Previous Page Next Page 
రక్షరేకు పేజి 5


                                      3
    "అత్తా! అరిసెలు తెచ్చాను. బావ కోసం అంటూ వచ్చింది చంద్రి, చేతిలో చిన్న గిన్నెలో అరిసెలు పట్టుకొని.
    అన్నమ్మ నవ్వి "అయితే. అరిసెలన్నీ బావకే మాకు లేవా?" అంది.
    చంద్రి సిగ్గుపడి మాట్లాడలేదు. చంద్రిని చిన్నతనంలోనే బళ్ళో వెయ్యలేదు.  అంచేత చదువుతున్నది ఏడో క్లాసే అయినా అది ఓణిలు వేసుకునే వయసులోకి వచ్చేసింది.
    అన్నమ్మ చంద్రి చేతిలో గిన్నె అందుకుని చంద్రిబుగ్గ చిదిమి ముద్దుచేసి, "వరస కాకపోయిందే! వరసయితే మీ అమ్మని బతిమాలి నిన్ను నా కొడుక్కి కట్టుకునే దాన్ని....." అంది.
    చంద్రి ముఖం ఇంతలో వికసించి అంతలో వడలిపోయింది.
    అటు అన్నమ్మా. నాగమ్మా యిద్దరూ రోజుకి రెండు సారులైనా చంద్రినీ, జైహింద్ బాబునీ భార్యా భర్తలుగా ఊహిస్తూ మాట్లాడక మానరు.
    అంతలోనే వరస లేదని గుర్తుచేసుకోకమానరు. ఆ మాటలు పిల్లల ఎదురుగా మాట్లాడకూడదనే జ్ఞానం వాళ్ళకి లేదు......
    ఆ మాటలన్నీ వింటోన్న చంద్రి, జైహింద్ బాబుల మనసుల్లో వాళ్ళకు తెలియకుండానే ఏవో అల్లిబిల్లిగా ఆలోచనలు అల్లుకునేవి.
    "వరస కాదు - " అనే మాట మాత్రం వాళ్ళ గుండెమీద బండలాగే పడేది. ఆ సంఘం ఏదైనా ఆమోదిస్తుంది కాని వరసకాని వివాహాన్ని మాత్రం ఆమోదించదు.
    "బావ నాకు పాఠాలు చెపుతాడు కదత్తా! బావ కోసం తేవద్దా నేను?" అంది అమాయకంగా చంద్రి.
    ఆ కుటుంబాల మధ్య పెద్ద అరమరికలు లేవు! లేనిపోని నిషేధాలూ లేవు! అటు చంద్రీ, ఇటు జైహింద్ బాబూ ఇద్దరూ చదువుకోవటంతో, చంద్రి "బావచేత పాఠాలు చెప్పించుకుంటాను" అని జైహింద్ బాబు దగ్గిర చేరేది.
    పెద్దవాళ్ళు ఏమీ అనేవారు కాదు సరికదా, బుడ్డి దీపం వెలుగులో చదువుకునే ఆఇద్దర్నీ ఏదో అపూర్వ దృశ్యం  చూస్తున్నట్లు చూసేవారు.
    అన్నమ్మచంద్రిని వాత్సల్యంగా చూస్తూ గమ్మత్తుకన్నానే! ఉడుక్కోబాకు! అరిసెలెందుకు చేసింది మీ అమ్మ అంది.
    "ఊర్కెనే! నేను అడిగాను....." ముద్దు ముద్దుగా చెప్పింది చంద్రి.
    ఎంత అణచుకున్నా అన్నమ్మ గుండెలను చీల్చుకుని ఒక నిట్టూర్పు బయటపడింది! అన్నమ్మ కుటుంబం కంటే నాగమ్మ కుటుంబం పెద్ద గొప్పదేంకాదు. అయినా కూతురు కోరినంత మాత్రాన నాగమ్మ అరిసెలు వండగలిగింది.
    ఏ పూటకా పూట ఎలా గడుస్తుందా, అని దిగులుతో గడుపుతోంది తను. తన మొగుడు తాగుబోతు! పాదించి ఇంట్లో ఇవ్వడు- తాగి వస్తాడు. ఎదురు తంతాడు! అప్పుడప్పుడు తను దాచింది కూడా ఎత్తుకుపోతుంటాడు. ఇక తన గతి ఇంతే! తన సంసారానికి విముక్తి లేదు.
    జైహింద్ బాబు వయసుకి మించి ఎదిగిపోయాడు.
    బడినుండి ఇంటికిరాగానే అందరిలా ఆటలకి వెళ్ళటం లేదు! తల్లినడికి డబ్బులు సంపాదించి గాలిపటాలు కొని మారు బేరానికి తమ గుడిసెలలో పిల్లలకే అమ్ముతున్నాడు.
    అలా గాలిపటాలు అమ్మి ఇంటికొచ్చిన జైహింద్ బాబు చంద్రిని చూసి ఉత్సాహంతో "చంద్రి వచ్చిందే! నాకేదో తెచ్చే ఉంటది" అన్నాడు.
    "అవును- అరిసెలు తెచ్చాను"
    గిన్నెలోంచి అరిసెలు తీసి ఒకటి తనే అందించింది. అది తిని "బాగుంది, చేపలు పడదాం! వస్తావా?" అన్నాడు.
    అక్కడికి కొంచెం దూరంగా చిన్న చెరువులాంటిది ఉంది. ఎండాకాలంలో ఎండిపోతుంది కాని, వానాకాలంలోనూ చలికాలంలోనూ కూడా నీళ్ళు కూడా వుంటాయి.
    అప్పుడప్పుడు ఆ గుడిసెల్లో పిల్లలు ఆ చెరువులో చేపలు పడుతూ ఉంటారు. మిలిటరీ ఆఫీసర్లు చూస్తే తిడుతూ ఉంటారు. జైహింద్ బాబు రమ్మంటే చంద్రికూడా వచ్చింది కొన్నిసార్లు.
    కాని ఇప్పుడు మాత్రం సిగ్గుపడిపోయి "చేపలు పట్టేదానికా? నేను రాను బాబూ" అంది.
    "ఏం?"
    కొడుకు అమాయకత్వానికి నవ్వుకుంటూ అన్నమ్మ "అట్లా వొస్తాదిరా? పెద్దదయిందిగా?" అంది.
    చంద్రిని విచిత్రంగా చూశాడు జైహింద్ బాబు. అది సిగ్గుపడి పారిపోయింది.   

 Previous Page Next Page