్మథుడు... ఇత్యాది ఆశిస్తున్నావేమిటి?"
పకాలున నవ్వేసింది జానకమ్మ.
"పోవే! గంభీరంగా ఉంటూనే, కొంటెగా మాట్లాడగలవు!"
తల్లి ముఖంలో నవ్వు చూసి చాలా తృప్తిపడింది లలిత.
"మంచి మనసు కలిగి ఉండటం కంటే గొప్ప వరం ఏముందమ్మా! మన మనసులూ మహా మంచివేంకావు. కానీ కనీసం మంచిగా ఉండటానికి తాపత్రయపడుతున్నాయి. నాన్న విషయంలో మన కర్తవ్యం మనం చేసామన్న తృప్తి చాలదా మనకు?"
జానకమ్మ ప్రేమగా లలిత చెక్కిళ్ళు నిమిరింది.
"నీ అమ్మ కడుపు చల్లగా నూరేళ్ళు బ్రతికి నా దగ్గిర ఎప్పుడు ఇలాంటి బంగారు మాటలే మాట్లాడు. అవునమ్మా! బ్రతక్క ఎలాగు తప్పదు. బ్రతికిన నాలుగు రోజులూ హాయిగా బ్రతికేస్తే పోలా?"
మోహన్ కి ఉద్యోగం దొరకలేదు. మరెవరిదగ్గిరకో వెళితే పనవుతుందని ఎవరో చెప్పారు. ఆ మాట లలితతో చెపితే మండిపడింది.
"నేను ఎవరి దగ్గరకు వెళ్ళను. నువ్వూ వెళ్ళకు. ఇలా ఎవరిమటుకు వాళ్ళం నలుగురితోపాటు అనుకుంటూ అక్రమాలు ప్రోత్సహిస్తున్నాం."
మోహన్ కు మండిపోయింది.
"నీ శ్రీరంగ నీతులు వినటానికి బాగానే ఉన్నాయి, కానీ నాకు ఉద్యోగం తెచ్చిపెట్టవు. ఏం చెయ్యాలి?"
"నువ్వొక్కడివేనా? ఇంకా నీలా మగ్గిపోతున్న వాళ్ళు లేరూ? మీరంతా కలిసి మీ హక్కుల కోసం పోరాడండి!"
లలిత మాటలు మొదట హాస్యంగా కనిపించినా చివరకు అదే మేలనిపించింది మోహన్ కి. నిరుద్యోగులంతా ఒక సంఘంలా సమావేశమయ్యారు. ఏ రోజు ఎక్కడెక్కడ ఎందరెందరు ఏయే విధాల అన్యాయంగా ఉద్యోగాలు సంపాదించారో బహిరంగపరిచి విద్యావంతులలో ఆందోళన లేవదియ్యసాగారు. కానీ ఇది ఎక్కువ రోజులు సాగలేదు. సంఘంలో శాంతిభద్రతలకు భంగం కలిగిస్తోన్న నేరం క్రింద మోహన్ తోపాటు మరికొందరిని అరెస్ట్ చేశారు.
ఆ వార్త విని జానకమ్మ తల్లడిల్లిపోయింది. లలితకు మతిపోయినట్లయింది. మోహన్ ని రెచ్చగొట్టింది తనే! ఒక రకంగా తనే ఇందుకు బాధ్యురాలి ననుకొని చాలా బాధపడింది.
ఈ సమయంలో ఆఫీసులో లలితతో పనిచేసే ఒక స్నేహితురాలు "అసిస్టెంట్ పోలీస్ కమీషనర్ మాధవరావుగారు చాలా మంచివారు. ఆయనను ఒకసారి కలుసుకోరాదు!" అంది.
అన్యాయంగా అరెస్టయిన తమ్ముణ్ని విడిపించవలసిన బాధ్యత అక్కగానే గాక నైతికంగా కూడా తనమీద ఉందనుకుంది లలిత. సాహసించి మాధవరావుగారి దగ్గిరకు వెళ్ళింది.
మాధవరావు మరీ పెద్దవాడు కాకపోయినా చిన్నవాడు కూడా కాడు. అందమైనవాడని చెప్పడానికి లేదు కాని అతని ముఖంలో గాంభీర్యం అదొక విధంగా ఆకర్షణీయంగా ఉంది.
"కూర్చోండి! ఎందుకొచ్చారు?" అన్నాడు మర్యాదగా.
"మా తమ్ముడు మోహన్ ని అరెస్ట్ చేసారు. వాడు..." లలిత ఏదో చెప్పబోతుండగానే చెయ్యెత్తి అడ్డుకున్నాడు మాధవరావు.
"ఇలాంటి పనులమీద ఎప్పుడు నా దగ్గిరకి రాకండి. ఒకసారి అరెస్టయ్యాక కోర్టులో విచారణ జరగవలసిందే! నేను కల్పించుకుని విడుదల చెయ్యను."