Previous Page Next Page 
తదనంతరం పేజి 5


    సుదర్శనాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ, అతన్ని అమితంగా ప్రేమిస్తూ ఉండేది ఒకే ఒక్క వ్యక్తి అతని భార్య అరుంధతి.


    ప్రతి సందర్భంలోనూ అతన్ని వెనకేసుకొస్తూ చాలా మందికి దూరమైన వ్యక్తి కూడా అరుంధతే. అతన్ని గురించి అత్తమామలతో వాదించి చాలా సందర్భాలలో వాళ్ళ ఆగ్రహానికి కూడా గురయింది.


    గుమ్మంలో అలికిడయితే తలత్రిప్పి చూశాడు.


    అరుంధతి చేతిలో పాలగ్లాసుతో లోపలకు ప్రవేశిస్తోంది.


    అతనామె ముఖంలోకి ఒకసారి చూసి వూరుకున్నాడు ఏమీ పలకరించకుండా.


    "మాట్లాడరేం?" అంది కొంచెంసేపు మెదలకుండా నిలబడి.


    "ఏముంది?"


    "ఏమీ లేదా?" అంటూ నవ్వింది.


    అతనేమీ మాట్లాడలేదు.


    "సరే యీ పాలు తీసుకోండి"


    "నేనివాళ్టి నుంచి పాలు మానేస్తాను.


    "ఏం?"


    "రోజు రోజుకీ ఖర్చులు పెరిగిపోతున్నాయి"


    అరుంధతి మళ్ళీ నవ్వింది. "ఖర్చులు పెరిగిపోతే పాలు మానేస్తారా?"


    "మరి ఏం మానేస్తారు?"


    "అన్నం మానెయ్యాలి"


    అతనికి ఆమె అలా మాట్లాడుతూంటే ముచ్చటేసింది. అరుంధతి లాంటి భార్య దొరకడం చాలా అరుదైన, అపురూపమైన విషయం. తాను తప్ప యింకొకరెవరయినా సరే అలాంటి భార్య వుంటే లోకాన్నంతటినీ జయించేవాడు.


    "ఏమిటలా చూస్తున్నారు?"


    "నీలోని గొప్పతనాన్ని."


    "ముందు పాలు తాగండి. తర్వాత నాలోని గొప్పతనం వర్ణిద్దురుగాని"


    అతను ఆమె చేతిలోని గ్లాసందుకుని కొంచం కొంచంగా త్రాగసాగాడు.


    అతనలా త్రాగడం ఆమెకు చాలా యిష్టం. ఎంత దాహంగా వున్నా మంచినీళ్ళయినా సరే ఒకేసారి గట గటా త్రాగడు. కొంచం కొంచంగా తాగుతాడు. ఎంత ఆకలిగా వున్నా ఎగబడి తిన్నట్లు అన్నం తినడు. కొంచం కొంచంగా చాలా నాజూగ్గా తింటాడు.


    ప్రపంచం చేత యిష్టబడడానికీ, ఆరాధించబడడానికీ అతనిలో చాలా ఆకర్షణలున్నాయి. కాని యీ చిత్రమైన ప్రపంచంలో అన్నీ అవలక్షణాలుగా తీసుకునే విచిత్ర పరిస్థితిలో వుంది.


                                                            *    *    *    *


    సుదర్శనం అరుంధతి ముఖంలోకి చూశాడు.


    ఆమె తల్లో యింతవరకూ కొంచమైనా నెరవలేదు. "మీరు జుట్టుకు రంగేసుకుంటారా?" అని ఆమెను చాలామంది అడుగుతుంటారు. ఆమె తలకట్టు నల్లగా నిగనిగలాడుతూ వుంటుంది.


    అతనికి ఒక్కోసారి ఆమెను చూస్తే అనిపిస్తూ వుంటుంది. ఆ మనిషికి భర్తగా వుండే అర్హత తనకున్నదా? అని. అంతేకాదు, ఈ యింట్లో పడకుండా వేరే యింట్లో అడుగుపెడితే ఆమె జీవితం ఎలా ప్రకాశించి వుండేదో అని.


    ఆమెనలా చూస్తోంటే అతనికి ముగ్థమోహనంగా అనిపించింది.


    పాలగ్లాసు ప్రక్కనపెట్టి చెయ్యిచాచి ఆమె చేతినందుకున్నాడు.


    వెనక్కి లాక్కోబోయి, అంతలోనే ఊరుకుని ఏమిటన్నట్లు చూసింది.


    అతనేమీ మాట్లాడలేదు.


    అతని కళ్ళలో కోరిక...ఆమెకర్థమయింది.


    అతని చేతులామెను దగ్గరకు లాక్కోబోతున్నాయి.

 Previous Page Next Page